Editorial

Tuesday, December 3, 2024
విశ్వ భాష‌J. B. S. Haldane : మననం తెలుపు

J. B. S. Haldane : మననం తెలుపు

బ్రిటన్ లో పుట్టి పెరిగి భారతావనికి వచ్చి, ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయి, ప్రజల వ్యాధులకు జన్యు సంబంధ కారణాలపై పరిశోధనలు చేసిన హల్డెన్ వర్థంతి నేడు. వారి జీవితకాలం కృషి మననం నేటి తెలుపు ప్రత్యేకం.

రమేష్ చెప్పాల

ప్రతిభావంతులకు ఎల్లలు లేవు. వారి సేవలకు పరిధులు లేవు. విశ్వజనీయత వారి సొంతం. మానవాళి శ్రేయస్సే వీరి అంతిమ ద్వేయం. ఆ కోవకే చెందిన వారు జాన్ బర్దన్ శాండర్సన్ హల్డెన్ (John Burdon Sanderson Haldane.)

డార్విన్ పరిణామ సిద్ధాంతానికి వారు గణిత పునాదులు వేశారు. క్లోనింగ్ పరిశోధనలకు పరోక్షంగా దోహదపడ్డారు. తన శరీరాన్నే ప్రయోగశాలగా చేసుకొని జన్యుశాస్త్ర అభివృద్ధికి దోహదపడ్డ మహనీయులు వారు.

1892 నవంబర్ 5న బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించిన హల్డెన్ తండ్రి కూడా శాస్త్రవేత్త. రెండో యేటి నుంచి హల్డెన్ పరిశోధన క్రమం ముగ్గ తొడిగింది అంటే ఆశ్చర్యగా ఉంటుంది. మిగిలిన పిల్లలా బొమ్మలతో కాకుండా హల్డెన్ తన తండ్రి ప్రయోగశాలలోని వస్తువులతో ఆటలు ఆడుకున్నాడు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే తండ్రికి ప్రయోగాల్లో సాయంగా నిలిచాడు. గణితంలో అసాధారణ ప్రతిభతో పదహారేళ్ల వయసులో ‘రస్సెల్ అవార్డ్’ అందుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి సైన్యంలో చేరాడు. యుద్ధానంతరం హల్డెన్ ఆక్స్ ఫర్డ్ న్యూ కాలేజీలో ‘శరీరధర్మ శాస్త్రం’ లెక్చరర్ గా నియమితులయ్యారు. గమ్మత్తేమంటే హల్డెన్ అప్పటికి ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య ఆయనకు అక్కరకు వచ్చింది. తన పందొమ్మిదోవయేట వెన్నెముక గల ప్రాణుల్లో జెనిటిక్స్ లింకేజీ గురించి పరిశోధనలు ప్రారంభించారు.

తండ్రి ప్రోత్సాహంతో 1922 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరి శరీరంలో జరిగే రసాయనిక మార్పులను అధ్యయనం చేసేందుకు బయో కెమిస్ట్రీలో పరిశోధన ప్రారంభించారు. ఈ క్రమంలోనే జన్యుశాస్త్రంపై ఆసక్తి పెరిగింది. అలా జెనిటిక్స్ ప్రొఫెసర్ గా ఎంతో పరిశోధన చేసిన మహనీయుడు హల్డెన్.

తను తాయారు చేసిన మందుల్ని తన పైనే స్వతహాగా ప్రయోగించుకొని వైద్యచరిత్రలో ప్రత్యామ్నాయ వైద్యమైన హోమియో విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన హానిమన్ మాదిరిగానే హల్డెన్ కూడా జన్యుశాస్త్రంలో అనేక పరిశోధనలు తనపై చేసుకొనే వారు. ఒకసారి కార్బన్ డయాక్సైడ్ వాయువును తన రూమంతా విడిచిపెట్టారు. మరోసారి హైడ్రో క్లోరింగ్ ఆమ్ల వాయువుల్ని పిల్చారు. సోడియం కార్బనేట్ ను మింగారు. ఇవన్నీ చేసి చివరకు ఫిట్స్ నివారణా మార్గాన్ని కనుగొనడం విశేషం. అంతేకాదు, తన శరీరంలో తాత్కాలికంగా చక్కెర వ్యాధిని కల్గించి ఎలాంటి మత్తు మందు లేకుండానే ఆపరేషన్ చేసుకొని పరిశీలనల్ని పరిశోధనలన్నీ తోటివారికి ఉపయోగ పడేలా చేశారు. హిమోగ్లోబిన్ “సి” ఉన్న వారిలో మలేరియా నిరోధకశక్తి ఎక్కువ ఉంటుందనీ, వంశపారపర్యంగా వచ్చే జబ్బులు అందరికీ రావనీ, అలాంటి లక్షణాలు కేవలం వందమందిలో ఒకరికో, ఇద్దరికో వస్తాయన్న పరిశోధనలు కూడా వారు చేసి నిరూపించారు.

విశేష పరిశోధనలు

సరైన పౌష్టికాహారం తినే వారు సాధారణంగా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. తరచూ రోగాల భారీన పడరన్నది అయన పరిశోధనల్లో ఒక విషయం. ఎక్కువగా మందుల్ని వాడటం వలన శరీరంలో హానికరమైన జన్యువులు నిదానంగా వృద్ధి చెందుతాయనీ కూడా వారు ఎప్పుడో తేల్చి చెప్పారు. కొన్ని జాతుల వారు మిగతా జాతుల వారి కంటే తెలివిగా ఉంటారన్న విషయం, మానవ జన్యుపదార్థంలో హఠాత్పరిణామ (మ్యుటేషన్) రేటును అంచనా వేయటంతో సహా హల్డెన్ ఫలితాల్లో ముఖ్యమైనవి.

తల్లిదండ్రులకు సంబందించిన లక్షణాలు సంతానంలో పూర్తిగా కనుమరుగవటమే మ్యుటేషన్. ఇది ప్రతి తరంలో యాభైవేల మందిలో ఒకరికి జరుగుతుందని హల్డెన్ వెల్లడించారు.

జంతుశాస్త్రంలో గణితాన్ని వినియోగించిన తొలి శాస్త్రవేత్త హల్డెన్. జీవరసాయన శాస్త్రంలో ఆయన ఆవిష్కరణలు ఎంజైమ్ కెమిస్ట్రీకి మూల సూత్రాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు.

చేప, తాబేలు, నరసింహస్వామీ…

జన్యుశాస్త్ర పరిశోధనకు భారతదేశంలో విస్తృత అవకాశాలున్నాయని భావించి 1957లో భార్య హెలెన్ తో కలిసి భారత్ కు వచ్చినప్పుడు ‘ఆస్తిక’ దేశమైన భారత్ కు పోవటమేమిటని ఆయన మిత్రులు ఎద్దేవా చేశారు. కానీ ఈ దేశం, ఇక్కడి ప్రజల జీవన విధానం వారికి ఎంతో నచ్చింది. భారతీయ సంస్కృతికి, తత్వానికి ముగ్ధుడైన హల్డెన్ మనదేశ పౌరసత్వం స్వీకరించి ఇక్కడి జీవితంలో భాగమవడం విశేషం. సూట్ బూట్ విడిచి ధోవతి పంచెకట్టారు కూడా.

మన పురాణాలు ఇతిహాసాల పట్ల కూడా వారికి పట్టు ఉంది. విష్ణుమూర్తి – చేప, తాబేలు, నరసింహస్వామీ, వామనాతారాలు ఎత్తటం జీవసృష్టినీ, వాటి పరిణామాన్ని సూచిస్తుందని వారు చెప్పేవారు.

అన్నట్టు అయన వామపక్ష వాది కూడా. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి ముందు కొన్నాళ్లపాటు అయన కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పటికీ  తర్వాత సోవియట్ యూనియన్ ఆధిపత్యాన్ని నిరసిస్తూ స్వేచ్ఛను కోరుతూ కమ్యూనిజానికి దూరమయ్యారనుకొండి.

హ్యూమన్ జెనెటిక్స్ కి మనదేశంలో ఆద్యులు

భారతదేశంలో హ్యూమన్ జెనెటిక్స్ అభివృద్ధి వెనక హల్డెన్ చేసిన కృషి శ్లాఘనీయంగా చెప్పాలి. ప్రయోగాలు చేయకుండానే స్టాటిస్టికల్ పద్ధతుల్లో బ్రీడింగ్ విశ్లేషణలను చేశారు. క్షీరదాల్లో రెండు జన్యువుల మధ్య బంధాన్ని చెప్పారు. పాలీప్లాయిడ్స్ కు లింకేజీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిమోఫీలియా, వర్ణాంధతలకు కారణమైన రెండు లైంగిక సంబంధం జన్యువుల మధ్య ఉండి పాక్షిక బంధాన్ని కూడా వారే కనుగొన్నారు.

విశాలంగా ఆలోచిస్తే ప్లాంట్ టిష్యూ కల్చర్, డి.ఎన్.ఏ టెక్నాలజీ, డి.ఎన్.ఎ ఫింగర్ ప్రింటింగ్, జెనటిక్ కౌన్సెలింగ్, జెనటిక్ ఇంజనీరింగ్, హ్యూమన్ జిన్ మాపింగ్, క్లోనింగ్…. ఇవన్నీ హల్డెన్ జన్యం శాస్త్ర మొక్కకు కాచిన విజ్ఞాన ఫలాలగా చెప్పవచ్చు.

వారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో నాలుగేళ్లు పని చేయడం గొప్ప విప్లవం. అప్పటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కోరిక మేరకు కలకత్తాలోని “జీవశాస్త్ర జాతీయ పరిశోధన సంస్థ”లో జన్యుశాస్త్రం, బయోమెట్రీ యూనిట్ లను వారే ప్రారంభించారు. మలేరియా,పైలేరియా, రక్తహీనతలపై పరిశోధనలు  జరిపారు. ఈ ఇనిస్టిట్యూట్ లో ఉన్నప్పుడే హ్యూమన్ జెనెటిక్స్, ఎకాలజీ, ఆంత్రోపాలజీ, ప్లాంట్ సైన్సస్ విభాగాల ఏర్పాటు వెనుక హాల్డెన్ చేసిన కృషి మర్చిపోలేనిది.

తెలుగు ప్రాంతానికీ వారీ సేవలు

హల్డెన్ దంపతుల పరిశోధనలు ఆంధ్రప్రదేశ్ కు కూడా విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ద్రోణంరాజు కృష్ణారావు, మీరా ఖాన్ లతో కలిసి రాష్ట్రంలోని పలు వ్యాధులపై హల్డెన్ శోధించారు. మేనరిక వివాహాల మూలంగా అనేక రోగాలు వస్తున్నాయని, టీ.బి వ్యాధి ఎక్కువవుతుందని వారి పరిశోధనలలో తేలింది. హల్డెన్ స్వత ఖర్చులతో మీరాఖాన్ ను ఇటలీ పంపి మలేరియా పై పరిశోధనలు చేయించారు. అప్పట్లో భారత్ తనకు బహుమతిగా ఇచ్చిన లక్ష రూపాయల్ని మిరఖాన్ కు పంపించి పరిశోధనల్ని ప్రోత్సహించారని చెబుతారు.

పోలవరం ప్రాంతంలో వచ్చే మలేరియాపై హాల్డెన్ నేతృత్వంలో పరిశోధనలు జరగడం విశేషం. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇటలీ, హాలాండ్, అమెరికా దేశాలు ఆర్థిక సాయం అందించాయి. ఓ.బి రక్తం గ్రూపుల కన్నా ఎ.ఎబి గ్రూపుల వారిలో వచ్చే మశూచి చాలా ప్రమాదకరమైనదని, ఓ.గ్రూపు సిఫిలిస్ సాధారణంగా రాదని, వచ్చినా నయం చేయటం తేలికని హల్డెన్ పరిశోధనల్లోనే తేలిందని చెబుతారు.

పిల్లలకోసం అనేక గ్రంధాలు

భార్య భర్తలిద్దరికీ భారతదేశపు వంటకాలు, ఖద్దరు బట్టలు,అంటే చాలా ఇష్టపడేవారు. భగవద్గీత తనకు ఇష్టమైన గ్రంథమని వారు ఎప్పుడు చెప్పేవారు.

సైన్స్ విస్తరణకు, పిల్లల్లో సైన్స్ అంటే ఆసక్తి పెంచేందుకు జీవ పరిణామ కారణాలు, వాట్ ఈజ్ లైఫ్, సైన్స్ అండ్ ఎథిక్స్, మై ఫ్రెండ్ మిస్టర్ లికే వంటి అనేక పుస్తకాలు రాశారు.

క్యాన్సర్ పై కవిత

దురదృష్టవశాత్తూ హల్డెన్ ను క్యాన్సర్ కబళించింది. 1963 లో క్యాన్సర్ కి విదేశాల్లో ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడే ‘క్యాన్సర్ ఈజ్ ఏ ఫన్నీ థింగ్’ అనే కవితను హాస్పిటల్ బెడ్ మీద ఉండి రాశారు. శాస్త్ర సంబంధ విషయాలపై రాసిన అత్యద్భుతమైన కవితగా దీన్ని ఇప్పటికీ పేర్కొంటారు.

Cancer’s a Funny Thing:
I wish I had the voice of Homer
To sing of rectal carcinoma,
This kills a lot more chaps, in fact,
Than were bumped off when Troy was sacked …
… I know that cancer often kills,
But so do cars and sleeping pills;
And it can hurt one till one sweats,
So can bad teeth and unpaid debts.
A spot of laughter, I am sure,
Often accelerates one’s cure;
So let us patients do our bit
To help the surgeons make us fit.

భువనేశ్వర్ లో తుదిశ్వాస

వారికి బ్రిటన్ లో చనిపోవటం ఇష్టం లేక భారత్ కు తిరిగి వచ్చారు. తను మరణించాక తన భౌతికకాయాన్ని పరిశోధన, బోధనలకు ఉపయోగించాల్సిదిగా వీలునామా రాసారు. అంతటి మహనీయులు 1964 డిసెంబర్ 1న భువనేశ్వర్ లో హల్డెన్ తుది శ్వాస విడిచారు. వారు కోరినట్లే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో హల్డెన్ భౌతికకాయాన్ని భద్రపరిచారు.

జన్యుశాస్త్ర మార్గదర్శి హల్డెన్ భారతదేశానికి దత్తత పుత్రుడు. వారి మననం ఒక స్ఫూర్తి. యువతకు ప్రేరణ.

*రమేష్ చెప్పాల రచయితా సినీ దర్శకులు. మానవాళి శ్రేయస్సుకోసం కృషి చేసే మహనీయుల గాథలు వారికి ఇష్టమైన అధ్యయనం. జీవన తాత్వికతను తెలుపే సజీవ గాథల కల్పన ఇష్టమైన అభిరుచి ‘మా కనపర్తి ముషాయిరా’ వారి కథల సంపుటి. త్వరలో తీర్థయాత్రా సాహిత్యానికి చేర్పుగా మరో పుస్తకం తెస్తున్నారు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article