Editorial

Wednesday, January 22, 2025
కథనాలుబాలుతో స్వరయానం - చివరి భాగం: ఎస్.వి.సూర్యప్రకాశరావు ఆత్మీయ నీరాజనం

బాలుతో స్వరయానం – చివరి భాగం: ఎస్.వి.సూర్యప్రకాశరావు ఆత్మీయ నీరాజనం

 

Narsim

ఇదే పాట… ప్రతీ చోటా… ఇలాగే పాడుకుంటాము

ఎస్.వి. సూర్యప్రకాశరావు

suryaబాలు దివికేగిన స్వర పారిజాతం. వారితో పరిచయ భాగ్యం నిజంగా ఒక సుకృతం. మానవ సంబంధాలకు వారిచ్చే విలువ ఎలాంటిదో స్వయంగా దర్శించిన అనుభవం నాది. వారి స్వరయానంలో  నా అక్షర నీరాజనం, ఈ చివరి భాగం.

నేను జీవితంలో మరచిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి. శైలజ సుధాకర్ పెళ్లికి వాళ్ల కుటుంబంలో ఒకరిగా కలుపుకుని మమ్మల్ని ఆహ్వానించి ఆదరించిన సంఘటన మేము ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి సాన్నిహిత్యం బలపడిన రోజుల్లో ఆయనతో మరింత సన్నిహితంగా మెలిగిన రెండు సంఘటనలు బాలు గారిలో ఔన్నత్యానికి అద్దం పట్టాయి.

వాటిలో ఒకటి నేను జెమిని టీవి కోసం రాసిన మహాభారతం (బి. ఆర్ చోప్రా) టైటిల్ సాంగ్. ఆరుద్ర గారు సాంగ్ ఫస్ట్ పార్ట్ రాశారు. ఆ పాట రాయించిన రావి కొండలరావు గారు ఎపిసోడ్ చివర టైటిల్స్ సమయంలో వచ్చే భాగాన్ని రాయించటం మరచిపోయారు. నేను ఆఫీస్ పని వల్ల ఆరుద్ర గారి దగ్గరకు వెళ్ళలేకపోయాను. మామూలు గా అయితే పాండి బజార్ వెళ్ళినప్పుడల్లా ఒకసారి వెళ్లి రామలక్ష్మి గారిని ఆరుద్ర గారిని పలకరించడం అలవాటే. సాంగ్ బాలు వారిచేత పాడించాలని ముందుగా నే డిసైడ్ అయాము. మ్యూజిక్ కండక్షన్ మాకు మరో సన్నిహిత మిత్రుడు మాధవపెద్ది సురేష్. రికార్డింగ్ కి బాలుగారు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి టి ఆర్ విజన్ స్టూడియో కి వచ్చేశారు. నన్ను చూసి ఆశ్చర్య పోయారు. ముందుగా చెప్పొచ్చు కదండీ. మంచి ప్రాజెక్ట్ . All the best అన్నారు. తరువాత లిరిక్ తీసుకుని సాంగ్ రికార్డింగ్ గదిలోకి వెళ్ళిపోయారు. 20 నిమిషాలు ఎవరు అతనిని డిస్టర్బ్ చెయ్యకూడదు. 20 నిమిషాలు అయన పాట విని ఆకళింపు చేసుకుంటారు. 20 నిమిషాలు అయాక నేను సురేష్ వెళ్ళాము. అప్పుడు ఆయన ‘అయ్యా ఇది హై పిచ్ సాంగ్. మహానుభావులు ఘంటసాల గారు వంటి వారు పాడవలసిన పాట. నేను శ్రుతి అడ్జెస్ట్ చేసుకుని పాడతాను. ఇంకొక సంగతి ఏమిటంటే రెండో భాగం ట్రాక్ ఉంది కానీ లిరిక్ లేదు. ఏం చేద్దాం?’ అన్నారు. ఇప్పుడు ఆరుద్ర గారి వద్దకు వెళ్ళే టైం లేదు. రావి కొండలరావు గారిని అడిగాను. ఇప్పుడు ఆయన దగ్గర్నుంచి అంటే కష్టం. టైం లేదు. ఇంతలో బాలు అన్నారు. ‘సరే నేను ఫస్ట్ పార్ట్ పాడుతూ ఉంటాను. మీరు డిసైడ్ చెయ్యండి’ అన్నారు. నేను ‘సరే మీరు పాడుతూ ఉండండి. హిందీ లిరిక్ ఉంది కదా అది విని నేనే రాసేస్తాను’ అన్నాను. ‘వెరీ good’ అన్నారు. అలాగే ఆయన ఫస్ట్ పార్ట్ పాడే లోగా నేను సెకండ్ పార్ట్ ఎనిమిది లైన్స్ రాసి ఇచ్చాను. అయన ‘లెంగ్త్ లు అవి చూద్దాము’ అని ఒకటి రెండుసార్లు హమ్ చేసి ఒకటి రెండు పదాలు మార్చ మన్నారు. వెంటనే మర్చేసాను. ఆలస్యం చెయ్యకుండా పాడేశారు. అప్పటికి రాత్రి 8 అయింది. ఒక డబ్బింగ్ సాంగ్ కోసం అంత శ్రమ శ్రద్ధ తీసుకోవడం అయన అప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ లో విశేషమే. తరువాత విఠల్ కి ఏదో చెప్పారు. విఠల్ మా వాళ్ళు మాట్లాడి ఇచ్చిన మొత్తంలో సగం మాత్రమే తీసుకుని మిగతా డబ్బు నాకు ఇచ్చేశాడు. తిరిగి వెళుతూ అయన నా భుజం మీద చెయ్యి వేసి ‘చూడు నాయనా… మేము అన్ని డబ్బు కోసమే చెయ్యకూడదు. ఈ రోజు నాకు ఎంతో సంతృప్తి కలిగింది.ఈ పాట నేను పాడానని గర్వంగా చెప్పుకుంటాను. Thanks for the opportunity’ అని కారు ఎక్కి ‘అల్ the best’ చెప్పి వెళ్లిపోయారు. అయితే ఈ సీరియల్ కి పోటీగా కొన్నాళ్ళకి ఈటీవి లో పాడుతా తీయగా కార్యక్రమానికి తాను సూత్రధారి నీ అవుతానని అయన ఊహించ లేదు.

‘శ్రమ లేదని అబద్ధం చెప్పను. ఇంత శ్రమ ఎప్పుడు పడలేదు. రాత్రి సింగపూర్ వెళ్ళాలి. ఆనంద్ కి మాట ఇచ్చాను కదా. తప్పదు. అయినా ఇలా ఎన్ని మెట్లు ఎక్కి శ్రమ పడితే ఈ మాత్రం స్థాయి కైన వచ్చాను’

మహాభారతం మొదలైన ఆదివారం ఉదయం పది గంటలకు ఈ టీవి పాడుతా తీయగా కార్యక్రమం ప్రారంభించింది. జెమిని లో మహాభారతం తరువాత రెండేళ్ళకి పద్మాలయ వారు సంజయ్ ఖాన్ మహాభారతం హక్కులు తీసుకుని నాచేత అనువాదం చేయించారు. దానికి టైటిల్ సాంగ్ పూర్తిగా నేనే రాశాను. దానికి మ్యూజిక్ కండక్షన్ జి. ఆనంద్ అనుకున్నాము. ఆయనే బాలు గారితో మాట్లాడి రికార్డింగ్ స్టూడియో టైం ఫిక్స్ చేశారు. కానీ ఆయనకు హఠాత్తుగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. బాలు గారితో చెప్పి అయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. రికార్డింగ్ ధియేటర్ కోడం బక్కంలో ఒక మూల ఇరుకు సందుల మధ్య ఉంది. నేనెప్పుడూ అది చూడలేదు. కష్టం మీద కనుక్కుని వెళ్లి బాలు గారికోసం వెయిటింగ్.11 గంటలకి వస్తానని చెప్పారు 12 అయినా రాలేదు .12 15 కి అయన నడుచుకుంటూ వస్తున్నారు. బెంజ్ కారు సందులోకి రాదు. భారీ కాయంతో రొప్పుకుని వచ్చారు. వస్తూనే ‘ఏమిటి స్వామి ఇక్కడ ఒక రికార్డింగ్ theatre ఉన్నట్లు నాకు తెలియదు. ఇంత మూల ఎవరైనా ఫిక్స్ చేస్తారా? ఆనంద్ సరిగా అడ్రస్ చెప్పొచ్చు కదా’ అన్నారు. తరువాత ఫస్ట్ ఫ్లోర్ ఇరుకు మెట్లు రొప్పుతూనే మీదకి వచ్చి కూల బడ్డారు.
నేను ‘i am sorry నాకు కూడా ఇలా ఇంత మూలకు ఉందని తెలియదు. మీచేత ఇంత దూరం నడిపించి మెట్లు ఎక్కించాను చాలా శ్రమ పెట్టాను’ అన్నాను. అయినా తేరుకుని ‘శ్రమ లేదని అబద్ధం చెప్పను. ఇంత శ్రమ ఎప్పుడు పడలేదు. రాత్రి సింగపూర్ వెళ్ళాలి. ఆనంద్ కి మాట ఇచ్చాను కదా. తప్పదు. అయినా ఇలా ఎన్ని మెట్లు ఎక్కి శ్రమ పడితే ఈ మాత్రం స్థాయి కైన వచ్చాను. Dont feel bad about this. ఏదీ ఆ లిరిక్ ఇస్తే పనిలో పడదాము’ అని ఆయన head ఫోన్స్ పెట్టుకుని ఒరిజినల్ హిందీ పాట వింటూ నా లిరిక్ చూసుకుంటున్నారు.

భారత వీరుల రసమయ చరితం
యుగయుగాలకు ఆదర్శం
అని చరణం చూసి
హిందీ వెర్షన్ విన్నారు.
‘హిందీలో భావం ఇది కాదే?’ అన్నారు.
నాకు గొంతు పెగల లేదు
కావాలనే నేను మార్చి రాశాను
కొంప తీసి మర్చమంటారా ఏమిటి అనుకున్నాను
ఆయన నావైపు చూసి ‘common tell me హిందీ మీనింగ్ ఒకటి తెలుగు ఒకటి ఉంది’ అంటే నేను ‘నేటివిటీ కోసం అందరికీ అర్థం కావాలని..’అంటుండగానే ‘ఇలా మార్చారన్న మాట. Nothing wrong ఇది ఒరిజినల్ రైటర్స్ చేసే పనే మీరు చేశారు. అనువాదంలా కాకుండా బాగుంది’ అని నవ్వుతూ ‘ఈ లిరిక్ చూసి ఈ మ్యూజిక్ వింటుంటే నా అలసట శ్రమ మరచిపోయాను. మా కళాకారులం ఆత్మ సంతృప్తితో బ్రతికే అల్ప సంతోషులం సార్’ అని పాట 20 నిమిషాల్లో పాడేసి ఒకటి రెండు సార్లు చూసుకుని మిక్సర్ దగ్గరకు వచ్చి ఇంజనీర్ దగ్గర కూర్చుని ఏవో సూచనలు చేసి ఆయనకు సంతృప్తి కలిగాక బయలు దేరారు.

సందు ముందు కారు వెళ్ళదు. పావు కిలోమీటరు నడవాలంటే అక్కడినుంచే వెళ్ళిపోయి I am సారీ అని ఆయన అని వుంటే ఎవరు ఏమీ అనలేరు. కానీ పాటకు తను నమ్మిన వృత్తికి అయన ఇచ్చే గౌరవం భక్తి ఎలాంటిదో ఈ సంఘటన చెబుతుంది.

నేను డబ్బు గురించి మాట్లాడే సమయంలో ‘అది నేను ఆనంద్ చూసుకుంటాం. అతనికి voucher పంపిస్తాను. You don’t worry’ అని వెళ్లిపోయారు. సందు ముందు కారు వెళ్ళదు. పావు కిలోమీటరు నడవాలంటే అక్కడినుంచే వెళ్ళిపోయి I am సారీ అని ఆయన అని వుంటే ఎవరు ఏమీ అనలేరు. కానీ పాటకు తను నమ్మిన వృత్తికి అయన ఇచ్చే గౌరవం భక్తి ఎలాంటిదో ఈ సంఘటన చెబుతుంది. ఆ సమయంలో ఆయన రెండు పాటలు పాడి పదిరెట్లు సంపాదిస్తున్న కాలం. ఇది నాకు బాలసుబ్ర హ్మణ్యం గారి పట్ల గౌరవాభిమానాల్ని ఎన్నో రెట్లు పెంచింది. అయన సహృదయతకు మనసులోనే జోహార్లు అర్పించారు.

ఆయనకు ఇబ్బంది కలిగించే పని నేను అనాలోచితంగా చేశాను .అందుకు ఇప్పటికీ పశ్చాతాపం నాకు ఉంది. అయన అది మరిచిపోయి మామూలుగా ఉన్నా నాకు మాత్రం మనసులో ఎక్కడో కలుక్కు మంటునే ఉంటుంది.

మరొక సందర్భం నా జీవితంలో చారిత్రాత్మక ఘట్టం అనుకుంటాను. శ్రీకాకుళం జిల్లా స్వర్ణోత్సవాలు. జి.ఆనంద్ చొరవతో నాకు ఆహ్వానం లభించింది. నన్ను ఆ జిల్లా మీద ఒక పాట రాయమన్నారు. రాసి అది చేతిలో పట్టుకుని వేదిక ఎక్కాను. ముఖ్య అతిధి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారే. అయన పక్కనే కూర్చున్నాను. జిల్లా కలెక్టర్, ఒక మంత్రి నేను బాలు గారే వేదిక మీద ఉన్నాము. బాలు నా చేతిలో ఉన్న కాగితం చూసి ‘ఏమిటి ఇది’ అని చనువుగా తీసుకుని చదివారు. ఆనంద్ ఏమంటాడో అని నా భయం.. అయన ప్లాన్ ఏమిటో. ఇది ఇంకా ట్యూన్ కూడా చెయ్యలేదు. ఎవరో మాట్లాడిన తరువాత బాలసుబ్రహ్మణ్యం గారు లేచి ‘ఈ జిల్లా గొప్పతనం ఇప్పుడే తెలుసుకున్నాను’ అని…
తొలి వెలుగుల శ్రీకారం
తెలుగుజాతి ప్రాకారం
స్వరణాంద్ర గోకులం
స్వర్ణోత్సవ శ్రీకాకుళం
అనే పల్లవితో రాసిన పాటకు
అలవోకగా స్వరకల్పన చేసి
ఆలపించారు. అంతే కాదు నా గురించి నాతో పరిచయం గురించి చెప్పి పాటను మెచ్చుకుని ఆశీర్వదించారు. అది ఒక లోకల్ టివి కవర్ చేసింది. అప్పుడు ఇంకా ప్రైవేట్ ఛానెల్స్ హవా జిల్లాలకు వ్యాపించలేదు. ఆ సంఘటన క్యాసెట్ బాలు గారికి చేరలేదు. రెండు మూడు సార్లు నన్ను అడిగారు. అతి కష్టం మీద దానిని సంపాదించి ఆయనకు చేర్చ గలిగాను. వెంటనే ఫోన్ చేసి ‘ధన్యవాదాలు నాయనా’ అన్నారు. వీటి తరువాత ఆయనకు ఇబ్బంది కలిగించే పని నేను అనాలోచితంగా చేశాను .అందుకు ఇప్పటికీ పశ్చాతాపం నాకు ఉంది. అయన అది మరిచిపోయి మామూలుగా ఉన్నా నాకు మాత్రం మనసులో ఎక్కడో కలుక్కు మంటునే ఉంటుంది. అది ఏమిటంటే…

ఆ సంఘటనకు ముందు నేను బాలు గారి మీద రాసిన ప్రొఫైల్ గురించి చెప్పాలి. అయన ఇంటర్వ్యూ ఆధారంగా కే విశ్వనాథ్ లాంటి అయన సన్నిహితులతో మాట్లాడి రాసిన ప్రొఫైల్ అది. తెలుగు ఎడిషన్ తో పాటు అన్ని భాషల్లో వచ్చింది. బాలు గారు చాలా సంతోషించారు. ‘ఒక జాతీయ పత్రిక నన్ను ఇలా గుర్తించటం ఆనందంగా ఉంది Thank you very much’ అని ఆయన అన్నారు. ఆ తరువాత రెండు సందర్భాలలో అయన గురించి రాశాను. కానీ ఆ తరువాత తెలుగులో ప్రవేశించిన పరభాషా గాయనీ గాయకుల ధోరణి గురించి ఒక కథనాన్ని ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్, హరిణి, ఉన్నికృష్ణన్, హరిహరన్ ల ఇంటర్వ్యూలతో రాశాను. పాడనా తెలుగు పాట అనే శీర్షికతో రాసిన ఆ స్టోరీకి నేను అనాలోచితంగా తొందర పాటుతో రాసిన ఇంట్రో అన్యాపదేశంగా బాలు గారిని ప్రస్తావించాను అనే అభిప్రాయం కలిగించింది.

నిజానికి ఆ కథనంలో నేను బాలు గారి గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. పరభాషా గాయనీ గాయకులకు లభిస్తున్న ఆదరణ వల్ల కొంతమంది గుత్తాధి పత్యానికి తెర పడింది అని ఇంట్రోలో రాశాను. ఈ కథనం ఇండస్ట్రీలో కలకలం రేపినట్లు చెన్నై లో ఉంటున్న నాకు వెంటనే తెలియలేదు. బాలు గారంటే ఓర్వలేని వాళ్ళు, ఆయన ప్రాభవానికి అసూయ పడ్డ వాళ్ళు ఆయనతో పోటీ పడలేక, ఆయనను సమీపించే అవకాశం లేని వాళ్ళు కొంత ఆజ్యం పోసారు. అందుకు నేను అవకాశం ఇచ్చినందుకు చాలా బాధ కలిగింది. ఈ నేపథ్యంలో నేను హైదరాబాద్ లో జీ ఆనంద్ స్వరమాధురి సంగీత విభావరికి వెళ్ళాను. బాల సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిధి. సభా కార్య్రమానికి ముందు ఆడియన్స్ లో మొదటి వరసలో మధ్యగా వేసిన సోఫాలో బాలు గారు, గాయకులు రామ కృష్ణ కూర్చున్నారు. నేను అదే వరసలో కార్నర్ సోఫాలో ఎవరో ఇద్దరితో కూర్చున్నాను. బాలు గారిని చూసి విష్ చేసి ‘నమస్కారం’ అన్నాను. అయన కూడా నవ్వుతూ చెయ్యి ఊపారు. నేను అయన దగ్గరకు వెళ్లడానికి లేవబోతుంటే ‘వద్దు నేనే వస్తాను’ అని వచ్చారు.

మనం ఏది రాసినా అడిగేవాడు ఎవడు అనే ఒక దిగువస్తాయి, అపరిపక్వ పాత్రికేయుడు నాలో కూడా ఉన్నాడా? అని అనిపించింది. ‘నిజమే సర్ పొరపాటే’ అన్నాను. ఆయన దానికి ‘ఇలా అనడం మీ సంస్కారం అనడం వారి ఔన్నత్యమే…

నాపక్కన కూర్చున్న ఇద్దరు మర్యాద పూర్వకంగా లేచారు. బాలు గారు నేను కూర్చున్నాం. వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళారు. ఆయన కుశల ప్రశ్నలు వేశాక ‘మీ ఆర్టికల్ చదివాను. కొత్త సింగర్స్ గురించి చాలా బాగా రాశారు. వాళ్ళందరూ నాకు పిల్లల లాంటి వాళ్ళు. వాళ్ళకి మంచి ప్రోత్సాహం. iam very happy. కానీ మీరు గుత్తాధిపత్యానికి తెరపడింది అన్నారు. పాత్రికేయుడిగా మీ భావ ప్రకటనా స్వేచ్ఛను నేను గౌరవిస్తాను. కానీ ఆ పదం ఎలా వాడతారు. ఇక్కడ నాకు నేనుగా ఎలాంటి monopolyని చలాయించటం లేదు. నా స్థాయి నాది. వాళ్ల స్థాయి వాళ్ళది. ఒక కాలంలో ఒక్కొక్కరికి ప్రజాదరణ అనుకోకుండా ఏకధాటిగా ఉంటుంది. మార్కెట్ డిమాండ్ బట్టి ఆ ఆదరణ ఉంటుంది’ అన్నారు. నేను షాక్ తిన్నాను. నాలో జర్నలిస్ట్ ఈగో ఊరుకోలేదు..iam sorry sir. ididnot mean it. అన్నాను. అప్పుడు ఆయన ‘మీరు నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారు అనటం లేదు. మీరు నాగురించి నా వ్యక్తిత్వం గురించి ఆర్టికల్స్ రాశారు. దానిని దృష్టిలో పెట్టుకుంటే ఇలా రాసేవారు కాదేమో’ అన్నారు.

నిజమే అనిపించింది. మనం ఏది రాసినా అడిగేవాడు ఎవడు అనే ఒక దిగువస్తాయి, అపరిపక్వ పాత్రికేయుడు నాలో కూడా ఉన్నాడా? అని అనిపించింది. ‘నిజమే సర్ పొరపాటే’ అన్నాను. ఆయన దానికి ‘ఇలా అనడం మీ సంస్కారం. ఒక్కసారి మీరు రాసింది ఎంతవరకు కరెక్ట్ అసలు ఫిల్మ్ మ్యూజిక్ వరల్డ్ లో గాయనీ గాయకులు ఎలా వస్తారు. ఎలా నిలబడతారు? ఎలా మరుగున పడిపోతారు అని నిజాయితీగా స్టడీ చేశారా? అలా చేసి మీరు ఇలాంటి ఇంట్రో రాస్తే నేను నిజమే అని ఒప్పుకుంటాను. Any lets not discuss any more on this topic. మీ కంటే వయసులో జీవితానుభవంలో పెద్దవాడిని కాబట్టి మిమ్మల్ని ఒక సోదరుడిగా భావించి ఇలా మాట్లాడాను. ఏమీ అనుకోకండి’ అన్నారు. ఆయన వాత్సల్యానికి మాట రాలేదు. ‘సర్ …అనాలోచితంగా అలా రాశాను ఒప్పుకుంటున్నాను. క్షమించాలి’ అన్నాను. ‘అయ్యో అంతమాట అనొద్దు నాయనా. you are a good జర్నలిస్ట్. మా వాళ్లంతా అంటుంటారు. Lets not talk on this any more. Enjoy the program. సభ మొదలవుతుంది. మద్రాస్ లో కలుద్దాం. God bless u’ అని తన సీట్ లోకి వెళ్ళిపోయారు.

పాటల్ని, నటనను, డబ్బింగ్ ను పరిమితం చేసుకుని బాలు పాడుతా తీయగా వంటి కార్యక్రమాల ద్వారా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆఖరి శ్వాస వరకు ఆ బాధ్యతే నిర్వహించారు. పాటకోసం పుట్టి పాటలో ఆఖరి స్వాసవరకు జీవించిన బాలు దివికేగిన స్వర పారిజాతం. ఆయనతో పరిచయ భాగ్యం నిజంగా ఒక సుకృతం అనుకుంటాను.

నేను రెండు రోజుల వరకు మనిషిని కాలేకపోయాను. మేరు పర్వతం లాంటి కీర్తి శిఖరంతో ఏమిటి ఇలాంటి ఘర్షణ. ఆయన నన్ను కట్ చేసి ఉండొచ్చు. గట్టిగా నిలదీసే వుండొచ్చు. కానీ అలాంటిది చేయలేదు. నా అధికారాన్ని దుర్వినియోగం చేశనేమో అనిపించింది. అధికార దుర్వినియోగంతో డబ్బు సంపాదించటం కంటే నీచమైన పనిగా ఒక్క క్షణం అనిపించింది. అప్పటి నుంచి head lines ఇంట్రోలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను.

బాలసుబ్రహ్మణ్యం గారిని తరువాత చాలా సార్లు కలిశాను. ఆ సంఘటన ప్రభావం ఛాయలు అయన ముఖంలో గాని నాపట్ల అయన వ్యవహరించిన తీరు గాను ఏనాడు కనిపించలేదు. అదే ఉత్తములు మహోన్నతవ్యక్తిత్వం కలిగిన వారి లక్షణం అనిపించింది. నాలాంటి పరిచయాలు ఆయనకి అన్ని రాష్ట్రాల్లోని అన్ని భాషల్లోనూ కోకొల్లలు. స్నేహమేరా జీవితం అని ఆయన ప్రాణం ఇచ్చిన స్నేహాలేన్నో. ఇక అయన పాటలు, సంగీతం తెలియదు అంటూనే శాస్త్రీయ సంగీత కారులని అబ్బురపరిచే అద్భుత ప్రతిభా పాటవాలు అయన ప్రదర్శించారు. పరభాషా గాయకులు పాశ్చాత్య సంగీత బాణీలు ప్రభావం గత ఇరవై ఏళ్లలో సినిమాలలో పాట అందులో సాహిత్యపు విలువల ప్రాముఖ్యాన్ని తగ్గించింది. అందుకు అనుగుణంగా అయన ఏ హీరోలకు మూడు దశాబ్దాలుగా పాడి వారి విజయాలకు కారణం అయారో వారికి పాడటం పరిమితమైంది. అది వారికే నష్టం గానీ తను నష్టపోయింది ఏమీ లేదని తన ప్రతిభను తక్కువ చేసుకోకుండా ప్రకటించుకున్న ఆత్మ విశ్వాసం ఆయనది.

ఘంటసాల విషయంలో చెలరేగిన ఆరోపణలు, వదంతులు ఆయనను చాలా బాధ పెట్టేవి. ఒక సందర్భంలో బాలు ‘చూడండి.. ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరూ ఘంటసాల గారు నేను కలిసిన రోజుల్లో ఎక్కడున్నారో తెలియదు. తెలుగు పాటకు బాట వేసిన భవస్పొరకమైన సొబగులు వేసింది ఘంటసాల గారు వారి బాటలోనే నేను నడిచాను. అనుకరించ కుండా అనుసరిస్టున్నాను. ఘంటసాల గారి విగ్రహాన్ని పెట్టడానికి ఎంత శ్రమ పడ్డానో మీకు తెలుసు. తరువాత మిగతా నగరాల్లో వారి అభిమానులు కూడా విగ్రహాలు పెట్టడం ఆరాధనోత్సవాలు చేయటం జరగుతోంది. నేనెప్పుడూ అయన తరువాత వాడినే. కానీ ఆయన అంతటి వాడినని ఎవరు అనరు అనకూడదు’ అని బాలు చాలా సందర్భాల్లో చెప్పేవారు. ఒక సారి నేను ‘ఒకరి గాత్రం ఏ దశలో నైనా మొనాటమి అనుకునే వీలు ఉంటుందా?’ అంటే అయన ‘అది పాడే వారు చూపించే ప్రభావం… వారు రసికులతో కనెక్ట్ అయే తీవ్రత బట్టి ఉంటుంది’ అని సమాధానం చెప్పారు. ‘ఘంటసాల గారి గొంతు ను ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా విసుగు అనుకుంటారా….అలాగే మంచి పాటలు సాహిత్యం సంగీతం ఎప్పుడు అలరిస్తూనే ఉంటాయి. వాటి వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకు వెళ్ళడమే మన బాధ్యత’ అన్నారు.

పాటల్ని, నటనను, డబ్బింగ్ ను పరిమితం చేసుకుని బాలు పాడుతా తీయగా వంటి కార్యక్రమాల ద్వారా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆఖరి శ్వాస వరకు ఆ బాధ్యతే నిర్వహించారు. పాటకోసం పుట్టి పాటలో ఆఖరి స్వాసవరకు జీవించిన బాలు దివికేగిన స్వర పారిజాతం. ఆయనతో పరిచయ భాగ్యం నిజంగా ఒక సుకృతం అనుకుంటాను.

మొదటి భాగాన్ని దీన్ని క్లిక్ చేసి చదవండి

ఇక్కడ క్లిక్ చేసి రెండవ భాగం చదవండి

వ్యాసకర్త ఎస్.వి.సూర్యప్రకాశరావు ప్రముఖ పాత్రికేయులు. ఇండియా టుడే పూర్వ సహాయ సంపాదకులు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article