Editorial

Monday, December 23, 2024
కథనాలుకెమెరా లేని యాత్ర - అనిల్ బత్తుల - సంతోష్ క్యాతం

కెమెరా లేని యాత్ర – అనిల్ బత్తుల – సంతోష్ క్యాతం

 

drawing

anilనిన్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, మిత్రుడు క్యాతం సంతోష్ ని అనుకోకుండా కలిశాను. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ, లాక్ డవున్ నిబంధనలను పాటిస్తూ సరదాగా ఎటైనా వెళ్ళాలనుకున్నాం. బయలు దేరేటప్పుడు సంతోష్ ఒక మాట అన్నాడు “ఈ రోజు కెమెరా లేదు. అద్భుతాలు జరుగుతాయి” అని!

నిజంగానే తన ఆయుధమైన కెమెరా లేకుండా ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఒక్క ఫోటో తీయలేదు. ఆ స్థలకాలాలను కేవలం కనులతో, మనసుతో అనుభవించాము.

అనిల్ బత్తుల

నిజామాబాద్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలోని దారిలో ఒక పెద్ద బండరాళ్ళ సమూహం వుంది. “ముందు నీకొకటి చూపిస్తా ” అంటూ సంతోష్ ని అక్కడకు తీసుకొచ్చాను. కిరణ్ చర్ల, మోషే డయాన్ నన్ను కలవటానికి వచ్చినప్పుడు, కిరణ్ కార్లో ఈ రాళ్ళ దాకా వెళ్లి ఉన్నాను. “ఇది దాటాక  నీకు ఇంకో అద్భుతం చూపిస్తా” అన్నాడు సంతోష్. బయలుదేరం. ఆ రాళ్ళను దాటి ముందుకు వెళ్తే…చిన్నాపూర్ అనే గ్రామం వచ్చింది.

అది పక్కా తెలంగాణా పల్లె. పాతకాలం నాటి ఇళ్ళు. గాలిలో గోధూలి నీరెండకు మెరుస్తోంది. పసువుల గిట్టల చప్పుడ్లు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఆడపడుచులు, సోదరీమణులు ఇంటి పనుల్లో మునిగివున్నారు. ఒక తల్లి తన మొండి మొల పిల్లాడికి సబ్బు రుద్దుతుంది. వాడేమో “స్నానం వద్దు” అని ఒకటే ఏడుపు. ఒక కోడిపెట్ట తన పిల్లలతో రహదారి పక్క నీటిలో పురుగుల కోసం వేటాడుతుంది. ఆ బుజ్జి కోడి పిల్లలు సర్కారు స్కూలు పిల్లల్లా ముచ్చటగా వున్నాయి.

గిజిగాడి గూడులలో ఇన్ని రంగుల మిశ్రమాలను ఒకే దగ్గర చూడటం ఇదే తొలిసారి. నిశ్శబ్ధంగా వాటిని చూస్తూ కొద్దిసేపు గడిపాము.

ఆ పల్లె దాటి కొంచం దూరం వెళ్ళాక పొలాల వరస పలకరించింది. తర్వాత కొంత గతుకుల రోడ్డు. కొండపై ఆంజనేయ స్వామి గుడి….గుడి దాటి ముందుకు వెళ్తే ఒక చెరువు. ఆ చెరువుకు అవతలి వైపు అడవి. చెరువులో జాలర్లు థర్మాకోల్ పడవల్లో కూర్చుని చేపలు పడుతున్నారు. బహుశా వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు గట్టుపై ఎదురు చూస్తున్నారు. చెరువు చుట్టూ వున్న దారిలో ప్రయాణించి ఒక చోట ఆగాం. ఒక తుమ్మ చెట్టుకి సుమారు పది గీజిగాడి గూడులు వున్నాయి. కొన్ని పాతవి, ఎండి పోయినవి.ఇంకొన్ని కొత్తగా కట్టినవి. ఆకుపచ్చగా ఫ్రెష్ గా వున్నాయి. పాత కొత్తల మేలు కలయికలా మరికొన్ని. గిజిగాడి గూడులలో ఇన్ని రంగుల మిశ్రమాలను ఒకే దగ్గర చూడటం ఇదే తొలిసారి. కొన్ని గిజిగాడు పక్షులు గూటిలోపలికి వెళుతూ మళ్ళీ బయటకు వస్తున్నాయి. నిశ్శబ్ధంగా వాటిని చూస్తూ కొద్దిసేపు గడిపాము.

మరో అద్భుత దృశ్యం చూపాలి. అక్కడ కింద కూర్చొని చూస్తున్నాం. కొన్ని వందల విదేశీ బాతులు ఆ చెరువు వద్ద వున్నాయి. అవి ఈ సీజన్లో రూస్టింగ్ …గుడ్లు పెట్టి పిల్లల్ని చేయటం కోసం ఇక్కడికి వచ్చాయట. ఆ పని అవ్వగానే తమ సొంత దేశం వెళ్ళిపోతాయత. సంతోష్ చెబుతున్నాడు.”అబ్బా..పక్షులకు పాస్ పోర్ట్, వీశా అక్కర్లేదు కదా.. ప్రపంచ దేశాలు తిరగడానికి …పక్షి అయితే ఎంత బాగుండో” అని మనసులో అనుకున్నాను.

బుజ్జి బాతు గోధుమ రెక్కలతో
నీటిపై ఎగురుతూ వుంటే,
భూమాత నిద్రపోతున్న చంటి పిల్లాడ్ని
చూసినట్లు చూస్తుంది.

వెనకాల నీలి ఆకాశం…ముందు కొన్ని వందల చిన్న చిన్న విదేశీ బాతులు గాలిలో ఎగురుతున్నాయి….ఆ అద్భుత దృశ్యం నా హృదయ పుటల్లో ముద్రించుకునిపొయింది. మనోహరం ఆ దృశ్యం. కళ్ళు ఇచ్చినందుకు భగవంతుడికి మనసులో కృతజ్ఞతలు తెల్పుకున్నాను. నిశ్శబ్ధ ఆహ్లాద క్షణాలవి. నిజంగా జీవించిన అపురూప క్షణాలు…చూడాల్సిన దృశ్యాల్ని అక్షరాల్లో రాయమని నాకు శాపం వుందేమో. అందుకే రాస్తున్నాను. నిజానికి ఇది రాయకుండా వుండలేని స్థితి. ఇంతలో ఒక నారాయణ పక్షి మా తల మీద నుండి ఎగురుతూ సూర్యుడి వైపుకు వెళ్తోంది….

సంతోష్ వాటి గురించి చెబుతుంటే ఆ సామూహిక ఇసక స్నానాలను  జీవితంలో మొదటిసారి చూస్తూ “ఇది కదా అదృష్టం” అనుకున్నాను మనసులో….

ఒక దగ్గర లేత పచ్చ రంగులో పిచ్చుక అంత సైజ్ వున్న చిన్న పసిరిక పక్షులు ఇసక స్నానం చేస్తున్నాయి. తమ రెక్కల్ని మట్టిలో ముంచి బయట విదిల్చటం భలే బాగుంది. అలా మట్టిలో స్నానం చేయటం వల్ల, వాటి రెక్కల్లో ఇరుక్కున్న పురుగులు పోతాయట. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా స్నానాలు చేస్తాయట. సంతోష్ వాటి గురించి చెబుతుంటే ఆ సామూహిక ఇసక స్నానాలను  జీవితంలో మొదటిసారి చూస్తూ “ఇది కదా అదృష్టం” అనుకున్నాను మనసులో….

అద్భుతం అంటే మా దృష్టిలో ప్రకృతి కాంతను చూడటం, ఆరాధించటం, నమస్కరించుకోవటం

తిరుగు ప్రయాణం. ఒక దగ్గర పొలాలలో పదుల సంఖ్యలో తాటి చెట్లున్నాయి. ప్రతి చెట్టుకు నాలుగు నుండి ఆరు తొర్రలు. ఆ తొర్రల్లో రామచిలుకలు నివసిస్తాయి. మిరాకిల్ ఏంటంటే.. ఒక గుడ్ల గూబ ఒక తొర్రని ఆక్రమించి దానిలో కూర్చుని మమల్నే చూస్తుంది. మరో తొర్రలో తెలంగాణ రాస్ట్ర పక్షి పాలపిట్ట వుంది. కొన్ని తొర్రల్లో రామ చిలుకలున్నాయి. మరొక చెట్టు తొర్రలో ఇంకో గుడ్ల గూబ నివసిస్తుంది. అది ముక్కు బయటకు పెట్టి మా వైపు తొంగి చూస్తుంది. అవి మమ్మల్ని చూసి ఎగిరిపోలేదు, ఎందుకంటే మేము దూరంగా నిలబడి వాటిని చూస్తున్నాము. ఇంతలో “అబ్బా ..కెమెరా వుంటే బాగుండు” అన్నాడు సంతోష్. “కానీ… పర్లేదు మన మనసు కెమరాలో ఈ అరుదైన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి” అన్నాడు..వెంటనే.

Santosh Kumar

నిజమే. కెమెరా లేని ఈ యాత్రలో అద్భుతాలే జరిగాయి. అద్భుతం అంటే మా దృష్టిలో ప్రకృతి కాంతను చూడటం, ఆరాధించటం, నమస్కరించుకోవటం, కాపాడటానికి ప్రయత్నించడం…అంతేకాదు. మంచి స్నేహితుడితో కాసేపు కొన్ని నిశ్శబ్ఢ క్షణాలు.

ఈ చిన్ని ప్రకృతి యాత్రను బహుమతిగా ఇచ్చిన మిత్రుడు సంతోష్ కి ధన్యవాదాలు.

సంతోష్ కుమార్ గురించి మొన్ననే  తెలుపు కథనం ప్రచురించింది. ఈ లైన్ ను క్లిక్ చేసి ఆ పరిచయాన్ని చదవవచ్చు.

ఇక అనిల్ బత్తుల గురించి. తాను పుస్తక ప్రేమికుడని, పిల్లల పుస్తకాలు రాస్తాడని, వందలాది సోవియట్ తెలుగు పుస్తకాలను కాపాడి ఉచితంగా చదువుకునేలా బ్లాగ్ ద్వారా అందుబాటులో వుంచాడని అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియనిది – తాను దశాబ్ద కాలం చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యొగాన్ని వదిలేయడం, నిజామాబాద్ దగ్గరున్న స్వగ్రామంలో అమ్మతో, ప్రకృతిలో జీవించడం. ప్రస్తుతం పిల్లల సినిమా తీసే పనిలో ఉన్నాడు. 

More articles

2 COMMENTS

  1. చాలా మంచి అనుభూతి ని కలిగించింది ఈ కెమెరా లేకుండా ప్రకృతి లో కి ప్రయాణము ..నిజమే.. కెమెరా ఉంటే ఈ రకమయిన అనుభూతి ఉండదు అస్సలే !!!

  2. అవును ..మర్చేపోయాను ..సంతోష్ ..ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ..చాలా అద్భుతమయిన మనిషి ..చాలా అరుదు గా వుంటారు .మన అదృష్టం ..ఆయనని దోస్త్ గా కలిగి వుండటము ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article