ఇప్పటిదాకా ప్రభుత్వ పంతానికి తొమ్మిది మంది ఉపాధ్యాయులు బలి కావడం పట్ల TPTF తీవ్ర ఆందోళన చెందుతూ తక్షణమే జి.ఓ. 317 విషయంలో బాధిత ఉపాధ్యాయుల, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించడానికి కమిటీ వేసి వారి స్వస్థలాలకు తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయాలనీ డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 317 ఉత్తర్వులు అమలు కోసం డిసెంబర్ 6 నుంచి ఏకపక్ష నిర్ణయాలతో కేవలం కలెక్టర్ లనే సంప్రదిస్తూ అమలులో నియంతృత్వ పోకడలతో పంతం నెగ్గించుకుంది. సంఘాల సూచనలను, బాధితుల గోడును పెడ చెవిన పెట్టింది. ఫలితంగా ఈరోజు వరకు రాష్ట్రంలో 9 మంది ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంది.
ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో ప్రధానోపాధ్యాయుడు B. జైత్రం, ఉపాధ్యాయురాలు పి. శ్రీమతి, వరంగల్ లో పి. గోపి. పి. సమ్మయ్య, మదనాపూర్ లో కృష్ణయ్య, వరంగల్ లో ఉద్యోగి జయమ్మ, భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో బేతల సరస్వతి, సూర్యాపేటలో మధు, రాజపూర్ మండలంలో ఉపాధ్యాయుడి భార్య జి.ఓ. 317 కారణంగా ఒత్తిడికి లోనై మరణించారు.
వీరంతా పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి దూరప్రాంతాలకు పోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడితో చనిపోవడం జరిగింది. లోకల్ కేడరైజేషన్ అమలు చేయడంలో ఇంత మంది ప్రాణాలను కోల్పోవడం తీవ్ర విచారకరం. దీనికి ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం అంత పంతానికి పోవలసిన అవసరం ఏముందో అంతుబట్టడం లేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ముందస్తుగా నైనా ఉపాధ్యాయులకు వివరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జిల్లాలలో అధికారుల తొందరపాటు, సీనియారిటీ జాబితాల తయారీలో అనుభవ లేమి వలన వేలాది మంది ఉపాధ్యాయులు న్యాయం పొందలేక అన్యాయానికి గురై తాము కోరుకున్న జిల్లాకు కేటాయింపులు లేకపోవడం వలన తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఉన్న విషయాన్నీ గుర్తించాలి. బాధపడే వారు తక్కువ గా ఉన్నారని అధికారులు అనడం బాధ్యతారాహిత్యం.
ఉపాధ్యాయులు చేసుకున్న అప్పీళ్ళనైనా పరిశీలించి ఇప్పటికే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సంబంధిత అధికారులు మాకు సంబంధం లేదంటూ ఉపాధ్యాయుల బాధను వినడానికి నిరాకరిస్తున్నారు.
ఉపాధ్యాయులు చేసుకున్న అప్పీళ్ళనైనా పరిశీలించి ఇప్పటికే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సంబంధిత అధికారులు మాకు సంబంధం లేదంటూ ఉపాధ్యాయుల బాధను వినడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వేలాది అప్పీళ్ళ ను ఏమి చేశారో కూడా ప్రకటించండం లేదు. తద్వారా ఉపాధ్యాయులలో మరింత ఆందోళన పెరుగుతుంది. నిన్నగాక మొన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మల్టీ జోనల్ కేటాయింపులను, లెక్చరర్లు, వైద్యులు, వైద్య ఉద్యోగుల కేటాయింపులలో కూడా తీవ్రంగా నష్టపోయిన వారు మానసిక ఆవేదనకు లోనవుతున్నారు. దీన్ని ప్రభుత్వం పరిశీలించాల్సి ఉండగా పంతానికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రాణాలు విడుస్తున్నారు.
ఇకనైనా ప్రభుత్వం జి.ఓ. 317 బాధిత ఉపాధ్యాయుల, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించడానికి కమిటీ వేసి బాధిత ఉద్యోగులు ఉపాధ్యాయులను వారి స్వస్థలాలకు తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తేనే వారి మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రభుత్వానికి పంతాలు కావాలో ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రాణాలు కావాలో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.
– K. రమణ. అధ్యక్షులు
మైస శ్రీనివాసులు. ప్రధాన కార్యదర్శి
తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF)