నేడు తారీఖు మే 22
సూర్యకుమార్
క్రీ.శ. 1251 మే 22 నాటి కొత్తపల్లి (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని కాలంలో కాయస్థ గంగయసాహిణి తన తల్లిదండ్రులకు పుణ్యంగా మణిమేఖలతీర్థంలోని (?)విష్ణు, నృసింహ, దైత్యసూద(?) దేవరల పూజా పునస్కారాలకు స్థానాపతియైన మునిదామయతీంద్రునికి కొత్తపల్లి గ్రామాన్ని ధారవోసినట్లుగా చెప్పబడ్డది. [నల్లగొండ జిల్లా శాసనాలు II నెం 70]. అట్లే 1268 యిదే తారీఖున యివ్వబడిన బూరుగుగడ్డ శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో సత్రము బొల్లమరాజు సోదరుడు ప్రథాని దేవకీపుత్రదాసుడు ఉభయపిరాట్ల సహిత చెన్నగోపీనాథుని ప్రతిష్ట చేసి దేవర అంగరంగ భోగాలకు యిరుకారులు పండే భూములనిచ్చినట్లు, అందులో దేవబ్రాహ్మణ భూములను మినహాయించినట్లు చెప్పబడ్డది.[హెచ్.ఎ.యస్. 13 నెం.18]. అట్లే 1559 యిదే తారీఖున యివ్వబడిన సుగమంచిపల్లి (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర రామరాజయ్యగారు తమ అవుకుసీమలో మంగళోజులపై గల కానిక కట్నం వెట్టి దొమ్మరిపన్ను మొదలగు పన్నులను సర్వమాన్యం చేసినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II. నెం.257]అట్లే 1593 యిదే తారీఖున యివ్వబడిన గుత్తి శాసనంలో వెంకటపతిరాయల పాలనలో జగతాపిగుత్తి శ్రీరామచంద్రదేవుని పూమాలసేవకి రఘునాధరాజయ్యదేవమహారాజులు గుత్తి పట్టణం యీడిగ గుత్త రొఖం నుండి నెలకు 2 గద్యాణాల చొప్పున సంవత్సరానికి 24 గద్యాణాలనిచ్చేటట్లుగా చెప్పబడ్డది. ఇక్కడ నెలకి 30 రోజులు లెక్కించాలని శాసనంలో చెప్పబడ్డది.[ద.భా.దే.శా.XVI నెం 304].