ప్రత్మహం పర్యవేక్షేత నరశ్చరిత మాత్మనః
కిన్నుమే పశుభిస్తుల్యం కిన్ను సత్పురషైరివ
గృహస్థ రత్నాకరము అనే గ్రంథం మనిషి తనను తాను ఆత్మపరిశీలనము చేసి చూసుకోవాలని చెబుతూ పై మాటలు చెప్పింది. ప్రతిరోజు ప్రతి మనిషి తన నడవడిపై తన చరిత్రపై తానే దృష్టి ఉంచుకోవలెను. ఈ రోజు నా ప్రవర్తన ఉత్తమ మానవుని వలె ఉన్నదా? లేక పశువలే ఉన్నదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి.
మన వ్యవహారంలో ఆధ్యాత్మికత అనగానే ఇదేదో వయసుమళ్ళిన వారికే గాని మనకు కాదన్న ఆలోచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా ఆధ్యాత్మికత అనగానే ఇది దైవ సంబంధమైనదే నన్న స్థిరమైన నమ్మకాలు కూడా చాలామందిలో ఉన్నాయి. కాని అసలైన ఆధ్యాత్మికత అంటే మనిషి తనను తాను శోధించుకొని సత్ప్రవర్తన కలిగి తానున్న సమాజానికి తోడ్పడటమే.
మన పూర్వులు తాపత్రయములుగా చెప్పే మూడు అంశాలలో ఆధ్యాత్మికత ఒకటి. ఆధిభౌతికము, ఆధిదైవికము అనేవి మిగిలిన రెండు అంశాలు. ఈ మూడు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడో ఒకచోట తటస్థపడుతూనే ఉంటాయి. అంతేకాని ఆధ్యాత్మికత అంటే ముక్కుమూసుకొని కూర్చోవడం, ఏవేవో పూజలు నిర్వహించుకోవడమనే సాంకేతిక అంశాలు మాత్రమే కాదు. ఆత్మను గురించి ప్రతి వ్యక్తి నిజాయితీగా ఆలోచించుకొని తానే దైవంగా ఎదిగే దిశలో ప్రయాణం సాగించడమే అసలైన ఆధ్యాత్మికత.
ఆత్మ పరిశీలనమే ఆధ్యాత్మికత. మనసును నిష్కల్మషం చేసుకోవడం ఆధ్యాత్మికత పరమార్థం.
మనిషన్నవాడు తాను ఉత్తమ విలువలతో కూడిన ధర్మాలను ఆచరిస్తూ, వాటినే ప్రచారం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఆధ్యాత్మికత. ఉత్తమ సంస్కారమే ఉత్తమ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వమే మనిషిని దైవం చేస్తుంది. అంతేకాని కేవలం పూజలు, వ్రతాలు, యాగాలు చేసి అన్ని పాపకర్మలు, సంఘవ్యతిరేక ప్రవర్తనలు ఆధ్యాత్మికం అనిపించుకోవు. వృద్ధాప్యంలో పొద్దుపోవడానికి చేసే ప్రక్రియ కాదు. మనిషి తాను జ్ఞానం పొందిన నాటి నుండి దాని ఫలాలను అనుభవిస్తున్న నాటి నుండి కూడా చైతన్యవంతుడై తన వాళ్ళ గురించి మాత్రమేగాని, కేవలం తనను గురించి మాత్రమే గాని స్వార్థంతో సంకుచితంగా ఆలోచిస్తూ ఆడంబరంగా పూజాదికాలు నిర్వహించి తన ఘనతను ప్రదర్శించుకోవాలనుకోవడం ఆధ్యాత్మికత అనిపించుకోదు. అది అసలైన ఆధ్యాత్మికత కూడా కాదు.
వైజ్ఞానికంగా మానవుడు ఖగోళాలు దాటివెళ్ళి నూతన ఆవిష్కరణలెన్నో సాధించి ఉండవచ్చు. కాని మరోసాటి మనిషి హృదయాన్ని మాత్రం చేరలేకపోతున్నాడు. ఇది సాధ్యమయ్యేది కేవలం ఆధ్యాత్మికత వల్ల మాత్రమే.
ఇది విశాల ప్రపంచంలో చరాచర సృష్టిలో అనేక జీవరాసులున్నాయి. బుద్ధిజీవిగా మానవునికి ఈ విశ్వంలో ప్రథమ స్థానం లభించింది. దాన్ని స్థిరంగా నిలుపుకుని, తనతోపాటు ఈ ప్రపంచమంతా బాగుండాలన్న ఆలోచనలు చేసి తన ప్రవర్తనను ఆ దిశగా మళ్ళించుకొని మంచిని చేయడమే ఆధ్యాత్మికత. అదొక ఆధునిక అవసరం కూడా. మనసును నిష్కల్మషం చేసుకోవడం ఆధ్యాత్మికత. మనిషి ఎప్పుడైనా రాగద్వేషాలకు అతీతుడేమీ కాదు. కాని వాటిని అడ్డుకునే ప్రయత్నం కాని, నిరోధించే ప్రయత్నంకాని తప్పక చేయాలి. అది మనిషి కనీసధర్మం. దానికి ఆలంబనమైన శక్తే ఆధ్యాత్మిక శక్తి. అంటే ముందుగా తనను తాను సంస్కరించుకోవాలన్నది తాత్పర్యం. ఆ సంస్కరించుకోవడం చిత్తశుద్ధితో చేయాలి. ఈ పని ఎవరికొరకో చేస్తున్నాననే ఊహకు దూరంగా తన ప్రయత్నం కొనసాగించాలి. తన నడవడికను, తన ప్రవర్తనను అవసరమనుకుంటే మార్చుకోవడానికి కూడా మానసికంగా సిద్ధపడాలి.
ఇటువంటి ఆధ్యాత్మికతనే భారతీయ శాస్త్రాలు బోధించాయి. దీనిని సత్యం అనే పేరుతో పిలిచి గౌరవించాయి. సత్యమే సర్వశ్రేష్టమని నొక్కి చెప్పాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంత వేగం సాధించి పురోగమిస్తున్న యీ ప్రపంచమానవుడు దీన్ని సాధించే అవకాశం ఉంటుందా? యీ ఆధ్యాత్మికత అవసరం ఏముంది. ఇది సుఖాలకు అడ్డుగా ఉంటుంది కదా! అనుకోవచ్చు. కాని మనిషి దృఢచిత్తంతో ప్రయత్నిస్తే తప్పక సాధించగలడు. తాత్కాలిక సుఖాలే పరమార్థాలనుకునే మానసిక భావనను కష్టపడైనా తొలగించుకోగలిగితే ఇదేమంత కష్టమైన పనికాదు.
జాగ్రత్తగా దీనిపై దృష్టిపెడితే ఇది అప్పటికాలం కన్నా ఇప్పుడే అవసరం ఎక్కువ. మనిషికి మనిషికి దూరమై పోతున్న రోజులొచ్చాయి. ఒక మనిషిని మరో మనిషి, ఒక గ్రామాన్ని మరో గ్రామం, ఒక రాష్ర్టాన్ని మరో రాష్ట్రం, ఒక దేశాన్ని మరోదేశం విశ్వసించలేని ఒకానొక అపనమ్మకపు భావనలు ప్రపంచాన్నంతా కప్పేశాయి. మానవ విలువలకు తిలోదకాలిస్తున్నాయి. మానవ సంబంధాలు మసిబారిపోతున్నాయి. వైజ్ఞానికంగా మానవుడు ఖగోళాలు దాటివెళ్ళి నూతన ఆవిష్కరణలెన్నో సాధించి ఉండవచ్చు. కాని మరోసాటి మనిషి హృదయాన్ని మాత్రం చేరలేకపోతున్నాడు. ఇది సాధ్యమయ్యేది కేవలం ఆధ్యాత్మికత వల్ల మాత్రమే. అది కూడా ప్రతి వ్యక్తీ తనను తాను శోధించుకుని సంస్కరింపబడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. యావత్ ప్రపంచం సుఖవంతమవుతుంది. కనుక ఉత్తమ జీవిత సూచికయే ఆధ్యాత్మికత అన్నది నూటికినూరు శాతం సత్యం.