Editorial

Wednesday, January 22, 2025
Interviewఅడుగడుగునా నా చరిత్ర ఉంది - టిఎన్. సదాలక్ష్మి

అడుగడుగునా నా చరిత్ర ఉంది – టిఎన్. సదాలక్ష్మి

ఆరు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో సదాలక్ష్మి గారు ఎన్నడూ రాజీపడలేదు. మంత్రివర్యులుగా, తొలి మహిళా డిప్యూటీ స్పీకర్, తెలంగాణ ఉద్యమకారిణిగా మాదిగ దండోరా నిర్మాతగా విశిష్ట వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. “అడుగడుగునా నా చరిత్ర ఉంది” అని సగర్వంగా చాటిన ఆ నిండు మనిషి జయంతి రేపు. ఈ సందర్భంగా 19 ఏండ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక ప్రచురించిన వారి జ్ఞాపకాలు తెలుపు మరోసారి. ఇంటర్వ్యూ : కందుకూరి రమేష్ బాబు.

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి?

మాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని బొల్లారం. నాన్న కర్ర కొండయ్య, అమ్మ గోపమ్మ ఇద్దరూ చదువుకున్న వాళ్లే. నాకు ఐదుగురు అన్నదమ్ములు. మా నాయన ఆయుర్వేద వైద్యుడు. సంస్కృతం చదువుకున్నాడు. ఆయనే నాకు మొట్ట మొదటి గురువు.

అమ్మ రామాయణం, మహాభారత ప్రవచనం చేసేది. నేను ప్రైమరీ స్కూలు బొల్లారం, మిడిల్ స్కూలు కీస్ హైస్కూల్లో చదివాను. ఇంటర్మీడియెట్ కోసం నిజాం కాలేజీలో చేరాను. ‘అది కో- ఎడ్యుకేషన్’ అని మా పెద్దన్న కాలేజీ మాన్పించాడు. నాకు చదువుకోవాలని పట్టుదలగా ఉండేది. అందుకని మద్రాస్ లోని క్వీన్ మేరీస్ విమెన్స్ కాలేజీలో యఫ్.ఏ.కి అడ్మిషన్ తీసుకున్నాను. ఇది 1949 నాటి మాట. మ్యారేజ్ అయ్యాకే మద్రాసు పోవాల్సి వచ్చింది. నిజాం కాలేజ్ నుంచి పోవడం మ్యారేజీ… ఇదంతా పెద్ద సమస్య అయింది. మానసికంగా పెద్ద దెబ్బ తగిలింది. అటూ ఇటూ తిరగడం వల్ల చదువు కూడా దెబ్బతింది. సప్లిమెంట్ కు ప్రిపేర్ అవుతున్నాను. అదే సమయంలో లేడీస్ కావాలని కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయంగా పిలుపు వచ్చింది. ఇక అప్పట్నుంచి చదువు లేదు సంధ్యలేదు.

రాజకీయ ప్రవేశం గురించి వివరించండి?

మొదటి జనరల్ ఎలక్షన్లలో ఇప్పటి కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేశాను. జనరల్ స్థానంలో పి.వి. నరసింహారావు, రిజర్వు స్థానం నుంచి నేను పోటీ చేశాను. కమ్యూనిస్టుల ప్రభావం బాగా ఉండేది. ఇద్దరం ఓడి పోయాం. 1957లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి రిజర్వు స్థానంలో పోటీ చేసి గెలిచాను.

అప్పుడు చెన్నారెడ్డి  నా దగ్గరకు వచ్చి రేడియో విన్నారా మీరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారట. నేను తర్వాతనట’ అని అక్కసుతో అడిగాడు. ‘ఏమో డాక్టరూ నేనేమీ విన్లేదు’ అని జవాబిచ్చాను. నిజంగానే నేను తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.

1960లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి యం.యల్.ఏ.గా గెలిచాను. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాడు. ఇంకా మంత్రివర్గం ఏర్పడలేదు. అప్పుడు చెన్నారెడ్డి  నా దగ్గరకు వచ్చి రేడియో విన్నారా మీరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారట. నేను తర్వాతనట’ అని అక్కసుతో అడిగాడు. ‘ఏమో డాక్టరూ నేనేమీ విన్లేదు’ అని జవాబిచ్చాను. నిజంగానే నేను తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.

మంత్రిగా మీ అనుభవం గురించి చెప్పండి?

నాతో సహా అప్పుడు 16 మందితో మంత్రివర్గం ఏర్పడింది. ఎండోమెంట్, స్మాల్ సేవింగ్స్, రిహాబిలిటేషన్ వెల్ఫేర్ వంటి శాఖలను నాకు అప్పగించారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టాఫ్ మీటింగ్ పెట్టాను. అధికారులను మంత్రిగా ‘మీ గ్రీవెన్సెస్ ఏమిట’ని అడిగాను. ఇది వారికి కొత్తట. అంతవరకు తమ సమస్యలు చెప్పుకోవాలంటే వారికి మంత్రులు ఇంటర్వ్యూ ఇచ్చేవారే కాదు.

‘ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ పెద్ద సముద్రం. అందులో అధికారులకు ప్రమోషన్లు ఉండేవి కావు. బాగా పని చేయాలంటే వారికి ప్రమోషన్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాను. ముఖ్యమంత్రి సంజీవ రెడ్డితో మాట్లాడి ఆ పద్ధతి మార్చివేశాను. అలాగే సంక్షేమం కూడా నేనే చూసేదాన్ని. అప్పుడు చెత్త డిపార్ట్మెంట్ గా చెప్పుకునే ఈ శాఖలో చాలా మార్పులు తీసుకొచ్చాను. కేవలం గిరిజన కార్పొరేషన్ ఒక్కటే ఉండే ఆ రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్, బి.సి కార్పొరేషన్, మహిళా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయించాను. ఆనాటి నా కృషి వల్లే నేడు ఆయా శాఖలు వటవృక్షాల్లా ఎదిగాయి.

డిప్యూటీ స్పీకర్ గా మీ అనుభవాన్ని వివరించండి?

1962 ఎన్నికల్లో నేను డిప్యుటీ స్పీకర్ గా ఎంపికయ్యాను. అప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు స్పీకర్. ఆయనకు గుండెపోటు రావడం వల్ల జబ్బు పడ్డాడు. దాంతో సభ నిర్వహణ భారం నా మీద పడింది. డిప్యూటీ స్పీకర్ గా నా అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. అప్పటి ఎక్స్ పీరియన్స్, అఛీవ్ మెంట్ ను తలుచుకుంటే ఇప్పుడు నిర్వర్తించిన వారు ‘ఏం లేదు’ అనిపిస్తుంది. సభ నిర్వహణ మొట్టమొదట అయోమయంగా అనిపించింది. నాది సైన్స్, కాళేశ్వరరావు నన్ను పిలిపించి ‘మద్రాసులో చదువుకున్నట్టున్నావు. ఇంగ్లీషు వచ్చు కదా’ అని అడిగాడు. అవునన్నాను. ‘ధైర్యంగల మనిషివని విన్నాను ఏమమ్మా ? ‘ఆ ధైర్యం ఉంది’ అన్నాను. ‘బెల్ కొట్టగలవా’ అని నవ్వుతూ అడిగాడు. ‘వచ్చండీ’ అన్నాను. ‘అయితే ఏం భయపడకండి’ అన్నాడు.

నా అబ్జర్వేషన్లో ఒకటి గమనించాను. ఎక్కువ చాన్స్ ఆపోజిషనుకు ఇవ్వాలి. వారు స్టడీ చేసి వస్తారు. సప్లిమెంట్ క్వశ్చన్స్ వేస్తారు. అపోజిషన్ వారికి అవకాశం ఇస్తే, గవర్నమెంటుకు కూడా మంచిది. విమర్శ వస్తే కనువిప్పు కలుగుతుంది.

ఆ తర్వాత ఆయన జబ్బు పడ్డాక వెళ్లి కలిశాను. ‘రూలింగ్ ఇబ్బంది అయితే రిజర్వ్ చేసుకోమ్మా. వచ్చి నన్నడుగు’ అని ఆయన చెప్పాడు. కానీ నాకా అవసరం ఎప్పుడూ రాలేదు. సభలో అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, వందేమాతరం రామచంద్రరావు వంటి వారు ప్రతిపక్షంలో ఉండేవారు. అంతా హేమాహేమీలు. దేవుడి దయవల్ల నాకు ఏనాడూ ఇబ్బంది కాలేదు. నా రూలింగును అందరూ ప్రశంసించేవారు. ప్రతి పక్షం వాళ్లే మెచ్చుకునే వారంటే అర్ధం చేసుకోండి. నా అబ్జర్వేషన్లో ఒకటి గమనించాను. ఎక్కువ చాన్స్ ఆపోజిషనుకు ఇవ్వాలి. వారు స్టడీ చేసి వస్తారు. సప్లిమెంట్ క్వశ్చన్స్ వేస్తారు. అపోజిషన్ వారికి అవకాశం ఇస్తే, గవర్నమెంటుకు కూడా మంచిది. విమర్శ వస్తే కనువిప్పు కలుగుతుంది.

డిప్యూటీ స్పీకర్ గా మీరు బాగా గుర్తుపెట్టుకున్న అనుభవం చెబుతారా?

అప్పట్లో పబ్లిక్ వర్క్సు డిపార్ట్మెంట్ మంత్రిగా అల్లూరి సత్యనారాయణ ఉండే వారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇవ్వవలసిందిపోయి ముఖ్యమంత్రి సంజీవయ్య కలగజేసుకునేవారు. సదరు మంత్రి జవాబు చెప్పడానికి వీలుకాకపోతే ముఖ్యమంత్రికి ఈ అవకాశం ఉంది. కానీ, ముందే ముఖ్యమంత్రి కలగ జేసుకోవడం నాకు నచ్చేది కాదు. దాంతో ఒకసారి “ప్లీజ్ హానరబుల్ సి.యం. మే టేక్ యువర్ సీట్. కన్సర్న్డ్ మినిస్టర్ మస్ట్ రిప్లయ్” అన్నాను.

మాదిగది. దీనికెంత పొగరు’ అని అనుకున్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. అధికారం ఒక మహిళ చేతుల్లోకి వస్తే ఆమె మనసు పెట్టి పని చేస్తుందనడానికి నేనే ఒక ఉదాహరణ.

కటువుగా ఒక ముఖ్యమంత్రిని కూర్చో అన్నోళ్ళు చరిత్రలోనే లేరు. నా వరకు నేను ప్రొసీడింగ్స్ తప్పితే భరించలేను. అసెంబ్లీ అయినా, కుటుంబమైనా ఒకటే. ఎవ్వర్నెయినా నేను పేరు పెట్టే పిలుస్తాను. మాదిగది. దీనికెంత పొగరు’ అని అనుకున్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. అధికారం ఒక మహిళ చేతుల్లోకి వస్తే ఆమె మనసు పెట్టి పని చేస్తుందనడానికి నేనే ఒక ఉదాహరణ.

తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర గురించి చెప్పండి?

తెలంగాణ మూమెంట్ గూర్చి కొత్తగా ఏం చెప్పాలి. 1967లో ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి విద్యార్థి ఉద్యమం రాజుకుంది. పోలీసులు మెర్సీలెస్ గా కొడుతున్నారు. నైజాం కాలేజీలో హింసాత్మకంగా కొట్టారు. విని తట్టుకోలేకపోయాను. మార్చ్ మూడు. రెడ్డి హాస్టల్లో కన్వెన్షన్. పోలీసుల హింసకు భయపడి దాన్ని విద్యార్థులు రద్దు చేసుకున్నారు. స్టేట్మెంట్ కూడా వచ్చింది. నేను, మాజీ ఎం.ఎల్.ఏ. శాంతాభాయి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాము. అప్పటి విద్యార్థులే మల్లిఖార్జున్, సూరిదాస్ రెడ్డి, లకన్ సింగ్, రత్నం, శంకర్ లు. వారికి పెద్దల సహకారంలేదని చెప్పడంతో ‘మేం ముందుంటాం. దీన్ని పెద్దల మూమెంట్ గా మారుస్తాం’ అని భరోసా ఇచ్చాం. రంగంలోకి దిగాం. ప్రత్యేక తెలంగాణతోనే మన కష్టాలు తీరుతాయని ప్రచారం చేస్తూ రాష్ట్రమంతా తిరిగాము. మేం ఫలానా జిల్లాకు వెళుతున్నాం అంటే చాలు, జనం లక్షల్లో ఆర్గనైజ్ అయిపోయేవారు. ఇలా విద్యార్థుల ఉద్యమాన్ని నేను పొలిటిసైజ్ చేశాను. తెలంగాణలోని ప్రతి ఎం.ఎల్.ఏ. ఇంటికి వెళ్ళాను. మున్సిపల్ కార్పొరేటర్లతో స్టేట్ మెంట్ ఇప్పించాను. ప్రజల్లో అనూహ్యమైన స్పందన.

తెలంగాణ ప్రజాసమితి నిర్మాణం గురించి చెప్పండి?

‘తెలంగాణ ప్రజా సమితి’ అన్న పార్టీకి మొదటి సెక్రటరీగా ఉన్నాను. విధ్యార్థులపై కేసులు పెడుతున్నారు కనుక లీగల్ సపోర్ట్ ఉంటుందని మదన్ మోహన్ ను చైర్మెన్ ను చేశాను. ఆయన లాయర్. ఈయన కాకుండా శంకర్రావు, సక్సేనా, జి.నారాయణరావు ఇంకా ఎంతోమందితో కలిసి పని చేశాను. అప్పటి ఉద్యమంలో ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయడాన్ని పనిగా పెట్టుకున్నాను. బట్టల దుఖాన్ల వాళ్లను, బేగం బజార్లో ఇత్తడి సామాన్లు అమ్మే వాళ్లను, లాయర్లను, బిజినెస్ అసోసియేషన్స్ ను, యన్.జీ.వో లను ఆర్గనైజ్ చేశాను. అప్పుడు జైల్ భరో స్టేట్మెంట్లు ఇస్తే, జైళ్ళే కాదు, ప్రైమరీ స్కూళ్ళు, కాలేజీలు నిండిపోయాయి. ఎడ్లబండ్లు, ఆటోలు, సైకిళ్లతో ర్యాలీలు తీస్తే చార్మినార్ నుంచి గవర్నర్ హౌజ్ వరకు గోడ పెట్టినట్లు ఉండేది.

ఆఖర్లో ‘విజయమో ‘వీర స్వర్గమో’ అన్న నినాదం ఇచ్చి ఉద్యమాన్ని ‘వయెలెన్స్’ వైపు నడిపించాను. పంద్రాగస్టు నాడు జాతీయ జెండాతోపాటు తెలంగాణ జెండా ఎగరెయ్యాలని పిలుపిచ్చినాను. నా ఉద్దేశ్యం ముందుగాల జాతీయజెండా ఎగరేయాలి. ఆ జెండా కింద తెలంగాణ జెండా ఎగరేయాలి. అట్లయితనే తెలంగాణను సపోర్టు చేసినట్లు. దీంతో ఒక్క మంత్రి టూరు వెళితే ఒట్టు.

ఆ పీరియడ్ లో వినాయక చవితి వచ్చినా, బోనాలు వచ్చినా తెలంగాణ పేరుతో జరపాలి. తెలంగాణ బోనాలు అంటూ కుండలకు పసుపు కుంకుమ పెట్టేవారు. బ్యానర్ కు వేప ఆకులు కట్టి తీసుకపోయే వారు. ఇలా ప్రతి పండుగకు తెలంగాణ పబ్లిక్ బాగా సహకరించేవారు. అప్పటి ఉద్యమ ఉధృతి చూసి ఆంధ్రవాళ్లు విపరీతంగా బయపడ్డారు. అప్పుడు మలక్ పేటలో ఫుల్గా ఆంధ్రా వాళ్లు ఉండేవారు. పెట్టే బేడా సర్దుకుని పోతానికి తయారైనారని విన్నాను. రాత్రికి రాత్రి వెళ్లి వాళ్లకు సర్ది చెప్పాను. ‘మీరూ మేము సోదరులం. ఆంధ్రవాళ్లు ఇక్కడ ఉండద్దని మేమేమీ అనడం లేదు. అది మా సిద్ధాంతం కాదు. తెలంగాణాలో మా కొరకు మేం ఆర్గనైజేషన్, ఆడ్మిని స్ట్రేషను తీసుకోవడానికి ఉద్యమం చేస్తున్నాం. అది తీసుకుంటానికే పోరాడుతున్నాం. ఇది కాస్మోపాలిటిన్ స్టేట్. ఎవరైనా ఉండొచ్చు’అని వారికి వివరించాను.

నాటి నాయకత్వం గురించి ఏమంటారు?

తెలంగాణ ప్రజా సమితి పార్టీకి నేను సంవత్సరం మీద రెండు నెలలు నాయకత్వం వహించాను. చెన్నారెడ్డి కేవలం ఒక్కనెల మాత్రమే సెక్రటరీగా చేశాడు. తర్వాత అరెస్ట్ అయ్యాడు. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. నాటి ఉద్యమానికి ప్రజల మద్దతు ఉంది గానీ నాయకత్వమే సరిపోలేదు. చెన్నారెడ్డి మాత్రం మంచి నియ్యతుతో పని చేయలేదు. సరెండర్ అయ్యాడు. తెలంగాణను ముంచినాడు.

‘చిన్న కుటుంబం చింతలేని కుటుంబం’, ‘తెలంగాణ వస్తే బొమ్మరిల్లుగా దిద్దుకుంటామని చెప్పాలి.

ఇప్పటి రాజకీయాల్లో తెలంగాణానే ముఖ్యం. తెలుగుదేశం కు తెలంగాణానే ప్రత్యామ్నాయం. ఇప్పటి వాళ్ళకి తెలంగాణ గురించి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేక పోతున్నారు. ఉద్యమ ఆవశ్యకతను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేక పోతున్నారు. ‘చిన్న కుటుంబం చింతలేని కుటుంబం’, ‘తెలంగాణ వస్తే బొమ్మరిల్లుగా దిద్దుకుంటామని చెప్పాలి.

తెలంగాణ ఎలా సాధ్యం అనుకుంటున్నారు?

నిన్న మొన్నటి పోరగాండ్లతో తెలంగాణ సాధ్యం కాదు. అది కాంగ్రెస్తోనే సాధ్యం. కమ్యూనిస్టుల్లో చీలికలు రావడంవల్ల మళ్లీ కాంగ్రెసే కావాలి. స్లోగన్ కాదు, దానికి ఓటర్ల బలం ఉంది. బి.జె.పి.కి కూడా ఓటర్ల బలం లేదు. ఇక చంద్రశేఖర్, చంద్రబాబును ఎదుర్కోగలడని నాకైతే నమ్మకం లేదు. తెలంగాణ ఐక్యవేదికలో ఇంటలెక్చువల్స్ ఉన్నరు. వారు జనం దగ్గరకు వెళ్లాలి.

ఎమర్జెన్సీ రోజులలో మీ యాక్టివిటీ?

ముందు రోజుల్లో బాబూ జగ్జీవన్ రామ్ ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసి(సి.యఫ్.డి) అనే పార్టీని నెలకొల్పారు. జయ ప్రకాష్ నారాయణ్ పిలుపును అందుకొని ఎన్నికల్లో ఈ పార్టీని జనతా పార్టీతో విలీనం చేసాము. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరా మీద ధ్వజమెత్తాము. అవినీతిపై ‘నీతి నిజాయితీ  కొరకు యుద్ధం’ అని ప్రచారం చేశాము. బాబుల్ రెడ్డిని జనతాపార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేయించాను. మోరార్జీ దేశాయ్, బహుగుణ, చంద్రశేఖర్, పండిత రాంచంద్రరావ్, వాజ్ పాయ్ వీరంతా నా కొలీగ్స్. కాంగ్రేస్ లో ఇప్పుడు పి.వి ఒక్కరే నా కొలీగ్. జనతాపార్టీ విచ్ఛిన్నం తర్వాత బాబూ జగ్జీవన్ రామ్ జై కాంగ్రెస్ పార్టీ పెట్టారు. నేను వద్దన్నాను.

తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పని చేశారుకదా?

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నన్ను పార్టీలో చేరమని ఆయన ఆహ్వానించారు. బాబూ జగ్జీవన్ రామ్ తో మాట్లాడి తెలుగుదేశంలో చేరాను. ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పని చేశాను. పార్టీ ఏర్పాటైన తొలి రోజులవి. చిత్తూరు సభలో ఒక కార్యకర్త నక్సలైట్ల గురించి చెప్పినప్పుడు వారి గూర్చి వివరించమని ఎన్టీఆర్ నన్ను కోరారు. వారి త్యాగాల గురించి చెప్పగానే, ఆ తర్వాతి సభలోనే ఆయన నక్సలైట్లను దేశభక్తులని అన్నారు. ఇప్పటికీ నేను అదే మాట అంటాను. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉన్నట్లే, నక్సలిజం ప్రభుత్వానికి ప్రతిపక్షం వంటిది. అది ప్రభుత్వంతో మంచి పనులు చేయిస్తుంది.

తెలుగు దేశం నుంచి ఎందుకు బయటకు వచ్చారు?

తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను ‘లీడ్ కాప్’ చైర్మన్ గా పని చేశాను. బంగారం లాంటి లెదర్ బిజినెస్ అంతా కమ్మవారి చేతుల్లోకి పోతోంది. అది మాదిగల కుల వృత్తికి పెద్ద దెబ్బ. అని మాట్లాడ సాగాను. దాంతో ఏడాదికే రామారావు ఈ పదవిలోంచి నన్ను తప్పించారు. తెలుగుదేశం పార్టీ రెండవసారి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నప్పుడు పార్టీలో మాదిగలకు 75 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సింది పోయి సీట్ల సంఖ్య తగ్గిస్తుంటే చాలా ఆవేదన చెందాను. నేను కుల పక్షపాతిని. మాదిగలకు కేవలం పదకొండు సీట్లు ఇవ్వడంతో అవమానంగా ఫీలయ్యాను. పార్టీలోంచి బయటకు వచ్చేసాను. అరుంధతి మహాసభ సెక్రటరీగా పని చేయసాగాను.

దండోరా ఉద్యమం వెనుక మీ పాత్ర ఎటువంటిది?

మాదిగలకు వర్గీకరణ అన్నది ‘నా ఫార్మూలా’నే. 1972లోనే నేను వెంగళరావుకు మెమొరాండం ఇచ్చాను. 1992లో నిజాం కాలేజీలో అది జాంబవ అరుంధతి మహాసభ జరిగింది. ఆ సభలోనే నా కార్యకర్తలతో వర్గీకరణపై పట్టు పట్టించాను. ‘వర్గీకరణ సభ జరిపితే నువ్వు ధృవతారగా చరిత్రలో నిలబడుతావు. లేకపోతే మాదిగలు అన్నలవుతారు’ అని ముఖ్యమంత్రి విజయ భాస్కర్రెడ్డికి ఆ రోజే చెప్పాను. ఆయన వినిపించుకోలేదు.

నా పేరు పెట్టకుండా కృష్ణ, కృపాకర్ లతో వర్క్ చేశాను. పోస్టర్స్ పై వారి ఫోటోలు, పేర్లనే వేయించాను. నా ఇల్లే అప్పుడు దండోరాకు కార్యాలయం.

ఆ తర్వాత మాదిగ దండోరా ఉద్యమాన్ని నిర్మించాను. కొత్త తరం వారితో ఈ ఉద్యమం నడపాలని అనుకున్నాను. అందుకు తగ్గట్టే నా పేరు పెట్టకుండా కృష్ణ, కృపాకర్ లతో వర్క్ చేశాను. పోస్టర్స్ పై వారి ఫోటోలు, పేర్లనే వేయించాను. నా ఇల్లే అప్పుడు దండోరాకు కార్యాలయం.

మిమ్మల్ని ‘దళిత లీడర్’ అంటే ఒప్పుకుంటారా?

ఒప్పుకోను. నేను జనరల్ లీడరు. అడుగడుగునా నా చరిత్ర ఉంది. మీరు రాసుకోలేరు. బ్రాహ్మణులు, రెడ్లు కూడా నా కార్యకర్తలే. అందరికీ నేను సేవ చేసిన. నేను లీడరు కావడం వల్ల, వినటమే కానీ చదవటం రాయటం తక్కువ. అందువల్ల నా చరిత్ర చాలా మందికి తెలియదు. త్వరలోనే నా జీవిత చరిత్రను ప్రచురిస్తాను.

స్త్రీలు సమానత్వం కోసం చేసే పోరాటాలపై మీ అభిప్రాయం?

స్త్రీ పురుషుల మధ్య సమానత్వం కుదరదని నా అభిప్రాయం. స్త్రీ ఒక యంత్రం లాంటిది. ఆమె ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి యంత్రాన్ని నిర్మించదు కదా. స్త్రీ పురుషుడికి కూడా జన్మనిస్తుంది. ఆమెనే తన సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆమె పురుషుడితో సమానం అంటే స్త్రీని తక్కువ చేసినట్లే. స్త్రీ పురుషుడి కంటే ఎక్కువే. ఆమెను జాగ్రత్తగా చూసుకొంటేనే సంఘం పటిష్టంగా ఉంటుంది.

అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లపై మీ అభిప్రాయం?

అంబేద్కర్ ఎన్నడూ గెలవలేదు. బాబూ జగ్జీవన్ రామ్ ఎన్నడూ ఓడిపోలేదు. అది చరిత్ర. బాబూ జగ్జీవన్ రామ్ మొదటినుంచీ అడ్మినిస్ట్రేషన్లో ఉండబట్టి తగినంత సమయం దొరకక రచనలు చేయలేదు. అదే అంబేద్కర్ విషయానికి వస్తే ఆయనకు పదవులు, అధికారం లేకపోవడం వల్ల విస్తృతంగా రాయగలిగాడు. అంబేద్కర్ ను ‘ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్’ అంటే నేనొప్పుకోను. అలాగే రిజర్వేషన్లు అంబేద్కర్ వల్లే వచ్చాయనుకోవడం కూడా తప్పే. వీటి వెనుక చాలా మంది కృషి ఉంది.

ఈ వయసులో మీరేం చేస్తున్నారు?

నేను బాబూ జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలిని. ఆ సంస్థ ద్వారా పిల్లల చదువు సంధ్యల గురించి పట్టించుకుంటాను. బీదవారికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ద్వారా సహాయ సహకారాలను ఇప్పిస్తుంటాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ ఫోరమ్ ఫర్ కాంగ్రెస్ అనే సంస్థల్లో నా వంతు కృషి చేస్తున్నాను. నిర్ణయ అనే స్వచ్ఛంద సంస్థలో ట్రస్టీగా ఉన్నాను.

మీ జీవితాశయం?

నాకు డెబ్భై ఏళ్లు. వెన్నుపూస వద్ద ఒక ఎముక విరిగి కొంత ఇబ్బంది పడుతున్నాను. అయినా, తిరిగి పొలిటికల్ యాక్టివ్ కావాలని ఉంది. ముఖ్యంగా కల్తీకి వ్యతిరేకంగా మహిళా ఉద్యమాన్ని నిర్మించాలని ఉంది.

గుడిసెలో ఉంటున్న కార్మికుడు కారప్పొడి కలుపుకొని తిండి తింటున్నాడు. ఆ కారం కూడా కల్తీ అయితే ఇక బ్రతికేదెలా? ఇది ప్రపంచ వ్యాప్త సమస్య, మహిళలతోనే జరగవలసిన ఉద్యమం. ‘ఇది నా చివరి కోరిక’.

ఈ ఇంటర్వ్యూ 24 నవంబర్ 2002 ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక సౌజన్యంతో పునర్ ముద్రితం. అన్నట్టు, రేపు ‘ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే కార్యక్రమలో ‘ఫైర్ బ్రాండ్ టి ఎన్. సదాలక్ష్మి’ పేరుతో వారిపై వచ్చిన రచనలతో ఒక పుస్తకం విడుదలవుతోంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article