Editorial

Monday, December 23, 2024
Peopleజ్ఞాపకం : సిల్క్ స్మిత జీవితంలో చివరి రోజు : తోట భావనారాయణ తెలుపు

జ్ఞాపకం : సిల్క్ స్మిత జీవితంలో చివరి రోజు : తోట భావనారాయణ తెలుపు

The last day in Silk Smitha’s life

చావు వార్త ఏదైనా బాధపెడుతుంది. ఎంత దగ్గర అనేదాన్ని బట్టి తీవ్రత ఎక్కువవుతుంది.

ఒకటిన్నర దశాబ్దం పైగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత కోట్లాది మందికి ఎంత దగ్గరో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? 450 సినిమాలంటే మాటలు కాదు. దారిపొడవునా ఆమె ధ్యాసే…

తోట భావనారాయణ

1996 సెప్టెంబర్ 23. ఉదయం 7 గంటలు కూడా కాలేదు.

ఫోన్ మోగింది. పలకరింపు కూడా లేకుండా నేరుగా విషయంలోకి వచ్చారు. “సిల్క్ స్మిత సూసైడ్ చేసుకుంది. వెంటనే వచ్చేయండి”. కాస్త మాట్లాడటం తప్ప తెలుగు చదవటం, రాయటం రాని మద్రాస్ సౌత్ జోన్ డీసీపీ సూర్యప్రకాశ్ మాటల అర్థం కాస్త అటూ ఇటుగా ఇదే. ఆ వార్త జీర్ణించుకోలేని అయోమయంలో “ఎలా?” అని అడుగుతుంటే “త్వరగా వచ్చేయండి. నేనూ బయల్దేరుతున్నా” అంటూ ఫోన్ కట్ చేశారు.

అప్పుడామెకు 36 ఏళ్ళు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటి? అని ఆలోచిస్తూ ఉండగానే నాలో రిపోర్టర్ మేలుకున్నాడు. అప్పుడు నేను మద్రాసులో వార్త సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నా. ఫొటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కు ఫోన్ చేశా. వలసరవాక్కంలో స్మిత ఇల్లు అతనుండే వడపళనికి ఐదు కిలోమీటర్లు మించి ఉండదు. నా కంటే త్వరగా చేరుకునే అవకాశం అతనికే ఉంది. పైగా నేను కాస్త ఆలస్యంగా వెళ్ళినా వివరాలు సేకరించవచ్చుగాని అక్కడి పరిస్థితి కెమెరాలో బంధించాల్సినవాడు వీలైనంత స్పీడ్ గా వెళ్ళాలి. సౌందర్ అలర్ట్ అయ్యాడు. నేనూ బయల్దేరా.

చావు వార్త ఏదైనా బాధపెడుతుంది. ఎంత దగ్గర అనేదాన్ని బట్టి తీవ్రత ఎక్కువవుతుంది. ఒకటిన్నర దశాబ్దం పైగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత కోట్లాది మందికి ఎంత దగ్గరో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? 450 సినిమాలంటే మాటలు కాదు. దారిపొడవునా ఆమె ధ్యాసే. ఎన్నో సంగతులు గుర్తుకొస్తున్నాయి. సినిమా హిట్టవ్వాలంటే సిల్క్ స్మిత పాట ఉండి తీరాలన్నది అప్పటి సినిమా ఫార్ములా. ఎంత పేరుమోసిన తారాగణం ఉన్నాసరే సిల్క్ లేకపోతే కుదరదంటే కుదరదని బయ్యర్లు కూడా భీష్మించుకునే రోజులున్నాయి.

1982 లో తెలుగులో సూపర్ హిట్ అయిన జస్టిస్ చౌదరి 1983 లో తమిళంలోకి ‘నీతిపతి’ గా రీమేక్ అయింది. ఎన్టీఆర్ డబుల్ రోల్ స్థానంలో శివాజీ గణేశన్, ఆయన కొడుకు ప్రభు ఉన్నారు. హీరోయిన్ రాధిక. ఇది పెద్ద కాంబినేషనే కాబట్టి తమిళంలో కూడా హిట్ అవుతుందనే అంచనా. సినిమా ప్రివ్యూ చూసిన బయ్యర్లు పెదవి విరిచారు. శివాజీ గణేశన్ కి ఇదొక షాక్. సిల్క్ లేని సినిమా అమ్ముడుపోదని కరాఖండీగా తేల్చి చెప్పారు. పెద్దాయన అహం దెబ్బతిన్నది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో సినిమా తీస్తే ఇదేం పద్ధతని నిలదీశారు. కానీ, జనం నాడీ తెలిసిన బయ్యర్లు పట్టువదల్లేదు.

నిర్మాత సురేశ్ బాలాజీకి మరో దారిలేదు. సినిమా అమ్ముడు పోవాలి. అప్పటికప్పుడు సిల్క్ డేట్స్ కోసం ట్రై చేశారు. అతి కష్టం మీద 15 రోజుల తరువాట రాత్రిపూట డేట్స్ దొరికాయి. ఈలోగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకితో పాట రికార్డ్ చేయించారు. బీచ్ లో షూట్ చేశారు. “ముత్తెడుక్కుమ్ ఆశయిలే.. కట్టుమారం యేరయిలే.. తొట్టుతళువుడది కాత్తు .. ముంగి ముంగి యేందిరిచ్చేన్ ..” అంటూ సాగే మత్తెక్కించే పాట కలిపిన తరువాతగాని బయ్యర్లకు కిక్కెక్కలేదు. వాళ్ళు ఊహించినట్టే సినిమా హిట్టయింది. ఈ లింక్ లో 27:35 దగ్గర చూడండి.

 

హీరో హీరోయిన్లు ప్రభు, రాధిక మధ్య పాట మొదలవుతుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉండగానే సిల్క్ స్మిత పాట వస్తుంది. హీరో హీరోయిన్లు ప్రేక్షకులుగా మిగిలిపోతారు. మొత్తంగా, అది అతికించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

విడుదలకు నోచుకోని సినిమాలకు ఇలాంటి పరిస్థితుల్లోనే సిల్క్ ఊపిరి పోసింది. రిలీజ్ కాకుండా డబ్బాలకే రీల్స్ పరిమితం చేయాల్సి వచ్చిన నిర్మాతలు ఆమె ఇంటిదగ్గర క్యూ కట్టారు. ఒక పాట జోడిస్తే చాలు సినిమా రిలీజ్ చేయవచ్చునన్న ఆశే అందుకు కారణం. అలా చాలా సినిమాలు సిల్క్ స్మిత పాట కలుపుకొని విడుదలై లాభాలు సంపాదించుకున్నాయి.

ఏలూరు పక్కన కొవ్వలి లో నాలుగోతరగతితో చదువు అటకెక్కించి, ఇష్టం లేని పెళ్ళికి వీడ్కోలు చెప్పి, ఇష్టమైన సినిమా మీద పిచ్చితో మద్రాసు రైలెక్కిన వడ్లపట్ల విజయలక్ష్మి సినిమా జీవితం కోరుకుందే తప్ప తన జీవితమే సినిమా అవుతుందని ఊహించి ఉండదు.

ఏలూరు పక్కన కొవ్వలి లో నాలుగోతరగతితో చదువు అటకెక్కించి, ఇష్టం లేని పెళ్ళికి వీడ్కోలు చెప్పి, ఇష్టమైన సినిమా మీద పిచ్చితో మద్రాసు రైలెక్కిన వడ్లపట్ల విజయలక్ష్మి సినిమా జీవితం కోరుకుందే తప్ప తన జీవితమే సినిమా అవుతుందని ఊహించి ఉండదు. నటి కావాలన్న ఆశను తాత్కాలికంగా పక్కనబెట్టి టచప్ ఆర్టిస్టుగా చేరి చిన్నా చితకా పాత్రలకే పరిమితమవుతున్న సమయంలో మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మన్ ఆమెను ‘ఇనయే తేడి’ సినిమాలో హీరోయిన్ ని చేసి స్మిత అని పేరు పెట్టాడు. ఆ తరువాత ‘వండిచక్రం’ తమిళ సినిమాతో సిల్క్ స్మిత అయ్యింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని హవా సాగుతున్న రోజుల్లో దూసుకొచ్చి శృంగార రసాధిదేవతగా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కెరటం సిల్క్ స్మిత. తమిళ ప్రేక్షకులు ఆమెను సిల్క్ అనే పిలుస్తారు.

ఆలోచనలు ఇలా సాగుతుండగానే నా ఆటో వలసరవాక్కంలో ఆమె ఇంటి ముందు ఆగింది.

చుట్టుపక్కలవాళ్ళు పాతికమంది దాకా ఉన్నారక్కడ. చుట్టాలెవరూ ఇంకా రాలేదు. డీసీపీ సూర్యప్రకాశ్ స్వయంగా రంగంలోకి దిగటంతో దాదాపు డజన్ మంది పోలీసులున్నారక్కడ. మా ఫొటోగ్రాఫర్ సౌందర్ రాజన్ అప్పటికే ఫోటోలు తీయటం పూర్తి చేసి నాకోసం ఎదురుచూస్తున్నాడు. నన్ను చూడగానే లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించింది స్మిత. నల్ల టీ షర్ట్, నైట్ పాంట్ లో ఉంది. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న సిల్క్ ఇప్పుడు నిర్జీవంగా ఉంది. అభిమాన నటీనటుల ఆటోగ్రాఫ్ తీసుకునే అలవాటుకు భిన్నంగా సిల్క్ స్మిత విషయంలో తమిళ ఫాన్స్ ప్రవర్తించేవారు. ఒక కిళ్ళీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని బతిమాలుకోవటం అప్పట్లో ఒక ట్రెండ్. 1984 లో ఒక సారి షూట్ బ్రేక్ లో యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని పిలుపొచ్చింది. సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ కొరికిన యాపిల్ ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కోవటమంటే మాటలా?

షాట్ గ్యాప్ లో ఆ డ్రెస్ తో కూర్చోవటం ఇబ్బందిగా ఉండి కాలుమీద కాలేసుకొని కూర్చుంటే అహంభావమని అపార్థం చేసుకున్నవాళ్ళూ, ఇదే అదనుగా ఆమె మీద నెగటివ్ ప్రచారం చేసినవాళ్ళూ ఉన్నారు.

తన పాత్రలకు తగినట్టుగా, తన పాటకు తగినట్టుగా, సందర్భోచితంగా డ్రెస్సులు స్వయంగా డిజైన్ చేసుకోవటం సిల్క్ స్మిత ప్రత్యేకత. కోట్లాది అభిమానులకోసం తనను తాను ఎలా ప్రదర్శించుకోవాలో తెలిసిన కళాత్మకత ఆమె సొంతం. అందుకే నిర్మాతలు గాని డైరెక్టర్లు గాని ఆమెకు సూచనలిచ్చేవారు కాదు. పైగా వాళ్ళ అంచనాలను కూడా మించిపోయి ఆమె డ్రెస్ సెలెక్షన్ ఉండేది. అయితే, షాట్ గ్యాప్ లో ఆ డ్రెస్ తో కూర్చోవటం ఇబ్బందిగా ఉండి కాలుమీద కాలేసుకొని కూర్చుంటే అహంభావమని అపార్థం చేసుకున్నవాళ్ళూ, ఇదే అదనుగా ఆమె మీద నెగటివ్ ప్రచారం చేసినవాళ్ళూ ఉన్నారు. ఇలా ముసురుకుంటున్న జ్ఞాపకాలతో తలమునకలై ఉండగా ఒక ఎస్సై వచ్చి సూర్యప్రకాశ్ గారు పక్క గదిలో ఉన్నారని చెప్పాడు.

“రండి. ఇది చదివి అర్థం చెప్పండి” అంటూ ఒక పేపర్ నా చేతిలో పెట్టారాయన. చిన్న పిల్లల రాతలా ఉన్న ఆ కాగితం ముక్క సిల్క్ స్మిత సూసైడ్ నోట్ అని అర్థమైంది. మానసికంగా చాలా వత్తిడిలో, నిరాశతో ఉన్నట్టు ఆమె మాటల్ని బట్టి అర్థమవుతూనే ఉంది. కొన్నేళ్ళుగా ఆమె బాగోగులు చూస్తున్న రాధాకృష్ణ ఇంట్లోనే ఆమె కూడా ఉంటోంది. రాధాకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. గడ్డం బాబుగా సినీ పరిశ్రమ చెప్పుకునే రాధాకృష్ణ ఆమెను గుప్పిట్లో పెట్టుకున్నాడని అంటూ ఉంటారు. కానీ ఈ లెటర్ లో మాత్రం బాబు (రాధాకృష్ణ) మంచివాడని, ఇంకెవరో మోసం చేశారని ఉంది. తనను తాను ఒక అభాగ్యురాలిగా చెప్పుకుంటూ, దేవుణ్ణి ఉద్దేశించి రాసినట్టున్న ఈ లెటర్ లో అక్షరదోషాలు దిద్దితే ఇలా ఉంటుంది. (అసలు లెటర్ కూడా ఇక్కడే ఇస్తున్నా. ఏమంత స్పష్టంగా ఉండదు)

“అభాగ్యురాలు 22/9/1996”

దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశాంతి లేకుండా చేశారు. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్న . అతను నన్ను మోసం చేసాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను.

దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు.

నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేసాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు . నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును.”

చదివి అర్థం చెప్పటం పూర్తయ్యాక లెటర్ కాపీ కావాలని డీసీపీని అడిగా. కాసేపు తటపటాయించి అక్కడ ఒక ఎస్సైని పిలిచి ఫోటోకాపీ తెమ్మన్నారు. అప్పుడప్పుడే పత్రికలవాళ్ళు వస్తూ ఉన్నారు. మిగిలిన పత్రికలవాళ్ళకెవరికీ ఆ లెటర్ ఇవ్వద్దన్నాను. “మీ పోటీ తగలెయ్యా” అన్నట్టు నవ్వుతూ సరేనన్నారు. ఫోటో కాపీ వచ్చేలోపు మరిన్ని వివరాలు తీసుకొని అక్కడినుంచి బయల్దేరా.

“ఎవరూ రాకపోయినా మీరు రావటం ఆశ్చర్యంగా ఉంది” అన్నప్పుడు ఇది గుర్తు చేసుకొని అర్జున్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.

మళ్ళీ సాయంత్రం వచ్చా. అప్పటికి పోస్ట్ మార్టం పూర్తయింది. చూడటానికి వచ్చేవాళ్లకోసం అక్కడే పెట్టారు. సిల్క్ స్మిత చనిపోయిన వార్త విన్న సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలని అందరిలాగే నాకూ అనిపించింది. హీరో అర్జున్ వచ్చాడు. ఎవరూ పట్టించుకోకపోయినా అర్జున్ మాత్రమే రావటం కాస్త ఆశ్చర్యమే కలిగించింది. ఆ మాటే అడిగితే చెప్పాడు. అంతకు కొద్ది రోజుల ముందే ఒక సినిమా షూటింగ్ చివరి రోజు అర్జున్ తో “నేను చచ్చిపోతే చూట్టానికి వస్తావా”? అని అడిగిందట. “ఛీ అదేం మాట” అని తేలిగ్గా కొట్టిపారేశాడే తప్ప సీరియస్ గా తీసుకోలేదు. “ఎవరూ రాకపోయినా మీరు రావటం ఆశ్చర్యంగా ఉంది” అన్నప్పుడు ఇది గుర్తు చేసుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. సెప్టెంబర్ 24 సంచికలో వార్త మొదటి పేజీ మూడోవంతు స్మిత ఫోటోతోబాటు లెటర్, ఆమె వార్తలు ఆక్రమించాయి.

అంత్యక్రియలదాకా జరిగిన విషయాలు, చిత్ర పరిశ్రమ స్పందించిన తీరు ఫాలో అప్ వార్త రాయటమే కాదు.. ఫటాఫట్ జయలక్ష్మి, దివ్యభారతి, సిల్క్ స్మిత లాంటి సినిమా సెలబ్రిటీల ఆత్మహత్యలని విశ్లేషిస్తూ నేను రాసి పంపిన వ్యాసం వార్త ఎడిటోరియల్ గా మారింది. అప్పట్లో స్మిత మరణం ఎడిటోరియల్ గా మారటం ఒక సంచలనమే. అయితే ఆ తరువాత ఆమె జీవిత కథ సినిమాలుగా రావటం చూశాం. 2011 లో విద్యాబాలన్ తో ఏక్తాకపూర్ తీసిన హిందీ సినిమా డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత పుట్టిన రోజునాడు విడుదల కావటం, విద్యాబాలన్ కు జాతీయ ఉత్తమనటి అవార్డు రావటం తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయింది. ఆ తరువాత 2013 లో పాకిస్తానీ నటి వీణా మాలిక్ తో ఒక కన్నడ సినిమా, సనా ఖాన్ తో ఒక మలయాళం సినిమా కూడా వచ్చాయి.

చనిపోయాక ఆమెతో అవసరం తీరిపోయిందనుకున్న చిత్ర పరిశ్రమ కనీసం ఒక సంస్మరణ సభ కూడా జరపలేదు.

చనిపోవటానికి ముందురోజు సాయంత్రం రాత్రి సిల్క్ స్మిత చాలా మందికి ఫోన్ చేసినట్టు ఆ తరువాత చాలామంది ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మొదలు తెలుగు నటి అనూరాధ దాకా చాలామంది బాధపడ్డారు. స్పందించకపోవటానికి ఏవేవో కారణాలు చెప్పుకున్నారు. బైటికి చెప్పనివాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. చనిపోయాక ఆమెతో అవసరం తీరిపోయిందనుకున్న చిత్ర పరిశ్రమ కనీసం ఒక సంస్మరణ సభ కూడా జరపలేదు. మళ్ళీ ఆమె కథనే సినిమాకు ముడిసరకుగా వాడుకోవటానికీ వెనకాడలేదు.

తోట భావ నారాయణ సీనియర్ పాత్రికేయులు. చెన్నయ్ కేంద్రంగా వారు చాలా కాలం పనిచేశారు. తెలుగునాట టివి జర్నలిజంలో తొలితరం ప్రవేశకులు. ఎలక్ట్రానిక్ జర్నలిజం లోతుపాతులపై, పరిణామాల సాధికారిక విశ్లేషకులు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article