Editorial

Friday, January 10, 2025
అభిప్రాయం‘ఆ ఇద్దరు’ దళిత బంధువులు – థాంక్స్ టు కెసిఆర్

‘ఆ ఇద్దరు’ దళిత బంధువులు – థాంక్స్ టు కెసిఆర్

కెసిఆర్ గారికి అత్యంత సన్నిహితులే ఐతే అది నిరూపించుకునేందుకు ఆ ఇద్దరు మేధావులు చేయవలసింది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ఆ నిధుల పక్కదారి పట్టకుండా చూడటం, దళిత ముఖ్యమంత్రి హామీ అమలు గురించి పట్టుబట్టడం, దళితులకు మూడెకరాల స్థలం గురించి నిలదీయడం, కానీ అంతెత్తున అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రికి అపార పేరు ప్రతిష్టలు తెచ్చేందుకు అష్టకష్టాలు పడటం చూశాం. ఇది హాస్యాస్పదం. సిగ్గు సిగ్గు.

కందుకూరి రమేష్ బాబు

celebrations logoఒక పాత్రికేయ సోదరుడితో పదేళ్ళలో ‘ఇంతలా మారిపోయారేమిటి వీళ్ళు?’ అన్నపుడు, ‘వాళ్ళు మారలేదు. మొదటి నుంచీ వారలాగే ఉన్నారు. అసలు ముఖాలే ఇవి. మధ్యలో మనం చూసిందే నిజం కాదు. ప్రజలతో మమేకమైన కారణంగా వారి వ్యక్తిత్వం గొప్పగా కనిపించడం అన్నది మనం తప్పుగా చూసిన రూపం’ అన్నారు. నిజం అనిపిస్తుంది.

పదేళ్ళలోనే చాలా మంది అసలు ముఖాలు కానరావడం మంచిదే అయింది. ఈ ఉపోద్గాతం ఎందుకూ అంటే అలాంటి వారందరి గురించి రాయడం కన్నా మచ్చుకు ఒక ఇద్దరి గురించి చెబితే చాలని. మనం బాగా ప్రేమించేవారు, అసలు ఆ ప్రేమకు -అభిమానానికి -గౌరవానికి అర్హులా అని సమీక్షించు కోవడానికి. వ్యక్తుల వల్ల సమిష్టి ఫలితాలు ఎట్లా బంగ పడుతున్నాయో తెలుపడానికి. తెలంగాణ రాష్ట్రం ఈ దశాబ్దంలో ఎట్లా సొంత భూమి పుత్రులతో తను సాధించిన ఫలితాలనే తాను పొందలేని స్థితికి వచ్చిందో ఉదాహరణీయంగా చెప్పడానికి.

మీకు తెలుసు, కొన్ని నెలల క్రితం ఇద్దరు తెలంగాణా మేధావులు అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగడానికి ముందు నానా యాగి చేయడం. ఇంటర్వ్యూల్లో/వ్యాసాల్లో అతిగా కెసిఆర్ ని పోగడటం. అంతకన్నా ముఖ్యంగా వారొక మాట చెప్పారు. తాము ఒక ఉగాది రోజున చెప్పడం వల్లనే కెసిఆర్ గారు అంతెత్తు విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారనడం. తమ పూనికతో వారొక అధ్బుతమైన నిర్ణయం తీసుకున్నారని సమాజానికి చాటడం. చూడండి. ఆ పరిణామాల గురించి రాసిన ‘ఘంటాపథం’.

చిత్రమేమిటంటే, అ నిర్ణయాన్ని అధ్బుతంగా కొనియాడుతున్నారు గానీ ఇలా ఆ ఇద్దరు మేధావులు చెప్పిన మాటకు అప్పటికప్పుడు కిసిఆర్ నిర్ణయం తీసుకొని స్థలం చూసి వెంటనే ఆగమేఘాల మీద ప్రభుత్వం ఉత్తర్వు ఇప్పించడం అన్నది ఏ విధంగా ప్రజాస్వామిక చర్య అవుతుందో అర్థం కాదు. ఒక నిర్ణయం తీసుకొని అదే రోజు అందరినీ ఒప్పించడం అన్నది ఎట్లా గొప్పగా పోగిడే విషయమో తెలియదు. ఇది పూర్తిగా అప్రజస్వామిక చర్య అనే అనుకోవాలి తప్పా ఒక అపురూపమైన చర్యగా చెప్పడం హాస్యాస్పదం.

టివి చర్చల్లో అసలు యాంకర్ కన్నా వీరి యాంకరింగే ఎక్కువ కన్పించడం చూసిన వారికి గుర్తుండే ఉంటుంది.

ఈ ఇద్దరు మేధావుల్లో ఒకరికి కెసిఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇంకొకరికి ఒకటి కాదు, రెండు విధాలా లబ్ది చేకూర్చారు. అందులో ఒకటి బుద్ధ వనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి నియమించడం. రెండవది, వారే అన్నట్టు కెసిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చిన రోజునే ఇతడికి కూడా తాను ఇదివరకే స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఐన ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ కోసం భూమీ, అక్కడ శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించడం. అట్లా ఈ ఇద్దరూ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు పొందినవారే. అంతేకాదు, ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అన్నది మొదట ట్యాంక్ బండ్ పై నిలబడటానికి ముందే వేరొక చిన్న నమూనా లక్ష్మయ్య గారి దళిత్ స్టడీస్’ సెంటర్ కార్యాలయ భవనమ్మీద నిలబడ్డది. అన్నట్టు 26 కోట్ల రూపాయలతో నిర్మాణమైన ఈ భవనానికి దళిత విజ్ఞాన ధామం అని పేరు పెట్టారు.

కెసిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చిన రోజునే ఇతడికి కూడా తాను ఇదివరకే స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఐన ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ కోసం భూమీ, అక్కడ శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించడం.

ఇట్లా అధికారికంగా కావలసింది పొందిన వీరు ఎన్నైనా చెబుతారు. అసలు వీరిద్దరూ తమకున్న సన్నిహిత అవకాశం ద్వార చేయవలసింది ఏమిటి? చేసింది ఏమిటి అన్నది ప్రశ్న.

ఆ ఉగాది రోజున తాము కెసిఆర్ తో ప్రయాణిస్తూ ఉన్నప్పుడో అంతకు ముందో ఆ తర్వాతో చేయవలసినది, అసలు ప్రభుత్వానికి ఇవ్వవలసిన సలహా- దళిత ముఖ్యమంత్రి హామీ గురించి ఆలోచించమని లేదా ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తారని ఒత్తిడి చేయవలసింది. అలాగే దళితులకు మూడెకరాల భూమి గురించి వెనకపట్టు పట్టిన ప్రభుత్వాన్ని, కాదు, ఆ హామీ తక్షణం అమలు చేయవలసిందే అని పట్టుబట్ట వలసినది. కానీ వీరిద్దరు చేసింది ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాని మాటున అతి ముఖ్యమైన దళిత హామీలను నీరుగార్చేలా చేయడం. ఆ లెక్కన ప్రభుత్వానికి వీళ్ళే అసలైన ‘దళిత బంధు’లు. అందుకే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గురించి వీరు మాట్లాడరు. నిరుద్యోగుల నిరసనల గురించి పట్టించుకోరు. చిత్రంగా, పైన పేర్కొన్న ముఖ్యమైన హామీల అమలు గురించి మరచిపోయేలా చేసేందుకు గాను వీరే అంబేద్కర్ విగ్రహం పెట్టమని సూచిస్తారు. దళిత బంధు ఎలా గొప్ప పథకమో వివరిస్తారు. ఆ పథకం ఏర్పాటు కోసం మేధో మధనంలో పాల్గొంటారు. టివి చర్చల్లో ప్రభుత్వ వాదనకు తోడ్పడే విధంగా చర్చలకు తెరలేపుతారు. దీనివల్ల ఎలుగెత్తి పోరాడిన తెలంగాణ ఒక సమాజంగా నష్టపోతున్నది. మొత్తంగా కెసిఆర్ అన్న వ్యక్తిని, ఆయన దొరతనాన్ని కట్టడి చేయడానికి ఉద్యమలో ఎదిగి వచ్చిన ఇటువంటి దళిత సోదరులు ప్రభుత్వం పదవులు లేదా ఆర్థిక సహకారాన్ని తీసికోవడం వల్ల ప్రజల తరపున మాట్లాడే సదవకాశాన్ని తెలంగాణా కోల్పోతూ వస్తోంది.

ఇట్లా -చాలా మంది ప్రభుత్వంలో విలీనమై అసలైన ప్రజల సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారు. తాము విగ్రహ పూజ చేస్తూ ప్రజా క్షేత్రంలోని వివిధ వార్గాలను కన్య్ఫూస్ చేస్తున్నారు.

విచారకరమైనది ఏమిటంటే, తామే ఆయనకు కొన్ని ఆలోచనలు కలగజేసామని నిస్సిగ్గుగా చెప్పుకోవడం. ఇది ఒక రకంగా కెసిఆర్ కు ప్రొటెక్షన్ ఫోర్స్ గానూ ఉపయోగపడటం గమనించవలసి ఉన్నది. అది ఇంకా విచారకరం. వీరిద్దరే కాదు, ఇట్లా -చాలా మంది ప్రభుత్వంలో విలీనమై అసలైన ప్రజల సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారు. తాము విగ్రహ పూజ చేస్తూ ప్రజా క్షేత్రంలోని వివిధ వార్గాలను కన్య్ఫూస్ చేస్తున్నారు.

నిజానికి టివి చర్చల్లో చక్రపాణి గారి విశ్లేషణా సామర్థ్యం, వాదనా పటిమకు ఆంధ్రావాళ్ళు ఆ రోజుల్లో నోర్లు మూసుకున్నారు. అటువంటి వ్యక్తి పెదవి విప్పకుండా ఉన్నారూ అంటే, విప్పినా అది ప్రభుత్వానికి మద్దతుగానే అంటే అందుకు కారణం…

ఘంటా చక్రపాణి గారు గానీ మల్లేపల్లి లక్ష్మయ్య గారు గానీ ఇద్దరూ కరీంనగర్ బిడ్డలు. ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ గా పేరు. వారికి కులవర్గ పోరాటాల గురించి తెలుసు. భూమి సమస్య తెలుసు. దళితుల ఆత్మగౌరవం అన్నది కేవలం ఆర్థిక పథకాల వల్ల ఏర్పడేది కాదని తెలిసిన వారే. రాజకీయ అధికారం ఎంత ముఖ్యమో కూడా తెలుసు. వారు మొదట పాత్రికేయులు కూడా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు. నిజానికి టివి చర్చల్లో చక్రపాణి గారి విశ్లేషణా సామర్థ్యం, వాదనా పటిమకు ఆంధ్రావాళ్ళు ఆ రోజుల్లో నోర్లు మూసుకున్నారు. అటువంటి వ్యక్తి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెదవి విప్పకుండా ఉన్నారూ అంటే, విప్పినా అది ప్రభుత్వానికి మద్దతుగానే అంటే అందుకు కారణం వారికి ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడమే అని ఎవరికైనా తెలుస్తుంది. అది తమ ప్రతిభకు దక్కిన గౌరవంతో పాటు తెలంగాణా ఉద్యమ ఫలం అని చెప్పక తప్పదు. కానీ ఆ పదవీ కాలం పూర్తయి రెండో వ్యక్తి చైర్మెన్ అయ్యాక కూడా ఆయన ప్రజల తరపున నిలబడకపోగా తిరిగి విగ్రహ పూజకు నడుం కట్టారు. అంతేకాదు, ఇటీవల పరీక్షా పత్రాల లీకేజీలో బాధ్యులైన వ్యక్తులు రోజుకొకరు బయట పడుతున్నా ‘టీఎస్‌పీఎస్సీ సంక్షోభం పూర్తిగా ఆ వ్యవస్థకు పరిమితమైన విషాదం’గానే పేర్కొంటూ ‘తప్పయినా, ఒప్పయినా బాధ్యత టీఎస్‌పీఎస్సీదే’ అని చెప్పినప్పటికీ విద్యార్థుల్లో స్థైర్యాన్ని కలిగజేసేందుకు  దాన్ని రద్దు చేసి సరికొత్త కమిషన్ నియామకం ఆవశ్యకతను నొక్కి చెప్పలేదు. లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని వెనుకేసుకు రావడం చూసి విస్తుపోయాం. ఇట్లా -లీకేజీ తర్వాత చక్రపాణి గారు అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. మరోసారి నామినేటెడ్ పదవి కోసమే ఏమో అయన ఇట్లా నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని వెనుకేసుకు వస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు.

అధికారం అప్పగిస్తే ఎవరేమిటో బోధపడుతుంది అంటారు. ఆ మాటకు సరైన ఉదాహరణలుగా ముందుకు వచ్చిన ఈ ఇద్దరు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మారిన ప్రతీకలకు నిలువెత్తు మూర్తిమత్వాలు.

ఇక మల్లేపల్లి లక్ష్మయ్య గారు. అణగారిన వర్గాల వారిపై భూస్యాముల అణచివేతను దిక్కరించిన మేనమామతో వారు ప్రేరణ పొందిన వారు. ఎం ఎల్ పాలిటిక్స్ నుంచి వచ్చినవారు. తన ప్రయాణంలో దళితుల అభ్యున్నతి కోసం పనిచేయడం ప్రథమ ప్రాధాన్యం చేసుకున్నవారు. ఎగిసిన తెలంగాణా ఉద్యమంలో మొదటి నుంచి వున్నారు. అయన కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన జెఏసిలో కో- కన్వీనర్ గా కీలక బాధ్యతల్లో ఉండిరి. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా మారిన కేసిఆర్ పోకడను ఆయన తప్పక ఖండించవలసింది. కానీ ఒక్కొక్కరిని ఈ కమిటీ నుంచి కెసిఆర్ లాగేశారని మనకు తెలుసు. అందులో లక్ష్మయ్య మొదట వెళ్ళిన వాళ్ళలో ఒక మేధావి అని మనం జ్ఞాపక చేసుకుంటే అయనకు, చక్రపాణి గారికీ తెలంగాణా విశాల ప్రయోజనాల కన్నా, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల కన్నా, కనీసం తమ జాతి బిడ్డలైన దళితుల విశాల ప్రయోజనాలు, వారి దీర్ఘకాలిక భవిత కన్నా -ఎన్నికల పథకాలే మిన్నగా భావించడం స్పష్టంగా చూడగలుగుతాం. వారికి ఆచరణ కన్నా విగ్రహా పూజలే మిన్న అని బోధపడుతుంది. ఇది నిజానికి విచారకరం. సిగ్గు చేటు.

అధికారం అప్పగిస్తే ఎవరేమిటో బోధపడుతుంది అంటారు. ఆ మాటకు సరైన ఉదాహరణలుగా ముందుకు వచ్చిన ఈ ఇద్దరు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మారిన ప్రతీకలకు నిలువెత్తు మూర్తిమత్వాలు. అందుకే అనడం, వీరే కెసిఆర్ కి ‘దళిత బంధువులు’ అని. ముఖ్యంగా దళితులకు, ఆనక -తెలంగాణా ప్రజలకు వీరేమీ కారేమో అని కూడా.

సంతోషం ఏమిటంటే, దశాబ్ద కాలంలోనే వీరి ముసుగులు తొలగిపోవడం.
థాంక్స్ టు కెసిఆర్.

కందుకూరి రమేష్ బాబు దశాబ్ది ఉత్సవాలపై రాసిన ఇతర వ్యాసాలు…

ఉత్సవ తెలంగాణ – వాస్తవ తెలంగాణ

ఖాళీ సీసాలు – ఉత్సవ తెలంగాణ

‘తెలంగాణా’కు లేని తెలంగాణ జర్నలిస్టులు!

భూస్వాముల స్వీట్ రివెంజ్ : రైతు బంధు

ఫక్తు రాజకీయానికి బలైన ‘ధూం ధాం’

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article