Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం 'సందిగ్ధ'

ఈ వారం మంచి పుస్తకం ‘సందిగ్ధ’

 

sandhighda

‘మంచి పుస్తకం’ ఒక సంపద.

‘తెలుపు’ కోసం కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘సందిగ్ధ’ మూడవది.

1980, 90లలో ఇంగ్లీషులో వెలువడిన ‘మానుషి’ పత్రికకి మంచి పేరు ఉండేది. మధు కిష్వర్ దీనికి వ్యవస్థాపక సంపాదకురాలు. అది ‘ఫెమినిస్టు’ పత్రిక అని ఇతరులు పేర్కొన్నప్పటికీ దాని ఉప శీర్షిక ‘A Journal about Woman and Society’ అని ఉంటుంది.

K Suresh 1992-96లో నేను వ్యవసాయ శాఖలో ఘంటశాల విత్తనాభివృద్ధి క్షేత్రంలో పని చేస్తుండగా మానుషి పత్రికలో ప్రచురితమయిన విజయ్‌దాన్ దేథా కథలు చదివాను. మానుషి ట్రస్ట్ ఆ కథలను ‘ద డైలెమా’ అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించింది. ఘంటశాలలో ఉండగా ఒక కథ, రాజేంద్రనగర్ లోని అపార్డ్‌కి డెప్యుటేషన్‌లో (1996-2001) ఉండగా మరో అయిదు కథలు అనువాదం చేశాను.

నేను చేసిన చాలా అనువాదాలకు మూల భాషకీ, తెలుగుకీ మధ్య ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఉంది. అయితే ‘సందిగ్ధ’ పుస్తకానికి మూల భాష రాజస్థానీ. విజయ్‌దాన్ దేథా (బిజ్జి అని అంటారు) తన మాతృ భాషలోనే రచనలు చేశారు. ‘సందిగ్ధ’ లోని కథలు ముందుగా హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లీషులోకి (రూత్ వనిత అనువాదం), ఇంగ్లీషు నుంచి తెలుగులోకి వచ్చాయి.

రాజస్థాన్ జానపద కథలను అక్షరబద్ధం చెయ్యటానికి రూపాయన్ అనే సంస్థని విజయ్‌దాన్ నెలకొల్పారు. రాజస్థానీ మౌఖిక భాషలోని జానపద కథల ఆధారంగా 14 సంపుటాల బాతాన్ రి ఫుల్వారి (కథల తోట) ప్రచురించారు. విజయ్‌దాన్ 800కి పైగా కథలు రాశారు. వీటిల్లో కొన్నింటిని సినిమాలుగాను, కొన్నింటిని నాటకాలుగాను మలచారు. ‘చరణ్‌దాస్ చోర్’ మూల కధ విజయ్‌దాన్ రాసినదే. దీనిని హబీబ్ తన్వీర్ నాటికగా మలచారు, శ్యాం బెనగల్ సినిమాగా తీశారు.

ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత

-సజయ, ఒమ్మి రమేష్ బాబు (లిఖిత ప్రెస్)

2000లో లిఖిత ప్రెస్ పేరుతో ప్రచురణలను ప్రారంభించిన సజయ, ఒమ్మి రమేష్ బాబులు విజయ్‌దాన్ దేథా ఆరు కథలను తమ మొదటి పుస్తకంగా ఎంచుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘ప్రాంతీయ స్థాయిలో విలసిల్లే జానపద సాహిత్యాన్నీ, కళలనీ కూడా విశ్వీకరణలో ఐక్యం చేసి వాటి అస్థిత్వాన్ని దెబ్బతీయాలన్న యత్నమూ జరుగుతోంది… ఈ సందర్భంలోనే మనం మన మౌలిక సాహిత్యపు విలువలన్నింటినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్యపు మూలాలన్నింటినీ శోధించి సాధించుకోవాల్సి ఉంది. ఈ లక్ష్యంతో విభిన్నమైన సామాజిక నేపథ్యాల జీవిత చిత్రణలను ప్రచురించాలన్న ఉద్దేశంతో ‘లిఖిత ప్రెస్’ ప్రారంభమౌతోంది… తన తొలి ప్రచురణగా వెలువరిస్తున్న ఈ రాజస్థానీ జానపద కథల సంకలనమే ఇందుకు సాక్ష్యం…’ అని ప్రచురణకర్తలు తమ ముందుమాటలో పేర్కొన్నారు. ఇంకా, ‘మన సమాజంలో మన గడ్డ మీద స్త్రీలు ఎటువంటి వివక్షకి గురవుతున్నారో, ఎలా శోకతప్తులవుతున్నారో కళ్లకు కట్టినట్టు వివరిస్తాయీ రాజస్థానీ జానపద కథలు, కల్పననీ, వాస్తవాన్నీకలబోసిన ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత,’ అని పేర్కొన్నారు. (ఈ పుస్తకం ప్రస్తుతం ముద్రణలో లేదు.)

ఆంగ్ల ప్రచురణకు పరిచయంలో, ‘తనలోని అధికార కాంక్షకు పగ్గాలు వదిలినప్పుడు పురుషులు ఎంతటి మూర్ఖులుగా, హాస్యాస్పదులుగా మారతారో జానపద సాహిత్యం స్పష్టంగా బయల్పరచడం చెప్పుకోదగిన విషయం. తమపై జరుగుతున్న అణిచివేతను బాహాటంగానూ, బయటకి కనపడకుండానూ స్త్రీలు అనేక విధాలుగా ఎలా వ్యతిరేకిస్తున్నారో ఈ కథలు తెలియచేస్తాయి. ఈ మహిళలలో ఏ ఒక్కరూ ప్రతిఘటించకుండా పడి ఉండలేదు. తమదైన హుందాతనాన్ని కాపాడుకుంటూనే పురుషులు నిర్ణయించిన వ్యవస్థలను, పద్ధతులను ప్రశ్నించి ఎదుర్కొన్నారు. జీవించటంలోని ఒక విధమైన ఆనందాన్ని, స్త్రీ – పురుషుల మధ్య మరింత సంతృప్తికరమైన, మరింత సమాన సంబంధాలను కాంక్షించటాన్నీ ఈ కథలు చాటుతున్నాయి,’ అని మధు కిష్వర్ పేర్కొన్నారు.

రాజ్‌కమల్ ప్రకాశన్ హిందీలో ప్రచురించిన ‘దువిధ’, ‘ఉల్‌ఝన్’ అన్న రెండు సంపుటాల నుంచి ఆధికారం, మానవ ప్రవర్తనపై దాని వికృత ప్రభావం అన్న అంశం చుట్టూ అల్లిన ఆరు కథలను ఎంపిక చేసి ఇంగ్లీషు అనువాదంతో ‘ద డైలెమా’ గా మానుషి ట్రస్ట్ ప్రచురించింది.

ఈ పుస్తకానికి శ్రీవిద్య నటరాజన్ జానపద శైలిని తలపించే రీతిలో ఎంతో చక్కని బొమ్మలు వేశారు. కవర్ డిజైన్ ఏలే లక్ష్మణ్ చేశారు.

విజయ్‌దాన్ దేథాది ఒక ప్రత్యేకమైన శైలి. ఇది కథ మొదలులోనే కనపడుతుంది. ఉదాహరణకు ‘కాకి విధానం’ కథ ఎలా మొదలవుతుందో చూడండి: ‘స్వప్రయోజనమే పూజ, స్వప్రయోజనమే దైవం. మిగిలినదంతా మోసం, దగా. దేశం, శీలం, అభిమానం అంటే ఎవరికి పట్టింది… మతం, కర్తవ్యం అన్నవి ఉత్తి మాటలు! పైన పటారం లోన లొటారం… ప్రేమ డొల్ల, హృదయం రాయి!… మునులు తెల్లగా కనపడతారు కానీ వాళ్ల హృదయాలు నలుపు. సృష్టికర్త, సర్వం తెలిసినవాడూ ప్రతి వ్యక్తి స్వప్రయోజనాలను తీర్చుగాక!’ అతని రచనలలో సుదీర్ఘమైన వర్ణనలు, ఉపమానాలు, సామెతలు ఉంటాయి.

అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా.

పురుషుడు కావటంతోనూ, అధికారం రావటంతోనూ వ్యక్తులు ఏలా మారిపోతారో ఈ కథలు చూబిస్తాయి. ఉదాహరణకు ‘కొత్త దారి’ అన్న కథలో ఒక వ్యాపారి తన కూతురిని కొడుకు వేషంలో పెంచి తన స్నేహితుడైన మరొక వ్యాపారి కూతురితో పెళ్లి జరిపిస్తాడు. చివరికి అబ్బాయిగా పెరిగిన అమ్మాయి (బీజా) తానూ అమ్మాయినేనని గుర్తించి బాధపడుతుంది. ‘స్త్రీ పురుషుల మధ్య వివాహంలో అద్భుతమేముంది!’ అనుకుని వాళ్లిద్దరూ అమ్మాయి బట్టల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక దెయ్యం సహాయంతో అందమైన మహలులో ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటారు. దెయ్యానికి పుంసత్వం ఇచ్చే శక్తులు ఉన్నాయని తెలుసుకుని తాను పురుషుడుగా మారతానని బీజా అంటాడు. అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా. ఇద్దరూ అమ్మాయిలుగా ఉన్నప్పుడు రాని ప్రశ్న (‘ఈ ఆస్తికి అసలైన యజమాని ఎవరు?’) బీజా పురుషుడుగా మారిన తరవాత అతనిలో తలెత్తుతుంది. అంతే కాకుండా, ‘నా సొంత సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను. అంతులేని సంపదను కూడగట్టి పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాను… నీ వంటి వాళ్లు వందల మంది నాకు రాణులై నా కోసం ఎదురు చూస్తుంటారు,’ అంటాడు. ఒక్క రాత్రి లోనే తమ మధ్య ఈ ‘నేను’ అన్నది ఎలా వచ్చిందని తీజా ఆశ్చర్యపోతుంది. బీజా తన తప్పుని తెలుసుకుని మళ్లీ అమ్మాయిగా మారిన తరవాతే వాళ్లిద్దరి మధ్య తిరిగి ప్రేమ నెలకొంటుంది.

‘ద్వంద్వ ప్రమాణాలు’ అన్న కథలో తన ప్రేమికుడైన రౌతుని దేశానికి రాజుగా రాణి ప్రకటించిన మరుక్షణం (మరుక్షణమే), ‘ఇటువంటి లంజను ఎలా నమ్మటం? పెళ్లి చేసుకున్న భర్తనే మోసగించటానికి వెనుకాడలేదు. తన పట్ల ఎంత కాలం విశ్వాసంగా ఉంటుంది?… వారిని నాశనం చేయకపోతే సింహాసనానికి అర్థమూ, విలువా లేకుండా పోతాయి,’ అనుకుంటాడు. పదవీచ్యుతుడైన రాజు, “తప్పు పూర్తిగా నాది కాదు. ఈ సింహాసనం, ఈ కిరీటానికి కూడా ఈ తప్పులో భాగముంది… తప్పులో అధిక భాగం ఈ రాజ్యాధికారానిదే,” అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు. సింహాసన అధికారాన్ని చవి చూడక ముందే మొత్తం ప్రపంచాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని రావాలని, గాలి, సముద్రం, పగటి కాంతుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఉవ్విళ్లూరుతుంటాడు. రాజ్య విస్తరణ, భోగాలాలసతలో కూరుకునిపోయి ఆమెను దూషిస్తాడు.

విక్రమార్కుని సింహాసనం మీద కూర్చుంటే చాలు నోటి నుంచి సత్యం, న్యాయం ఎలా పలుకుతాయో, అలా పురుషుడిగా పుట్టినందుకు గర్వం, అహంకారం, స్వార్థం వంటివి పుట్టుకొస్తాయి. పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చెయ్యవచ్చు కానీ పితృస్వామ్యాన్ని అంత తేలికగా అంతం చెయ్యలేమన్న దాని గురించి అందరం లోతుగా ఆలోచించాలి.

‘సంశయం’ అన్న కథ చూస్తే విజయ్‌దాన్ దేథా కథా నైపుణ్యం, ఆలోచనా విధానం అర్థమవుతాయి. వాస్తవానికి ఇది ఒక చిన్న కథ. రొమిల్లా థాపర్ ‘భారత కథలు’ అన్న పుస్తకంలో (ఇది విజ్ఞాన ప్రచురణల ద్వారా తెలుగులో అందుబాటులో ఉంది) ‘భూతం’ అన్న పేరుతో ఈ కథ ఉంది. దీని నిడివి ఒకటిన్నర పేజీలు. ధనిక వ్యాపారి కొడుకు పెళ్లి చేసుకుని భార్యతో ఊరికి తిరిగి వస్తుంటే దారిలో ఆమెను చూసి ఒక దెయ్యం మోహిస్తాడు. కొత్త భార్యని ఒంటరిని చేసి వ్యాపారి కొడుకు వ్యాపారానికి వెళితే అతని లాగా వచ్చిన దెయ్యం ఆమెతో కాపురం చేస్తుంటాడు. ఆమె భర్త తిరిగి వచ్చినప్పుడు అసలు భర్త ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. తీర్పు కోసం రాజు దగ్గరకు వెళుతుంటే దారిలో ఒక గొర్రెల కాపరి ఒక సీసాలోకి దెయ్యం వెళ్లేలా చేసి అసలైన భర్తని గుర్తిస్తాడు. స్త్రీ ఒక వస్తువు కాబట్టి ఆమెను అసలైన యజమాని దగ్గరకు చేర్చటం ద్వారా న్యాయం జరిగినట్టు ఆ కథ ఉంటుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

ఇందులో ఆ స్త్రీ ఆలోచనలకు ఎటువంటి తావు లేదు. ఇదే కథని ‘పహేలీ’ అన్న పేరుతో సినిమాగా తీశారు. అసలైన భర్తని గుర్తించినప్పటికీ జనాదరణ కోసం దెయ్యం తిరిగి అతని రూపంలో వచ్చాడన్న ముగింపుని సినిమాలో ఇచ్చారు. విజయ్‌దాన్ దేథా ఈ రెండింటికీ భిన్నంగా దీనిని 25 పేజీల అద్భుతమైన ప్రేమ కథగా మలిచాడు. ఆమె అందానికి వివశుడైన దెయ్యం ఆమెను ఆవహించి బాధించలేడు, ఆమె భర్తను ఆవహించినా ఆమె బాధపడుతుంది కాబట్టి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడతాడు. వ్యాపారి కొడుకు పరదేశాలకు వెళ్లటం చూసి అతడి వేషంలో వస్తాడు. కొడుకే తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు అనుకుంటారు. అటువంటిది కొత్త భార్యకి తేడా ఏం తెలుస్తుంది? కానీ, ఆమె నుంచి నిజం దాచటం అంటే ఆమెను మోసం చెయ్యటం అవుతుందని దెయ్యం నిజం చెపుతాడు.

దెయ్యం ప్రేమ లోని నిజాయితీని గుర్తించి, వెళ్లే వాడిని ఆపలేకపోయాను, వచ్చినవానిని ఎలా ఆపగలనని అతనిని భర్తగా అంగీకరిస్తుంది. దెయ్యం ప్రేమ కాంతితో సూర్యుడు మసకబారాడంట! వాళ్లిద్దరూ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా రోజులు గడుపుతుంటారు. తల్లిదండ్రుల దగ్గర, గ్రామ ప్రజల దగ్గర మంచి పేరు గడిస్తారు. ఒక సందర్భంలో ఆమె ప్రేమ అతని హృదయంలోని విషాన్ని అమృతంగా మార్చిందని దెయ్యం అంటాడు. భార్య గర్భవతి అయ్యి, ప్రసవ వేదనలో ఉన్న సమయంలో విషయం తెలిసి, ఒక సంవత్సరం ముందుగానే అసలైన భర్త తిరిగి వస్తాడు. భార్య ప్రాణ గండం నుంచి బయటపడి ఆడపిల్లను ప్రసవించేంతవరకు బయట జరుగుతున్న గొడవ దెయ్యానికి పట్టదు. నాలుగేళ్ల ప్రేమమయ జీవితంతో అతడి తత్వమే మారిపోయింది. అతడు అబద్దమూ చెప్పలేడు, అలాగని నిజమూ చెప్పలేడు. ఆమె మర్యాదని కాపాడాలన్నదే అతని ఆలోచన. దెయ్యాలు చేసే మాయలు అతడికి అన్నీ తెలుసు కానీ మనుషుల మోసాల గురించి ఏమీ తెలియదట. ఆమె కష్టాలపాలు కాకూడదని గొర్రెల కాపరి పెట్టిన మొదటి రెండు పరీక్షల్లో నెగ్గి అనాలోచితంగా మూడవ పరీక్షలో నీటి బుర్రలోకి దూరి బందీ అవుతాడు. అసలు భర్త ఉన్న పడక గదిలోకి వెళ్లబోతూ భార్య, ‘జంతువులనైనా వాటి ఇష్టానికి వ్యతిరేకంగా నడిపించలేమే, అవి కనీసం నిరసనతో తలనైనా ఊపుతాయి. కానీ ఆడవాళ్లకు తమ సొంత మనసు ఉండే వీలుందా?’ అన్న ఆలోచనలతో కథ ముగుస్తుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

++

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. మీకు పరిచయం చేసిన పై పుస్తకం మూడవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు పరిచయం చేస్తారు. 

 

More articles

1 COMMENT

  1. నిజమే. యీ కథలు పాఠకుడిని ఆలోచనల్లోకి నెట్టేస్తాయి. వాస్తవ జీవితంలోని వివక్షను, అమానతలను వివరిస్తునే బతుకును బంగారుమయం చేసుకోగలమనే తపనను కలిగిస్తాయి. యెంతో ప్రేమాస్పదంగా కొసరాజు సురేష్ గారు వీటిని అనువాదం చేశారు.
    నేను అప్పుడు వార్త దినపత్రికలో పనిచెస్తన్నాను. వొకనాడు వొమ్మి రమేష్ బాబు సందిగ్ధ కథల పుస్తకాన్ని నాకు యిస్తూ… యిందులో కథలు నీ ఆలోచనలకు దగ్గరగా వుంటాయి. నీకు బాగా నచ్చుతాయి అని అన్నాడు. జానపద కథలపై ఉన్న మక్కువతో పుస్తకాన్ని తీసుకున్నాను.
    ఆ తర్వాతే తెలిసింది.
    యివి అసమానతల పునాదిపై నుంచి వెలసిన అద్భుత పరిమళాన్ని వెదజల్లే కతలని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article