Editorial

Monday, December 23, 2024
Song‘తేనెటీగా.. తేనెటీగా..' : విమలక్క గొంతున తేనెలూరే పాట

‘తేనెటీగా.. తేనెటీగా..’ : విమలక్క గొంతున తేనెలూరే పాట

 

ఆధునిక మానవుడి స్వార్థం, అత్యాశల గురించి, అంతస్తుల జీవనం గురించి విమర్శనాత్మకంగా చెప్పడం కన్నా, ప్రకృతిలోని ఇతర జీవరాశులు, క్రిమి కీటకాల కలివిడితనం, ఉన్నతి, వాటి సౌహర్ద్రంతో తెలియజెప్పడం వల్ల మరింత మార్పు తెవచ్చు. ఆ దిశలో వచ్చిన ‘తేనెటీగ’ పాట మెల్లగా పలువురిని ఆకర్షిస్తోంది. విన్నకొద్ది వినాలనిపిస్తోంది.

హృదయాన్ని హత్తుకునేలా రూపకల్పన చేసిన ఈ పాట పర్యావరణ స్పృహలో విరిసిన ‘అరుణోదయం’.

కందుకూరి రమేష్ బాబు

‘దారెంట వేలాడే దృశ్యాన్ని’ పాటగా మలిచిన మిత్ర, దాని రాగయుక్తం చేసి మరచిపోలేని విధంగా గానం చేసిన విమలక్కలకు అభినందనలతో తెలుపు కథనం ఇది. పర్యావరణానికి విధ్వంసానికి పాల్పడుతున్న మానవుడి చేతనని నిదానంగా మేల్కొలుపే సుతారమైన హెచ్చరిక ఈ పాట.

‘తేనెటీగా… తేనెటీగా… నువ్వు గట్టె కోటకు రాణివేగా…’ అన్న పల్లవితో హయిగా సాగే ఈ పాట ప్రకృతిలో తేనెటీగ ప్రాముఖ్యతను చెబుతూ మనిషి తుంటరి ప్రవృత్తిని నిందిస్తూ మానవుడి మృగనీతి ఖండిస్తూ రుషిలా మసులుతున్న తేనెటీగను అపురూపంగా కొనియాడుతుంది. ఈ పాట పర్యావరణ స్పృహకు చక్కటి దర్శనం.

నిజానికి ‘ఝుం ఝుం మారుతం’లా సాగే విమలక్క గొంతు ‘తేనెటీగ పాట కారణంగా సద్దుమణిగి ఆర్ద్రంగా మనిషి హృదయ పరివర్తనకు దారి చూపడం విశేషం.

తేనెటీగ ప్రతీకతో మనిషి మనిషితో కలివిడిగ జీవించలేకపోతున్న సందర్భాన్ని చాటే ఈ పాట వీనుల విందు. ఒక బృందగానం. అదే సమయంలో ఒక చక్కటి స్పృహ కూడా.

ఝుమ్మని వాలే తేనెటీగ గురించిన పలు పద చిత్రాలతో విమలక్క గొంతు ఈ పాటలో తెనేలూరుతుంది. నిజానికి ‘ఝుం ఝుం మారుతం’లా సాగే విమలక్క గొంతు ‘తేనెటీగ పాట కారణంగా సద్దుమణిగి ఆర్ద్రంగా మనిషి హృదయ పరివర్తనకు దారి చూపడం విశేషం.

నిండుగా వెలుగే ప్రకృతికి కీలకమైన పరపరాగ సంపర్కం ప్రాముఖ్యత ద్వారా తేనెటీగ ప్రశస్తిని తెలియజేబుతూ అవి లేకపోతే నాలుగేండ్లలోనే మానవ జాతి అంతమవుతుందన్న హెచ్చరిక ఈ పాటలోని ముఖ్యాంశం. ఇంతటి పాటను సందేశం పాలు మించకుండా హత్తుకునేలా రచించడం మిత్ర విశేషం.

తెలంగాణ రాష్ట సాధన తర్వాత వస్తు శిల్పాలలో అభివ్యక్తిలో వచ్చి చేరుతున్న నూతన రూపానికి ఈ పాట మేలైన ఉదాహరణ

మరో విధంగానూ ఈ పాటకు విశిష్టత ఉంది. ‘నినాదం’ స్థానంలో వచ్చిన ఈ ‘తేనెటీగ’ నాదం కరోనా మహమ్మారి అనంతరం ఒక అందమైన ఆచరణ. నూతన పరికల్పన. అంతేకాదు, తెలంగాణ రాష్ట సాధన తర్వాత వస్తు శిల్పాలలో అభివ్యక్తిలో వచ్చి చేరుతున్న నూతన రూపానికి ఈ పాట మేలైన ఉదాహరణ కూడా. ఇది నేటి వర్తమానంలో అవశ్యమైన విధానం.

కాగా, ఐదేళ్ళ క్రితమే ఈ పాట రాసినట్టు, లచ్చన్న అన్న రైతు తన ఇంటి వెనకాలి వేపచెట్టుకు వేలాడుతున్న తేనెతుట్టె ఈ గేయానికి ప్రేరణ అని మిత్ర ( వారు జనశక్తి అగ్రనేత కూర దేవేందర్ అని తెలిసిందే ) అన్నారు. ఆ రైతు తేనెతుట్టెను తొలగించకుండా ఎన్నో ఏండ్లుగా సహజీవనం చేయడాన్ని గమనించగా ఈ పాట పుట్టిందని చెప్పారు.

ఈ పాటలో తేనెటీగలు ‘ఆకాశంలో తారల గుంపులా తరాడినట్లు’ ఉండటం అన్న ప్రతీక మిత్ర సాహిత్య పటిమలోని మేలిమిని మరోసారి ఆవిష్కరిస్తుందని చెప్పవచ్చు.

ఈ పాట దృశ్యీకరణలో అడవి మధ్య ‘బహుజన బతుకమ్మ’ విమలక్క యావత్ ప్రకృతి రాణి రూపం సంతరించు కున్నట్లుగా కానవచ్చింది. అట్లా ప్రకృతికి రాణిలా శోభిల్లిన విమలక్క అమ్మాయిలను దగ్గరకు తీసుకున్నప్పుడు తానే తేనెతుట్టెలా కన్పిస్తుంది.

ఆరువేల గదుల నీ ఇంటి బలగమూ అనడంలో, ఆధునిక అంతస్తులు ఎన్ని ఉంటే ఎం లాభమని చెప్పడంలో, వేలాడే ఇల్లుకటి ఏ మనిషి కట్టాడని పేర్కొనడంలో, నీ లాంటి ఇంజినీరు ఎక్కడని ఉంటాడని కీర్తించడమూ – ఇవన్నీ ఈ పాట భావుకత్వం మాటున మానవుడి అగడాలను విమర్శిస్తూ సాగడం విశేషం.

పాటలో తేనెటీగలను ‘రాణి’గా కొనియాడటం ఎట్లా సహజంగా ఉందో అట్లే ఈ పాట దృశ్యీకరణలో అడవి మధ్య ‘బహుజన బతుకమ్మ’ – విమలక్క యావత్ ప్రకృతి రాణి రూపం సంతరించు కున్నట్లుగా అంతే సహజంగా కానవచ్చింది. అట్లా ప్రకృతికి రాణిలా శోభిల్లిన విమలక్క అమ్మాయిలను దగ్గరకు తీసుకున్నప్పుడు తానే తేనెతుట్టెలా కన్పిస్తుంది. ఈ మాదిగిరిగా అంతడ్పుల నాగరాజు చక్కటి కోరియోగ్రఫీ చేయడం ఈ పాటను మరింత ఆహ్లాదంగా మలిచింది. సంగీతం, ఎడిటింగ్ కూడా బాగుంది. రూపకల్పన చేసిన బృందానికి, ఈ పాట వీడియో రూపకల్పన నిర్మాణాన్ని తమ బాధ్యతగా తీసుకున్న జడల శ్రీనివాస్, కొండ దేవయ్య తదితరులకు అభినందనలు.

ఈ వ్యాసం వెలుగులో తేనెటీగ పాట మరోసారి వినండి. అంతరార్థంలో ఇది పర్యావరణ విప్లవ పాట. ‘సినుకు సినుకు’ పాట తర్వాత తిరిగి అదే స్థాయిలో మనసుకు కట్టిపడేసే పాట.

అన్నట్టు, ఈ పాటను మిత్ర -విమలక్కలతో పాటు ప్రస్తుత అరుణోదయ అధ్యక్షులు బైరాగి మోహన్ గత వారం వేములవాడలో దర్శకులు ఆర్ నారాయణమూర్తి, ప్రసిద్ద రచయితలు జింబో, పెద్దింటి అశోక్ కుమార్లు, కవి వజ్జుల శివకుమార్, సీనియర్ జర్నలిస్టు కొడం పవన్ కుమార్ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో ఈ పాటను మరో మారు విడుదల చేశారు.

మరి, ఈ పాట ప్రజల్లోకి ఎక్కడిక్కడ మరింత విస్తృతంగా వెళ్లేందుకు అందరూ ప్రయత్నిస్తారని ఆశిద్దాం.

https://www.facebook.com/100001871881743/videos/pcb.7405397966199193/417942386830905

 

More articles

1 COMMENT

  1. శ్రమైక సౌందర్యానికి ,సామాజిక సమరసతకు ప్రతీకగా
    నిలిచిన తేనెటీగ గొప్పతనాన్ని తాను కైగాట్టిన పాటతో
    వివరించిన మిత్ర అన్నగారికి, నోరూరించే తేనె కన్నా మధురమైన తన గాత్రంతో శ్రోతలందరినీ మంత్రముగ్ధులను గావించిన మా ఆలేరు ముద్దుబిడ్డ విమలక్కకు వేవేల వందనాలు.🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article