కామం కారణంగా వచ్చే పది దురభ్యాసాలు క్రోధం కారణంగా వచ్చే ఎనిమిది దుర్వ్యసనాలు మానవత్వానికే మచ్చ తెచ్చేవి. మానవుని ఉత్తమ పురోగతికి పెద్దపెద్ద ఆటంకాలు. మనిషి ఆధ్యాత్మిక సాధనకు అవి అడ్డుగోడలు. అంతేకాదు మొత్తం సమాజానికి కూడా నష్టకారణాలే.
‘‘దశకామసముత్థాని తథాష్టౌ క్రోధజాని చ ।
వ్య్రసనాని దురంతాని ప్రయత్నేన వివర్జయేత్ ॥”
మానవ జీవితంలో అతని అలవాట్లే అతని ప్రగతిని, అతని పతనాన్ని శాసిస్తాయి. పురోగతి సాధించాలనుకున్న వ్యక్తి తప్పనిసరిగా తనకున్న దురభ్యాసాలకు దూరంగా ఉండాలి. అప్పుడే అతనికి నిజమైన పురోగతికి మార్గం సుగమమౌతుంది. మరీ ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకున్నవాడైతే విధిగా దురలవాట్లకు దూరం కావాలి. అప్పుడే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. అసలు ఈ దురభ్యాసాలకు కారణాన్ని శాస్త్రకారుల, స్మృతికారులు అన్వేషించారు. అందుకే మనిషిలోని ‘‘కామగుణం వల్ల పదివిధాలైన దురభ్యాసాలు, క్రోధగుణం వల్ల ఎనిమిది దురభ్యాసాలు అలవాటౌతాయి. తన పట్టుదలతో, తన ప్రయత్నంతో తానే అటువంటి వ్యసానాలను తొలగించుకోవాలి” అని స్పష్టంగా చెప్పారు.
విస్తృత జ్ఞానం ఆత్మ సంయమనం ఇస్తుంది. ఆత్మ సంయమనం వెలుగుదారిని చూపిస్తుంది. అది మన ప్రయాణం సులభ సాధ్యం చేస్తుంది. అందుకే ఉత్తమ మార్గానికి అవరోధ కారకాలైన దురభ్యాసాలకు దూరంగా ఉండడమే మన కర్తవ్యం. అవేమిటో గన్నమరాజు గిరిజా మనోహరబాబు తెలుపు.
మనిషిగా పుట్టిన ప్రతివ్యక్తిలోనూ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు లక్షణాలు సంప్రాపిస్తాయి. వీటిని మన ధర్మశాస్త్రాలు ‘‘అరిషడ్వర్గాలు”గా పేర్కొంటాయి. అంటే ఈ ఆరు మన పాలిటి శత్రువులన్నమాట. ఈ గుణాల కారణంగా మానవుడు పతనం దిశగా వెళ్ళి అనేక ఆపదలను కొనితెచ్చుకుంటాడు. వీటిలో మొదటి రెండు మరింత ప్రమాదకరమైనవి. దురభ్యాసాల పునాదులు. కామం కారణంగా పదివిధాలైన దురభ్యాసాలు వస్తాయన్నారు.
‘‘మృగయాక్షో దివాస్వప్నః పరివాదః స్త్రియో మదః ।
తార్యత్రికం వృథా త్యాచ కామజో వశకోగుణః ॥”
‘‘వేటాడి జంతుహింసకు పాల్పడడం, ‘జూదం’తో సర్వం కోల్పోవడం, ‘పగటి నిద్ర’తో ఆరోగ్యం పాడుచేసుకోవడం, ఇతరుల తప్పులు వెదుకుతూ కాలం వృథా చెయ్యడం, పరస్త్రీ వాంఛ కలిగి పతనం కావడం, మధ్యపానాసక్తులై అనారోగ్యపీడితులు కావడం, అనవసరమైన నృత్యగీత వాద్యాది కార్యక్రమాలతో కాలం వృథా చెయ్యడం” వంటి పది దుర్వ్యసనాలు మానవుని ఆధ్యాత్మిక సాధనకు అవరోధంగా ఉండి మానసికోన్నతిని కలుగనియ్యవు. ఇవి ‘కామం’ వల్ల కలిగే లక్షణాలు. కోరికలు అనేవి సహజ స్వభావంగా ఉంటాయి. అందుకని ప్రాచీనులు ‘కామం’ అనేది చతుర్విధపురుషార్థాల్లో ఒకటిగా గౌరవించారు. అవి ధర్మబద్ధమైన కోరికలే కావాలి. పైగా అవి ధర్మమార్గంలో సంపాదించిన ధనంతోనే తీర్చుకోవాలన్న నియమం విధించారు. అందుకని ‘కామం’ అనేది ధర్మబద్ధం కాకపోతే ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఇంత విపులంగా చెప్పింది శాస్త్రం.
అదే రీతిలో మనకున్న ఆరుగురు శత్రువులో ‘క్రోధం’ ఒకటి. క్రోధ స్వభావం మన మానసిక స్థితిని అతలాకుతలం చేసి మన అనారోగ్యానికి కూడా కారణమవుతుంటుంది. అంతేగాక
‘‘వైశున్యం సాహసం ద్రోహం మీర్ష్యాసూయార్థ దూషణమ్ ।
వాగ్దండజిం చపారుష్యం ’క్రోధజోపి దణోష్టకః ॥”
అంటూ క్రోధం వల్ల కలిగే ఎనిమిది దురభ్యాసాలను చెప్పారు. ‘‘ఇతరులపై అనవసర నేరారోపణలు చెయ్యడం, అనవసరమైన సాహసాన్ని ప్రదర్శించి సజ్జనులను బాధించడం, కపటంతో అపకారానికి పూనుకోవడం. ఇతరుల్లోని ఉత్తమ గుణాలను సహింపలేకపోవడం, అట్లే ఇతరుల్లోని మంచిగుణాలను దోషాలుగా చూపే యత్నం చెయ్యడం, ఇతరుల ధనాన్ని అపహరించడం, అనవసరంగా పరదూషణకు పాల్పడటం, పరహింసకు పూనుకోవడమనే యీ ఎనిమిది అవలక్షణాలు మనిషిని పశుప్రాయుణ్ణి చేస్తాయి. ఆధ్యాత్మిక సాధకునికి ఇవి అసలైన అడ్డంకులుగా మారుతాయి.
మానవ జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించేది. ఆధ్యాత్మిక భావసంపన్నతే అన్నది నిర్వివాదాంశం. కేవలం తన ఉన్నతిని మాత్రమే కాంక్షించకుండా సర్వమానవజాతి కూడా ఉత్తమస్థాయినందుకొని ప్రశాంత జీవితాలను సాధించాలని కోరుకునే భావనే ఆధ్యాత్మిక భావన.
కామం కారణంగా వచ్చే పది దురభ్యాసాలు క్రోధం కారణంగా వచ్చే ఎనిమిది దుర్వ్యసనాలు మానవత్వానికే మచ్చ తెచ్చేవి. మానవుని ఉత్తమ పురోగతికి పెద్దపెద్ద ఆటంకాలు. మనిషి ఆధ్యాత్మిక సాధనకు అవి అడ్డుగోడలు. అంతేకాదు మొత్తం సమాజానికి కూడా నష్టకారణాలే. అందుకే పూర్వులు ఈ రెండు గుణాలను అరిషడ్వర్గాల్లో మొదటనే పేర్కొన్నారు. వ్యసనాలనేవి మృత్యువు కన్నా చెడ్డవి. ఆ విషయాన్నే ‘‘వ్యసనన్యచ మృత్యోశ్చ వ్యసనం కష్ట మచ్యుతే” అని భావించారు. వీటితో మానవుడు క్రమక్రమంగా పతనం చెంది సర్వభ్రష్టుడైపోతాడు.
మానవ జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించేది. ఆధ్యాత్మిక భావసంపన్నతే అన్నది నిర్వివాదాంశం. కేవలం తన ఉన్నతిని మాత్రమే కాంక్షించకుండా సర్వమానవజాతి కూడా ఉత్తమస్థాయినందుకొని ప్రశాంత జీవితాలను సాధించాలని కోరుకునే భావనే ఆధ్యాత్మిక భావన. దాన్ని అడ్డుకునే రీతిలో ఎటువంటి దురభ్యాసాలున్నా వాటిని మిక్కిలి సహనంతో, బుద్ధితో అధిగమించి ముందుకు సాగిపోవాలన్న ప్రాచీన భావాలను పరిగణలోకి తీసుకొని, తనలోని దుష్టభావాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళిన ఎవరైనా అన్నివిజయాలను తప్పక సాధించగలరనడానికి అనేక దృష్టాంతాలు మన గ్రంథాల్లో లభిస్తాయి.
విస్తృత జ్ఞానం ఆత్మ సంయమనం ఇస్తుంది. ఆత్మ సంయమనం వెలుగుదారిని చూపిస్తుంది. అది మన ప్రయాణం సులభ సాధ్యం చేస్తుంది. అందుకే ఉత్తమ మార్గానికి అవరోధ కారకాలైన దురభ్యాసాలకు దూరంగా ఉండడమే మన కర్తవ్యం.