Editorial

Tuesday, December 3, 2024
Opinionఇది మామూలు గూఢచర్యం కాదు - అరుంధతి రాయ్ తెలుపు

ఇది మామూలు గూఢచర్యం కాదు – అరుంధతి రాయ్ తెలుపు

This is no ordinary spying. Our most intimate selves are now exposed

ఇది మామూలు గూఢచర్యం కాదు, మన సన్నిహిత అంతరంగాన్ని ఛిద్రం చేస్తున్నారు!

అరుంధతి రాయ్

భారతదేశంలో మృత్యుభీకర వేసవి అతి వేగంగా గూఢచార వేసవిగా రూపు మార్చుకుంటున్నట్టున్నది.

దాదాపు నలబై లక్షల మంది ప్రాణాలు బలితీసుకుని కరోనావైరస్ రెండో అల వెనుకపట్టు పట్టింది. అధికారికంగా మరణాల సంఖ్య అందులో పదో వంతు, నాలుగు లక్షలు మాత్రమే. నరేంద్ర మోడీ దుర్మార్గ రాజ్యంలో శ్మశానాలలో పొగలు ఆరిపోతుండగా, సమాధుల మీద మట్టి చదును అవుతుండగా, మన వీథుల్లో బ్రహ్మాండమైన ప్రకటనలు పుట్టుకొచ్చి “మోడీజీ, ధన్యవాదాలు” అని ప్రకటించాయి. “ఉచిత వాక్సిన్” వాగ్దానాలకు ప్రజలు ముందస్తుగానే తెలుపుకుంటున్న కృతజ్ఞతలట అవి. ఇంతకూ ఆ ఉచిత వాక్సిన్ చాలావరకు దొరకడమే లేదు. మొత్తం జనాభాలో ఇంకా 93 శాతానికి పూర్తి వాక్సిన్ అందవలసే ఉంది. వాస్తవ మరణాల సంఖ్యను నమోదు చేయదలచుకునే ప్రయత్నం ఏదైనా మోడీ ప్రభుత్వ దృష్టిలో భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రే. అంటే విమానాల్లోంచి తీసిన ఫొటోల్లో మీరు చూసిన సామూహిక సమాధుల్లోకి భారతదేశపు అంతర్జాతీయ ప్రతిష్టను భంగపరచే ఏకైక ఉద్దేశంతోనే లక్షలాది మంది కేవలం పాత్రధారులుగా తమంతట తామే దిగిపోయారన్నమాట. శవాలుగా మారువేషాలు వేసుకుని నదుల్లో తేలియాడారన్నమాట. లేదా నగరాల రహదారుల పక్కన తమంతట తామే దహనమై పోయారన్నమాట.

రెండు శతాబ్దాలుగా నడుస్తున్న ప్రతిష్టాత్మక బ్రిటిష్ దినపత్రిక ది గార్డియన్, 27 జూలై 2021 సంచికలో అచ్చయిన అరుంధతి రాయ్ వ్యాసానికి తెలుగు అనువాదం ఎన్ వేణుగోపాల్.

ఇప్పుడు పదిహేడు వార్తాసంస్థలకు చెందిన అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల బృందం మీద భారత ప్రభుత్వమూ, దాని ఒడిలోని ప్రచార మాధ్యమాలూ అదే నేరారోపణను చేస్తున్నాయి. ఆ వార్తాసంస్థలు ఫర్బిడెన్ స్టోరీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి, భారీ అంతర్జాతీయ గూఢచర్యానికి సంబంధించిన ఒక అసాధారణ వార్తా కథనాన్ని వెల్లడించాయి. ఆ నివేదికల్లో భారతదేశం పేరు కూడ ఉంది. ఇజ్రాయెలీ గూఢచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ఎన్ఎస్ఒ గ్రూప్ తయారుచేసిన పెగాసస్ స్పైవేర్ ను మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కూడ కొన్నాయని ఆ జాబితాలో ఉంది. ఈ వార్త బైటపడగానే, మానవహక్కుల విషయంలో మంచి చరిత్ర ఉన్న ప్రభుత్వాలకు మాత్రమే తాము తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్ముతామని, తీవ్రవాదుల, నేరస్తుల ఆనుపానులు కనిపెట్టే జాతీయ భద్రతా అవసరాల కోసం వాడే ప్రభుత్వాలకే అమ్ముతామని ఎన్ఎస్ఒ ప్రకటించింది.

ఇలా ఎన్ఎస్ఒ చేసిన మానవహక్కుల పరీక్షలో నెగ్గిన దేశాల జాబితా ఒకసారి చూడండి. రువాండా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికో. మరి “తీవ్రవాదులు” “నేరస్తులు” అనే మాటలను నిర్వచించినదెవరు? అంగీకరించినదెవరు? ఎన్ఎస్ఒ, దాని వినియోగదారులూ మాత్రమేనా?

ఒక దేశపు ప్రభుత్వం పక్షాన ఆ దేశపు పౌరుల వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడే ఈ గూఢచర్య కార్యకలాపాన్ని ఒక విదేశీ సంస్థ అమ్ముతుందంటే, నిర్వహిస్తుందంటే అది పూర్తిగా దేశద్రోహకరమైన విషయం.

ఒక్కొక్క ఫోన్ మీద ఆ స్పైవేర్ వాడడానికి వేలాది డాలర్లు ఖర్చవుతుందనే విపరీతమైన వ్యయాన్ని అలా ఉంచి, మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ఖరీదు మీద 17 శాతం వార్షిక నిర్వహణ వ్యయం వసూలు చేస్తుంది ఎన్ఎస్ఒ. ఒక దేశపు ప్రభుత్వం పక్షాన ఆ దేశపు పౌరుల వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడే ఈ గూఢచర్య కార్యకలాపాన్ని ఒక విదేశీ సంస్థ అమ్ముతుందంటే, నిర్వహిస్తుందంటే అది పూర్తిగా దేశద్రోహకరమైన విషయం.

జర్నలిస్టుల పరిశోధక బృందం అప్పటికే బైటపడిన 50,000 ఫోన్ నంబర్ల జాబితాను పరీక్షించింది. ఆ జాబితాలో వెయ్యికి పైగా నంబర్లు భారతదేశంలో ఎన్ఎస్ఒ వినియోగదారు వాడినట్టు విశ్లేషణలో తేలింది. వీటిలో ఒక ఫోన్ లోకి జొరబడడంలో విజయం సాధించారా లేదా, లేక జొరబడడానికి ప్రయత్నం జరిగిందా అనేది ఆ ఫోన్ ను ఫోరెన్సిక్ పరీక్షకు గురిచేసినప్పుడు మాత్రమే బైటపడుతుంది. భారతదేశంలో ఇప్పటివరకూ పరీక్షకు గురిచేసిన ఫోన్లలో చాలవరకు పెగాసస్ స్పైవేర్ దాడికి గురయ్యాయని తేలింది. బైటపడిన జాబితాలో ప్రతిపక్ష రాజకీయనాయకులు, అసమ్మతి జర్నలిస్టులు, కార్యకర్తలు, న్యాయవాదులు, మేధావులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ మాట వినని భారత ఎన్నికల కమిషన్ అధికారి, సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి, కాబినెట్ మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, విదేశీ దౌత్యవేత్తలు, చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ల ఫోన్ నంబర్లు కూడ ఉన్నాయి.

భారత ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఈ జాబితా బూటకం అని ఖండించారు. ఎంతో నైపుణ్యంగల, సకల విషయాలూ తెలిసిన కాల్పనిక రచయిత కూడ ఇంత కచ్చితమైన, విశ్వసనీయమైన జాబితా తయారు చేయజాలరని భారత రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించేవారెవరైనా చెప్పగలఋ. అధికారపార్టీకి ఆసక్తి ఉండే వ్యక్తుల పేర్లతో, తన రాజకీయ ప్రణాళికకు వ్యతిరేకమైనవారని అధికారపార్టీ భావించేవారి పేర్లతో ఇంత సమగ్రమైన జాబితా మరొకటి ఉండదు. నిజానికి ఈ జాబితా సంభ్రమపరిచేంత సూక్ష్మ వివరాలతో ఉంది. కథలలోపల కథలెన్నో ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన పేర్లు కూడ ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని ఊహించదగిన పేర్లు లేవు.

లక్ష్యంగా పెట్టుకున్న ఒక ఫోన్ కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఆ ఫోన్ లోకి పెగాసస్ ను ప్రవేశ పెట్టవచ్చునాని అంటున్నారు. ఒక్కసారి అది ఊహించి చూడండి. మిస్డ్ కాల్ అనే క్షిపణి మీద అదృశ్యంగా ఉండే పేలుడుపదార్థాన్ని నేరుగా మీ ఫోన్ లోపలికి జొరబెట్టేస్తారన్నమాట.

లక్ష్యంగా పెట్టుకున్న ఒక ఫోన్ కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఆ ఫోన్ లోకి పెగాసస్ ను ప్రవేశ పెట్టవచ్చునాని అంటున్నారు. ఒక్కసారి అది ఊహించి చూడండి. మిస్డ్ కాల్ అనే క్షిపణి మీద అదృశ్యంగా ఉండే పేలుడుపదార్థాన్ని నేరుగా మీ ఫోన్ లోపలికి జొరబెట్టేస్తారన్నమాట. అంటే దాన్ని పోలిన ఖండాంతర అణ్వాయుధ క్షిపణి మరొకటి లేదన్నమాట. అది ప్రజాస్వామ్య దేశాలను కుప్పకూల్చివేయగలదు. సమాజాలను చిన్నాభిన్నం చేయగలదు. ఇదంతా కూడ సాధారణమైన అధికార యంత్రాంగపు ఆలస్యం ఏమీ లేకుండానే. వారంట్లు ఉండవు, ఆయుధ ఒప్పందాలుండవు. పర్యవేక్షక బృందాలుండవు. ఎటువంటి నియంత్రణా ఉండదు. సాంకేతిక పరిజ్ఞానానికి విలువల తటస్థత ఉంటుందని అంటారు గదూ. అది ఎవరి తప్పూ కాదు.

భారత ప్రభుత్వానికీ ఎన్ఎస్ఒ కూ ఈ స్నేహపూర్వక కలయిక ఇజ్రాయెల్ లో 2017లో జరిగినట్టుంది. మోడీ, నెతన్యాహు కలుసుకున్న ఆ అపూర్వ సందర్భాన్ని భారత ప్రచార మాధ్యమాలు ‘భ్రాతృప్రేమ’ అని అభివర్ణించాయి. వాళ్లిద్దరూ దోర్ సముద్ర తీరంలో, తమ పాంట్లు పైకి మడుచుకుని నీటిలో కలిసి తిరిగారు. ఆ తడి తడి ఇసుక మీద వాళ్లు వదిలినవి తమ పాదముద్రలు మాత్రమే కాదు, అంతకన్న ఎక్కువే. సరిగ్గా ఆ సమయం నుంచే భారతదేశపు ఫోన్ నంబర్లు ఈ స్పైవేర్ జాబితాలో కనబడడం మొదలైంది.

ఆ సంవత్సరమే భారత జాతీయ భద్రతా మండలి బడ్జెట్ పది రెట్లు పెరిగింది. పెరిగిన కేటాయింపులలో అత్యధిక భాగం సైబర్ సెక్యూరిటీ పద్దు కిందనే ఉండింది. మోడీ ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికైన తర్వాత, 2019 ఆగస్ట్ లో భారతదేశపు అత్యంత క్రూరమైన తీవ్రవాద వ్యతిరేక చట్టం – చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (యుఎపిఎ) పరిధిలోకి సంస్థలను మాత్రమే గాక వ్యక్తులను కూడ తెచ్చారు. అప్పటికే వేలాది మంది ఈ చట్టం కింద బెయిల్ కూడ లేకుండా జైళ్లలో మగ్గిపోతున్నారు. సంస్థలతో పాటు వ్యక్తులను ఎందుకు తెచ్చారో తెలుసునా? సంస్థలకు స్మార్ట్ ఫోన్లు ఉండవుగదా! సైద్ధాంతికమైనదే అయినప్పటికీ, ఇది ఒక ముఖ్యమైన వివరం. కాని ఈ వివరమే చట్ట పరిధిని విస్తరిస్తుంది, మార్కెట్ ను కూడ విస్తరిస్తుంది.

పార్లమెంటులో ఈ సవరణ మీద చర్చ సందర్భంలో హోం మంత్రి అమిత్ షా ఒక మాటన్నారు: “అయ్యా, తీవ్రవాదాన్ని పెంచేవి తుపాకులు కావు. తీవ్రవాదానికి మూలం దాన్ని వ్యాపింపజేసే ప్రచారంలోనే ఉంది…. ఆ వ్యక్తులందరినీ తీవ్రవాదులుగా ప్రకటించడానికి, పార్లమెంటు సభ్యులలో ఏ ఒక్కరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదనుకుంటాను.”

ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పెగాసస్ కుంభకోణం పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. హోంమంత్రి దిగిపోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మందబలం సమృద్ధిగా ఉన్న మోడీ అధికారపక్షం, రైల్వేలు, సమాచార సంబంధాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కొత్తగా పదవీస్వీకారం చేసిన అశ్విని వైష్ణవ్ కు పార్లమెంటులో ప్రభుత్వాన్ని సమర్థించే బాధ్యత అప్పగించింది. అయితే ఆయనకు అవమానకరంగా, ఆయన నంబర్ కూడ బైటపడిన జాబితాలో ఉంది.

ప్రభుత్వం ఇచ్చిన అనేక ప్రకటనల్లోని డొంకతిరుగుడునూ, మాయచేసే అధికారిక పదాడంబరాన్నీ పక్కన పెడితే, పెగాసస్ కొనడం, వాడడం అసలు జరగనే లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. తాము భారత ప్రభుత్వానికి అమ్మలేదని ఎన్ఎస్ఒ కూడ చెప్పలేదు

ప్రభుత్వం ఇచ్చిన అనేక ప్రకటనల్లోని డొంకతిరుగుడునూ, మాయచేసే అధికారిక పదాడంబరాన్నీ పక్కన పెడితే, పెగాసస్ కొనడం, వాడడం అసలు జరగనే లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. తాము భారత ప్రభుత్వానికి అమ్మలేదని ఎన్ఎస్ఒ కూడ చెప్పలేదు. స్పైవేర్ దుర్వినియోగం జరుగుతున్నదనే ఆరోపణలపై ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు విచారణకు ఆదేశించాయి. భారతదేశంలో కూడ దీనికి వెచ్చించిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనే పొగను పట్టుకుని ముందుకు వెళ్తే కచ్చితంగా నిప్పు దగ్గరికి చేరగలుగుతాం. కాని ఆ నిప్పు అక్కడి నుంచి మనను ఎక్కడికి తీసుకువెళ్తుంది?

ఒకసారి ఇది ఆలోచించండి: పదహారు మంది కార్యకర్తలు, న్యాయవాదులు, కార్మికనాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. వారిలో ఎక్కువమంది దళితులు. వారందరినీ భీమా కోరేగాం కేసుగా సుప్రసిద్ధమైన కేసులో సంవత్సరాలుగా నిర్బంధించి ఉంచారు. దళితులకూ, ఆధిపత్య కుల బృందాలకూ మధ్య 2018 జనవరి 1న జరిగిన హింసను రెచ్చగొట్టారనే ఊహాతీతమైన వారి మీద ఆరోపణ చేశారు. ఆ రోజున వేలాది మంది దళితులు భీమా కోరేగాం యుద్ధపు 200వ సంస్మరణ దినాన్ని జరుపుకోవడానికి అక్కడ సమావేశమయ్యారు. (ఆ యుద్ధంలో దళిత సైనికులు బ్రిటిష్ వారి తరఫున పోరాడి నిరంకుశ బ్రాహ్మణ పాలన నెరపిన పీష్వాలను ఓడించారు.) ఈ పదహారు మంది భీమా కోరేగాం నిందితులలో ఎనిమిది మంది ఫోన్ నంబర్లు, వారి సన్నిహిత కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు బైటపడిన స్పైవేర్ జాబితాలో ఉన్నాయి. ఆ ఫోన్లన్నిటిలోకీ పెగాసస్ ప్రవేశించిందా, కొన్నిటిలోకే ప్రవేశించిందా, ప్రవేశించడానికి ప్రయత్నించిందా వివరాలు తెలుసుకోవాలంటే ఆ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు గురి చెయ్యాలి. కాని ఆ ఫోన్లన్నీ వాళ్లను అరెస్టు చేసినప్పుడు జప్తు చేశారు, పోలీసుల దగ్గరే ఉన్నాయి.

తనకు శత్రువులుగా భావించినవాళ్ల మీద ఉచ్చులు పన్నడానికి మోడీ ప్రభుత్వం ఎంతెంత దారుణమైన పనులకు పాల్పడుతున్నదో తెలుసుకోవడంలో మాలో కొందరం పండితులమే అయిపోయాం.

తనకు శత్రువులుగా భావించినవాళ్ల మీద ఉచ్చులు పన్నడానికి మోడీ ప్రభుత్వం ఎంతెంత దారుణమైన పనులకు పాల్పడుతున్నదో తెలుసుకోవడంలో మాలో కొందరం పండితులమే అయిపోయాం. ఆ దారుణమైన పనులు కేవలం గూఢచర్యానికి మించినవి. భీమా కోరేగాం నిందితులలో రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ ల కంప్యూటర్ల ఎలక్ట్రానిక్ కాపీల మీద విశ్లేషణ చేసిన మసాచుసెట్స్ లోని డిజిటల్ ఫోరెన్సిక్స్ సంస్థ ఆర్సెనాల్ కంప్యూటింగ్ ఇటీవలనే తన నివేదిక ప్రకటించింది. ఆ ఇద్దరి కంప్యూటర్లలో కూడ ఒక గుర్తు తెలియని ఆగంతుకుడు జొరబడ్డాడని, వారి హార్డ్ డ్రైవ్ లలో అదృశ్యంగా ఉన్న ఫోల్డర్లలో ప్రమాదకరమైన డాక్యుమెంట్లు ప్రవేశపెట్టాడని ఆ పరిశోధకులు గుర్తించారు. ఆ డాక్యుమెంట్లలో ఒకటి, కాస్త మసాలా కలపడం కోసం, మోడీని చంపడానికి కుట్ర పన్నారని చూపే నమ్మశక్యం కాని ఉత్తరం.

ఆర్సెనాల్ నివేదిక అత్యంత తీవ్రమైన పర్యవసానాలు భారత న్యాయవ్యవస్థకు గాని, భారత ప్రధానస్రవంతి ప్రచార సాధనాలకు గాని పట్టనే పట్టలేదు. న్యాయ సాధనలో తాము చేయవలసిన పని ఉందని వాళ్లు అనుకోనేలేదు. అందుకు పూర్తి వ్యతిరేకంగా పని చేశారు. వారు ఆ నివేదిక వల్ల జరగగల పరిణామాలను అడ్డుకుంటూ, దాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా, భీమా కోరేగాం కేసు నిందితుడు, 84 సంవత్సరాల జెసూయిట్ ప్రీస్ట్ ఫాదర్ స్టాన్ స్వామి జైలులో కరోనావైరస్ సోకి చనిపోయారు. ఆయన ఎన్నో దశాబ్దాల పాటు జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసుల మధ్యన, వారి ఆవాసాలనూ, భూములనూ స్వాధీనం చేసుకోదలచిన కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడారు. అరెస్టయ్యే సమయానికి ఆయన పార్కిన్సన్ వ్యాధితో, కాన్సర్ తో బాధ పడుతున్నారు.

మరి, మనం పెగాసస్ పట్ల ఏం చేయవలసి ఉంది? పాలితుల మీద పాలకులు తరతరాలుగా సాగిస్తున్న గూఢచర్యానికి ఇది ఒక కొత్త సాంకేతిక విధాన రూపం మాత్రమే అని నిరాశతో దాన్ని కొట్టివేయడం తీవ్రమైన తప్పిదం. ఇది సాధారణ గూడచర్యం కాదు. మన మొబైల్ ఫోన్లు మన అత్యంత సన్నిహిత ఆంతరంగిక వస్తువులు. అవి ఒకరకంగా మన మెదడుకూ శరీరానికీ కొనసాగింపుగా మారిపోయాయి. మొబైల్ ఫోన్ల ద్వారా చట్టవ్యతిరేక గూఢచర్యం భారతదేశంలో కొత్తేమీ కాదు. కశ్మీరీలలో ప్రతి ఒక్కరికీ దాని గురించి తెలుసు. భారతదేశంలోని కార్యకర్తలలో కూడ చాలా మందికి అది తెలుసు. కాని, మన ఫోన్లలోకి జొరబడే, దాని మీద ఆధిపత్యం వహించే చట్టబద్ధ హక్కును ప్రభుత్వాలకూ, కార్పొరేషన్లకూ ఇవ్వడమంటే స్వచ్చందంగా మనమే మన మీద ఉల్లంఘనలు జరగడానికి అవకాశం ఇవ్వడమే.

పెగాసస్ వాటికన్న ఎక్కువ చొరబడుతుంది. అది కేవలం మీ జేబులో ఒక గూఢచారి ఉండడం లాంటిది మాత్రమే కాదు. అది మీరు ప్రాణాధికంగా ప్రేమించేవారే మీ మీద గూఢచర్యం చెయ్యడం లాంటిది. అంతకన్న ఘోరంగా మీ మెదడే, లేదా మీ మెదడులోని చొరబడడానికి వీలులేని మూలమూలలే మీ మీద నిఘా పెట్టడం లాంటిది.

ఈ స్పైవేర్ వల్ల ఉండగల ప్రమాదం ఇంతకు ముందరి గూఢచార, నిఘా రూపాలన్నిటి ప్రమాదం కన్న ఎక్కువ చొరబాటు స్వభావం కలిగినదని పెగాసస్ ప్రాజెక్ట్ బైటపెట్టింది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ ఆల్గారిథంల పడుగూ పేకా అల్లిన సాలెగూళ్లలో కోట్లాది మంది తమ జీవితాలు గడుపుతున్నారు. తమ కోరికలను బహిరంగ పరుస్తున్నారు. కాని పెగాసస్ వాటికన్న ఎక్కువ చొరబడుతుంది. అది కేవలం మీ జేబులో ఒక గూఢచారి ఉండడం లాంటిది మాత్రమే కాదు. అది మీరు ప్రాణాధికంగా ప్రేమించేవారే మీ మీద గూఢచర్యం చెయ్యడం లాంటిది. అంతకన్న ఘోరంగా మీ మెదడే, లేదా మీ మెదడులోని చొరబడడానికి వీలులేని మూలమూలలే మీ మీద నిఘా పెట్టడం లాంటిది.

పెగాసస్ వంటి స్పైవేర్ కేవలం అది ప్రవేశించిన ఫోన్ వినియోగదారును మాత్రమే కాదు, ఆ వినియోగదారు సమస్త సామాజిక బృందాన్నీ, రాజకీయ, సామాజిక, ఆర్థిక జీవితంలోని మిత్రులనూ, కుటుంబాలనూ, సహచరులనూ అందరినీ ప్రమాదంలో పడేస్తుంది.

ఇటువంటి విస్తృతమైన ప్రజా నిఘా గురించి ప్రపంచంలో మరెవరి కన్నా ఎక్కువ కాలంగా, ఎక్కువ లోతుగా ఆలోచించిన వ్యక్తి బహుశా అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ మాజీ విశ్లేషకుడు, అసమ్మతివాది ఎడ్వర్డ్ స్నోడెన్ అయి ఉంటాడు. గార్డియన్ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా హెచ్చరించాడు: “ఈ సాంకేతిక పరిజ్ఞానం అమ్మకాలను ఆపడానికి మీరు ఏమీ చేయకపోతే, అది కేవలం 50,000 లక్ష్యాల దగ్గరే ఆగిపోదు. అది త్వరలోనే అయిదు కోట్ల లక్ష్యాలను చేరుతుంది. మనమెవరమూ ఊహించలేనంత వేగంతో విస్తరిస్తుంది” అన్నాడు. ఆయన మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఆయన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని లోపలి నుంచి చూశాడు, ఇది ఎలా అభివృద్ధి చెందుతున్నదో చూశాడు.

దాదాపు ఏడేళ్ల కింద, డిసెంబర్ 2014లో నేను మాస్కోలో స్నోడెన్ ను కలిశాను. అప్పటికే ఆయన తన ప్రభుత్వం తన సొంత పౌరుల మీద సాగిస్తున్న గూఢచర్యాన్ని అసహ్యించుకుని, ఆ విషయాలు బైటపెట్టాలని నిర్ణయించుకుని ఏడాదిన్నర అయింది. మే 2013లో అనూహ్యంగా తప్పించుకుని, ఒక కాందిశీకుడిలా జీవించడానికి అలవాటు పడుతున్నాడు. పెంటగన్ పేపర్స్ కు చెందిన డానియెల్ ఎల్స్ బెర్గ్, జాన్ కుసాక్ కు చెందిన జాన్ కుసాక్, నేను స్నోడెన్ ను కలవడానికే మాస్కో వెళ్లాం. రష్యన్ చలికాలపు మంచు గాలులు కిటికీ అద్దాలను బాదుతుండగా ఒక హోటల్ గదిలో మూడు రోజుల పాటు మేం నిఘా గురించీ, గూఢచర్యం గురించీ ఎడతెగని సంభాషణలు జరిపాం. ఇది ఎంతదూరం పోతుంది? ఇది మనను ఎక్కడికి తీసుకుపోతుంది? చివరికి మనం ఏమవుతాం?

మనం ఏదో ఒకటి చేయకపోతే, నిద్రలో నడిచినట్టుగా మనం నేరుగా సంపూర్ణ గూఢచర్య రాజ్యం లోకి నడిచి వెళ్లిపోతాం. అక్కడ ఉండేది రెండు రకాల అపార శక్తులున్న సర్వశక్తిమంతమైన రాజ్యం.

పెగాసస్ ప్రాజెక్టు వార్తలు వెలువడగానే నేను నా పాత కాగితాలు తవ్వి తీసి, మా సంభాషణలను నమోదు చేసిన ట్రాన్స్క్రిప్ట్ చూశాను. అది కొన్ని వందల పేజీలుంది. అది చదువుతుంటే నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అప్పటికి ముప్పై ఏళ్ల వయసులో ఉన్న స్నోడెన్, ఒక విషాద ప్రవక్త లాగా చెప్పాడు: “ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వెనక్కి తిప్పడం కుదరదు. అది ఎక్కడికీ పోదు…. అది ఇంకా చౌకగా దొరుకుతుంది, ఇంకా శక్తిమంతంగా తయారవుతుంది. ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. మనం ఏదో ఒకటి చేయకపోతే, నిద్రలో నడిచినట్టుగా మనం నేరుగా సంపూర్ణ గూఢచర్య రాజ్యం లోకి నడిచి వెళ్లిపోతాం. అక్కడ ఉండేది రెండు రకాల అపార శక్తులున్న సర్వశక్తిమంతమైన రాజ్యం. దానికి బలప్రయోగం చేయడానికి అనంతమైన సామర్థ్యం ఉంటుంది. దానికి తన సామర్థ్యాన్ని ఏ లక్ష్యానికి గురిపెట్టాలో తెలుసుకునే అనంతమైన శక్తి ఉంటుంది. ఆ సామర్థ్యమూ ఆ శక్తీ రెండూ కలిసి ఉండడం అత్యంత ప్రమాదకరం…. అదే భవిష్యత్ దిశ” అన్నాడాయన.

మరో మాటల్లో చెప్పాలంటే, ప్రజల గురించి తెలియవలసిన సమస్తమూ తెలిసిన రాజ్యం చేత పాలించబడే దిశగా, మరొక వంక, ఆ రాజ్యం గురించి ప్రజలకు అంతకంతకూ తక్కువ తెలిసే దిశగా మనం పయనిస్తున్నాం. ఆ అసమతుల్యత ఒకే ఒక్క గమ్యానికి దారితీస్తుంది. అది దుష్టత్వం. ప్రజాస్వామ్య అంతం.

స్నోడెన్ చెప్పినది సరైనదే. ఈ సాంకేతిక విధానాన్ని వెనక్కి తిప్పలేం. కాని దాన్ని ఇలా నియంత్రణ లేని, చట్టబద్ధమైన పరిశ్రమ లాగా, విపరీతమైన లాభాలు చేసుకుంటూ, ఖండాంతర స్వేచ్ఛా విపణి మహా రహదారుల మీద మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ తిరగనివ్వవలసిన అవసరమేమీ లేదు. దాన్ని చట్టాల గొలుసులతో కట్టి వేయవచ్చు. దాన్ని రహస్య జీవితంలోకి నెట్టేయవచ్చు. అలా సాంకేతిక విధానం ఉంటే ఉంటుందేమో. పరిశ్రమ ఉండనవసరం లేదు.

అంటే మనం ఎక్కడికి చేరినట్టు? చెప్పాలంటే, పాత కాలపు, మంచి రాజకీయాల ప్రపంచంలోకి చేరుతాం. కేవలం రాజకీయ కార్యాచరణ మాత్రమే ఈ ప్రమాదాన్ని అడ్డుకోగలదు. ఎందుకంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చట్టబద్ధంగా కాకపోతే, చట్టవ్యతిరేకంగానైనా వినియోగించినప్పుడు, అది మన కాలానికి చెందిన సంక్లిష్ట వలయం లోపలే మనుగడలో ఉంటుంది. ఆ వలయం జాతీయవాదం, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం, వలసవాదం, జాతి దురహంకార వాదం, కుల దురహంకార వాదం, పురుషాధిపత్యం అనే వలయం. అదే మన యుద్ధ రంగం. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఎలాగైనా ఉండనీండి.

మనకు వ్యతిరేకంగా డిజిటల్ గూఢచర్యాన్ని ఉపయోగిస్తున్న పాలనలను మనం కూలదోయవలసి ఉంది. అధికార పగ్గాల మీద వాళ్ల పట్టును తొలగించడానికి మనం చేయగలిగినంతా చేయవలసి ఉంది. వాళ్లు తెగగొట్టిన వాటన్నిటినీ అతికించడానికి, వాళ్లు దొంగిలించిన దాన్నంతా వెనక్కి రాబట్టుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయవలసి ఉన్నది.

మన మొబైల్ ఫోన్లు అనే మన సన్నిహిత ఆంతరంగిక శత్రువు చేత అదుపు చేయబడని, వాటి ఆధిపత్యం కింద ఉండని ఒక ప్రపంచంలోకి మనం తిరిగి ప్రయాణించవలసి ఉంది. మనం ఊపిరి సలపనివ్వని డిజిటల్ గూఢచర్య ప్రపంచానికి బైట మన జీవితాలను, పోరాటాలను, సామాజిక ఉద్యమాలను పునర్నిర్మించుకునే ప్రయత్నం చేయవలసి ఉంది. మనకు వ్యతిరేకంగా డిజిటల్ గూఢచర్యాన్ని ఉపయోగిస్తున్న పాలనలను మనం కూలదోయవలసి ఉంది. అధికార పగ్గాల మీద వాళ్ల పట్టును తొలగించడానికి మనం చేయగలిగినంతా చేయవలసి ఉంది. వాళ్లు తెగగొట్టిన వాటన్నిటినీ అతికించడానికి, వాళ్లు దొంగిలించిన దాన్నంతా వెనక్కి రాబట్టుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయవలసి ఉన్నది.

అరుంధతీ రాయ్ నవలా రచయిత, వ్యాసకర్త, రాజకీయ కార్యకర్త. ఎన్.వేణుగోపాల్ వీక్షణం సంపాదకులు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article