Editorial

Wednesday, January 22, 2025
కథనాలుఇది 'వెన్నెల పర్వం' : నాటి ‘విషాద పర్వం’ స్పూర్తితో నేటి ‘విరాట పర్వం’ :...

ఇది ‘వెన్నెల పర్వం’ : నాటి ‘విషాద పర్వం’ స్పూర్తితో నేటి ‘విరాట పర్వం’ : తెలుపు ప్రత్యేకం

నిన్న వరంగల్ లో జరిగిన ఆత్మీయ వేడుక అనంతరం ‘విరాట పర్వం’ చిత్ర యూనిట్ ఈ ఉదయం తమ చిత్రానికి మూలం, ‘వెన్నెల’ పాత్రకు ఆధారమైన ‘సరళ’ కుటుంబ సభ్యులను కలవడం విశేషం. ఆ సరళ గాథ ఒక నాటి పీపుల్స్ వార్ చరిత్రలో ఒక విషాద పర్వం. అది వెన్నెలగా మారిన పర్వం తెలుపుకు ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు

ఓరుగల్లు బిడ్డ వేణు ఊడుగుల కవి, రచయిత, దర్శకులు. అయన ‘జైబోలో తెలంగాణ’లో తన నిశితమైన కలానికి పదును పెట్టి మాటలు రాశారు. ‘నీదీ నాదీ ఒకే కథ’తో దర్శకుడి యువతరం ఆవేదనకు అద్దం పట్టారు. ఇప్పుడు తననిగన్న ఉద్యమ గడ్డ ఋణం తీర్చుకోను విషాదాన్ని ఓర్చుకొని ఒక వెన్నెల పర్వాన్ని రచించి దర్శకత్వం వహించారు. ముందుగ తనకు అభినందనలు.

విరాట పర్వం సరళం కాదు సంక్లిష్టం. కానీ దాన్ని ప్రేమించడం వల్ల అయన ఓరుగల్ల బిడ్డగా జరిగిన కథను సరికొత్త మలుపు తిప్పారు. అక్కడి నేలపై విరిసిన ఆశయాలను – అందలి మహోజ్వల ప్రేమను, అది విప్లవ రూపంగా మారిన తొవ్వను, చివరాఖరికి అది నూరు పూలు వికసించనీ అని నమ్మిన వారిచేతే చిద్రమై మట్టిలో కలిసిపోవడం అంతా అదొక విషాదభరిత యదార్థ గాథ. దాని నుంచి ఒక మహాకవ్యానికి కావాల్సిన ఇతివృత్తాన్ని గైకొని , దాన్నొక ఉత్తేజభరితంగా ‘విరాట పర్వం’గా మలిచినందుకు అభినందనలు.

అన్నిటికన్నా మిన్న.. నేటి మావోయిస్టు పార్టి -అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఆలస్యంగా అంగీకరించిన ఒక ఘోర తప్పిదాన్ని ఆధారం చేసుకుని కవిగా తన కాల్పానికతతో దర్శకుడి సినిమాటిక్ లిబర్టీతో వర్తమానానికి గతకాలపు చరిత్రను, అందలి తెర తీయగ వచ్చే ఘటనా ఘటనలను వెండితెరపై సాహసోపేతంగా ఆవిష్కరించారు. అది భవితకు ఒక దిక్సూచి గనుక అభినందనలు. తెలంగాణా సినిమాకు అది స్ఫూర్తి గనుకా అభినందనలు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ అంటే ఇదొక వెన్నుతట్టు. తెలంగాణా అంటే ఎగబాకడం కాదు, అది ఎరురీత. పోరాటం. తెలంగాణాలో ఉద్యమం అంటే అది ఎవరిపైనో పెట్టే విమర్శ కాదు, సమీక్ష. ఆచరణకు నాంది. ఈ విరాటపర్వం ఆ దిశలో ఎన్నటికీ ఎన్నదగిన ప్రేమ అవుతుందన్న విశ్వాసంతో ఆ కథ వెనుక కథపై తెలుపు ప్రత్యేక కథనం.

విషాద పర్వం నుంచి ‘వెన్నెల’ పర్వం

నిజానికి ఈ సినిమా మూలం ఒక విషాద పర్వం. అదొక అడవి కాచిన వెన్నెల. దాన్ని అయన అద్భుతమైన నటులతో, గొప్ప టెక్నీషియన్లతో సజీవం చేసి మన కళ్ళ ముందుకు తెచ్చిన వైనం ముచ్చటగా ఉంది. సినిమా ప్రమోషన్ రోజు రోజుకూ పెరుగుతుండగా నేడు మరో విశేషం.

ఇంతకూ అధ్బుతమైన నటి సాయి పల్లవి పోషించిన ‘వెన్నెల’ పాత్ర ఎవరో కాదు, ‘సరళ’ అని దర్శకులు వివరాలు పేర్కొనకుండా కొన్ని ఫోటోలను సామజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తెలియజేశారు.  “This film is an ode to the girl” అని కూడా వేణు ఊడుగుల పేర్కొన్నారు.

ఆ సరళనే ఈ ‘వెన్నెల’

ఇంతకూ అధ్బుతమైన నటి సాయి పల్లవి పోషించిన ‘వెన్నెల’ ఎవరో కాదు, పీపుల్స్ వార్ చేతిలో కోవర్ట్ అన్న అనుమానంతో హత్యగావింప బడిన ‘సరళ’.

ఎవరీ సరళ అంటే అప్పటి పీపుల్స్ వార్ కమిటీ తమ పార్టీ కార్యాచరణలో దొర్లిన తప్పులకు తమను క్షమించమని కోరుతూ విడుదల చేసిన ప్రకటనలోని ఈ భాగం చదివితే వివరంగా బోధపడుతుంది.

11 నవంబర్ 1992లో భారత కమ్యూనిస్టు పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్యాం పేరిట విడుదలైంది ఆ ప్రకటన.  అప్పట్లో కాకతీయ ఎక్స్ ప్రెస్ బోగిని తమ కార్యకర్తలే దగ్ధం చేయడం వల్ల 37 మంది మరణించైనా విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సంచలన ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రజలను క్షమాపణలు వేడుకుంటూ విడుదల చేసిన ఈ ఉత్తరంలో సరళ హత్య గురించి కూడా గురించి చింతిస్తూ ఆ తీవ్ర తప్పిదం గురించి ప్రస్తావిస్తూ శ్యాం పేర్కొన్న మాటలు ఇవి…

“జరిగిన తప్పును క్షమించమని కోరుతున్నాం”

“…1992 ఫిబ్రవరిలో సరళ అనే మహిళ విపవోద్యమంలో పని చేయడానికి ఖమ్మం నుంచి నిజామాబాద్ దళాల వద్దకు చేరింది. విప్లవోద్యమంలో పాల్గొనడానికి వచ్చిన సరళ పోలిస్ యిన్ ఫార్మర్ గా అనుమానించబడి మా పార్టీ కార్యకర్తల చేతిలో మరణించింది. ఈ సంఘటన మా పార్టీని, యావత్ ప్రజల హృదయాలను కలచివేసిన సంఘటనగా తీవ్రమైన తప్పుగా భావిస్తున్నాం.”

“విప్లవోద్యమంపై మరో దాడిని ప్రారంభించిన ప్రభుత్వం యిన్ ఫార్మర్లుగా మార్చుకుని పార్టీని దళాలను తుదముట్టించాలని పథకం సిద్దం చేసుకున్న నేపథ్యంలో మా కార్యకర్తలు సరళను ఇన్ ఫార్మర్ గా అనుమానించినప్పటికీ సరైన పరిశీలన లేకుండా తొందరపాటు చర్యవలన జరిగిన తప్పుగా సరళ సంఘటనను గుర్తించాలని ప్రజలకు ప్రజస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇది పరిస్థితులను సాకుగా తెసుకుని మా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాదని అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాం. మా కార్యకర్తల తొందరపాటు వల్లనే జరిగిన తప్పుగా అంగీకరిస్తూ, సరళ కుటుంబ సభ్యులను, ప్రజలను మా వల్ల జరిగిన తప్పును క్షమించమని కోరుతున్నాం. “

వెన్నెలలో సరళను చూసుకున్న తల్లి

ఇదీ సరళ హత్యగావింప బడిన వైనంపై పెపుల్స్ వార్ ప్రకటన. ఇదే సంఘటనను, అందలి వెనకాలి మరిన్ని ఘటనలను ఆధారం చేసుకుని వేణు ఊడుగుల వెన్నెల పాత్రను రూపొందించి సరళ ప్రేమకు, ఆమె పోరాట గాథకు గొప్పగా నివాళి అర్పించడం ఈ విశేషం.

చిత్ర యూనిట్ ని ముఖ్యంగా సరళ పాత్రధారి అయిన సాయి పల్లవిని సరళ తల్లి సరోజతో కలిపించడం అంటే చరిత్ర నిర్మాణంలో గాయపడ్డ హృదయాలకు ఒక ఆత్మీయ లేపనం అనే అనాలి. ఐతే, దర్శకుడు చిత్రంలో సరళను బ్రతికించారా లేదా అన్నది ఒక అయన ప్రేమకు దృష్టాంతం. అది తెరమీదే చూడాలి.

సుప్రభాతం కథనం ఊతంగా…

అప్పట్లో సుప్రభాతం వార పత్రిక మే మాసంలో సరళ హత్యపై సమగ్రమైన కవర్ స్టోరీ చేసింది. ‘అడవి మింగిన వెన్నెల సరళ’ పేరిట జయదేవ్ రాసిన ఆ పరిశోధనాత్మక కథనం ఒక సంచలనం. అందులో అనేక వివరాలు వేణు ఊడుగుల చిత్ర పరిశోధనకు తోడ్పడ్డాయి. ఆ కథనం లీడ్…ఇది…

“పోలీసులు నక్సలైట్ కాని ఒక జర్నలిస్టును బూటకపు ఎన్ కౌంటర్ లో చంపి అదృశ్యం చేస్తే, నక్సలైట్లు పోలీసు కానే కాని ఒక విద్యార్థిని హతమార్చి అదృశ్యం చేశారు.”

ఒక సంఘర్షణ తెలుపు పర్వం

కాగా, నిన్న తాను వరంగల్ వేడుకలో అన్నట్టు ఇది పైన పేర్కొన్న నిజ ఘటనల ఆధారంగా తీసిన చిత్రమే ఐనప్పటికీ, ఈ ప్రాంతంలో అపజయాలు కూడా అగ్ని జ్వాలలై మండుతాయో…ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహా కావ్యాలై పుడతాయో ఆ ప్రాంతమే మన ఓరుగల్లు” అని అన్నారు దర్శకులు.

ఆ మాటలు అంటూనే ఈ ప్రాంతంలో 1992 లో జరిగిన ఒక మరణం, మహా సంక్షోభం తన చేత కలం పట్టించి ఈ కథ రాయించిందని, ఆ మరణం వెనుకల ఆధిపత్య రాజకీయాలు, ప్రత్యామ్యాయ రాజకీయాల మధ్య సంఘర్షణ కారణమని చెప్పడం విశేషం. ఆ సంఘర్షణకు తాను అద్భుతమైన ప్రేమ కథను జోడించినట్లు చెప్పడం విశేషం.

https://www.facebook.com/telanganavoice.voice/videos/834635024607635

సైకిల్ వదిలి సాయుధ పోరుబాట

సుప్రభాతం వార పత్రిక లోతైన కథనం ప్రచురించింది. అందులో పేర్కొన్నట్టు, అప్పటికి సరళ పదిహేడేళ్ళ ఇంటర్ బైపిసి విద్యార్థి. పుస్తకాల పురుగు. సామాజిక చైతన్యం గల యువతి. ఒక పార్టీ ఆఫీసులో సైకిల్ వదిలేసి అడవిబాట పడుతుంది.

ఆ రోజుల్లోనే అప్పటి సిర్నాపల్లి దళ కమాండర్ జ్యోతి ఎన్ కౌంటర్ కావడంతో ఆ స్థానంలో తాను వెళ్లి సమాజ మార్పుకోసం ఉత్తేజంతో పనిచేయాలనుకుంటుంది. అనేక కష్టాలు పడి జిల్లా నాయకత్వాన్ని కలుస్తుంది. వారు తనను నమ్మకుండా అనుమానించి హత్య చేయడంపై అనేక వివరాలతో సుప్రభాతం కథనం రాసింది. ఒక్కమాటలో ఒక విద్యార్థిని ఐన సరళ ఉద్యమం టచ్ లోకి వెళ్ళే ముంది ఒక నెలరోజులు సిర్నాపల్లి ప్రాంత ప్రజలకు అత్మీయురాలే అవుతుంది. కొండలు గుట్టలు ఎక్కుతుంది. రాత్రి పగలూ పార్టీ కాంటాక్ట్ కోసం తపిస్తుంది. రెండు ఉత్తరాలను తల్లిదండ్రులకు రాస్తుంది. సాయుధ పోరాటంలో భాగం కావాలనే వచ్చాను అని అందులో రాస్తుంది. ఆ క్రమంలో అక్కడి ప్రజలకు అత్మీయురాలే అవుతుంది. చివరకు మిలిటెంట్ల సాయంతో ఆ యువతీ ఉద్యమకారుల వద్దకు చేరుతుంది. ఆమె ఎందుకు అగ్ర నాయకత్వం వద్దకు వచ్చిందీ అనడానికి అనేక కారణాలు చెబుతారు. అందులో ఒకరిని ప్రేమించడం కూడా ఒకటి. ఏమైనా ఆమె హత్య వెనక చాలా మిస్టరీ ఉంది. సందేహాలు ఉన్నాయ్. కానీ ఆమెను నిజానికి ఇన్ ఫార్మర్ కాదు. ఉద్యమం పట్ల ఎంతో నిబద్దతతో ఆకర్శితురాలైన ప్రేమి అన్నది నిజం. ఆమెను  అనుమానించి నిర్దారించుకోకుండా చంపడం పట్ల పార్టీ ఆలస్యంగా క్షమాపణలు వేడుకోవడం మటుకు నిజ జీవితం. పార్టీయే అంగీకరించినట్లు అది తీవ్ర పొరబాటు.

ఇదీ నేపథ్యం. కాగా, ఈ మధ్యలో వేణు ఊడుగుల ‘అన్నల’ చేతిలో బలైన ఈ ‘సరళ’ను ఎట్లా చూపించారూ, ఏ పరిస్థితుల మధ్య నాటి పార్టీ ప్రజల్లో పనిచేసిందీ, ఈ ‘వెన్నెల’ను ఎలా ఆవిష్కరించారూ అన్నది సస్పెన్స్.

అద్భుతమైన నటీమణులు

ఏమైనా, ఇదంతా సరళమైన గాథ కాదు. నాటకీయత అనడం సబబు కాదు. ఒక గొప్ప ఉద్వేగం, ఉత్తేజం విషాదం మూర్తీ భావించిన గాథ ఇది. అది వ్యక్తిగతం కూడా కాదు, సామూహికం. విప్లవానికే ఒక కుదుపు. అందుకే ఈ సినిమాలో అనేక మహిళా పాత్రలు సృష్టించారు దర్శకులు. వాటిని సాయి పల్లవి తో ఉద్దండులైన నటీమణులు ప్రియమణి, నందిత దాస్ , ఈశ్వరీరావ్‌ లు నటించడం మరో విశేషం. అంతేకాదు, సినిమాకు ప్రాణప్రదమైన సినిమాటోగ్రఫీ మరో ఎత్తు. అది డాని సాంచెజ్-లోపెజ్ నిర్వహించారు. వీరు మహానటి చిత్రానికి కూడా పనిచేశారు.

మరో విశేషం ఏమిటంటే, ఇంత వాస్తవికమైన కథకు రాణా వంటి హీరో, సాయి పల్లవి వంటి హీరోయిన్ లు జస్ట్ పాత్రలుగా మార్చుకోవడం, సినీ  నిర్మాణానికి చక్కటి ప్రొడక్షన్ హౌజ్ లభించడం అంతా వేణు ఊడుగులకు కుదిరిన ఈక్వేషన్ అనే అనాలి. కథే ప్రాణంగా ఎంచ్జుకోవడం వల్ల ఇవన్నీ అమరాయి అనుకోవచ్చు. మొత్తానికి ఈ చిత్రంతో వేణు ఊడుగుల దర్శకుడిగా మరో మెట్టు ఎక్కినట్టే లెక్క.

బాలగోపాల్ మాటలే స్పూర్తినిచ్చాయా?

కాగా, ఈ కథలో కల్పానికత ప్రాణం. దర్శకులు ఎలా ఆ లిబర్టీ తీసుకున్నరూ అన్నది ఆసక్తికరం. ఐతే, సుప్రభాతం కథనంలో అప్పటి పౌరహక్కుల నేత బాలగోపాల్ స్పందన కూడా ఉంది. అందులో ఆయనంటారు…”సరళ పోలీసు గూడచారిని అయ్యే అవకాశం లేదు. అమ్మాయి అత్యుత్సాహం…అమాయకత్వాన్ని పీపుల్స్ వార్ అనుమానించడం శోచనీయం. ఈమెను పీపుల్స్ వార్ సక్రమంగా వినియోగించుకుంటే మంచి నాయకురాలు అయ్యేది” అని వారన్నారు.

…బహుశా వేణు ఊడుగుల ఈ దిశలో ఆలోచించి వెన్నెల పాత్రను ఒక యోధురాలిగా తీర్చిదిద్దారా అన్నది తెలియదు!

ఆ అనుభవం కోసం చేసిన అన్వేషణ

చివరగా ఒక మాట. సుప్రభాతం కథనంలో సరళ గురించి ఒక మంచి మాట రాశారు. అది …”చలం గారు చెప్పినట్టు సరళ శరీరానికి వ్యాయామం ఉంది. మెదడులో జ్ఞానం ఉంది. హృదయానికి అనుభవమే లేదు. ఆ అనుభవం కోసం చేసిన అన్వేషణ చివరకు ఆమె ప్రాణాలనే హరించింది.”

-ఇదీ సరళ విషాద పర్వం. మరి వేణు ఊడుగుల ‘విరాట పర్వం’ ఏమిటీ అన్నది వెండితెరపై చూసేందుకు జూన్ 17 వరకు ఆగాల్సిందే. ఒక వాస్తవిక గత, చరిత్రను అయన వెన్నెల పర్వంగా ఎలా మలిచారూ అన్నది చూడవలసిందే.

ఈ సినిమాపై తెలుపు ఇదివరకు ప్రచురించిన కథనం ‘యుద్దమే కథగా ప్రేమనే విప్లవం’ చదవండి.

 

More articles

1 COMMENT

  1. విరాట పర్వం సినిమా
    సినిమా లా లేదు మన ప్రక్కింటి అమ్మాయి
    జీవితంలాగ వుంది.

    చాలా బాగా తీసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article