Editorial

Thursday, November 21, 2024
Opinionఆకార్‌ ను ఆపేసిన వైనం - మోదీ విరుద్ధ పోకడ : మెరుగుమాల నాంచారయ్య తెలుపు

ఆకార్‌ ను ఆపేసిన వైనం – మోదీ విరుద్ధ పోకడ : మెరుగుమాల నాంచారయ్య తెలుపు

ప్రధాని మోదీ కులాన్ని ఎగతాళిచేన గులాం నబీ ఆజాద్‌ ఆప్తుడయ్యాడు. ఆ కులం ‘తినే అలవాట్లు’ వెల్లడించిన ఆకార్‌ పటేల్‌ శత్రువయ్యాడు! అమెరికా పోకుండా బెంగళూరులో అందుకే ఆకార్‌ ను ఆపేశారు!

మెరుగుమాల నాంచారయ్య

తొమ్మిదేళ్ల క్రితం 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీని నాటి కాంగ్రెస్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తో పోల్చి ప్రశంసించాడో కాషాయపక్ష నేత. దీనిపై ఆగ్రహించిన కేంద్రమంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత, గులాం నబీ ఆజాద్‌ నరేంద్రభాయ్‌పై ఉత్తరాదిన ప్రాచుర్యంలో ఉన్న ఓ వెకిలి సామెతతో తిట్టిపోశాడు. అప్పటి ఆజాద్‌ మాటలతో మోదీ కులం ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆయన ఓబీసీ తేలీ (తెలకల లేదా గాండ్ల లేదా ఘాంచీ) అనే వాస్తవం వెల్లడైంది. ఉత్తరాదిన మోదీ అనే ఇంటిపేరు రాజస్థానీ నేపథ్యం ఉన్న వైశ్యులకు (బనియా) ఎక్కువ (99 శాతం వరకూ) ఉంటుంది. ఈ లెక్కన నరేంద్ర మోదీ కూడా అప్పటి దాకా బనియానే (కోమటి) అనుకున్నారు. ‘కహా భోజరాజ్‌–కహా గంగూ తేలీ!’ అని నక్కకూ, నాగలోకానికి పోలికా అనే అర్ధంలో ఆజాద్‌ మోదీని కించపరుస్తూ మాట్లాడారు. వందల ఏళ్ల నాటి భోజరాజు రాజ్యంలో ఈ గంగూ తేలీ అనే సామాన్యుడు మోదీ (తెలకల) కులస్తుడు. ఆ వెంటనే బీజేపీ విరుచుకుపడగానే కశ్మీరీ ముస్లిం బ్రాహ్మణుడైన ఆజాద్‌ ఆలస్యం చేయకుండా క్షమాపణ చెప్పారు.

చేసింది తప్పే అయినా పరస్సర విరుద్ధ పదాలతో కూడిన (గులాం–ఆజాద్‌) కాంగ్రెస్‌ నేత దేశానికి, మోదీకి మహోపకారం చేశారు. అప్పటి నుంచీ మోదీ తన కులాన్ని రాజకీయంగా వాడుకోవడం (బీసీనని చెప్పుకోవడం) మొదలెట్టారు.

చేసింది తప్పే అయినా పరస్సర విరుద్ధ పదాలతో కూడిన (గులాం–ఆజాద్‌) కాంగ్రెస్‌ నేత దేశానికి, మోదీకి మహోపకారం చేశారు. అప్పటి నుంచీ మోదీ తన కులాన్ని రాజకీయంగా వాడుకోవడం (బీసీనని చెప్పుకోవడం) మొదలెట్టారు.

మోదీ పుట్టిన ప్రాంతంలో హిందూ ఆలయాలున్న పుణ్యస్థలం మోధెరా అనే మాటను బట్టి ఆ ప్రాంతంలోని అన్ని కులాల పేర్లకూ ముందు మోద్‌ అనేది తగిలిస్తారనీ, వైశ్యులు కాని తేలి లేదా ఘంచీ (తెలంగాణ, రాయలసీమలో గాండ్ల) కులాన్ని మోద్‌ ఘాంచీ అనీ, వైశ్యులను మోద్‌ బనియా అంటారని కూడా ఆజాద్‌ వ్యాఖ్యల వల్ల వచ్చిన వివాదం తర్వాతే తెలిసింది. మొత్తానికి మోదీ నువ్వుల నూనె గానుక ఆడే బీసీ కులంలో పుట్టాడనే విషయం దేశమంతా ప్రచారంలోకి వచ్చింది. అంత వరకూ బాగానే ఉంది.

సూరత్‌ బీజేపీ వైశ్య ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆకార్‌ పటేల్‌ పై కేసు–అరెస్టు!

ప్రఖ్యాత పాత్రికేయుడు, చరిత్రకారుడు, అమ్మెస్టీ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్‌ పటేల్‌ గుజరాతీ పాటీదార్‌ (పటేల్‌) కుటుంబంలో పుట్టిన మేధావి. ఆయన మతం, కులం, జాతి వంటి విషయాలతోపాటు సమకాలీన అంశాలపై పత్రికల్లో రాస్తుంటారు. ఆయన నరేంద్రమోదీ విధానాలను విమర్శించడం సర్వసాధారణ విషయం. అయితే, గుజరాతీలు 80 శాతం వరకూ శాకాహారులని, నరేంద్రభాయ్‌ కూడా మంసాహారం తినరని, ఆయన పుట్టిన ఘాంచీ కులస్తులు కూడా శాకాహారులనే అడ్డగోలు అబద్ధపు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆకార్‌ పటేల్‌ ఈ అంశాలపై వివరణ ఇస్తూ వాస్తవాలు వెల్లడించారు.

2020 జూన్‌ నెలలో ఈ విషయంపై ఆకార్‌ రెండు ట్వీట్లు చేశారు. ‘ప్రధాని మోదీది ఘాంచీ కులం. ఈ కులాన్ని 1999లో బీజేపీ తొలి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చేర్చారు. ఈ సామాజికవర్గంలో పేదరికం లేదు. ఘాంచీ కులస్తులు మాంసాహారులు. ఆయన కుటుంబ సభ్యులు కూడా శాకాహారులు కాదు. నమో మాత్రం శాకాహారి. ఆరెసెస్‌లో చేరినాక నరేంద్ర మోదీ ఇలా శాకాహారి అయ్యారు.’ అని తన మొదటి రెండు ట్వీట్లలో ఆకార్‌ వ్యాఖ్యానించారు. ఇందులో తప్పుపట్టాల్సిన విషయం ఏమీలేదు. మూడో ట్వీట్లో, ‘ 2002లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించిన వారు ముస్లిం ఘాంచీ కులానికి చెందినోళ్లు. ఇతర భారతీయులపై ప్రత్యేకించి ముస్లింలపై జరిగే హింస నుంచి ఆరెసెస్, బీజేపీ ఎప్పుడూ లబ్ధిపొందాయి. వాజపేయి, ఆడ్వాణీ, మోదీ ఇలా రాజకీయ ప్రయోజనం పొందినోళ్లే,’ అని ఆకార్‌ అన్నారు.

మోదీ కులస్తులు మాంసాహారులని, ఆయన కుటుంబంలో ఆయన మాత్రమే శాకాహారి అని అన్నందుకు ప్రధాని కులస్తులైన ఘాంచీలకు కోపం రాలేదు. తోటి గుజరాతీ పాటీదార్‌ అయిన ఆకార్‌ నిజమే చెప్పాడు కదా అనుకున్నారు. గుజరాత్‌లోని సూరత్‌ వెస్ట్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ ఆకార్‌ ట్వీట్లు ప్రధాని కులాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ సూరత్‌ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఎమ్మెల్యే మోదీ ప్రధాని మోదీ కులంవాడు కాదు. వైశ్యుడు. మోధెరా ప్రాంతం వాడు కావడంతో పూర్ణేష్‌ మోదీ కులాన్ని మోద్‌ వణిక్‌ (మోద్‌ వైశ్య) అని పిలుస్తారు. ఈ బీజేపీ ఎమ్మెల్యే సమస్త గుజరాతీ మోద్‌ వణిక్‌ సమాజ్‌ (అఖిల గుజరాత్‌ మోద్‌ వైశ్యుల సంఘం) అధ్యక్షుడు కూడా. ప్రధాని కులం వారితో కాకుండా ఇలా తెలివిగా వైశ్య మోదీ ఎమ్మెల్యేతో ఎఫ్‌ఐఆర్‌ ఆకార్‌ పటేల్‌ పై నమోదయ్యేలా బీజేపీ తెలివైన వ్యూహం అమలు చేసింది.

ఈ కేసులో అంతా సర్దుకుందని అనుకున్న తరుణంలో బుధవారం అమెరికా పర్యటనకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఆకార్‌ను హఠాత్తుగా నిలిపివేశారు.

2020 ఆగస్టులో ఈ కేసు విషయమై ఆకార్‌ ను అరెస్టు చేశారు. మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో వెంటనే బెయిలు పొందారు పటేల్‌. ఈ మాత్రం ట్వీట్లపై దాఖలైన ఫిర్యాదుతో ఏకంగా ఆకార్‌ పటేల్‌ పాస్‌పోర్ట్‌ సైతం కోర్టులో డిపాజిట్‌ చేయించారు. తర్వాత విదేశీ ప్రయాణం సందర్భంగా ఆయనకు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అంతా సర్దుకుందని అనుకున్న తరుణంలో బుధవారం అమెరికా పర్యటనకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఆకార్‌ను హఠాత్తుగా నిలిపివేశారు. అమెరికా వర్సిటీల్లో ప్రసంగించడానికి పయనమైన ఆకార్‌ ను ఇలా వేధింపులకు గురిచేస్తోంది ప్రభుత్వం. మోదీ కులం, కుటుంబం మాంసాహారులని పదే పదే చెబితే అంత అపరాధమా?

ప్రధాని, ఆయన కుటుంబం, కులం– ఇలా మొత్తంగా శాకాహారులనే అబద్ధం ప్రచారం చేయడాన్ని అడ్డుకోవడమే ఆకార్‌ పటేల్‌ చేసిన పాపమైంది

ఆహారపు అలవాట్లపై ఆకార్‌ అనేక వ్యాసాలు రాశారు. గుజరాతీలంతా శాకాహారులు కాదనీ, వారిలో మూడొంతులకు పైగా మాంసం, చేపలు తింటారని ఆయన పలు సందర్భాల్లో రాశారు. కొన్నేళ్ల క్రితం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఓ వ్యాసం రాస్తూ, ‘‘ సూరత్‌ నగరంలో ప్రధాని పుట్టిన ఘాంచీ కులస్తులు ఉడకబెట్టిన కోడి గుడ్లను మసాలాతోపాటు పైన వెల్లుల్లి పరకలు వేసి సాయంత్రం వీధుల్లో అమ్ముతుంటారు,’ అని ఆకార్‌ వెల్లడించారు.

ప్రధాని, ఆయన కుటుంబం, కులం– ఇలా మొత్తంగా శాకాహారులనే అబద్ధం ప్రచారం చేయడాన్ని అడ్డుకోవడమే ఆకార్‌ పటేల్‌ చేసిన పాపమైంది

మెరుగుమాల నాంచారయ్య సీనియర్ పాత్రికేయులు. ఉదయం, వార్త దిన పత్రికల్లో పనిచేయడమే కాక ఈనాడు, సాక్షి జర్నలిజం కళాశాల అధ్యాపకులుగా వారు సుశిక్షితులైన యువ పాత్రికేయులను అందించిన మార్గదర్శి. నిశితమైన విశ్లేషకులుగా వారు పాఠకులకు పరిచితులే. మనదేశ వాస్తవికత అయిన కులాన్ని, దాని విస్తృతిని వారు లోతుగా అధ్యయనం చేయడమే కాక అనేక శ్రేణుల్లో. పలు రంగాల్లో దాని అనివార్య ప్రభావాన్ని వారు రచించే కథనాల ద్వారా వివరించడం తన ప్రత్యేకత.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article