Editorial

Wednesday, January 22, 2025
వ్యాసాలుఈ సాయంత్రం : కుమార్ కూనపరాజు 'ప్రేమరాగం' విందామా? - తాడి ప్రకాష్

ఈ సాయంత్రం : కుమార్ కూనపరాజు ‘ప్రేమరాగం’ విందామా? – తాడి ప్రకాష్

ఇది కుమారరాజా కథల పుస్తకం ‘ప్రేమ రాగం వింటావా?’ అన్న కథల పుస్తకానికి సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు రాసిన ముందు మాటలో కొంతభాగం. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సాయంత్రం (26) ఆరు గంటలకు.

అందరూ ఆహ్వానితులే.

తాడి ప్రకాష్

2018 సెప్టెంబర్ 8……
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12…..
ఆర్టిస్ట్ మోహన్ లేని ఆ ఆఫీస్ హడావుడిగా ఉంది.
అతి తేలికైన పద్ధతిలో లియో టాయ్ స్టాయ్ శిల్పం అక్కడ తయారవుతోంది.
చెక్కముక్కల ఫ్రేమ్ కి ఒక ముతక గుడ్డని బిగించి, ఒక పద్ధతిలో అమర్చి ఆ మహారచయిత రూపు తెస్తున్నాడు కారంకి శ్రీరామ్. నలుగురైదుగురు మిత్రులం ఆసక్తిగా చూస్తున్నాం.

టాల్ స్టాయ్ గంభీరంగా కూర్చుని ఉండే మాస్కో శిల్పం నమూనా అది.

మేకులు కొట్టీ, గమ్ తో అతికించీ నానా తంటాలు పడుతున్నాడు ఆర్టిస్ట్ శ్రీరామ్. తక్కువ నీళ్ళు పోసి ఒక పెగ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆరేడుగంటల శ్రమ, చెమటలు కారే వర్క్ తర్వాత శిల్పం దాదాపు పూర్తి అయింది. ఎనిమిది అడుగుల విగ్రహం అది. మర్నాడు విజయవాడలో జరిగే టాల్ స్టాయ్ పుట్టినరోజు సభలో దాన్ని వేదిక మీద ఉంచాలి. అంత పెద్ద ఫ్రేమ్ ని విజయవాడ తీసుకెళ్ళడం ఎలా? ఆంబులెన్స్ లో అయితే స్ట్రెచర్ మీద పడుకోబెట్టి, విగ్రహం ముక్కలు అయిపోకుండా తీసుకెళ్ళొచ్చు అన్నాడో మిత్రుడు.

అలాగే చేద్దాం, మాట్లాడండి అన్నాడు కూనపరాజు కుమార్. విజయవాడ నుంచి తిరిగి రావడానికి కూడా ఖర్చవుతుంది కనుక ఎనిమిది వేలు ఇవ్వమన్నాడు అంబులెన్స్ వాడు. మర్నాడు సిద్ధార్ధ కాలేజి ఆడిటోరియం బైట విగ్రహం నిలబెట్టి, రంగులు వేయడం మొదలుపెట్టాడు శ్రీరామ్. గ్రేలో రకరకాల షేడ్స్ వేగంగా స్ప్రే చేస్తున్నాడు. చూస్తుండగానే మాస్కో కొండరాయి శిల్పంలానే టాల్ స్టాయ్ రూపుదిద్దుకున్నాడు. వచ్చినవాళ్ళు “భలేగా చేశారే” అని ఆర్టిస్ట్ ని మెచ్చుకుంటున్నారు. కుమార్ రాజు చొరవతో ప్రచురించిన తొమ్మిది టాల్ స్టాయ్ అనువాద రచనల ఆవిష్కరణ ఆరోజు.

వేదిక మీద అమర్చిన టాల్ స్టాయ్ విగ్రహం అందరినీ ఆకర్షించింది. అలా, సభా వేదిక మీద రచయిత శిల్పం ఉండాలన్న ఆలోచన కూనపరాజు కుమార్ ది.

‘యుద్ధము-శాంతి’, ‘అన్నాకెరెనినా’ లాంటి పెద్ద గ్రంథాలతో పాటూ కథల పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. వేదిక మీద అమర్చిన టాల్ స్టాయ్ విగ్రహం అందరినీ ఆకర్షించింది. అలా, సభా వేదిక మీద రచయిత శిల్పం ఉండాలన్న ఆలోచన కూనపరాజు కుమార్ ది. ఆ ఆలోచన ఖరీదు వేల రూపాయలు. అక్కడ విగ్రహం పెట్టాలని ఎవరూ అడగలేదు. పెట్టకపోతే వచ్చే నష్టమూ లేదు, కేవలం ప్రేమ. టాల్ స్టాయ్ సాహిత్యం ఇచ్చిన ఉత్తేజం అది. సాహిత్య సభలో రెండు పిచ్చి బిస్కెట్లు, ఓ ముష్టి టీ ఇవ్వడానికే ఆలోచించే వాళ్ళున్నారని మనకి తెలుసు. ఇంత శ్రమ, ఇంత ఖర్చు కుమార్ ఎందుకు పెట్టుకున్నట్టూ?
దీనివల్ల పెద్ద పేరూ ప్రతిష్టా వస్తాయా? గుండె నిండిన ప్రేమకీ, అపారమైన అభిమానానికీ శ్రీశ్రీ అన్నట్టు ఖరీదు కట్టలేం. కుమార్ అయితే అసలది ఖర్చు అనే అనుకోడు.

చిత్రం : గిరిధర్ అరసవల్లి

“మానవ ప్రవర్తన యొక్క అరుదైన సుగుణాలు వెల్లడి కావాలంటే దాని పనితీరును అనేక ఏళ్ళపాటు పరిశీలించే అదృష్టం వుండాలి “. ఈ మాటలు కూనపరాజు కుమార్ కి సంబంధించి నూరుశాతం నిజం అన్నది నా ప్రత్యక్ష అనుభవం.

ఓ 20 ఏళ్ల క్రితం…..

ఒకరోజు సాయంకాలం, బాగ్ లింగంపల్లిలోని ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్ కి వెళ్ళేసరికి…ఓ 40 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. కాంతులు వెదజల్లుతూ నవ్వుతున్నాడు. న్యూయార్క్ నుంచి లేటెస్ట్ గా దిగొచ్చాడనీ, కూనపరాజు గారనీ పరిచయం చేశారు. ఆ రాత్రి, లిటరల్ గా ఒక లిటరరీ పార్టీ. కథలు, నవలలు….ప్రపంచ సాహిత్యం. ఆయనది భీమవరం దగ్గర ఓ పచ్చని పల్లెటూరు… మాది ఏలూరు. పశ్చిమగోదావరి మర్యాదల్ని పూర్తిగా పాటిస్తూ మీరు, మీరు అనే పిలుచుకుంటాం. గొడవలు పడ్డా సరే, “మీరుత్త దొంగా ముండా కొడుకుగారండీ” అని తిట్టుకుంటాం తప్ప మర్యాదకేం లోటు చెయ్యం.
ఎప్పుడు కలిసినా, సమాజమూ, కమ్యూనిస్టులూ, సాహిత్యం ఇదే మా టాపిక్. ఆయన అమెరికన్ ఎక్స్ పీరియెన్స్ ని రాసి న్యూయార్క్ కథలు (2013) పుస్తకం తెచ్చాడు. హైదరాబాద్ సప్తపర్ణిలో అట్టహాసంగా సభ….మిత్రులందరినీ పిలిచాడు మోహన్. విశాఖ నుంచి డాక్టర్ చందు సుబ్బారావు, బిజీగా వుండే సజ్జల రామకృష్ణారెడ్డి, రచయిత కేశవరెడ్డి, మోహన్ని తెగ ప్రేమించే శ్రీరమణ, ఖదీర్ బాబూ ఇంకా ఎంతో మంది వచ్చారు.

అదో సాహితీ ఉత్సవం.

కుమార్ ది పెదనిండ్ర కొలను. A typical costal village. ఆ పక్క గ్రామమే నటుడు ఎం.ఎస్ నారాయణది. వాళ్ళిద్దరూ మిత్రులు. హైదరాబాద్ లో మా ఆఫీసుకి కుమార్ తో కలిసి వచ్చేవాడు ఎమ్మెస్. కాళిదాసు నుంచి మేరియో పూజో దాకా ఎమ్మెస్ నారాయణ మాట్లాడుతుంటే వినాలి. మంచి పద్యాలూ, సంస్కృత శ్లోకాలూ, స్పాంటేనియస్ గా జోకులూ…..మరిచిపోలేని రోజులవి. నలుగుర్నీ నవ్వించే తాగుబోతు పాత్రల ‘చిల్లర’ సినిమా నటుడు, నిజానికి జ్ఞాన సంపదని ఉదారంగా పంచే దాన కర్ణుడా! అని ఆశ్చర్యం. ఎమ్మెస్ చనిపోయిన విషాదం నుంచి తేరుకున్నాక, ఆయన జీవిత చరిత్రని కుమార్ రాశాడు, హృదయాన్ని కదిలించేలా.

అది నవ్య వీక్లీలో సీరియల్ గా వచ్చింది.

కుమార్ కొత్త కథామంజరి ‘ప్రేమరాగం వింటావా?’

ఈ 15 కథలూ హాయిగా చదివిస్తాయి. సమకాలీన జీవిత చిత్రణ, సన్నివేశ కల్పన, వస్తు వైవిధ్యం, వాస్తవికత….

ఓ హెన్రీ రాశాడా? అనిపించే ‘ప్రేమరాగం వింటావా?’లో అందం అంతా ఆ berivity లో, కథ ముగింపులో ఉంది.

కథల్లో ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు ఒక ఉద్వేగంతో సాగుతాయి. గుండెలోపలి పొరల్లో ఇంకిపోయిన కన్నీళ్ళలా యీ కథలు గుర్తుండిపోతాయి. ముదురు గోధుమ రంగులో ముద్దొచ్చే….అందంగా మెరిసిపోయే చిన్నారి కొల్లేటి పిట్టలు ‘బుడబుచ్చకాయలు’… కాల్చుకు తింటే రుచిగా వుంటాయి. చిల్లర డబ్బుల కోసం రోజంతా శ్రమించే పేదల బతుకుల్ని ఆ పిట్టలతో పోల్చిన విషాదం పాఠకుణ్ణి కదిలిస్తుంది. సమాజం పట్ల, కర్కశమైన యీ జీవితం పట్ల సచేతనమైన సదవగాహన వున్న కుమార్ లాంటి రచయిత మాత్రమే రాయగలిగిన కథ యిది.

ఓ హెన్రీ రాశాడా? అనిపించే ‘ప్రేమరాగం వింటావా?’లో అందం అంతా ఆ berivity లో, కథ ముగింపులో ఉంది. ‘శ్రీ లక్ష్మి పేరు మార్చుకుంది’ నిజ జీవిత కథ. ఆడవాళ్ళ నిస్సహాయత, ఐనా తన కాళ్ళ మీద నిలబడాలనే తెగువ ఈ కథని జీవంతో తొణికిసలాడేలా చేసింది. ఇంకా ‘తీతువుపిట్టపాట’, ‘తారాజువ్వలు’, ‘తోలుబొమ్మలాట’ మన మీద గాఢమైన ముద్ర వేస్తాయి.

“ప్రభుత్వం పురమాయించిందని పద్యం రాయలేను నేను… హృద్రక్తం ఉప్పొంగి రాస్తున్నాను. అంతరాత్మ శాసనాన్ని అంగీకరిస్తున్నాను. ఇది నా విధి, నా ధర్మం నిర్వహిస్తున్నాను”. అని రష్యన్ మహాకవి ‘మయకోవ్ స్కీ’ అన్నట్టుగా కూనపరాజు కుమార్ ఒక బాధ్యతతో రాసిన ఈ కథల వెనక సృజనాత్మక సంగీతం వినగలగాలి.

ఒక యువతి జీవన విషాదాన్ని శక్తిమంతంగా రాసిన కథ ‘మేపుల్ ఆకులు’. కథ చివరలో ఒక గొప్ప ఆశని చిగురింప జేస్తూ, “చేదు జ్ఞాపకాలను ఆకులుగా రాల్చి కొత్త ఆశలను ఆకులుగా తొడుక్కోవడం చేస్తూనే వుండాలేమో బహుశా” అంటాడు రచయిత. ఒక జీవిత సత్యాన్ని ఇంత అలవోకగా చెప్పగల పరిణితి సాధించినవాడు కుమార్.

“చెట్లునాటిన మనిషి” అనే ప్రపంచ ప్రఖ్యాత కథని రచయిత ‘జాజియానో’ ఈ మాటలతో ప్రారంభించాడు- “మానవ ప్రవర్తన యొక్క అరుదైన సుగుణాలు వెల్లడి కావాలంటే దాని పనితీరును అనేక ఏళ్ళపాటు పరిశీలించే అదృష్టం వుండాలి. ఈ పనితీరు ఏ మాత్రం అహంకారం లేనిదైనట్లయితే, దీనికి ప్రేరణ అసమానమైన ఔదార్యం అయినట్లయితే, వీటన్నిటికీ తోడు ఇది ఈ భూమి మీద తన ప్రత్యక్ష ముద్ర వేసినట్లయితే అప్పుడు పొరపాటనేది ఉండజాలదు”. ఈ మాటలు కూనపరాజు కుమార్ కి సంబంధించి నూరుశాతం నిజం అన్నది నా ప్రత్యక్ష అనుభవం.

యీ కాలంలోనూ కూనపరాజు కుమార్ లాంటి ఒక నిండయిన మానవుడు నిజమైన సాహిత్యం కోసం నిలబడి వుండడంలోని నిలువెత్తు నిజాయితీకి నేను నమస్కరిస్తున్నాను.

టాల్ స్టాయ్ 190వ జన్మదినం జరిపాక, ఫ్యోదర్ దోస్తయేవ్ స్కీ 200వ పుట్టినరోజు ఘనంగా జరపడానికి కుమార్ తాపత్రయం చూశాను. ఘనంగా అంటే శాలూవాలూ, పూలదండలూ, పార్టీలు కావు. ఏకంగా బృహత్తర నవల ‘బ్రదర్స్ కరమజోవ్’ నే అరుణాప్రసాద్ గారితో అనువాదం చేయించాడు. ‘భార్య చాటు మనిషి’(దాసరి అమరేంద్ర), దాస్తోయేవస్కీ కథలు (అరిపిరాల సత్యప్రసాద్)అనువాదం అయ్యేదాకా వూరుకోలేదు. మధురాంతకం నరేంద్ర తిరుపతి నించి వచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో దాస్తోయేవస్కీ 200వ జయంతి సభ చిరస్మరణీయం. శ్రీకాకుళం నుంచి అరుణా ప్రసాద్ వచ్చారు. సభ మొత్తం ఖర్చు ఎంత అయింతో నాకు తెలుసు. ఇది నా కనీస ధర్మం అనుకొని చేశాడు కుమార్.

ఇవి రియల్ ఎస్టేట్ రోజులు, పాడుకాలం. కథనో,కవిత్వాన్నో చదివే దిక్కు లేదు… అని మనం దిగులు పడుతున్న, డబ్బెక్కి కొట్టుకుంటున్న యీ కాలంలోనూ కూనపరాజు కుమార్ లాంటి ఒక నిండయిన మానవుడు నిజమైన సాహిత్యం కోసం నిలబడి వుండడంలోని నిలువెత్తు నిజాయితీకి నేను నమస్కరిస్తున్నాను.

 తాడి ప్రకాష్ గారు సీనియర్ జర్నలిస్ట్. పెద్దగా ప్రచారం ఇష్టపడరు. కానీ వెలుగులు పంచె పాత్రికేయ లోకమనే దీపం కింద నీడ వంటి కలం తనది. అప్పుడప్పుడు ఇలాంటి వ్యాసాలతో మన చుట్టూ ఉన్న రోడ్లనే కాదు, వీదులనూ, నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళే అందలి అద్భుత మనుషుల పరిచయాలను తమ అక్షరాలతో వెలుగిస్తారు. ఇటీవలే వారి ‘ఏలూరు రోడు ఆత్మగీతం’ అన్న పుస్తకం ఇలాంటి అద్భుత పరిచయ వ్యాసాలతో విడుదలైంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article