చరిత్రకు చిత్తుప్రతిగా ఉండే పాత్రికేయాన్ని Literature in Hurry అన్నారు. కానీ పాత్రికేయుడు వార్తలో, వార్తా కథనంలో దాని శీర్షికలో కూర్పులో తప్పక ఉంటాడు. అతడే ఆత్మ.
ఆ వార్తా లేదా కథానానికి ముందూ వెనకా తానే సాక్షి, రచయిత. అంతటి విశిష్థత ఉన్న పాత్రికేయ ప్రపంచంలో జర్నలిస్టులు స్వయం ప్రకాశకులు కాదనే అందరూ అనుకుంటారు. వార్తతోనే జగము వెలుగు… విరియు…వర్ధిల్లు అనే అనుకుంటారు. కానీ పాత్రికేయుడే వార్త, కథనం. చరిత్రకారుడు.
ఇలా అనగలిగే స్థాయిలో గొప్ప కృషి చేసిన అతికొద్దిమంది తెలుగు పాత్రికేయుల్లో తాడి ప్రకాష్ గారు ఒకరు. నేడు విజయవాడలో విడుదలవుతున్న ‘ఏలూరు రోడు ఆత్మగీతం’ అందుకు దాఖలా.
అ పుస్తకం గురించి ఆత్మీయంగా వారు నాలుగు ముక్కలు రాశారు. అది చదవమంటూ అభినందనలు తెలుపు. శుభాకాంక్షలు పంచు.
“కొన్ని జ్ఞాపకాలివి. కలలూ, కలవరింతలూ కలిసి నడిచిన రోజులవి.
గులాబీ పూల రేకులు కొన్ని, కన్నీటి బిందువులు మరికొన్ని. ఏలూరు రోడ్డులో రాత్రిపూట చెట్ల కింద కరిగిపోయిన నాటి వెన్నెల నీడలు. వీటిని ‘కొన్ని సందర్భాలలో కొందరు మనుషులు’ అన్నాడు రచయిత వెంకట్ శిద్ధారెడ్డి, జయకాంతన్ని గుర్తుచేస్తూ.
ఏలూరు రోడ్ ఆత్మగీతం. కదిలి వెళ్లిపోయిన కాలాన్ని జర్నలిస్టు కళ్లద్దాల్లోంచి చూడటమే ఈ పుస్తకం.
నాకు నచ్చినవీ, హృదయానికి బాగా దగ్గరగా వచ్చినవీ మాత్రమే రాయగలిగాను. వీటికో వరసా పద్దతీ ఏమీ ఉండదు. అప్పటికి ఏది గాఢంగా అనిపిస్తే అదే రాశాను. కవులూ, కథకులూ, కళాకారులూ, సినిమాలూ, సంఘటనలూ…. దేనిగురించి రాసినా కదిలి వెళ్లిపోయిన కాలాన్ని జర్నలిస్టు కళ్లద్దాల్లోంచి చూడటమే! కోపం వస్తే తిట్టి పడేయటం, ప్రేమ పొంగిపొర్లితే కావలించుకుని కన్నీళ్లు పెట్టుకోవడం మనందరి బలహీనత.
నా యీ బలమైన బలహీనతని మెచ్చుకోవడంలోనే మీ ఔన్నత్యం దాగి ఉందని గుర్తించే ఔదార్యం ఉంది నాకు.”
ఈ ఉదయం అంటే 9 జనవరి 2022 న విజయవాడలోని ఠాగూర్ గ్రంధాలయంలో ఆవిష్కరణ.
పుస్తక వెల : 250. ఈ లింక్ క్లిక్ చేసి amazon ద్వారా తెప్పించుకోవచ్చు.
ఇది అన్విక్షికి ప్రచురణ.