తెలుగు ప్రేక్షకులు, శ్రోతలకు అమావాస్య ‘సిరివెన్నెల’ అస్తమయం. వారి అంతిమ సంస్కారానికి తివిక్రమ్ పలికిన సెల్యూట్ ని మించిన నివాళి లేదు.
ఆ కవి పండితుల అస్తమయం సందర్భంగా గుండెల నిండా వారి స్మృతిని పొదువుకుని మనసారా బాధ పడటానికి నేడు వారికి గొప్పగా కడపటి వీడ్కోలు పలకాలి. అందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పదేళ్ళ క్రితం పేర్కొన్న మాటలను మించిన నివాళి లేదనే తెలుపు భావిస్తున్నది.
ఈ లింక్ క్లిక్ చేసి ఆరు నిమిషాల పదకొండు సెకండ్ల ఆ అపురూప ప్రసంగం వినగలరు.
ఒక వెళ్లిపోవాలి…
‘రెండు జేబుల్లో చేతుల్లో పెట్టుకొని నడిచిపోవడం’ అన్న మాట తర్వాత బాగా ప్రాచుర్యంలోకి రావడం తెలిసిందే. అది సరగాదాగా మారిపోవడమూ …పలువురు తమాషాగా ఉటంకించడం మీరు ఎరిగినదే. ఐతే, త్రివిక్రమ్ అలా చెప్పిన సందర్భం సిరివెన్నెల గురించి చెప్పిన సందర్భమే అని చాలా మందికి తెలియదు. ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్ర మందమా’ అన్న వారి మాట. ఆ మాట విన్నాక ఎవరైనా నిర్లిప్తంగా తనని తాను మైమరచి ఒకానొక ప్రపంచంలోకి నిస్పృహతో నడిచి వెళ్ళడం అన్నది వారి అసలు నిగూడార్థం.
విశేషం ఏమిటంటే త్రివిక్రమ్ ఈ మాటలు చెబుతున్నప్పుడు సిరివెన్నెల గారు సభలో ఆశీనులై ఉన్నారు. ‘సిరివెన్నెల’ గా వీరి సినీ ప్రవేశానికి కారణమైన కళా తపస్వి కె. విశ్వనాధ్ గారూ ఈ వీడియోలో కనిపిస్తారు.
శ్రీశ్రీ కి చలం, సిరివెన్నెలకు వీరు…
నిజానికి సిరివెన్నెల గురించి ఇంత గొప్పగా చెప్పిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. చెప్పాలంటే శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం యోగ్యతా పత్రం తర్వాత ఆధునిక సినీ పాటల రచయిత గురించి తివిక్రం ఇచ్చిన ఈ కితాబు ప్రేక్షకుల నుంచి అందిన అత్యుత్తమ ప్రశంసగా పేర్కొనవచ్చు. నిజానికి త్రివిక్రమ్ ఒక దర్శకుడిగా, మాటల రచయితగా కాకుండా ఒక సగటు ప్రేక్షకుడిగా, సాహిత్య అభిమానంగా ఈ మాటలు పంచుకోవడం వల్లే ఇలా పోల్చి చెప్పడం. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవిగా అయన కొనియాడటం గొప్పగా ఉంది.
అర్థరాత్రి సూర్యుడు…
త్రివిక్రం అంటారు, ఒక ఇరుకు సందుల్లో కురిసిన సిరి వెన్నెల అయన అని. అయన గురించి ఇంకా ఇలా అంటారు…హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్ధం లేని తనం, నిర్మాతల తాలూకు వ్యాపార విలువలు, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేని తనం, వీటన్నిటి మధ్యలో కూడా ఒక గొప్ప పాటను ఇవ్వడానికి రాత్రుళ్ళు, టేబుల్ మీద, ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు, అయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన ఒడులుకున్న కుటుంబం, అయన మాట్లాడలేని మనుషులు… ప్రపంచమంతా పడుకున్న తర్వాత అయన లేస్తాడు…అయన రాత్రి ఉదయించే సూర్యుడు, అని.
ఈ మాటలు వింటూ సిరివెన్నెల తల పంకించడం ఒక గొప్ప దృశ్యం, అనుభవం. ( వీడియో కోసం ఈ లింక్ చూడండి). వారికివే కన్నీటి నివాళులు తెలుపు.