Editorial

Monday, December 23, 2024
విశ్వ భాష‌Language of the Universe : పున్నమి వెన్నెల తెలుపు

Language of the Universe : పున్నమి వెన్నెల తెలుపు

సూర్యాస్తమయం తరువాత చంద్రోదయంతో వెన్నెల ప్రారంభమవుతుంది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కనులారా చూడవలసిందే. మనసారా ఆస్వాదించవలసిందే. ఐనా తెలుపు ప్రయత్నం ఒక సందర్భం.

రాత్రిల్లు చంద్రుడి చల్లని వెలుగే ‘వెన్నెల’.

వెన్నెలే ‘చంద్రకాంతి’.

పగటిపూట చంద్రుడు వెన్నెల కురిపించినప్పటికి సూరీడి వెలుతురు ఎక్కువగా ఉండటం వల్ల ఆ  చంద్రకాంతిని మనం గుర్తించలేం. అందుకే చంద్రుడు రాత్రులందు కురిపించే కాంతినే ‘వెన్నెల’ అంటాం.

చంద్రుని నుంచి వెలువడే చంద్రకాంతి శుక్లపక్షంలో రోజు రోజుకు పెరుగుతూ, కృష్ణపక్షంలో రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది.

పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా వెన్నెల కురిపిస్తాడు. అందుకే పున్నమి చంద్రుడిని ‘నిండు చంద్రుడు’ అని కూడా అంటాం. ఆ రోజు పిండార బోసినట్లే వెన్నెల!

వెన్నెల తెల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఇది లోకానికి తెలిసిన నిజం. వెన్నెల తెల్లగా ఉండి మెరవడమే వెండివెన్నెల. అది కవులు వాడే ప్రయోగం.

చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను చందమామ అని పిలుచుకుంటాం. ఇదీ అంతే.

నిజానికి చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. చంద్రకళలలో మార్పులకు కారణం అదే. సూర్యుని నుంచి పొందిన వెలుతురును బట్టి వెన్నెలలో హెచ్చు తగ్గులుంటాయి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా వెన్నెలలో మార్పులు…వాటిని మొత్తం పదహారు కళలుగా చేబుతారు.

చంద్రుని పదహారు కళలు ఇవి…

1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ.

15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి, పూర్తి అమావాస్య ఘడియలు స్వల్ప సమయమే ఉంటాయి కాబట్టి.

ఈ తిథులేమిటి అంటారా?

సూర్య చంద్రుల మద్య దూరాన్ని తిధి అంటారు. చంద్రుడు సూర్యుడిని దాటి 12° నడచిన ఒక తిధి అవుతుంది. దీన్ని శుక్లపక్ష పాడ్యమి అంటారు. చంద్రుడు సూర్యున్ని దాటి 180° నుండి 360° వరకు నడుచే కాలం కృష్ణ పక్షం. ఒక నెలలో శుక్ల పక్షం, కృష్ణ పక్షం అను రెండు భాగాలుగా చెబుతారు. శుక్ల పక్షంలో 15 తిధులు, కృష్ణ పక్షంలో 15 తిధులు ఉంటాయి. శుక్ల పక్షం లో 15 తిధి పూర్ణిమ, కృష్ణ పక్షంలో 15 వ తిధి అమావాస్యగా ఎంచుతారు.

చంద్రుడు దేవతలందరిలోకీ అందగాడని, చల్లని వాడనీ, పదునాలుగు లోకాల వారికీ ఇష్టుడనీ చెబుతారు. ఐతే చంద్రుడి క్షీణించడం వెనుక ఒక గాథ ప్రాచుర్యంలో ఉన్నది. అది మీకు తెలిసే ఉంటుంది గానీ ఇక్కడ సందర్భానుసారం కాబట్టి వివరంగా ఆ కథ..

ప్రాచుర్యంలో ఉన్న గాథ

అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు దక్షప్రజాపతి కుమార్తెలు. వాళ్లందరూ అందగత్తెలే. వారిని దక్షుడు చంద్రుడికిచ్చి వివాహం కావించాడట. చంద్రుడు వాళ్లందరినీ అనురాగంతోనే చూశాడు. కానీ, రోహిణిపైన మాత్రం కొంచెం ఎక్కువ ప్రేమ కనబరుస్తాడట. అది చూసి మిగతా వారు అసూయ చెంది, లోలోపల కుమలి పోయారట. అంతేకాదు, వారందరూ కలిసి పుట్టింటికి వెళ్లి తమ విచారాన్నితండ్రితో చెప్పుకొని కంటనీరు పెట్టుకున్నారట.

దక్షుడు వారి పట్ల జాలిపడి, చంద్రుణ్ని తన ఇంటికి పిలిచి తన కుమార్తెలందరిపట్ల సమానమైన ఆదరం కనబరచవలసిందని హితవు చెప్పి పంపాడట. కానీ చంద్రుడు తన పక్షపాతాన్ని మానుకోలేకపోయాడని అంటారు.

దీంతో దక్షుడు ఆగ్రహం చెంది, అల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపించాడట. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయిందట. లతలు, వృక్షాలు వాడిపోయాయట. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయట. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారట.

లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారట. బ్రహ్మ చంద్రుడితో, ‘సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు’ అన్నాడట.

చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, ‘వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు’ అని వరమిచ్చాడు.
ఇలా ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయని ఈ కథని పెద్దలు చెబుతారు.

శాస్త్రీయ కారణం ఇది…

భూమిపై అర్ధగోళంలో ఎప్పుడూ సూర్యకాంతి ప్రసిరించినట్లే, చంద్రుని అర్ధగోళంపై కూడా సూర్యకాంతి సతతం ప్రసరిస్తునే వుంటుంది. ఒక్క చంద్రగ్రహణం సమయంలో తప్పించి!

చంద్రకాంతి హెచ్చు తగ్గులుగా మారడానికి శాస్త్రీయ కారణం, భూమి చుట్టూ చంద్రుని భ్రమణకాలం.
భూమి తన చుట్టూ తాను తిరుగేందుకు పట్టేకాలం, సూర్యుని చుట్టూ భూమి తిరుగెందుకు గల భ్రమణ కాలం, వీటి వ్యాత్యాసాల వల్ల చంద్రకళలలో తేడాలు, అమవాస్య, పూర్ణిమలు ఏర్పడుతాయి.

ఉదాహరణకు పున్నమి రోజు సూర్యుడు పడమట వున్నప్పుడు, చంద్రుడు తూర్పున ఉంటాడు. అందుచేత సూర్యకాంతి పడు చంద్రుని అర్ధగోళము సంపూర్ణంగా కనిపిస్తుందని చెబుతారు. అమవాస్య రోజున సూర్యచంద్రులు పడమటి దిక్కునే వుండటం వలన చంద్రకాంతి అస్సలు కనిపించదు.

చంద్రగ్రహణం పౌర్ణమి రోజే వస్తుంది…

నిజానికి చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుని వ్యాసం 2159 మైళ్ళు. ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్ర మండలంపై వాతావరణం లేదంటారు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయని చెబుతారు.

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉండే మనకు చంద్రుడు కనిపించడు. దీన్ని ‘చంద్ర గ్రహణం’ అంటాం. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడే జరుగుతుందట.

చంద్రుడి వల్లే ఆటు పోట్లు

సృష్టిలోని వస్తువులన్నీ ఒకదాని కొకటి ఆకర్షించుకుంటూనే ఉంటాయి. సూర్యుడి ఆకర్షణ శక్తి వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే, భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమితో పోల్చుకుంటే చంద్రుని పరిమాణం చిన్నదైనా దాని ఆకర్షణ శక్తి భూమి మీద ప్రభావం చూపుతుందని చెబుతారు. అలా చంద్రుడు కలిగించే గురుత్వాకర్షణ శక్తికి ఉదాహరణే- సముద్రంలో ఏర్పడే ఆటుపోటులు.

సముద్రతీరంలో ఉన్న వాళ్లకు ఒక రోజులో రెండు సార్లు ఆటు (Low Tide), రెండు సార్లు పోటు (High Tide) వస్తుందని తెలుస్తుంది. సముద్రపు నీరు నెమ్మదిగా ఆరు గంటల సేపు పైకి దూసుకు రావడమే ‘పోటు’. తర్వాత ఆరుగంటల పాటు ఆ నీరంతా వెనక్కి తగ్గడమే ‘ఆటు’. పౌర్ణమికి, అమావాస్యకు ఈ పరిమాణం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయాల్లో సూర్యుడు, భూమి, చంద్రుడు ఓకే సరళరేఖలోకి వస్తారు. అందువల్ల సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలాలు రెండూ కలిసి భూమిపై పని చేస్తాయి.

వెన్నెల పారాయణం

జాతకరీత్యా చంద్రుడు మనః కారకుడని అంటారు. పౌర్ణమి నాడు అలలు ఎలాగైతే ఉవ్వెత్తున ఎగసిపడతాయో, మనసు కూడా అంతే ఉత్తేజితంగా ఉంటుందని చెబుతారు. ఐతే, ఆ ఆలోచనల మీద అదుపు లేకపోతే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అదే ఆలోచనలను నియంత్రించుకోగలిగితే శక్తివంతమైన ధారణ ఏర్పడుతుందనే చెబుతారు.

ఇందువల్లే పౌర్ణమినాడు తప్పకుండా ధ్యానం చేయాలని పెద్దలు చెబుతారు. పౌర్ణమి ప్రభావాన్ని మరింత దైవికంగా మార్చుకునేందుకు ‘లలిత సహస్రనామం’ పారాయణం చేయాలని కూడా చేబుతారు. దీన్నే ‘వెన్నెల పారాయణం’ అని కూడా అంటారు.

వెన్నెల పారాయణానికి రాత్రివేళ కాచిన పాలల్లో యాలకుల పొడి, చక్కెర వేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ పాలల్లో చంద్రుడిని చూస్తూ తొమ్మిదిసార్లు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయాలంటారు.

ఒకోసారి మనకు చంద్రుడు కనిపించకపోవచ్చు. వర్షం, మబ్బులు కారణంగా చంద్రుడిని చూడలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాలో పళ్లెంలోకి ఒక తమలపాకు తీసుకుని, అందులో గంధాన్ని అద్దిన రూపాయి బిళ్లను ఉంచాలి. ఇక్కడ గంధం అద్దిన రూపాయే చంద్రుడిగా భావించడం అన్నమాట.

పౌర్ణమి రోజున ప్రత్యేకించి లలిత సహస్రనామాన్ని చదవడానికి కారణం లలితాదేవిని ఈ సృష్టికే మాతృస్వరూపంగా భావించడమే. సృష్టి, స్థితి, లయలను నియంత్రించే త్రిపురసుందరిగా నమ్ముడం వల్లే.

ఇక పారాయణం పూర్తయిన తర్వాత గిన్నెలోని పాలని ఇంటిల్లపాదీ తాగాలనీ, రూపాయికాసు మీద రాసిన గంధాన్ని ఉదరానికి రాసుకుంటే చలవ చేస్తుందని పెద్దలు చెబుతారు.

నెలవంక

మహ్మదీయుల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్‌ అవతరించిన మాసం రంజాన్‌ గా చెబుతారు. చంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం తొమ్మిదో నెలలో ఆ పండుగ వస్తుంది. నెలవంక కనిపించిన మరుసటి దినంతో రంజాన్‌ మాసం ప్రారంభమవుతుంది.

 

కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమి హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం అంటారు. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉందని వేదాలు, పురాణాలు చెబుతాయి. ‘శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావడం చేత మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని అంటారు.

చంద్రుడి పర్యాయ పదాలు

నిశాకరుడు, నెలవంక, ఇంద్రుడు, శశాంకుడు, సుధాకరుడు, శశి, శీత భానుడు, రజనీ.

వెన్నెల నానార్థాలు

వెన్నెలను ‘కౌముది’ అని కూడా అంటాం. దీనర్థం, రాత్రివేళలో చంద్రుని వలన కలుగు ప్రకాశం.

“జలతారు వెన్నెల” అంటే?

చంద్రుడి వెన్నెల నీటిపై పడ్డప్పుడు దాని పరివర్తనని ‘జలతారు వెన్నెల’ అంటారు.

కొండలపై నుండి ప్రవాహం కింద జారుతున్న సమయంలో ఆ నీటి ప్రవాహం సూర్యుని కాంతులు, వెన్నెల కాంతులతో పోటీ పడి మెరవడాన్ని బట్టి ఇలాంటి భావవ్యక్తీకరణ వచ్చిందని కూడా అంటారు.

జాబిలి మీది సంతకం

‘కార్తీకమాసపు రాత్రివేళ/ కావాలనే మేలుకున్నాను/ చల్లని తెల్లని వెన్నెల/ అంతటా పడుతోంది/ మెత్తని పుత్తడి వెన్నెల/ భూమి ఒంటిని హత్తుకుంది’ అంటాడు తిలక్‌.

‘శరశ్చంద్ర చంద్రికా ధవళం మహీషం దధీ’ అన్నాడట కాళిదాసు. అంటే… శరశత్కాలం వెన్నెల తెల్లనైన చిక్కటి పెరుగు వలే వున్నదని దీని అర్థం. శరత్కాల గగనంలో చందమామను చూస్తూ… ‘శరచ్చంద్రిక’ అంటూ ఓ దీర్ఘ కవితనే రాసేశాడు మహాకవి శ్రీశ్రీ. పూర్ణ చంద్రుడి తెల్లని వెన్నెల… ఆ సముద్రపు అలలపై తేలియాడుతుటే, సముద్రం తెల్లగా మెరిసిపోతుంది. దీన్నే ‘జాబిల్లి సముద్రం మీద సంతకం చేయడం’ అని కూడా శ్రీశ్రీ చమత్కరిస్తాడు. కార్తీకంలో వెన్నెల బావుంటుందని చెబుతూ, వెన్నెల మానవ సంబంధాలను మెరుగుపరుస్తుందని… ‘వన భోజనాలూ-మానవ సంబంధాలూ’ అనే వ్యాసంలో ప్రముఖ రచయిత శ్రీరమణ అంటారు.

ఇక కావ్యాలలో వెన్నెల ప్రస్తావనలు ఎన్నో. ఎర్రన నృసింహ పురాణంలో అద్భుతంగా వర్ణిస్తారు.

ఇక గోరటి వెంకన్న పాట మరవరాదు. పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన అటూ రాశారాయన.

పాటల్లో వెన్నెల

సాహిత్యంలోనే కాదు, తెలుగు పాటల్లో వెన్నెల అపురూపగా హత్తుకున్నదే కదా.

పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహాలకే కన్నులుంటే (పూజా ఫలం), నవమి నాటి వెన్నెల నేను…దశమి నాటి జాబిలి నీవు (శివరంజని), ఓ జాబిలీ…వెన్నెలా ఆకాశం…ఉన్నదే నీకోసం…(రంగూన్ రౌడి ), వెన్నెలవే వెన్నెలవే (మెరుపు కలలు), వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే (ప్రేమదేశం), చల్లని వెన్నెలలో (సంతానం), సన్నగ వీచే…(గుండమ్మ కథ)….ఇంకా ఎన్నెన్నో…

ప్రతి పౌర్ణమికి తెలుపు

ప్రతి పౌర్ణమికి ‘తెలుపు’ చల్లటి చందమామ గురించి, హృదయాలను ఉప్పొంగించే వెన్నెల గురించి ప్రచురిస్తుంది. మీరు తెలుపోచ్చు.

కవితలు, పాటలు, కథనాలు పంపవలసిన మెయిల్ ఇది… teluputv@gmail.com

అన్నట్టు ఈ రోజు ప్రచురించిన బాలగంగాధర తిలక్ కవిత కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. అలాగే దాశరథి పాట ‘చిన్ని మల్లె పూవులో…పున్నమి జాబిల్లిలో’ ఇది క్లిక్ చేసి వినండి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article