అగ్రనేత ఆర్కే మరణం గురించి పార్టీ ప్రకటన ఎలా ఉన్నా అయన మృతిని ‘విచారకరం’, ‘దురదృష్టకరం’ అని అనుకోలేం. అది ‘హత్య’ అనే చెప్పాలి. ఆర్కే మృత్యువు రాజ్యం చేతులకు అంటని రక్తపు మరక.
కందుకూరి రమేష్ బాబు
RK విషయంలో ఇది ‘రాజ్యం చేసిన హత్యే’ అన్న మాట బహుశా చాలా మోటుగా వినవస్తుంది. అన్నిటికీ అదే ఆరోపణా? అని అనుకోవచ్చు కూడా. కానీ, ‘అకస్మాత్తుగా’ కిడ్నీ సమస్యలు తలెత్తినప్పుడు ఎంతో జాగురూకతతో డయాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. బహుశా మంచి వైద్యం ఇప్పించామని పార్టీ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ నిత్య నిర్భంధం మధ్య ఆయనకు అత్యవసరమైన చికిత్స అసాధ్యం. అంతేకాదు, ప్రశాంతమైన వాతావరణం, అత్యున్నత వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటం కూడా అంత తేలిక కాదని అందరికీ తెలుసు. కానీ అయన మృతి చెందారు. అనారోగ్యంతో అని భావిస్తున్నాం. కానీ ఈ మృత్యువుని సామాన్యమైనదిగా చూడలేం. ముఖ్యంగా వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ముఖాముఖిగా కూచున్న మావోయిస్టు పార్టీ ప్రతినిధి తాను. పార్టీ తరపున చర్చల బృందానికి సారథి కూడా. అంతటి నేత ఇలా చికిత్స సమయంలో కుప్ప కూలడాన్ని అనారోగ్యంతో మరణించడంగానే భావించలేం. అతడి మృతి ‘విచారకరం’, ‘దురదృష్టకరం’ అని అనుకోలేం. అది ‘హత్య’ అనే చెప్పాలి.
“మరణించకుండా చూసుకునే అవకాశం ఉంటుంది…కానీ ఇలా కావడం దురదృష్టకరం”
పేరు ప్రస్తావన చేయలేము గానీ ఒక ముఖ్య నెఫ్రాలజిస్టును తెలుపు సంప్రదించి అభిప్రాయం అడుగగా “డయాలిసిస్ చేసే సమయంలో గుండె సంభంధమైన సమస్యలు సహజంగానే ఉత్పన్నం అవుతాయి. ఎంతో జాగ్రత్తగా మానిటర్ చేయవలసి ఉంటుంది. బహుశా వాళ్లకు మంచి ఆస్పత్రి, ఇంటెన్సివ కేర్ యూనిట్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు” అని అభిప్రాయపడ్డారు. “మరణించకుండా చూసుకునే అవకాశం ఉంటుంది…కానీ ఇలా కావడం దురదృష్టకరం” అని బాధ పడ్డారు. “Avoidable death .. unfortunate” అన్నారాయన.
కానీ ఇలా జరగడం అంటే అది ప్రభుత్వం పార్టీల మధ్య విఫలమైన చర్చలకు మరో దృష్టాంతంగానే భావించాలి.
నిజానికి విప్లవోద్యమం యాదృచ్చికం కాదు. మైదానంలో ఉండనీయని పరిస్థితుల్లోనే అడవి బాట పట్టడం ఒక అనివార్యం ప్రస్తానం అని తెలుసు. ఈ ప్రస్థానంలో ఎన్నో దశాబ్దాలను చూశాం. చివరాఖరికి ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్య కాదని అంగీకరించే స్థితి రావదాన్నీ చూశాం. చర్చలకు కూడా కూర్చోవడం ప్రపంచమంతా చూసింది. నాటి ఆ చర్చల ప్రతినిధి నేడు ఇలా మరణించడం అంటే, వారిని ప్రాణాపాయాన్నుంచి తప్పించాల్సిన అగత్యమూ ఉండిందనే అనుకోవాలి. కానీ ఇలా జరగడం అంటే అది ప్రభుత్వం పార్టీల మధ్య విఫలమైన చర్చలకు మరో దృష్టాంతంగానే భావించాలి. ఇలా ఎందరో అగ్ర నేతలను ప్రజలు, ప్రజా ఉద్యమాలు కోల్పవడం విషాదం మాత్రం కాదు, అది దుర్మార్గం.
“మంచి వైద్యం అందించినప్పటికీ”…అన్నారు గమనించాలి.
ఆర్కే మరణం గురించి మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేస్తూ ఇలా పేర్కొన్న విషయం చదివే వుంటారు… “ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య తలెత్తింది. వెంటనే డయాలసిస్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో మూత్రపిండాలు విఫలమై, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారు. మంచి వైద్యం అందించినా ఆయన్ను కాపాడుకోలేకపోయాం. ”
“మంచి వైద్యం అందించినప్పటికీ”…అన్నారు గమనించాలి.
నిజానికి నిర్భంధం అన్నది ఆరోగ్యాన్ని కాపాడుకోలేని నిస్సహాయ స్థితి కలిగించే మరో అణచివేత రూపమే. ఐతే, వారు ఇలా అనడానికి కారణం బహుశా తమ పొరబాటు ఏమీ లేదన్న అదుర్తాతో చెప్పిఉంటారు గానీ వారి మృతి రాజ్యం హత్యే అని భావించక తప్పదు.
అందుకే అనడం, ఆర్కే మృత్యువు రాజ్యం చేతులకు అంటని రక్తపు మరక. దాన్ని మనం చూడవలసి ఉంది.
“ మావోయిస్ట్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావడంతో.. ఆర్కే భార్య శిరీష కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ “అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేకు చికిత్స అందకుండా చుట్టుముట్టి.. ప్రభుత్వమే హత్య చేసింద”ని ఆరోపించారు. నిజానికి ఇలాంటి ఆరోపణ లేదా మాట పౌర సమాజం నుంచి బలంగా రావాలి.
ఆర్కే …అక్కిరాజు హరగోపాల్ గారు మామూలు మనిషి కాదు. ఎన్నో సార్లు ఎన్ కౌంటర్ ల నుంచి అయన తృటిలో తప్పించుకున్న ధీరుడు. రాజ్యానికి చిక్కకుండా ఆయన కాపాడుకున్నా ప్రాణం, ఉద్యమ జీవితం నేడు చిటికెలో పోవడం అంటే అది సాధారణమైన మృత్యువు కాదనే అర్థం. ఈ వార్తను పార్టీ ప్రకటించక ముందే అయన మరణ వార్తను ముందే మీడియాకు లీక్ చేసిన పోలీసులు, రాజ్యం ఇందుకు పెద్ద దోషిగా చూడవలసిందే.
అందుకే అనడం, ఆర్కే మృత్యువు రాజ్యం చేతులకు అంటని రక్తపు మరక. దాన్ని మనం చూడవలసి ఉంది.