Editorial

Wednesday, January 22, 2025
స్మరణజయంతిజాతి పిత : సార్ కి దక్కవలసిన గౌరవం ఇది

జాతి పిత : సార్ కి దక్కవలసిన గౌరవం ఇది

‘పుట్టుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది’’

కాళోజీ మాటలు సరిగ్గా వర్తించేది తెలంగాణలో జయశంకర్ సార్‌కే అంటే అతిశయోక్తి కాదు. అవును మరి. భిన్న పాయల్లో నడిచిన వారందరినీ ఏకం చేసి, స్వరాష్ట్ర గమ్యానికి చేరువ చేసిన దీర్ఘదర్శి ఆయన. తెలంగాణ సాధన ఆవశ్యకతను మొదట్నుంచీ నినదించిన నిఖార్సయిన తెలంగాణ వాది వారు. ఆగష్టు 6న వారి జయంతి సందర్భంగా వారిని ‘జాతిపిత’గా కొనియాడవలసిన ఆవశ్యకత తెలుపు నీరాజనం ఈ సంపాదకీయం.

కందుకూరి రమేష్ బాబు

ఒక విద్యార్థిగా, టీచర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా, వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తూనే తెలంగాణ రణన్నినాదాన్ని వినిపించిన పోరాటశీలి ఆయన. ఉద్యోగ విరమణానంతరం పూర్తికాలం తెలంగాణ కార్యకర్తగా పనిచేసి, మనదైన ఒక స్వీయ రాజకీయ అస్తిత్వానికి మనల్ని చేరువ చేసిన మహనీయులు ఆయన. రచనలు, ప్రసంగాలు, పరిశోధన – తెలంగాణ సాధనలో క్రియాశీలంగా ఉండే వ్యక్తులతో లోతైన చర్చలు జరపడం, ఉద్యమంలో భాగం చేయడం, అట్లా అవిశ్రాంత పథికుడిగా వారు పనిచేసిన ఫలితేమే నేడు తెలంగాణ రాష్ట్రం. అందుకే ఆయన రాష్ట్ర సాధనకు సంభంధించి తొలి ఉపాధ్యాయుడు, అనధికార జాతి పిత – జయశంకర్ సార్.

తెలంగాణ ఉద్యమ సమయంలో పరాంకుశం వేణుగోపాల్ స్వామీ అన్న పాత్రికేయు సోదరుడు ‘మన జాతి వేరు, మన నీతి వేరు’ అని రాశారు, తెలంగాణ తోవలు అన్న సాంస్కతిక సంస్థ ప్రచురించిన పుస్తకంలో. తెలంగాణా వారికి ఆంధ్ర ప్రజానీకానికి అసలు సౌమ్యం లేదని, సామరస్యం కుదరదని, ఇరువురువీ వేరు వేరు అస్తిత్వాలు అని నొక్కి చెబుతూ అట్లా రాశారాయన. నిజానికి జాతి అన్న పదంలో ప్రాంతీయ స్పృహ ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పాటై ఉన్నప్పుడు తెలంగాణా రాష్ట్రానికి జయశంకర్ సార్ ఒక జాతి పితగా పొందవలసిన గౌరవం పొందలేదనే చెప్పాలి. ఆ మేరకు ముఖ్యమంత్రి అ ప్రకటన చేయవలసిన అవసరం కూడా ఉన్నది.

ప్రస్తుతం ఆ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పాటై ఉన్నప్పుడు తెలంగాణా రాష్ట్రానికి జయశంకర్ సార్ ఒక జాతి పితగా పొందవలసిన గౌరవం పొందలేదనే చెప్పాలి. ఆ మేరకు ముఖ్యమంత్రి అ ప్రకటన చేయవలసిన అవసరం కూడా ఉన్నది.

1934 ఆగష్టు 6న హనుమకొండలో జన్మించిన జయశంకర్ సార్ 1952 నుంచి సాగుతున్న ఉద్యమం మూడు దశలకు సాక్షి. అప్పట్నుంచీ తుదిశ్వాస విడిచేదాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అన్నదే ఆయన ఏకైక ఎజెండా. తన ‘ఇంటరెస్ట్’ అంతవరకే అని ఆయనే అన్నారు. ఆ ఘడియ చివరి దాకా ఉండి వెళ్లిపోయారు. వారే అన్నట్టే తెలంగాణ పునర్నిర్మాణం అన్నదాంతో నిమిత్తం లేకుండా గనుక అయన గురించి మాట్లాడుకుంటే, తెలంగాణలో పొడిచే ప్రతి పొద్దునా ఆయనే ప్రాతఃస్మరణీయుడు.

ఒక విద్యార్థిగా 1952లో నాన్‌ముల్కీ ఉద్యమంలోకి ఉరికిండు. 54లో ఫజల్ అలీ కమీషన్‌ను కలిసిండు. 1968-71 ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిండు. 1996 నుంచి మళ్లీ మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నడు.

నిజానికి తెలంగాణ అనేక రకాల ప్రయోగశాల. ఇక్కడ జరగని ఉద్యమం లేదు. కానీ, తెలంగాణ ఒక తేల్చవలసిన అంశంగా మారడానికి కావలసిన భావజాల వ్యాప్తిలో ముందుండి, మరెందరికో స్ఫూర్తినిచ్చింది జయశంకర్ సారే. ఒక వ్యక్తిగా మనసా వాచా కర్మణా తెలంగాణే సర్వస్వంగా జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ ఉద్యమమే ప్రధాన ఇరుసుగా అన్ని శక్తులూ కదిలేలా వ్యవహరించిన ఛోదక శక్తి శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్. అందుకే ఆయన్ని జాతి పితగా స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. దాని వల్ల ఉద్యమ తెలంగాణ, అందలి కార్యశీలురకు తగిన గౌరవం లభిస్తుంది కూడా.

గమ్యాన్ని ముద్దాడేదాకా ఉద్యమాన్ని వీడేది లేదని కేసీఆర్ వంటివారు ఆత్మస్థయిర్యంతో చెప్పడానికి కావలసిన ప్రాతిపదికను సైద్ధాంతికంగా సమకూర్చింది ఆయనే.

నిజానికి విప్లవోద్యమం వల్ల సామాజిక అవగాహన పెంచుకుని, చైతన్యవంతమైన వాళ్లలో జయశంకర్ సార్ కూడా ఒకరు. అయితే, తక్షణ లక్ష్యం అయిన ‘భౌగోళిక తెలంగాణ’ సాధనకు పరిమితులతో కూడిన కార్యాచరణ అవసరం అని గ్రహించిన వాళ్లలో వారే ముఖ్యులు. పార్లమెంటరీ, ఉదారవాద రాజకీయాలు తెలంగాణ సాధనలో కీలకమని గుర్తించి, ఆ దిశగా ఎవరేమన్నా పట్టించుకోకుండా సానుకూల రాజకీయ ప్రక్రియ ఆవశ్యకతను గుర్తించి పనిచేశారు. ‘గమ్యాన్ని ముద్దాడేదాకా ఉద్యమాన్ని వీడేది లేదని కేసీఆర్ వంటివారు ఆత్మస్థయిర్యంతో చెప్పడానికి కావలసిన ప్రాతిపదికను సైద్ధాంతికంగా సమకూర్చింది ఆయనే. అందుకే రాజకీయ సాధనలో కేసీఆర్ ఎంత ముఖ్యమో సిద్దాంతిక స్థాయిలో జయశంకర్ సార్ అంతే ముఖ్యం. కానీ వారి పాత్రను సుస్థిరం చేసే ప్రయత్నాలేవీ సరిగా జరగలేదు.

‘‘.. నేను సిద్ధాంతకర్తని కాను. అలా అనుకోను. ఇంగ్లీషులో ‘ఐడియలాగ్’ అనే మాట పత్రికలు వాడేవి. తెలుగు అనువాదంగా పత్రికలూ అలాగే వాడాయి. అట్లా నేను సిద్దాంతవేత్తని అయ్యానుగానీ నేను అలా అనుకోను. చివరకు నన్ను ‘టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త’ను అని కూడా అన్నారు.. అది కూడా కాదు. నేను విశ్వసనీయత ఉన్నంతవరకూ, తెలంగాణ సాధనకు ఎవరు పనిచేసినా వారితో ఉన్నాను. నేను సిద్ధాంతకర్తను కాను, కార్యకర్తను, స్వచ్ఛంద కార్యకర్తను’’ అని అయన కొంపల్లి వెంకట్ గౌడ్ గ్రంధస్తం చేసిన ‘వొడవని ముచ్చట’ లో పేర్కొనడం గమనిస్తే వారి నిజాయితీ, వినమ్రత ఎంతటిదో గుర్తించవచ్చు.

ఇక్కడే మరో సంగతి. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక నమ్మకస్తుడైన, ప్రజలకు విధేయుడైన కార్యకర్తగా జీవించాడు. అట్లే మనపై చెరగని ముద్ర వేసి పోయాడు. ఆయన్ని అపార గౌరవంతో గుర్తు పెట్టుకోవలసిన తీరులో ప్రభుత్వమే కాదు, పౌర సమాజం కూడా ఎక్కడికక్కడ గుర్తు చేయవలసి ఉన్నది. ఇకముందైనా ఆ పని చేయవలసి ఉన్నది.

 తెలంగాణా రాష్ట్ర ఫలాలు ప్రజలపరం చేసే దిశలో వారిని ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంచుకోవలసిన అవసరమూ ఉన్నది. ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ప్రతి కార్యకర్త  జయశంకర్ సార్ నుంచి స్ఫూర్తి పొందడానికి అవకాశమూ ఉన్నది.

సహజంగా వారిది ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, తొణకని వ్యక్తిత్వం కూడా. ఉద్యమం ఒడిదుడుకులకు లోనైనప్పుడు భావోద్వేగాలకు లోనుకాని స్థితప్రజ్ఞత వారిది. ఈ ఉదాత్త వ్యక్తిత్వమే ఆయన్ని తెలంగాణ వాదిగా చివరి వరకూ నిలిపింది. అయితే, ఈ వ్యక్తిత్వం అన్నది పాదుకొనడం వెనుక చరిత్ర ఉన్నది. అది కొత్తగా చెప్పవలసినది కాదు. ఎంతో వివక్ష, మరెన్నో చేదు అనుభవాలు ఆయన్ని తెలంగాణ వాదిగా మలిచాయి. దానికి తోడు ఆయన వెనుకబడిన కులంలో పుట్టడం, వరంగల్‌లో జన్మించడం, ఆర్థిక శాస్త్రాన్ని చదువుకోవడం, వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా అవివాహితుడిగా జీవించడం, బోధనా రంగంలోనే జీవిత కాలం కృషి సల్పడం, విప్లవ రాజకీయాల చైతన్యాన్ని అందిపుచ్చుకోవడం, అదే సమయంలో మన సంస్కృతిని నిలు కాపాడుకోవడం, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్- ఈ మూడు భాషల్లో ప్రవీణులై ఉండి, గొప్పగా కమ్యూనికేట్ చేయగలగడం, సరళ సుబోధకంగా కలం పట్టి రాయగలగడం, వీటన్నిటివల్లా ఆయన ఎంచుకున్న కార్యశీలత చక్కగా వన్నెతేలింది. వాటి కారణంగా ఆయనకు మరింత వినయం, విధేయతా అబ్బాయి. నేను ‘కార్యకర్తను’ అనేంత గొప్పవాణ్ణి చేశాయి. ఇటువంటి కర్యశీలతే నేడు అవసరం ఉన్నది. తెలంగాణా రాష్ట్ర ఫలాలు ప్రజలపరం చేసే దిశలో వారిని ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంచుకోవలసిన అవసరమూ ఉన్నది. ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ప్రతి కార్యకర్త  జయశంకర్ సార్ నుంచి స్ఫూర్తి పొందడానికి అవకాశమూ ఉన్నది.

ఇట్లా తన ప్రతి కార్యాచరణ తెలంగాణకు ఎంతగానో ఉపకరించింది. అవన్నీ ప్రతి జయంతికి పెద్ద ఎత్తున చెబుతూ వారి స్మృతిలో తెలంగాణా పునర్ నిర్మాణానికి బీజాలు వేయవలసి ఉన్నది. అందుకు కూడా వారిని జాతి పితగా స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

తెలంగాణ సాధన విషయానికి వస్తే అయన ఒక చురుకైన ప్రశ్న. తన జీవితంలో ఆయన అనేక ప్రశ్నలు వేశాడు. వేయవలసిన వాళ్లకే వేశాడు. గణాంకాలతో సహా జవాబులూ చెప్పాడు. ముఖ్యంగా చంద్రబాబును ప్రశ్నించాడు. ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కూడా ‘టేకాఫ్’ అవుతున్నాయంటే, ‘టేకాఫ్’ అంటే పైకెగరడం కదా…కానీ జరుగుతున్నది అది కాదు, ‘మునుగుతున్నది’…అని గట్టిగానే చెప్పారాయన. ‘నేనూ ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. మీ ప్రభుత్వ లెక్కలే ఆ సంగతిని ధృవపరుస్తాయి’ అని మరుసటి రోజే బాబుకు వివరంగా రాశాడు. అలా, తాను ఎవరైతే తెలంగాణను ఒక ‘సమస్య’ అనుకుంటారో వాళ్లకు దాని లోతుపాతులను సులభంగా అర్థమయ్యేలా చెప్పాడు. ‘దగాపడ్డ తెలంగాణ’ గురించి రాయడం మొదలెట్టాడు.

మల్లేపల్లి లక్ష్మయ్య గారు ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్’ పేరిట 1997లో ప్రచురించిన సార్ ప్రసంగ పాఠం మెలమెల్లగా యావత్ తెలంగాణకు గొప్ప కరదీపికే అయింది. అనతికాలంలో అది ఆయుధంగా మారింది. ఈ పుస్తకాన్ని తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్రవాళ్లూ చదివి వాస్తవాలు గ్రహించే సౌలభ్యమూ కలిగింది. అయితే, 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆ  తర్వాత ఈ డిమాండ్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిందనే వాదనను ముందుకు తెచ్చింది. అప్పటికే రెండు మూడు ముద్రణలు పొందిన ఈ పుస్తకాన్ని మళ్లీ ఆ తరుణంలో పునర్ముద్రించారు. అది ఎంత మేలు చేసిందో మరొకసారి వివరంగా చర్చించాల్సి ఉంది. అలా, ఈ ఒక్క పుస్తకం చరిత్రలో తెచ్చిన విప్లవం తక్కువేమీ కాదు. ఇట్లా తన ప్రతి కార్యాచరణ తెలంగాణకు ఎంతగానో ఉపకరించింది. అవన్నీ ప్రతి జయంతికి పెద్ద ఎత్తున చెబుతూ వారి స్మృతిలో తెలంగాణా పునర్ నిర్మాణానికి బీజాలు వేయవలసి ఉన్నది. అందుకు కూడా వారిని జాతి పితగా స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

నిజానికి ‘జాతి పిత’ అన్న పదం ఆయనకు సరైన నివాళి. మలి తెలంగాణా ఉద్యమ కాలం నుంచి అంతటి గౌరవం అందుకో తగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారూ అంటే అది జయశంకర్ సారే. వారు ఉద్యమ పితామహులుగా ప్రతి ఒక్కరి మదిలో ఉండనైతే ఉన్నారు.

నిజానికి ‘జాతి పిత’ అన్న పదం ఆయనకు సరైన నివాళి. మలి తెలంగాణా ఉద్యమ కాలం నుంచి అంతటి గౌరవం అందుకో తగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారూ అంటే అది జయశంకర్ సారే. వారు ఉద్యమ పితామహులుగా ప్రతి ఒక్కరి మదిలో ఉండనైతే ఉన్నారు. అంతెందుకు, కేసీఆర్ వంటి నేతలకు కావలసిన ఆత్మవిశ్వాసాన్నీ ప్రోది చేసి, ఉద్యమ కార్యాచరణకు కావాల్సిన పరిశోధన అంతా గురుతర బాధ్యతగా నిర్వహించిన వ్యక్తి కూడా ఆయనే. అంతేకాదు, మలి తెలంగాణా దశను తెలంగాణ ఉద్యమ ‘పునరుద్ధరణ’ దశగా గనుక మనం మాట్లాడుకుంటే, దానికి ఆదినుంచీ జయశంకర్ సార్ ఉఛ్వాస నిశ్వాసాలుగానే ఉన్నారు. అందువల్లే జయశంకర్ సార్ జయంతిని ‘ఉద్యమ పితామహులు జయంతి’గా గుర్తించి జరుపుకోవడం సభ్యతా సంస్కారం…అది ఒక జాతికి మేలు కూడా.

1996 ఆగస్టు 15న ఆనాటి ప్రధాని దేవేగౌడ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ మూడు రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించడం, ఆ ఒక్కమాట తెలంగాణ వాదులను తట్టిలేపడం, దాని ఫలితమే అక్టోబర్ 27న నిజామాబాద్‌లో కొందరు సమావేశం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత నవంబర్ 1న వరంగల్‌లో విద్రోహదినం పేరిట సభ ఏర్పాటు…దానికి ఐదువేల మంది జనం రావడం..అక్కడ్నుంచీ మళ్లీ తెలంగాణ వాదన అన్నది మరింత స్థిరంగా, నిరాటంకంగా మొదలై తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణకు అంకురం వేయడం, అయితే నాటి వరంగల్ సభ జరిగిన మరునాడే చంద్రబాబు, ‘వేర్పాటు వాదాన్ని సహించను. ఉక్కుపాదంతో అణచివేస్తాను’ అంటే, ఆ సభ అనంతరం అనేక సమావేశాలు, సభలు జరిగాయి. ఇలా తాను ఆరంభించిన అగ్నికి చంద్రబాబే అజ్యం అవగా, ఆ వేడిని చల్లారకుండా కొనసాగేలా చేసిన వాళ్లలో జయశంకర్ సార్ కీలకం.

చెన్నారెడ్డి మొదలు కేసీఆర్ దాకా…తనను అడిగిన వాళ్లకు తన వంతు సహకారం అందించారు. అవసరమైన చోటల్లా కార్యకర్తగా కృషి చేశారు. అటువంటి మహనీయుడిని తిరుగులేని విధంగా గుర్తు చేసుకోవడానికి వారిని జాతి పితగా గుర్తించడం సరైన నివాళి అన్నదే నేటి సంపాదకీయం సందర్భం.

ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో చేరడానికి వచ్చినప్పుడు మొదలైన వివక్ష, తర్వాత్తర్వాత పెరిగింది. దాంతో పాటు ఆయనలోనూ తెలంగాణ వాది ఎదిగాడు. అయితే, 1996 తర్వాత జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో పూర్తికాలం నిమగ్నమయ్యారు. 2001 దాకా అనేక వేదికలతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా 1996-97లో తెలంగాణ భావజాల వ్యాప్తి విషయంలో నాన్ పొలిటికల్ గ్రూప్‌గా, అకాడమీషియన్స్‌తో కలిసి చాలా చేశారు. అనేక సమావేశాల్లో ప్రసంగిస్తూ, రచనలు చేస్తూ కీలకంగా ఉన్నారు. 1998-99లో అమెరికాలో తెలంగాణ యాక్టివిటీ పెరగడంతో అక్కడికీ వెళ్లారు. పది పట్టణాల్లో సమావేశాలు పెట్టారు. ఆయన స్ఫూర్తి ‘తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఏర్పాటుకూ మార్గం వేసింది. తర్వాత 2000 సంవత్సరంలో కాంగ్రెస్ వాళ్లు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసుకుంటే ఆయన్ను ఎమ్మెల్యేలు వాళ్ల తరఫున పిలిపించుకుని తెలంగాణ వాదన వినిపించేలా చేసుకున్నరు. రెండున్నర గంటల సేపు ఆయన అధికారికంగా వాదించారు. తర్వాతే కేసీఆర్ జయశంకర్ సార్‌ను కలిశారు. అలా చెన్నారెడ్డి మొదలు కేసీఆర్ దాకా…తనను అడిగిన వాళ్లకు తన వంతు సహకారం అందించారు. అవసరమైన చోటల్లా కార్యకర్తగా కృషి చేశారు. అటువంటి మహనీయుడిని తిరుగులేని విధంగా గుర్తు చేసుకోవడానికి వారిని జాతి పితగా గుర్తించడం సరైన నివాళి అన్నదే నేటి సంపాదకీయం సందర్భం.

శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదని అంటారు. అందుకే అన్ని తెలిసిన విజ్ఞులు కేసిఆర్ గారు. వారు జాతి నిర్మాత పాత్రకు పరిమితమైరేపు జయశంకర్ సార్ కి ఘనంగా నివాళి అర్పిస్తూ, సార్ ని ‘మన జాతి పిత’గా అభివర్ణిస్తే అది అన్ని విధాలా వారికీ, అందరికీ మంచిదని తెలుపడం అత్యాశ కాదనే అనుకుందాం.

టీఆర్‌ఎస్ వచ్చేదాకా ఒక బలమైన నిర్మాణంతో కూడిన పార్టీ అన్నది లేదు. అది వచ్చాక ఆయన కృషికి మరింత బలం చేకూరింది. అయితే ఆయన ఎన్నడూ ఏ పార్టీలోనూ చేరలేదు. టీఆర్‌ఎస్‌లోనూ సభ్యుడిగా చేరలేదు. ఎందుకంటే తానే అన్నట్టు తన పర్పస్ తెలంగాణ సాధనే. పదవులూ, హోదాలు, లబ్ధి పొందడమూ కాదు. చివరకు ఆయనపై ‘తెలంగాణ సిద్ధాంతకర్త’ అన్న పేరు నుంచి ‘టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త’ అన్న అపవాదు వచ్చినా తన పని మానలేదు. ‘కొందరు అన్నరు, నువ్వు టీఆర్‌ఎస్ లోపల్నుంచి బయటకు రావాలె’ అని! ‘నేను ఎప్పుడు లోపలున్న’ అని నవ్వే వారాయన. అంత మాత్రాన అయన్ని టీఆర్ ఎస్ పార్టీ గానే, ఆ పార్టీ ప్రభుత్వం గానీ నామ మాత్రంగా గుర్తించి వదిలేయడం ఒక ఉద్యమ పార్టీగా దానికి మంచిదైతే కాదు.

చివరగా ఒక మాట. శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదని అంటారు. అందుకే అన్ని తెలిసిన విజ్ఞులు కేసిఆర్ గారు. వారు జాతి నిర్మాత పాత్రకు పరిమితమై రేపు జయశంకర్ సార్ కి ఘనంగా నివాళి అర్పిస్తూ, సార్ ని ‘మన జాతి పిత’గా అభివర్ణిస్తే అది అన్ని విధాలా వారికీ, అందరికీ మంచిదని తెలుపడం అత్యాశ కాదనే అనుకుందాం.

 

More articles

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article