Editorial

Monday, December 23, 2024
వ్యాసాలుమనకాలం కాళోజీకి తెలుపు నివాళి

మనకాలం కాళోజీకి తెలుపు నివాళి

అతడొక సంబురం. వేడుక. బతుకమ్మ, దసరా పండుగ. పుస్తకం ఎత్తుకున్న బోనాలు.
ఆయన రాక ఒక ఉత్సవం. ఇప్పుడైతె తుపాను మిగిల్చిన ఆనవాలు.

కందుకూరి రమేష్ బాబు 

Kandukuri Ramesh Babu

తెలంగాణా ఒరవడిలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది మనం వోన్ చేసుకున్న కాళోజీలో కానవస్తుంది. అలాగే నిన్న ప్రపంచానికి మనల్ని వదిలి మరో వైపు ఒరిగిన నిజాం వెంకటేశం గారిలోనూ కనిపిస్తుంది.

అది గొడవ.

‘నా గొడవ’లో కాళోజీ ధ్వనించిన ధ్వనే నిజాం వెంకటేశం గారిది. ఆయనది నిత్య ప్రతిపక్షం లేదా గొడగొడ దుఖం అనుకుంటే వీరిది నిత్య సంబురం లేదా జీవన సెలయేరు. అది నిరంతర ప్రశంస, ప్రోత్సాహకరమైన అభినందనలో నిండుగా విలసిల్లింది. తలలో నాలికలా అది గడగడా చెప్పింది. అది మన గురించి. మనలోని మంచి గురించి మార్పు గురించి. కానీ ఒక ప్రక్రియలో ఇమడనందున అది సాహిత్యం కాలేదు గానీ అది సిరిసిల్ల జగిత్యాల పోరాటాలకు నాయకత్వం వహించిన వారి భుజం భుజం కలిపి నడిచిన త్రోవలో దాగి ఉన్నది. మలి తెలంగాణాలో అలిశెట్టి స్మృతిని పదిలం చేయడంలో ఉన్నది. అంతకు ముందరి ఉద్విగ్న తెలంగాణాలో అల్లం రాజయ్య కథలను వెల్లడి చేయడంలో ఉన్నది. వీరే కాదు, వేలాది కవులు, రచయితలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, ఆఖరికి కుడి ఎడమ అన్న భేదం లేకుండా ఆ త్రోవ అవిశ్రాంతంగా నడిచింది. నిన్న ఆ నడక నిచ్చలరూపు దాల్చింది. ఆగిపోయింది. అయిపోయింది. మన గొడవను నా గొడవగా చేసుకున్న మనిషి లేడిప్పుడు.

నిజానికి వ్యక్తులు సంస్థలుగా నడయాడిన నేల ఇది. ఆ వారసత్వం నిజాం వెంకటేశం గారిదని నేటి తరానికి గొప్పగా తెలియవలసి ఉన్నది. తెలంగాణా సాధించాక ఆ సంగతే మరుగున పడింది.

చాలాసార్లు సానుభూతి పరులుగానో మద్దతు పలికిన వాళ్ళు గానో లేదంటే వెనుక నడిచిన వాల్లుగానో కార్యకర్తలుగానో మనకు ప్రజలు కన్పిస్తారు. అటువంటి ప్రజల్లో ఒక ప్రజాకారుడు నిజాం వెంకటేశం. అయన మరణిస్తే ఒక కవి, రచయిత, సంపాదకుడు లేదా సృజన కారుడు కాలం చేశారని పేర్కొనడం ఎంతో మందికి కొంచెం కష్టమే అయింది. వారు కొన్ని రచనలు చేసినా అవి అనువాదాలే కావడం వల్ల లేదా అనేక పుస్తకాలు వేసినా అది ప్రచురణకర్తగా ఉండిపోవడం వల్ల… లేదా ఆ విషయం నలుగురికీ తెలియనీయకుండా అజ్ఞాతంగా ఉండటం వల్ల మాత్రమే జరగలేదు. ఆయనకు తాను వెల్లడి కావడం కన్నా ఇతరులు ప్రఖ్యాతిలోకి రావడమే ఇష్టం. అందుకే అతడి గురించిన వార్త అస్పష్ట స్పష్టంగా నమోదైంది. నిజానికి ఇదే నిజం. అదే తెలంగాణా స్వాభావిక సంస్కృతి.

పని జరగడం, ఆ పనికి వెన్నుదన్నుగా నిలవడం అతడికి ఇష్టం.పేరు, ప్రఖ్యాతి, హోదా, గౌరవం కోసమే పని చేయకుండా – తన అహాన్ని తనలో నిద్ర లేవ్వకుండా చూసుకోవడంలో ఆయన ప్రజ్ఞ ఉన్నది. అది వారు ఆచరించిన సంస్కారం. తన సాహిత్య వ్యక్తిత్వం ఇదే అని చెప్పాలి.

అదే ఇక్కడి ప్రజల శైలి. అ శైలిలో మేరు పర్వతం వంటి వారు నిజాం వెంకటేశం గారు. తన మిత్రులంతా పొందిన గౌరవం, పేరు తనదే అనుకున్న ఆ అభిమాని నేడు లేకపోవడం అంటే ఆ లోటు కొద్దిమందికో లేదా అనేక మంది మనుషులకో కాదు, అది మొత్తం తెలంగాణకే లోటు. వారికి నివాళి అర్పించడం అంటే ఒక కడపటి మనిషిని స్మరించుకోవడమే. నిస్వార్థంగా పరుల అభ్యున్నతి కాంక్షించే ధోరణిలో మిగిలిన చిట్ట చివరి మనిషి సంస్కరణ వంటిదే అంటే అతిశయోక్తి కాదు.

నిజానికి వ్యక్తులు సంస్థలుగా నడయాడిన నేల ఇది. ఆ వారసత్వం నిజాం వెంకటేశం గారిదని నేటి తరానికి గొప్పగా తెలియవలసి ఉన్నది. తెలంగాణా సాధించాక ఆ సంగతే మరుగున పడింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ తమ సంతాపంలో పేర్కొన్నట్టు అయన పేదవారికి వెన్ను దన్నుగా నిలవలేదు, సమస్త సారస్వత మిత్రులకూ అండదండగా ఉన్నారు. అయన నడిచే గ్రంథాలయం కాదు, ఎందరి ఇండ్లనో తన పుస్తకాలతో గ్రంధాలయంగా మార్చిన మనీషి.

అయన ఒక్కడిగా ప్రయాణించింది ఎప్పుడూ లేదు. ఎన్నడూ ఒక్క పుస్తకం కొన్న చరిత్రా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒక బృందంగా వెళ్ళవలసిందే. కొంటే ఒకటి కాదు, పది పుస్తకాలకు తక్కువ కొన్నదీ లేదు. అనేక సార్లు వంద పుస్తకాలను కొని వాటిని అభిరుచిగల పాఠకులకు కాదు, చక్కగా సాధన చేస్తున్న కవులు, రచయితలకు ఇచ్చి వారిని ఎడ్యుకేట్ చేసిన నాయకుడు వారు. గొప్ప సారస్వత దార్శానికత వారిది. ముఖ్యమంత్రి కెసిఆర్ తమ సంతాపంలో పేర్కొన్నట్టు అయన పేదవారికి వెన్ను దన్నుగా నిలవలేదు, సమస్త సారస్వత మిత్రులకూ అండదండగా ఉన్నారు. అయన నడిచే గ్రంథాలయం కాదు, ఎందరి ఇండ్లనో తన పుస్తకాలతో గ్రంధాలయంగా మార్చిన మనీషి. చాలా తక్కువ తెలుస్తుంది ప్రజల్లో ఒకరిగా ఉన్న మనుషుల గురించి.

ఆయన గురించి చాలా రాయాలి. ఇప్పుడైనా ఎక్కడికక్కడ పెద్దవాళ్ళు లోతుగా రాయవలసిందే. నలుగురి కోసం నడిచిన వాళ్ళు నలుగురికీ తెలియాలని కోరుకోవడం ఇప్పుడు అత్యవసరమే. వారు ఎంత మందిని ఎట్లా దగ్గర తీసుకున్నారో  మరే విధంగా వారిలో ప్రేరణకు ఊతమిచ్చారో తెలియవలసే ఉన్నది. ఎదిగిన వారు చెప్పితే కానీ తెలియని సామాన్యుడు ఆయన. తొంభయ్యవ దశకంకు ముందు ఆయన నిశ్శబ్ద కృషి తెలియకపోతే ఆ తర్వాతి వారికి చాలా ఖాళీ ఉంటుంది మరి.

అతడు చిరునవ్వు మాత్రమే కాదు, హృదయంలా విరిసే నవ్వు. ఇతరుల ప్రయత్నాన్ని, కృషిని, సాధనను ఎలుగెత్తి చాటడంలో ఆయన నిత్య దండోరా. మన లోకమే తన లోకంగా బ్రతికిన కర్మయోగి. ఇతరులకు ప్రోత్సాహం ఇవ్వడంలో ఎంత దూరమమేంటే అంత దూరం వెళ్ళే సాహసి. చిత్రమేమీ కాని విషయం ఏమిటంటే, తన కోసం తాను పని చేయడం ససిమేరా ఒప్పుకొని విరాగి ఆయన. అదే ఆయన సామాన్యత. విశిష్టతా.

లిస్టు రాస్తే తాను సహకరించిన వాళ్ళ కన్నా సహకారం పొందని వాళ్ళను మాత్రమే పేర్కొనవలసి వస్తుంది. అంతగా అల్లుకున్న సాహితీ సౌరభం అయన.

వారి ఆత్మీయ సమాజానికే కాదు, తమ కుటుంబానికి మనం అండగా ఉండాలి. ముఖ్యంగా వారి శ్రీమతి, అమ్మ మాధవి గారికి ఈ విషాదంలో వెన్నంటి ఉండాలి.

తెలుగు మాత్రమే కాదు, ఆంగ్లం, హిందీ మొదలు బహుభాషల్లో మన సాహిత్యం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందాలని కాంక్షించిన తపస్వి. సారస్వతం ప్రతి ఇంటా కొలువు దీరాలని తపించిన స్వాప్నికుడు.

తానొక తులసి కోట. రావి చెట్టు. నల్ల బెల్లం.

అయన ఒక ప్రచురణ. దిక్సూచి, అది నయనం.

తన సంపాదనలో పెన్షన్ లో ఆదాయ వనరుల్లో పుస్తకాలుగా కరిగిన కాలమే అత్యధికం. వారిని స్మరించుకోవడం అంటే చాలా చిన్న విషయంగా కన్పించే వారి దశాబ్దాల చేదోడు వాదోడు… అదొక సంస్థకు, అకాడమీకి ఎక్కువే అన్నది తెలిసిన వాళ్లకు తెలుసు.

సిరిసిల్ల ఆదిగా అది జూకంటి, నలిమెల మొదలు పత్తిపాక, ఆడెపు లక్ష్మణ్ తదితరుల్లో మానేరుగా ప్రవహించే ఆ ఒరవడిలో ఎందరో. అందులో ఒకరిగా ఈ నివాళి రచన రాయడం ఒక కన్నీటి బిందువు, ఆనంద బాష్పమూ.

నిజాం వెంకటేశం గారంటే మల్లెపువ్వు వంటి తెల్ల చొక్కా. గల గలలాడే గొంతు. మాటల్లో పలుకుల్లో ఆ జీర గొంతు రాగం ఇక రాళ్ళలో మేఘాల్లో వెతుక్కోవలసినదే.

అతడొక సంబురం. వేడుక.

బతుకమ్మ, దసరా పండుగ.

పుస్తకం ఎత్తుకున్న బోనాలు.

నిన్నటి దాకా ఆయన రాక ఒక నిత్య పండుగా పబ్బం. ఇప్పుడైతె తుపాను మిగిల్చిన ఆనవాలు. వారి ఆత్మీయత ఆదరణా పొందిన సమాజానికే కాదు, తమ కుటుంబానికి మనం ఇప్పుడు అండగా ఉండాలి. ముఖ్యంగా వారి శ్రీమతి, అమ్మ మాధవి గారికి ఈ విషాదంలో వెన్నంటి ఉండాలి.

తల్లి చెంతకేగిన ఆ బిడ్డకు తెలంగాణా తరపున, తెలుగు ప్రజానీకం తరపున కన్నీటి నివాళి.

సామాన్యశాస్త్రం వ్యాసంగం జిరాక్స్ ప్రతులతో మొదలై పుస్తకాలుగా ఎదిగి నేడు గ్యాలరీగా నిలదొక్కుకోవడంలో అతికొద్ది మంది సహకారం అందిస్తే అందులో వారు పునాది. గోడలు, ప్రహరీ. వారికి ఘన నివాళి.

ఆయన గత నెల ఫోన్ చేసి పదేళ్ళ కింద తీసిన అమ్మ ఫోటోలు యాది చేసిండు. ఒకట్రెండు ఎన్ లార్జ్ చేయాలన్నాడు. అమ్మ వెళ్ళేలా ఉన్నదని చూచాయగా చెప్పాడు. ఇప్పుడు ఆ ఫోటో తప్పక ఫ్రేం చేయాలి. అందులో అమ్మనే కాదు, తానూ ఉన్నాడు గనుక.

మొదట అన్నట్టు, ఎవరు గొడవ వారిదే అయిపోయిన కాలంలో మనల్ని పన్నెత్తు మాట కూడా అనకుండా శాశ్వతంగా మన గొడవను చివరకు మనకే వదిలి వెళ్లిపోయిన నిజాం వెంకటేశం గారు నాకు మనకాలం కాళోజీ.

బహుశా తల్లి మరణం ఆయనను కృంగదీసిందేమో అని అనుకుంటున్నాం గానీ తరచి చూస్తే అనిపిస్తోంది…అందరికీ చేతనైనది చేసి, తనకోసం మిగిలిన ఏకైక పని… పుష్కరకాలానికి పైగా మంచాన పడ్డ తల్లికి అంత్యక్రియలే అన్నట్టు, అవి పూర్తయ్యాక ఇక మరేమీ మిగలలేదని బహుశా అనుకున్నారో ఏమో…వెళ్ళిపోయారు.

ఎవరు గొడవ వారిదే అయిపోయిన కాలంలో మనల్ని పన్నెత్తు మాట కూడా అనకుండా శాశ్వతంగా మన మానాన మనల్ని వదిలి వెళ్లిపోయిన నిజాం వెంకటేశం గారు నాకు మనకాలం కాళోజీ. ఇక మిగిలింది మన గొడవ. అందులో వారి స్మృతిని పదిలం చేసుకున్నా లేకపోయినా వారికేమీ పట్టదు.

అదృష్టవంతులు వారు. అటువంటి మనిషిని త్వరగా కోల్పోయిన దురదృష్టవంతులం మనం. వారికి  వ్యక్తిగతంగా సామాన్యశాస్త్రం తెలుపు ఘన నివాళి ఇది. ఆ రచయిత, సంపాదకుడు, కవి, అనువాదకుడు మీదు మిక్కిలి అద్భుతమైన నిండు మనిషికి తెలుపు నివాళి ఈ సగౌరవ సంపాదకీయమూ.

సెలవు. సెలవు.

రేపు ఉదయం వారి అంత్యక్రియలు.

More articles

1 COMMENT

  1. గొప్ప నివాళి.
    మంచి మనసున్న మానవీయ ఆత్మీయకరస్పర్శ నిజాం వెంకటేశం గారిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article