మహమ్మారి తగ్గినట్టు ఉంది. మళ్ళీ తల ఎత్తేట్టూ ఉంది. ఈ సందిగ్ధ సమయంలో ఒక ఉద్విగ్న జ్ఞాపకం ఈ సంపాదకీయం.
కోట్లాది హృదయాలను తట్టిలేపిన ఆదేశ్ రవి పాట పుట్టి సరిగ్గా నేటికి రెండేళ్ళు. ఈ సందర్భంగా ఆ దు:ఖభారిత పాటకు, మనుషులను కరుణామయులను చేసిన ఆ పాటగాడికి పాదాభివందనం తెలుపు సంపాదకీయం ఇది.
కందుకూరి రమేష్ బాబు
కనీ వినీ ఎరుగనట్టు జీవితం స్తంభించి పోయిన ఆ విషాద జ్ఞాపకాలు మీకింకా గుర్తుండే ఉంటాయి. ఆ సమయంలో దేశ రాజధాని మొదలు కడుపు తిప్పలకు రెక్కలే ఆస్తులుగా దూరతీరాలకు వలస వెళ్ళిన మనుషులు ఇంటిముఖం పట్టేందుకు తిరిగి కాళ్ళనే ఆశ్రయించిన దుస్థితిని ఎవరం మరచిపోగలం? కరోనా మహమ్మారితో విలవిల్లాడిన ప్రపంచంలో వలస కార్ముకుల వేదన ఒక గొడగొడ దు:ఖం. దాన్ని వినిపించింది, ఆ దిక్కు మన కళ్ళు తెరిపించింది, ఆపన్నహస్తం అందించేలా సైతం చేసింది ఒకే ఒక్క కవి. సంగీతకారుడు. అతడు ఆదేశ్ రవి. అతడి పాటకు రెండేళ్ళు ఈ నాటికి.
లాక్ డౌన్ విధించిన ఆ ఘడియల్లో లక్షలాది పాదాలు ఇంటి ముఖం పట్టిన తరుణంలో వారి కష్టాన్ని కళ్ళకు కట్టిన ఆ పాదాలు…అవి ఇంకా మన చెవుల్లో గింగుర్లు తిరుగుతూనే ఉన్నయ్.
‘పిల్లా జెల్లా’ పాట. ఆ ‘ముసలి తల్లి’ పాట. ‘చెడ్డ బతుకు …చెడ్డ బతుకు’ అంటూ నిస్సహాయంగా తలకాయ కొట్టుకున్న పాట. ‘ఇడిసి పెడితే నడిసి నేను బొత సారూ’ అన్న నిస్సహాయ అభ్యర్థణ…అంతా ఒక పీడ. వేదన. వలస పాదాలు ఈ దేశ ముఖంపై లిఖించిన నలిగిపోని చరిత్ర.
అది వ్యక్తిగతంగా ఆదేశ్ రవి ఆశ్రుగీతం. దుఃఖ రాగం. సామూహికంగా దేశమంటే మనుషులని నమ్మేవారికి అది దేశభక్షి గీతం. రాజ్యం క్రూరంగా చేసిన పరిహాసానికి ద్రవించిన రక్త చలన గీతం. సంగీతమే లేని గద్గద గేయం. కవులు కళాకారులు శూన్యంగా మారిన వేళ ఇదొక్కటే ఒక మేలుకొలుపు గీతం అయింది.
అప్పటిదాకా ఇంటిపట్టున ఉండి నాలుగు గోడల మధ్య ఎవరి భద్రలోకంలో వారున్నప్పుడు… బిక్కుబిక్కు మంటూ టీవిలకు అతుక్కుపోయినప్పుడు..చేతులు సానిటైజ్ చేసుకోవడమే తమ ఏకైక కర్తవ్యంగా మారినప్పుడు… అందరూనూ ప్రేక్షక పాత్రలో లీనమై.. వంట వార్పుల్లో నిమగ్నమైన వారందరికీ ఆ పాట చెంప చెళ్ళుమనిపించింది. ఒక్కపరి పెను నిస్పృహను విదిల్చింది. ఇండ్లు వదిలి బయటకు వచ్చేలా చేసింది. ఆపన్న హస్తం అందించేందుకు సన్న ద్దులనూ చేసింది.
ఎవరి ఇల్లే వారి లోకంగా, ఎవరి గదే వారి విశ్వంగా మారిన సమయంలో కరోనా భయోత్పాతాన్ని అధిగమించి, కనీస మనవ ప్రయతానికి పురికొల్పిన ఇలాంటి ప్రపంచ గేయం మరోకటి లేదని కూడా మీకు తెలుసు. అంతటి ప్రభావశీలమైన ఆ కవికి వందనం…అభివందనం.
ఒక్కమాటలో సుదీర్ఘమైన వలస కార్మికుల లాంగ్ మార్చ్ కి సంక్షిప్త దృశ్యరూపం ఈ గేయం.
జైలు గోడలు బద్దలు కొట్టుకుని ఖైదీలు బయటకు వచ్చినట్టు, ఘనీభవించిన మానవత్వాన్ని పెల్లుబికేలా చేసిన కరుణరసార్ద్ర ఆగ్రహగీతక ఆ పాట.
మీకు తెలుసు, ఆ పాట చేరని ప్రాంతం లేదు. అనేక భాషల్లోకి ఆ దుఖం ప్రవహించింది. నిజానికి పాటకు ముందు దేశం వేరు. పాట తర్వాత ఈ దేశం వేరు. రెండు తెలుగు రాష్ట్రాల స్థితి గతి మారిపాయే!
మహమ్మారి కాలంలో స్మశానంగా మారిన సమాజంలో మనుషుల్లో ఒక అజేయమైన విశ్వాసాన్ని ప్రేరేపించిన ఈ పాటకు, పాటగాడికి సమాజం రుణపడి ఉంటుంది.
ఎప్పుడో శ్రీశ్రీ రాసిన కవిత…అలాగే…దేశ విభజన సమయంలో కుశ్వంత్ సింగ్ రాసిన పాట…వాటన్నిటినీ మరిపించిన ఈ నిశ్శబ్ద గేయం కన్నీళ్లు కార్పించడమే కాదు, మనిషి మరో మనిషికోసం ఏమైనా చేయకపోతే ‘అదో బతుకా…’ అనిపించేలా చేసింది. ఒక్కపరి ఎక్కడికక్కడ అందరినీ కార్యోన్ముఖులను చేసింది. అన్నిటికన్నా మిన్న… ప్రాణాంతక కరోనా కన్నా ‘పేదరికం’ మరింత పెద్దరోగం అన్న స్పృహను కలిగించింది. అపార కరుణతో నడిచేపోయే మనుషులకు పాద రక్షలయ్యేలా చేసింది. ఆకలి తీర్చి వారిని ఇంటికి చేర్చేదాకా కన్నంటుకోని స్థితిలోకి నెట్టింది.
యావత్ ప్రపంచం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు అచేతనుడైన మనిషిని మేలుకొలిపి చేతనైన సాయం చేసేలా ప్రేరేపించిన ఆ గీతం…మాయమై పోయాడేమో మనిషి అనుకున్న వేళ అతడి జాడను తిరిగి పట్టి చూపి వలస కార్మికుల కోసం గుడారం వేసేలా మార్చిన ఆ పాట… అశేష జనావలిని తమవంతు కర్తవ్యంలో నిమగ్నమయ్యేలా చేసినా ఆ చరణాలు నిరాశామయ భవితలో గొప్ప ఆశను పంచింది.
చేష్టలుడిగిన మనిషికి అనధికారిక ఆర్డినెన్స్ గా నిలిచిన ఆ గేయం ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలను నాంది పలికేలా చేయడం ఒక నమ్మలేని నిజం. అది గొప్ప చేతన. అద్భుతమైన మానవత్వ సమ్మేళనానికి తిరుగులేని సాక్ష్యం. ఒక్క కవి మాత్రమే చేయగల మహత్తర కర్తవ్యం.
మహమ్మారి కాలంలో స్మశానంగా మారిన సమాజంలో మనుషులకు ఒక అజేయమైన విశ్వాసాన్ని ప్రేరేపించిన ఈ పాటకు, పాటగాడికి సమాజం రుణపడి ఉంటుందని తెలుపుతూ ఈ సంపాదకీయం.
ఆదేశ్ రవికి పాదాభివందనం.