సుతారమైన వారి ప్రేమానురాగాల అభివ్యక్తి తెలుపు సంపాదకీయం ఇది
కందుకూరి రమేష్ బాబు
సుప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు రెండు వారాల క్రితం స్వర్గస్తులయ్యారు. గత ఏడు తమ 58 వివాహ వార్షికోత్సవ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇది. దీన్ని వారు ఫేసు బుక్ లో పంచుకున్నారు. ఇందులో దంపతులుద్దరూ ఎంత అందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు! కానీ కాలానికి కన్ను కుట్టినట్టు మృత్యువు ఈ జంటను వేరు చేసి ఒకరిని తీసుకెళ్ళింది. జయదేవ్ గారిని ఒంటరి చేసింది.
నిజమే. మృత్యువు ఒక కఠిన వాస్తవం. ఆ సత్యాన్ని వారు అంగీకరిస్తూనే అంతరంగాన్ని కుదిపే ఆ దుఖాన్ని దిగమింగుతూ తన శ్రీమతి జ్ఞాపకాలతో బ్రతకడం అలవాటు చేసుకుంటున్నారు. ఆ మేరకు అయన ప్రయత్నం మనకు కనబడటమే విశేషం.
బాపు గారు ఉండి ఉంటే విడివడ్డ ఈ దంపతుల ప్రేమానురాగాలపై ఎంత చక్కటి బొమ్మ వేసేవరో అనిపిస్తోంది.
అవును. ఆయన తన ప్రధాన వ్యాపకమైన చిత్రకళలో ముఖ్యంగా వ్యంగ చిత్రకళలో తన వేదనను సున్నితంగా మనతో పంచుకుంటున్నారు. ఆ క్రమంలో నెమ్మదిగా కాసింత ధైర్యాన్ని ప్రోది చేసుకుంటున్నారనే అనుకోవాలి. ఫేస్ బుక్ లో వాటిని చూసిన ఎందరో కదిలిపోతున్నారు. తమ అత్మీయ వచనాలతో ఆదరాభిమానాలతో త్వరలో జయదేవ్ గారు తేరుకోవాలని చెబుతూనే ఉన్నారు.
“కొంచం accept చెయ్యడం గురించి ఆలోచన మొదలు పెట్టండి” అని ఒకరంటే “ఎప్పుడో accept చేసేశాను. ఇది హ్యూమర్ ఫిలాసఫీ” అని వీటి గురించి స్పందించారు కూడా. కానీ వాస్తవానికి ఎంత బాధ ఇది!
“జయదేవ్ గారు మృదు స్వభావి, మితభాషి. నవ్వు మొహమైనా పెద్దగా నవ్వరు” అంటారు. కానీ ఈ సారి తన బొమ్మల్లో అయన పూర్తిగా వ్యక్తమవుతున్నారు. నిజంగా ఈ విషాద సమయంలో వారు నవ్విస్తున్నారు. బాపు గారు ఉండి ఉంటే విడివడ్డ ఈ దంపతుల ప్రేమానురాగాలపై ఎంత చక్కటి బొమ్మ వేసేవరో అనిపిస్తోంది.
వీటిని చూస్తుంటే ఒక క్షణం శ్రీ రావూరి భరద్వాజ గారు తన జీవిత భాగస్వామి కాంతం గారిపై వెలువరించిన రచనలు స్పురణకు వచ్చాయి. అట్లే, అజంతా అన్నట్టు ‘మృత్యువు హాస్య ప్రియత్వం’ అని అనలేము గానీ ఈ వ్యక్తీకరణలు జీవన వైరాగ్యం నుంచి వెలువడిన మేలిమి ముత్యాలని చెప్పక తప్పదు.
నిజానికి వీటిని కార్టూన్లు అనకుండా వారు పెద్ద మనసు చేసుకుని చిత్ర రూపంలో తన అర్ధాంగి కోసం పలుకుతున్న అపురూప శ్రద్దాంజలి అనే అనవలసి ఉంది.
ఏమైనా, ఈ కళాకారుడి ఆశావాదమూ, పనిలో పడి శ్రద్దగా తమని తాము “వారు కూడదీసుకుంటున్న తీరు అద్భుతం” అని ఒకరు అన్నది ఎంతో నిజం.
ఎంత బాగున్నాయి చూడండి.
ఒక వంటరి పక్షి విలవిల. సుతారమైన వారి ప్రేమానురాగాల అభివ్యక్తి.
సర్! మీకు నమస్సులు.
అమ్మగారి ఆత్మశాంతి కోసమూ, మీరు త్వరగా తేరుకోవాలనీ ఒక ప్రార్థన. అందుకే మీకు ఈ ఆత్మీయ సంపాదకీయ కథనం.