Editorial

Wednesday, January 22, 2025
Peopleఅన్వితా రెడ్డి : ఎవరెస్ట్ శిఖరంపై మన 'భువనగిరి' దరహాసం

అన్వితా రెడ్డి : ఎవరెస్ట్ శిఖరంపై మన ‘భువనగిరి’ దరహాసం

Anvithaనిన్న మహిళా బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ గా నిజామాబాద్ బిడ్డ తెలంగాణ పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పగా మొన్ననే ఈ భువనగిరి బిడ్డ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన సాహసోపేత వారసత్వాన్ని అత్యున్నత శిఖరమానంగా ఎగుర వేసింది. ఈ సందర్భంగా అన్వితా రెడ్డికి తెలుపు అభినందన కథనం.

కందుకూరి రమేష్ బాబు 

భువవగిరికి చెందిన ఇరవై నాలుగేళ్ల అన్వితా రెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని మరోసారి ప్రపంచ పటంలో చిరస్మరణీయం చేసింది. మొన్న అంటే మే 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ యువతి అధిరోహించి మన బిడ్డల సత్తా ఏమిటో చాటింది.

హైదరాబాద్‌లోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ నిర్వహిస్తున్న హిమాలయాల స్ప్రింగ్ క్లైంబింగ్ సీజన్‌లో ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ టీమ్‌లో భాగస్వామిగా అన్వితా రెడ్డి ఈ రికార్డును సాధించడం విశేషం.

కిలిమంజారో పర్వతాన్ని కూడా…

అన్విత భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఇన్‌స్ట్రక్టర్ శిక్షణను పూర్తి చేసి ఆ తర్వాత పర్వతారోహణ సంస్థల్లో ప్రాథమిక, అడ్వాన్స్ పర్వతారోహణ కోర్సులను పూర్తి చేసింది 2021 ఫిబ్రవరిలో ఖాడే పర్వతాన్ని అధిరోహించింది. 2021 జనవరిలో ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని కూడా అధిరోహించింది. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ద్వారా శీతాకాల శిక్షణను లేహ్‌లో పూర్తి చేశాక 2021 డిసెంబర్ లో యూరోప్ ఖండంలోని ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన ఏకైక భారతీయురాలిగా సైతం తాను రికార్డుల కెక్కింది.

తన తాజా విజయమైన ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం కోసం ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ద్వారా 2022 జనవరిలో ప్రత్యేక ప్రిపరేషన్ కోర్సును పూర్తి చేసి ఎట్టకేలకు తన స్వప్నం సఫలం చేసుకున్నది.

సామాన్యుల సాహసానికి మరో ఉదాహరణ

తల్లి దండ్రులతో విజయ దరహాసం

అన్విత అంటే స్థిరమైన అన్న అర్థం. అంతేకాదు, ఖాళీలను పూరించే  క్రియాశీలత అని కూడా. ఈ అన్విత ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్థిరంగా శిఖరస్థాయికి వెళ్ళింది. అసంభవం అనుకున్న భావనలు చెరిపేసి యువతకు స్పూర్తినిస్తూ తానే ఇక్కడి పిల్లకకు ఆశావహమైన ఒక కొత్త వంతెన నిర్మిస్తోంది. ప్రస్తుతం భువనగిరిలోని Rock Climbing Schoolలో  శిక్షకురాలుగా కూడా పనిచేస్తూ తానీ విజయాన్ని సాధించింది.

విశేషం ఏమిటంటే, అన్విత రెడ్డి  సామాన్యమైన వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చింది. ఆమె తల్లి దండ్రులు పడమటి మధుసూధన్ రెడ్డి, చంద్రకళలు. తల్లి భువనగిరి అంగన్‌వాడీ పాఠశాలలో పనిచేస్తున్నారు.

విజయవంతంగా శిఖరాగ్రం చేరిన అన్విత ప్రస్తుతం  శిఖరం నుంచి దిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంటోంది. ఈ నెలాఖరుకు మన రాష్ట్రానికి తిరిగి వస్తుంది.

అన్విత రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశంలోని నేపాల్‌లో  దక్షిణం వైపు నుండి పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరింది. డాక్యుమెంటేషన్, సామగ్రి కొనుగోలు కోసం ఖాట్మండులో కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఆమె లుక్లా వెళ్లారు. అక్కడ నుండి బేస్ క్యాంపుకు చేరుకోవడానికి 9 రోజుల పాదయాత్ర సాగింది. 2022 ఏప్రిల్ 17వ తేదీన 5300 ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. మే మాసంలోని తొలి వారంలో అన్విత పర్వతం పైకి ‘రొటేషన్స్’ పూర్తి చేసింది.

ఇలా శిఖరాన్ని ముద్దాడింది

ఒక భ్రమణంలో సభ్యులు బరువుతో ఎత్తైన శిబిరాలకు ఎక్కి అక్కడ ఒక రాత్రి ఉండి, శిబిరాలకు తిరిగి వస్తారు. ఈ పద్ధతిలో వారి శరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు సర్దుబాటు చేసుకుంటుంది. భ్రమణం సమయంలో అన్విత 7,100 మీటర్ల ఎత్తుకు చేరుకుని మే 12న బేస్ క్యాంప్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు, వివిధ స్థాయిలలో నాలుగు శిబిరాలను దాటింది. తన షెర్పా గైడ్‌తో క్యాంప్-4 నుండి మే 15 రాత్రి బయలుదేరి 16 మే 2022న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకుని తన యానంలో అత్య్యున్నత విజయాన్ని నమోదు చేసింది.

అభినందనలు అన్వితా…

ప్రస్తుతం అమె శిఖరం నుండి దిగి బుధవారం నాటికి బేస్ క్యాంప్‌కు చేరుకుంటుంది. ఈ నెలాఖరుకు మన రాష్ట్రం తిరిగి వస్తుంది.

అత్యంత సాహసోపేతంగా అన్విత సాగించిన విజయ పరంపరకు తెలుపు అభినందనలు తెలియజేస్తూ ఈ భువనగిరి బిడ్డకు తెలంగాణ సమాజం స్వాగతం పలుకుతోందని తెలియజేస్తోంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article