Telangana – Land of Dinosaur’s
హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రాక్షస బల్లిని చూశారా? దాని వెనకాలి పరిశోధన, ఆ శిలాజాలు, వాటి రూపకల్పన గురించిన వివరాలు చదవండి.
అరవింద్ పకిడె
డైనోసార్. ఈ పేరు వింటేనే మనకు హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. డైనోసార్లు, వాటి జీవన విధానం ఇతివృత్తంగా అనేక సినిమాలు రూపొందాయి. సుమారు 20 కోట్ల సంవత్సరాల క్రితం సంచరించిన డైనోసార్లు అనేక ప్రకృతి విపత్తుల మూలంగా అంతరించిపోయాయి. ఐతే, అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే ఉండేవని మనం భావించే ఆ రాక్షస బల్లుల అవశేషాలు మన దేశంలోనూ, తెలంగాణలోనూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వంద సంవత్సరాల క్రితం, ఆంగ్లేయుల కాలంలో ఖనిజాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేస్తున్న క్రమంలో వాటి శిలాజాలు లభ్యమయ్యాయి.
వేమనపల్లిని ఆ కాలంలో ‘యామనపల్లి’ అని పిలిచేవారు. అందుకే ఆ రాక్షసబల్లికి ‘కోటసారస్ యమనపల్లియెన్సిస్’ అనే శాస్త్రీయనామాన్ని పెట్టారు.
కొందరు విదేశీ పరిశోధకులు వచ్చి ఇక్కడ పరిశోధనలు కూడా నిర్వహించారు. మన వారే ఐన జీఎస్‌ఐకి చెందిన తెలుగు పరిశోధకులు పొన్నాల యాదగిరి 1980ల లో అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లి (ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉంది) ప్రాంతంలో ఎగిరే రాక్షస బల్లి (ఆర్కియోప్టెరిక్స్) అవశేషాలను గుర్తించడం విశేషం. అలాగే, గోదావరి బేసిన్ పరిధిలోని మలేరి, ధర్మారం, కోటలలో ఇంకా చాలా అవశేషాలు లభించాయి. డైనోసార్ ఎముకలు, వాటి గుడ్లు, గుడ్ల పెంకుల శిలాజాలు కూడా లభ్యమయ్యాయి. అవి ఇక్కడ ఉండటానికి గల కారణం ఏమిటో కాదు, వాటికి తగిన ఆహారం లభ్యం కావడమే. అవును. మహారాష్ట్ర–తెలంగాణల్లో విస్తరించిన ప్రాణహిత–గోదావరి నదీతీరాల్లో ఆంజియోస్పర్మ్ (ఆవృతబీజ) వృక్షాలు విస్తృతంగా ఉండటంతో వాటి ఆకులను తినేందుకు ఈ ప్రాంతాల్లో డైనోసార్లు ఎక్కువగా సంచరించేవని పరిశోధకులు వివరిస్తున్నారు.
‘డైనోసారియం’లో కనిపించే రాక్షస బల్లి శిలాజం ఎత్తు 16 అడుగులు, పొడవు 44 అడుగులు. దాదాపు 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో దాని ఆకృతిని రూపొందించి అవెలా ఉండేవో నేటి తరానికి చూసేందుకు వీలుగా పెట్టారు.
ఆ డైనోసార్ లు ఎలా ఉండేవో చూడాలంటే హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ‘డైనోసారియం’ దర్శించాలి. అక్కడ కనిపించే రాక్షస బల్లి శిలాజం ఎత్తు 16 అడుగులు, పొడవు 44 అడుగులు. దాదాపు 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో దాని ఆకృతిని రూపొందించి అవెలా ఉండేవో మనం చూసేందుకు వీలుగా పెట్టారు. ముందే చెప్పినట్లు, ఈ అవశేషాలు వేమనపల్లిలో 1974–1980 సంవత్సరాల మధ్యకాలంలో దొరకడం విశేషం. వేమనపల్లిని ఆ కాలంలో ‘యామనపల్లి’ అని పిలిచేవారు. అందుకే ఆ రాక్షసబల్లికి ‘కోటసారస్ యమనపల్లియెన్సిస్’ అనే శాస్త్రీయనామాన్ని పెట్టారు.
అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్. చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.