నేడు తెలంగాణ కథ – 2020 ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా హాజరైన జింబో గాలిలాగా, నీరులాగా, నింగిలాగా కథ ప్రపంచమంతటా ఉంటుందని అన్నారు.
కథకులు మనం గుర్తించని చరిత్రకారులని ప్రముఖ కథకులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ సభ్యులు మంగారి రాజేందర్ (జింబో) అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘బుగులు’ తెలంగాణ కథ – 2020 ఆవిష్కరణ కార్యక్రమానికి జింబో ముఖ్య అతిథిగా హాజరై ‘బుగులు’ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాలిలాగా, నీరులాగా, నింగిలాగా కథ ప్రపంచమంతటా ఉంటుందని అన్నారు. మనిషి జీవితం కథతోనే మొదలై కథతోనే ముగుస్తుందని అన్నారు. హృదయాన్ని తాకేలా కథలు రాయాలని కొత్త కథకులకు సూచించారు. ప్రేంచంద్, సాదత్ హసన్ మంటో, మధురాంతకం రాజారాం కథలు ఎప్పటికీ నిలిచిపోయే కథలని కొన్ని కథలను ఉదాహరించారు. కథకులంటే చరిత్రను నిక్షిప్తం చేసేవారని, సమకాలీన సమాజంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో, భాష ఎలా ఉందో, సంఘర్షణ ఎలా ఉందో కథకులు రికార్డ్ చేస్తారని తెలిపారు.
గౌరవ అతిథిగా హాజరైన డా. కాంచనపల్లి గోవర్ధన్ రాజు మాట్లాడుతూ సింగిడి రచయితల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కథా సంకలనాల పరంపర నిరంతరం కొనసాగాలని సూచించారు. శిల్ప చాతుర్యం, భాషా సామర్థ్యం ఉన్నంత మాత్రాన్నే కథ రాయలేమని, కదిలించగలిగిన సంఘటనల నుండే కథా వస్తువును ఎన్నుకోవాలని అన్నారు. ఈ కథా సంకలంలోని కథకులందరూ మనవ సంబంధాలను చాలా శక్తివంతంగా చిత్రించారని అన్నారు.
తెలంగాణ భాషా & సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ‘బుగులు’ తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబమని, ఇందులో జీవన తాత్వికత, పోరాటం, సంఘర్షణ అన్నీ ఉన్నాయని అన్నారు. తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ చెప్తుందని, కాకపొతే ఇక్కడి మనిషికి మట్టి భాష తెలియాలని అన్నారు. ‘బుగులు’ నిష్పక్షపాతంగా తీసుకొచ్చిన కథా సంకలనమని సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్, డా. వెల్దండి శ్రీధర్ లను అభినందించారు.
డా. పసునూరి రవీందర్ మాట్లాడుతూ ఇప్పటి కథకులు మన ముందరి తరం కథలతో కరచాలనం చేయాలని అన్నారు. ప్రతి ఏటా తీసుకొస్తున్న ఈ కథా సంకలం ఒక చారిత్రాత్మకమైన పని అని కొనియాడారు.
కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత డా. పసునూరి రవీందర్ మాట్లాడుతూ ఇప్పటి కథకులు మన ముందరి తరం కథలతో కరచాలనం చేయాలని అన్నారు. ప్రతి ఏటా తీసుకొస్తున్న ఈ కథా సంకలం ఒక చారిత్రాత్మకమైన పని అని కొనియాడారు. నిఖార్సైన తెలంగాణ జీవితం, సంఘర్షణ మెండుగా ఉన్న కథల సంకలనంగా ‘బుగులు’ నిలుస్తుందని ప్రశంసించారు. మరో కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ కవిత్వం కంటే కథే ఎక్కువ మాట్లాడుతుందని అన్నారు. ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకోవాల్సిన సందర్భమని దానికి ఇలాంటి కథా సంకలనాలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. సమాజాన్ని మార్చేది సాహిత్యకారులు, కథకులేనని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా రాగ ద్వేషాలకు అతీతంగా ఈ కథా సంకలనాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సంకలనంలో చోటు చేసుకున్న కథలేగాక మరిన్ని మంచి కథల్ని పుస్తకం చివర ఇచ్చామని, పాఠకులు వాటిని కూడా చదవాలని సూచించారు.
ఈ సంకలనంలోని కథకులు మేడి చైతన్య, యామిని నల్ల, అక్కల చంద్రమౌళి, తమ స్పందన తెలిపారు. కార్యక్రమంలో చందు తులసి, ఏశాల శ్రీనివాస్, డా. మామిడాల రమేష్ బాబు, సంగి రమేష్, అంబటి వెంకన్న, గుడిపెల్లి నిరంజన్, కోడం కుమారస్వామి, చిన్నయ్య తదితర సాహితీకారులు పాల్గొన్నారు.