Editorial

Wednesday, January 22, 2025
కథ"నన్ను పేరుతోనే పిలు" : స్వాతి శ్రీపాద కథ

“నన్ను పేరుతోనే పిలు” : స్వాతి శ్రీపాద కథ

Illustration by Beera Srinivas

“మల్లికా ఈ కృత్రిమ వావి వరసలతో అలసిపోయాను. పక్కంటి వాళ్లను పిలిచినట్టు ఆంటీ అని ఇంట్లో వాళ్ళే పిలిచాక – ఆంటీ వెగటుగా ఉంది. వయసులేవైతేనేం మన ఆలోచనలూ మనసులూ సమవయస్కులే. నన్ను పేరుతోనే పిలు” అనేది.

స్వాతి శ్రీపాద

సౌకుమార్యం బొత్తిగా నశించిపోయి పరాన్న జీవులుగా బ్రతుకుతున్న జనాలను చూస్తుంటే రక్తం మరిగిపోతోంది మల్లికకు.

అవును తల్లీ పిల్లల మధ్యనా, తండ్రీ కొడుకుల మధ్యనా, ఒక్క కడుపున పుట్టి ఒక ఇంట్లో పెరిగిన సహోదరుల మధ్య, చివరికి మనసూ జీవితమూ పంచుకునే భార్యా భర్తల మధ్య ఈ ధనవ్యామోహం ఏమిటో, ఈ అహంకారాలేమిటో చివరికి ఒకరిని ఒకరు పీక్కుతినే రాక్షజాతిగా మారబోతున్నారా?

కవయిత్రి, రచయిత్రి స్వాతి శ్రీపాద కలం పట్టింది 69 లో. పుస్తక రూపాన వెలువరించిన కవితా సంపూటాలు – హృదయంలో అడుగులు, మనసుకు చూపుంటే, ఏడారులు ఎండమావులు, నదినై ప్రవహించాలని, సుప్తక్షణం. కథల సంపుటులు – మౌన వీణ, గోడలు, అవతలివైపు, పొరలు. నవలలు – పునరాగమనం, చిరుజల్లు కురిసెనా, శిశిర వసంతం, చుక్కాని చిరు దీపం, అనువాదాలు 32 కు పైగా. వారి రచనల్లోని ప్రత్యేకత, తెరలు తీయడం. అవ్యక్తంగా ఉన్న భావాలు, అనుభవాలను సాహసోపేతంగా  ఆవిష్కరించడం. మరో మాటలో అంతరంగాల ముడి విప్పడం, జీవితాన్ని జీవించే గాథలు రాయడం. ఈ కథలోని రాజేశ్వరి గారి ఇతివృత్తం మచ్చుకు ఒక ఉదాహరణ. వారి ఇ మెయిల్ swatee53@gmail.com.

రాజేశ్వరి గారు మరోసారి కళ్ళల్లో మెదిలారు మల్లికకు. రాజేశ్వరి తొంభై దరిదాపుల్లోకి చేరుకున్నారు. పేరుకు నలుగురు పిల్లలు. ఇద్దరమ్మాయిలూ ఇద్దరు అబ్బాయిలూ. ముప్పై ఏళ్ళ క్రితమే గతించిన భర్త చేసిన పెద్ద ఉద్యోగం వల్ల, చేతినిండా పుష్కలంగా డబ్బూ, అటుపుట్టింటి వారూ ఇటు మెట్టినింటివారూ ఉన్నవాళ్ళే కావడం వల్ల స్థిర చరాస్థులకూ లోపం లేదు. పిల్లలందరూ మంచి చదువులు చదివి సవ్యంగా స్థిరపడిన వారే.

ఇద్దరు కొడుకులూ, కోడళ్ళూ ఇంజనీర్లు, ఇద్దరు కూతుళ్ళూ, అల్లుళ్ళూ డాక్టర్లు. పెళ్ళికి ఎదిగి వచ్చిన మనుమలూ మనవరాళ్ళూ …

అయినా రాజేశ్వరి గారు ఒక్కరే ఉంటారు. లంకంత ఇంట్లో కాదు. నాలుగు బెడ్ రూమ్ ల అపార్ట్మెంట్లో. ఆ కాంప్లెక్స్ లోనే చిన్న టూబెడ్ రూమ్ ఫ్లాట్ మల్లికది. ఎలా కలిసిందో కాని మల్లికకూ రాజేశ్వరికీ మనసు కలిసి స్నేహం పెరిగింది.

ఇరవై సంవత్సరాలు ఇద్దరికీ అరమరికలు లేకుండా కష్టసుఖాలు పంచుకోడం పరిపాటిగా మారింది.
పిల్లల్లో ఇద్దరుకూతుళ్ళూ ఒక కొడుకూ అమెరికాలో ఉన్నారు. రెండో కొడుకు ఢిల్లీలో. నిజానికి అందరినీ సమానంగా చదివించారు. రెండో కొడుకూ అమెరికా వెళ్ళి ఎమ్ ఎస్ చదివాడు అయిదారేళ్ళు ఉద్యోగమూ చేసాడు కూడా.

ఆ క్రమంలోనే అక్కడే పరిచయమైన మెక్సికన్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అమ్మ అనుమతి కోరాడు.

“అదేమిటో మల్లికా, ఎవరినైనా చేసుకో కాని విదేశం వాళ్ళు వద్దురా అన్నాను. నాకు తెలీదు వీడు ఆ పిల్లతో అయిదారేళ్ళుగా కలిసి ఉన్నాడని. అంతే తెగతెంపులు చేసుకుని వెనక్కి వచ్చేసాడు. అలాగని మేమేం మాకు నచ్చిన పిల్లను కట్టబెట్టలేదు. వాడికి నచ్చిన అమ్మాయే, పెద్ద చదువులే చదివి ఇంటర్నేషనల్ సంస్థలో ఉద్యోగం కూడా …

కాని అదేమిటో నేనెంత సస్నేహంగా ఉందామన్నా, నాపొడే గిట్టదు.” అని వాపోయేది.
అప్పుడో ఇప్పుడో కలవడం తప్ప పిల్లలే అతిధులైపోయారు.

నిజమే ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా, ఎన్ని యుగాలు మారినా అత్తకూ కోడలికీ చుక్కెదురు తగ్గదులా ఉంది.

ఎవరి కుటుంబం వారు ఏర్పరచుకునే క్రమంలో పాత కుటుంబం అంతరించి పోవాలి గామోసు.

నీరసించిన రాజేశ్వరి గారు శుష్కమైన నవ్వు నవ్వి -“వీళ్ళు ఎందుకు వస్తారో తెలుసా మల్లికా, మా అమ్మ సిక్. బెడ్ రిడెన్, చూసి వచ్చాం” అని చెప్పుకుందుకు.

ఆర్నెల్లుగా రాజేశ్వరికి అంతగా బాగుండటం లేదు. అడపా దడపా ఆసుపత్రి విడిదీ తప్పడం లేదు. బీపీ ఎక్కువనో తక్కువనో, షుగర్ ఎక్కువనో తక్కువనో , నీరసానికో నొప్పులకో … ఎంత పిల్లలు వచ్చి వారం పది రోజులున్నా మల్లికే ఆధారమయింది ఆమెకు. ఢిల్లీలో కొడుకూ అందరిలానే వచ్చి శనాదివారాలు ఉండి వెళ్ళిపోతాడు.

నీరసించిన రాజేశ్వరి గారు శుష్కమైన నవ్వు నవ్వి -“వీళ్ళు ఎందుకు వస్తారో తెలుసా మల్లికా, మా అమ్మ సిక్. బెడ్ రిడెన్, చూసి వచ్చాం” అని చెప్పుకుందుకు.

నిజం చెప్పనా? జీవితమంతా స్వేచ్చగా బ్రతికాను. పిల్లలకు సక్రమమైన దారి ఏర్పరచాను. ఇప్పుడూ వాళ్ళు రాకపోతే రాలేదనీ బెంగలేదు వస్తే వచ్చారన్న ఆనందమూ లేదు. తల్లిని కదా, సదా వారి మంచే కోరతాను. కాని వాళ్ల మొహాల్లో ఇంకెన్ని రోజులు ఇలా రావాలో అన్న దిగులు కనబడుతుంది. అయినా రావద్దని చెప్పలేనుగా” అంది ఒకసారి.

మల్లిక అప్పుడప్పుడు ఆవిడను రాజేశ్వరీ అనే పిలిచేది. ఆ ప్రపోజల్ ఆవిడదే.

“మల్లికా ఈ కృత్రిమ వావి వరసలతో అలసిపోయాను. పక్కంటి వాళ్లను పిలిచినట్టు ఆంటీ అని ఇంట్లో వాళ్ళే పిలిచాక – ఆంటీ వెగటుగా ఉంది. అది ఎదురుగా, వెనకాలైతే నీ యమ్మ నీ యమ్మ అనే.. అదేలే పొలైట్ గా యువర్ మామ్ అని మాట్లాడుకోడం. వయసులేవైతేనేం మన ఆలోచనలూ మనసులూ సమవయస్కులే. పేరుతోనే పిలు” అనేది.

“రాజేశ్వరీ అలా అంటావు గాని నీ మనసు అమ్మ మనసు.”

“వన్ సైడెడ్ లవ్” అని నవ్విందామె, “అయినా నాపిల్లలకు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ కష్టాలూ సమస్యలూ వారి వారి సరదాలూ సంతోషాలు వారికున్నాయి. నాలా రికామీగా మంచం పట్టుకుని ఉన్నారా, నాపక్కన కూచోమనడానికి” అనేది.

వారం రోజులుగా బొత్తిగా బాగాలేదు. వారం క్రితమే వెళ్లారు ఇరవై రోజులుగా ఇక్కడే ఉన్న అమెరికా కూతుళ్ళు కొడుకూ వారున్నప్పుడే ఢిల్లీ వారూ వచ్చి వెళ్ళారు.

కాస్సేపు మెళుకువ కాస్సేపు మగతగా ఉండటంతో భయపడి పిల్లలను రమ్మనననా అని అడిగింది మల్లిక.

రాజేశ్వరి వారించింది.

“చూశావా మల్లికా అంతా ఋణాను బంధమే కదా … నలుగురు పిల్లలా. చివరికి నువ్వు ఆత్మీయురాలివై అన్నీ వదిలి నా పక్కన ఉన్నావు. ఏవేవో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటాం. చుట్టూ తామరతంపరగా జనాలను పోగేసుకుంటాం. కాని ఇప్పటికి గాని తెలిసిరాలేదు – ఎప్పటికీ మనసున మనసైన వారే మన వారని.

“ఇప్పుడే వద్దు. నేను చెప్తానుగా, ఆయన వస్తున్నారు, నన్ను తీసుకుపోడానికి, వచ్చాక చెప్తాను” అనేసింది.

అంతే కాదు, నాకు తెలియకుండా పిలవకు. నన్ను నాలుగురోజులు ప్రశాంతంగా ఉందనీ అనికూడా అంది. మెళుకువ వచ్చినప్పుడల్లా ఎప్పటెప్పటి అనుభవాలో మల్లికకు చెప్తూనే ఉంది.

రెండు రోజుల క్రితం “చూశావా మల్లికా అంతా ఋణాను బంధమే కదా … నలుగురు పిల్లలా. చివరికి నువ్వు ఆత్మీయురాలివై అన్నీ వదిలి నా పక్కన ఉన్నావు. ఏవేవో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటాం. చుట్టూ తామరతంపరగా జనాలను పోగేసుకుంటాం. కాని ఇప్పటికి గాని తెలిసిరాలేదు – ఎప్పటికీ మనసున మనసైన వారే మన వారని. ఈ రోజు శనివారమా .. సరిగ్గా సోమవారం పొద్దున సూర్యోదయానికల్లా ప్రయాణం. పల్లకీ దారిలో ఉంది. జన్మజన్మలకూ మనం మిత్రులుగానే ఉందాం” అని చెప్పి మళ్ళీ నిద్రలోకి జారి పోయిందావిడ.

అంతే మళ్ళీ స్పృహలోకి రాలేదు.

కొడుకులూ కూతుళ్ళూ అట్టహాసంగా ఆవిడను సాగనంపారు. ఇంట్లో పెళ్ళి సందడే.
చివరికి ఉండబట్టలేక పన్నెండో రోజున అమ్మ జ్ఞాపకార్ధం ఏమైనా ఇద్దామా అంది మల్లిక.

“మా సంగతులు మేం చూసుకోగలగం. నీ సలహాలు అనవసరం. అయినా ఆర్నెల్లుగా చాలానే ఖర్చైంది. అన్నాడు రెండో వాడు.

ఆస్థి పంపకాలలో మల్లగుల్లాలు పడుతున్నమిగతాముగ్గురూ మొహాలు మాడ్చుకుని మాటమంతీ లేకుండా కిమ్మనలేదు.

ఫొటోలో రాజేశ్వరి మొహం మీద చిరునవ్వు కనిపించింది మల్లికకు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article