చాలా తేలిగ్గా సరదాగా సాగిపోయే ఈ సినిమాలో బాగా పండిన చిన్న చిన్న విషయాలు అనేకం. ఇలాంటి దర్శకులకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకునేవాళ్లలో నేను ఫస్ట్ బెంచీ.
స్వరూప్ తోటాడ
తెలుగు సినిమా ఇదివరకూ చెప్పడానికి భయపడ్డ కొన్ని కధల్ని ఇప్పుడు ధైర్యం చేసి చెబుతుంది. అంటే చిన్న చిన్న కధలన్నమాట. అయితే అచ్చు మన వీధి చివర బడ్డీ కొట్టు దగ్గర నుంచుంటే కనబడే వినబడే దృశ్యాలు, మాటలే సినిమాలో ఉంటాయి అంటే దానికి సినిమా హాల్ కి పోవడం ఎందుకు… చెప్పులేసుకొని ఆ కిరాణా కొట్టుకి వెళ్తే సరిపోతుంది కదా అనే ప్రశ్న చాలా సమంజసమైంది. అలాంటి సినిమా మన రోజువారీ జీవితాన్ని వడపోసి అందులో మనమే తేలిగ్గా తీసుకున్న మార్మాన్నో, గుర్తించని అందాన్నో అది మనకు పట్టివ్వలేనప్పుడు ఈ సినిమాల్లోని realism మన కమర్షియల్ సినిమాల హై డెసిబెల్ తలనొప్పి కంటే ఎక్కువ బోర్ అయిపోతుంది.
నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. Vijay Kumar Kalivarapu సినిమా జయమ్మ పంచాయితీ తన కధలోని చమత్కారంతో ఈ సవాలుని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. దాని మేరలో అది విజయం సాధిస్తుంది.
ఉత్తరాంధ్ర భాష, అక్కడి వ్యవహారాలు, ఆ కాలంలో అక్కడి మనుషుల తీరుతెన్నులు ఈ సినిమా ఎంచుకున్న హ్యూమర్ స్కేల్ కి గుణించుకొని బాగా తెరకెక్కించాడు దర్శకుడు. చాలా తేలిగ్గా సరదాగా సాగిపోయే ఈ సినిమాలో బాగా పండిన చిన్న చిన్న విషయాలు అనేకం. ఇలాంటి దర్శకులకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకునేవాళ్లలో నేను ఫస్ట్ బెంచీ. జీవితానికి దగ్గరైన కధలకూ మన సినిమా చోటివ్వాలి కదా మరి.
ఈ దర్శకుడు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలి. ఇదే passion, ఇదే నిజాయితీ, ఇదే కసితో ముందుకు వెళ్ళాలి.
బరువైన మెలోడ్రామా వైపు పోకుండా హాస్యంతోనే ఎక్కువ కథను చెప్పడంతో సులువుగా చూడదగ్గ సినిమా అయ్యిందిది. అలా అని పైపైనే ఏదో కథ నడిపించి అయ్యిందనిపించలేదు. ప్రస్తుతం చిన్న సినిమా చర్చకు తీసుకొస్తున్న సామాజికాంశాలు ఈ కథ కూడా తన పరిధిలో చర్చిస్తుంది.
విమర్శలు లేవా అంటే ఉన్నాయి. ఇపుడిప్పుడే ఓ కొత్త దారి తొక్కుతూ ఉత్సాహపడుతున్న యువ దర్శకుల మీద విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు. దర్శకత్వం అవకాశాల కోసం తిరుగుతున్న కొంత మంది స్నేహితులు ఉండటం వల్ల, తెలిసిన వాళ్ళ సినిమా కధా చర్చల్లో ఈ మధ్య పాల్గొంటుండడం వల్ల ఈ మొత్తం ప్రహసనంలో ఓ కొత్త కథతో వచ్చిన కుర్రాణ్ణి ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో ఎన్ని రాజీలు పడమంటారో, ఎన్ని తిప్పలు పెడతారో నేను చూస్తున్నాను. ఓ కథను ఒప్పించే క్రమంలో దాని కొమ్మల్ని ఎన్నిసార్లు ఖండించాల్సి వస్తుందో నాకు తెలుసు. ఓ సినిమా పూర్తిగా రూపుదిద్దుకున్నాక ఆ దర్శకుడి ఒరిజినల్ విజన్ ఏంటి, సినిమాలో చివరికి తెరకెక్కింది ఏంటి అన్నది ఆ దర్శకుడొక్కడికే తెలుస్తుంది. అందుకే నవతరం దర్శకుల మీద (ప్రత్యేకించి కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్న దర్శకుల మీద) అది అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని విమర్శలు చేయబుద్ధి కాదు. అలా అని నచ్చినవి మాత్రమే మాట్లాడి విమర్శ చేయకపోతే వాళ్ళను mollycoddle చేసి ఒక false approval ఇచ్చి చెడగొట్టిన వాళ్ళము అవుతాము. అదీ వాళ్లకు మంచి చేయదు. అందుకే తెలుగు సినిమాల పట్ల సైలెంట్ గా ఉంటాను.
నా అభిప్రాయం పైకి చెప్పడం ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని దర్శకుడు విజయ్ అభిప్రాయపడటం వల్ల ఈ ఒక్క సినిమా గురించి నోరు విప్పాను. ఐనా విమర్శల జోలికి పోవడంలేదు. ఇప్పటి కొత్త దర్శకులందరి సినిమాల మీదా ఒక కామన్ విమర్శ తర్వాత ఎప్పుడైనా రాస్తాను.
విజయ్ గారూ, ప్రశంసలు, విమర్శలు, లెక్కలు తర్వాత. మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలి. ఇదే passion, ఇదే నిజాయితీ, ఇదే కసితో ముందుకు వెళ్ళాలి. మీరు కథ ఎంచుకున్న తీరు, చెప్పిన తీరులో చమత్కారం పాళ్ళు ఇంకా పెంచి మరెన్నో తమాషా సినిమాలు చేయాలి. All the best.
- Now the film is streaming on amazon prime video.
స్వరూప్ తొడట వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సినిమాలు చూడటం, వాటిని సామాజిక మాధ్యమాల్లో విశ్లేషించడం ఇష్టమైన ప్రవృత్తి. తాను షార్ట్ కాన్సెప్ట్ సినిమాలు తీయడమే కాదు, వాటిలో నటిస్తాడు కూడా. స్వరూప్ తోటాడ కొన్ని మసాల కింద వెలువరిచిన వ్యాస సంపుటి -UNTITLED అన్విక్షి ప్రచురించింది. దాని ముందు మాట ఇక్కడ క్లిక్ చేసి చదవొచ్చు. అలాగే తాను గతంలో తెలుపుకు రాసిన కథనాలు ఇవి: చీకటి తెలుపు, The Diving Bell And The Butterfly.