Editorial

Monday, December 23, 2024
చారిత్రాత్మకంమన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్

మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్

SURAVARAM

 

ఇద్దరినీ పోల్చకూడదు కానీ, పోల్చవలసివస్తే – కాశీనాథుని నాగేశ్వరరావు కంటే సురవరం ప్రతాపరెడ్డి గొప్ప పత్రికా సంపాదకుడని నా అభిప్రాయం.

కె. శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యాలయం బషీర్బాగ్లోని ‘దేశోద్ధారక’ భవన్లో ఉన్నది. దేశోద్ధారక, విశ్వదాత అన్న బిరుదులున్న కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్ర ప్రతిక స్థాపకుడిగా జాతీయోద్యమ అభిమానిగా ఎంతో సేవ చేశారు. ఆయనను జర్నలిస్టులు జ్ఞాపకం చేసుకోవడం అవసరమే. దేశోద్ధారక భవన్లో ప్రెస్క్లబ్వారి ఆడిటోరియం ఉన్నది. దానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టారు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం కూడా అవసరమే. అయితే, ఆ రెండు నామకరణాలను ఒకచోట చూసినప్పుడు ఒక అంతరం కనిపిస్తుంది. ఒకరు పెద్ద, ఒకరు చిన్న, మరి మన ప్రతాపరెడ్డి చిన్నవాడా?

ఇద్దరినీ పోల్చకూడదు కానీ, పోల్చవలసివస్తే – కాశీనాథుని నాగేశ్వరరావు కంటే సురవరం ప్రతాపరెడ్డి గొప్ప పత్రికా సంపాదకుడని నా అభిప్రాయం. ఎందుకంటే – కాశీనాధుని నాగేశ్వరరావు ఒక పారిశ్రామికవేత్త. ఆయన తన వ్యాపారాలకు అనుబంధంగా, తన జాతీయ ఆకాంక్షలకు వాహికగా ఆంధ్ర ప్రతికను ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి ఒక ఉద్యోగార్థిగా ఉన్నప్పుడు ఆయనకు గోలకొండ అవకాశం లభించింది. ఒక రకంగా చూస్తే – ప్రతాపరెడ్డి ఉద్యోగం కోసమే గోలకొండ పత్రిక అవతరించింది.

తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ( TJF) ఇరవై ఏళ్ల క్రితం తెచ్చిన ‘తెలంగాణ, మే 31, 2000’ పుస్తకంలోని తొలి వ్యాసం ఇది. నేటి నుంచి మొత్తం పదమూడు వ్యాసాలను ధారావాహికంగా ‘తెలుపు’ ప్రచురిస్తుంది.

రేపటికి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్ళ నిండుతున్న సందర్భంగా ఈ వ్యాసాలు ద్విదశాబ్ది చరిత్ర గల ‘ఫోరం’ ఏర్పాటుకు గల ఆవశ్యకతను తెలుపడంతో పాటు, ఆ నాడే ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రభలమవుతున ఆకాంక్షను పాత్రికేయం లోకం ఎలా వ్యక్తం చేసిందో, ఎందుకు ఆయా అంశాలను బాధ్యతగాను నాటి సమాజం మందు పెట్టిందో నేటి తరం భేరీజు వేసుకోవడానికి కూడా ఉపకరిస్తాయి.

గోలకొండ పత్రికకు పెట్టుబడి పెట్టింది ఎవరు? – అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధాం చెప్పలేము. ఆ పత్రికకు కావలసిన పెట్టుబడిని అనేక మంది సంస్థానాధీశ్వరులనుంచి, దేశ్ ముఖులనుంచి విరాళాల రూపంలో రాజబహదూర్ వెంకట్రావురెడ్డి సేకరించారు. ఒక నామమాత్రపు ప్రచురణకర్త (గడ్డంపల్లి రామకృష్ణారెడ్డి) ఉండేవారు. అన్ని బాధ్యతలు ప్రతాపరెడ్డివే. వంద రూపాయల జీతంతో ఆయ జీవితం ప్రారంభమైంది.

ఆంధ్ర ప్రతికకు ఒక పాఠక నియోజకవర్గం ఏర్పడింది. వేగంగా ఏర్పడుతోంది. స్వాతంత్ర్యోద్యమ అభిమానులు, ఆంధ్రోద్యమ అభిమానులు ఆంధ్ర ప్రతికకు పారకులు. (ఆయా ఉద్యమాలకు ఆంధ్ర పత్రిక కూడా దోహదం అందించింది గోలకొండ పత్రిక 1926లో ప్రారంభమైనప్పుడు తెలంగాణాలో అక్షరాస్యుల సంఖ్య చాలా తక్కువ. ప్రజాస్వామిక ఉద్యమం ఇంకా ప్రారంభమే కాలేదు. గ్రామీణ ప్రాంతాలలో భూస్వాముల దౌర్జన్యపాలన, రాజధానిలో తెలుగేతరుల ప్రాబల్యం ఉండేది. బ్రిటిష్ ఇండియాలో పత్రికారచనకు ఎన్నో రక్షణలుండగా, హైదరాబాద్ రాజ్యంలో నిరంకుశత్వం ఉండేది. ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికను నిర్వహించారు.

గోలకొండ పత్రిక స్థాపనకు ముందు, మద్రాసులో న్యాయవాద విద్య చదువుతున్నప్పుడే ప్రతాపరెడ్డికి పత్రికాస్థాపన ఆలోచన ఉండింది. దేశబంధు అంటే పంచముడని అర్థం ఉన్నదని సి.ఆర్.దాసు చెప్పారు కాబట్టి, ఆ పేరుతో ఒక పత్రిక ప్రారంభించాలని ప్రతాపరెడ్డి తన డైరీలో రాసుకున్నారు. గోలకొండ పత్రిక ప్రారంభ సంచికలో ప్రతాపరెడ్డి రాసిన సంపాదకీయాలన్ని చూస్తే ఆయన ఎంతటి నిర్మొహమాటంగా, సూటిగా ప్రజలతో సంభాషించదలచారో తెలుస్తుంది. “…. ఈ పత్రిక ‘రెడ్ల’ కొరకేర్పడినదని కొందరు శంకించి యున్నారు. రెడ్ల యొక్క అభివృద్ధిని గోరుచుండునదైన నితర శాఖలవారికి బ్రతికూలముగా నెప్పటికి నుండదని యందరకు విశద పరచుచున్నాము.. మేము హిందువులందే యననేల మతాంతరవాలంబకులందును భేదమేమాత్రమును జేయువారము కాము. ముఖ్యముగా నాంధ్రులలో నగ్రజన్ములను వారిని మొదలుకొని యంత్యజన్ములను వారి వరకును మేము సేవ జేయ యత్నింపగలము..” అని ప్రతాపరెడ్డి ప్రథమ సంపాదకీయం ప్రకటిస్తుంది.

కాశీనాధుని నాగేశ్వరరావుకూ, ప్రతాపరెడ్డికీ ఉన మరొక ముఖ్యమైన భేదం ఏమిటంటే ఆంధ్ర ప్రతికకు వాస్తవ సంపాదుకులు వేరే ఉండేవారు. నాగేశ్వరరావు ఎప్పుడూ పూర్తి సంపాదకత్వం వహించలేదు. ప్రతాపరెడ్డి ఇతరుల పేరు మీద కూడా సంపాదకత్వం నిర్వహించిన వ్యక్తి. భారతికి ధీటు రాగలిగిన సాహిత్య పత్రిక ‘సుజాత’కు పసుమాముల నృసింహశర్మ సంపాదకుడిగా ఉన్నప్పటికీ ఆ పత్రిక మీద ప్రతాపరెడ్డి ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. (గుడిపాటి వెంకటచలం కథలను భారతి సహా కోస్తాంధ్ర మర్యాదస్తుల పత్రికలన్నీ నిషేధించినప్పుడు అయన కథలను వరుసగా – ప్రచురించిన ఘనత ఈ సుజాతదే. అందుకే చలం విశాలంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. తెలంగాణ వాళ్ళను సుఖంగా బతకనీయరు ఈ కోస్తావారు అంటారాయన.

ప్రతాపరెడ్డి కుమారుడు ఎస్.ఎన్.రెడ్డి చెప్పినట్టు – ఆయన వారితో ఎప్పుడూ లేడు, అలాగని వారితో ప్రత్యక్ష పోరాటమూ చేయలేదు. తెలంగాణాను ఒక సాంస్కృతిక అస్తిత్వంగా గుర్తించి, దాని మీద అవ్యాజమైన ప్రేమను కురిపించిన రచయిత ప్రతాపరెడ్డి, ఆ ప్రేమకు తిరుగులేని సాక్ష్యం ‘గోలకొండ కవుల సంచిక’.

ఎంతో ప్రతికూల పరిస్థితిలో పత్రికను నడిపిన ఘనత ప్రతాపరెడ్డిది. స్వయంగా ఆంధ్రమహాసభ ఉద్యమంలో భాగస్వామి అయి, ఎందరో దేశముఖులతోనూ, సంస్థానాధీశులతోనూ సన్నిహితత్వం ఉన్న సురవరం తన పత్రికలో వారి గురించి వ్యతిరేకంగా రాయడానికి ఏనాడూ సంకోచించలేదు. తన సొంత కులమైన రెడ్లలో విద్య మీద ఉన్న అనాసక్తిని, సామాన్యుల మీద వారు చూపించే దౌష్ట్యాని ఆయన ఎంత గానో వ్యతిరేకించారు. ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల వశం కావడన్ని, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కానీ, అలాగని దొరతనాన్ని ఆలింగనమూ చేసుకోలేదు. ప్రతాపరెడ్డి కుమారుడు ఎస్.ఎన్.రెడ్డి చెప్పినట్టు – ఆయన వారితో ఎప్పుడూ లేడు, అలాగని వారితో ప్రత్యక్ష పోరాటమూ చేయలేదు. తెలంగాణాను ఒక సాంస్కృతిక అస్తిత్వంగా గుర్తించి, దాని మీద అవ్యాజమైన ప్రేమను కురిపించిన రచయిత ప్రతాపరెడ్డి, ఆ ప్రేమకు తిరుగులేని సాక్ష్యం ‘గోలకొండ కవుల సంచిక’.

అస్పష్టమైన యాజమాన్యంతో, రాజబహదూర్ ప్రేరణతో నడచిన గోలకొండకు 1946 ప్రాంతాలలో ఒక వ్యవస్థ ఏర్పడింది. దాన్ని ఒక లిమిటెడ్ కంపెనీగా మార్చారు. వనపర్తి రాజా దానికి నిర్వాహకులయ్యారు. ప్రతాపరెడ్డి స్వతంత్ర వ్యవహారశైలి వనపర్తి రాజా వంటి ‘సోషలిస్టు’కే నచ్చలేదు. ధోరణిలో మార్పు గమనించిన ప్రతాపరెడ్డి రాజీనామా తరువాత కొత్తూరు సీతయ్యగుప్తతో కలసి ప్రజావాణి వారపత్రికను స్థాపించి అతి కొద్ది కాలం నడిపారు.

ఇంకా విశాలాంధ్ర ఏర్పడకముందే, పోలీసు యాక్షన్ తరువాత హైదరాబాద్ రాష్ట్రంలోకి వెల్లువలాగా వస్తున్న కోస్తాంధ్రుల వలసను చూసి ప్రతాపరెడ్డి విముఖులయ్యారు. తెలంగాణాలోకి వస్తున్న కోస్తాంధ్ర పత్రికలను చూసి బాధపడ్డారు. సినిమాతారల ముఖచిత్రాలతో వస్తున్న పత్రికలను, వాటి వ్యాపార దక్షతను తట్టుకుని తెలంగాణా పత్రికలు నిలబడలేవని బాధపడ్డారు. ఆయన అనుకున్నట్టే అయింది. గోలకొండ పత్రిక 1965 ప్రాంతంలో మూతపడింది. కోస్తాంధ్రనుంచి ఒక్కొక్కటీ పత్రిక వచ్చి మొత్తం తెలంగాణాను ఆక్రమించడం మొదలు పెట్టింది. ఆ ఆక్రమణ సంస్థలలో పనిచేయడానికి ఒక కొత్త తరం జర్నలిస్టులు రూపొందారు. వారే ఇప్పుడు తెలంగాణా అస్తిత్వపు గొంతుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు.

  • కె. శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు

తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక పుస్తకం  కోసం క్లిక్ చేయండి

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article