Editorial

Monday, December 23, 2024
కథనాలుSUNDAY SPECIAL : సోషల్ మీడియా పోకడలపై 'సింప్లీ పైడి'

SUNDAY SPECIAL : సోషల్ మీడియా పోకడలపై ‘సింప్లీ పైడి’

మన జీవన శైలిని సామాజిక మాధ్యమాలు ఎంతగా మారుస్తున్నాయో గ్రహించడానికి పైడి శ్రీనివాస్ కార్టూన్లు కూడా ఒక ఉదాహరణ. అవి మన వర్తమాన స్థితిపై వేసిన చురుకైన సెటైర్ గానూ భావించవచ్చు.

కందుకూరి రమేష్ బాబు 

గత దశాబ్దకాలంలోనే మన జీవన శైలి విపరీతంగా మారిపోయింది. కంప్యూటర్, టెలివిజన్, ఫోన్ -ఈ మూడు పెట్టెలు ఎప్పుడైతే ఒకటొకటిగా మనకు అందుబాటులోకి వచ్చాయో ఒక శతాబ్దంలో జరిగిన మార్పులతో పోలిస్తే అంతకన్నా ఎక్కువ మార్పులు కేవలం ఒక్క దశాబ్దంలో సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఇక ల్యాండ్ ఫోన్ సెల్ ఫోన్ గా మారాక అటు తర్వాత అది స్మార్ట్ ఫోన్ గా మన చేతుల్లోకి మారాక ఆ మార్పు చెప్పనలవి కాదు. ఇక…ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సౌకర్యం చేతుల్లోకి వచ్చాక పరిస్థితి మరింత వేగంగా మారిపోయింది. ఒక్క మాటలో మన సమాజం సామాజిక మాధ్యమాలలోనే చక్కర్లు కొడుతోందంటే అతిశయోక్తి కాదు. ఇక కరోనా కాలంలో ఇల్లే కార్యాలయం అయ్యాక మనిషి ఈ మూడు పెట్టేల్లోనే బందీ అయ్యాడు. అనేక విధాలా ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు కూడా కానవస్తున్నాయి.

కొండను అద్దంలో చూపినట్టు కళాకారులు సమాజాన్ని అధ్బుతంగా ప్రతిబింబిస్తారు. అందులో కట్టే కొట్టే తెచ్చే అన్న రూపంలో చెప్పే ‘కార్టూనిజం’ ఒక మంచి సూక్ష్మదర్శిని.

కాగా, ఫేసు బుక్, యూ ట్యూబ్ తదితర మాధ్యమాల ప్రభావంతో శారీరక మానసిక ఆరోగ్యమే కాదు, మనిషి వ్యక్తిగత, కౌటుంబిక జీవితం పెను ప్రభావానికి గురవుతోందనే చెప్పాలి. దాన్ని లోతుగా అధ్యయనం చేసి, విస్తృతంగా విశ్లేషించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే కొండను అద్దంలో చూపినట్టు కళాకారులు సమాజాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తారు. అందులో కట్టే కొట్టే తెచ్చే అన్న రూపంలో చెప్పే ‘కార్టూనిజం’ ఒక మంచి సూక్ష్మదర్శిని. ఆ విభాగంలో వర్తమాన స్థితిని చక్కగా పసిగట్టి సరదాగానే ఐనప్పటికీ సోషల్ మీడియా పోకడలపై సున్నితమైన వ్యంగ విమర్శ చేస్తున్న కార్టూనిస్టుల్లో పైడి శ్రీనివాస్ చెప్పుకోదగిన ఆర్టిస్ట్. ఇటీవల వారి కొన్ని కార్టూన్లు సన్నిహితంగా చూద్దాం.

ఇంట్లో గొడవ పడటం కామన్. ఐతే ఇప్పుడు కోపాన్ని భార్యా పిల్లలపై కాదట. ఫేసు బుక్ ఫ్రెండ్స్ పై తీరుస్తున్నారట! ఇది నేడు ‘పైడి’ విసిరిన కార్టూన్.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో ప్రజలు ఎక్కువ ఫాలో అయింది రాంగోపాల్ వర్మ  Twitter యుద్దమే. అది కూడా వర్మ – పేర్ని నాని వివాదం ప్రధానంగా సోషల్ మీడియాగా జరిపిందే అని జ్ఞాపకం చేసే కార్టూన్ ఇది.

దీనిపై చెప్పేదేముంది. అస్తమానం అదే పని అంటే తప్పేముంది!

నిజమే. పిల్లల భాషా యాసలు… మాటలు సంభాషణలు అన్నింటా  యూట్యూబ్ లేదా టివి విశేషాలే కదా! మనం మాట్లాడేవి ఇప్పుడు పట్టుకుని అప్పజెప్పే పరిస్థితి ఎక్కడుంది?

రాజకీయ నాయకుల వాద వివాదాలు, సవాళ్ళు ప్రతి సవాళ్లు, తొడ కొట్టడాలు, “నువ్వెంత… అంటే నువ్వెంత” అనుకోవడాలు మొదలు… తీవ్ర స్థాయికి వెళ్లి దుర్బాషాలాడటం దాకా …పిల్లల చెవులో పడకుండా ఉండటం సవాలే!

ఇటీవల బుల్లెట్ బండి సాంగ్ ఎట్లా వైరల్ అయిందో మనకు తెలుసు. నిజానికి అది యూట్యూబ్ సాంగ్. దాన్ని ఒక అమ్మాయి చూసి డ్యాన్స్ చేయడంతో ఆ పాట ప్రతి పెళ్లి వేడుకలో తప్పనిసరి ‘ఐటెం’గా మారింది. పెళ్ళికూతురు ఆ డ్యాన్స్ కి తయారుగా ఉండటం ఒక కండిషన్ గా మారింది. పై కార్టూన్ ఆ తమాషా స్థితిని యధాలాపంగానే ఐనా వాస్తవికంగా ఆవిష్కరిస్తోంది.

కరోనా ఫస్టు…సెకండ్ వేవ్స్ దాటి మూడో వేవ్ లోకి వచ్చాం. నిజానికి ఫస్టు లాక్ డౌన్ లో ఇంటిపట్టున బందీ ఐనప్పుడు గానీ కరోనా సోకిన వారు క్వారంటైన్ లో ఉండటం గానీ, ఈ ఏడాది, రెండేళ్ళ కాలంలో ప్రతి వార్తా టీవీ ద్వారా తెలువాల్సిందే. తెలిసిన కొద్దీ భయం!

దినదినం కరోనా మృతుల వివరాలు తెలిసినకొద్దీ ఎంత ఆందోళన పడ్డాం. అతిశయోక్తి కాదుగానీ వార్తలు తెలిసిన కొద్దీ ప్రతి ఒక్కరం ఎంత ఒత్తిడికి గురయ్యాం!

హస్యాస్పదంగానూ మన ప్రవర్తన లేదా? ఆఖరికి కింది కార్టూన్ లో చెప్పినట్టు వ్యాక్సిన్ వేసుకున్నా ఆ సంగతి ఫేసు బుక్ లో షేర్ చేసుకోవాల్సిందే. స్టేటస్ లో పెట్టుకోవాల్సిందే.

తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోవడంతో ఎవరి ప్రొఫైల్ పిక్చర్ అయినా ఫేస్ బుక్ వాల్ పై సడెన్ గా కనిపిస్తే …”పాపం పొయాడేమో” అనుకోలేదా మనం!   ఇటువంటి ప్రతి విషయాన్నీ పైడి శ్రీనివాస్ తన కార్టూన్లలో నమోదు చేయడం విశేషం.

నిజానికి మనకు తెలియకుండానే మన స్పందనా ప్రతిస్పందనా ముందు చెప్పినట్టు టివి ఫోన్ కంప్యూటర్ .. ఈ మూడు పెట్టెల నుంచి జరగడం, అది సోషల్ మీడియా యాక్షన్ రియాక్షన్ ల ఆధారంగానే ముడివడి ఉండటం ఇప్పుడు చిత్రమేమీ కాదు.

అంతెందుకు? మనం బయటకు వెళితే బంధువులు సైతం పాత పరిచయం నుంచి పలకరింపుగా నవ్వడం కాదు, ఇటీవలి ఫేసు బుక్ పోస్టులు, గ్రూపు షేర్లు, స్టేటస్ లో పెట్టిన అంశాల ఆధారంగానే మనల్ని గుర్తుపట్టి పలకరించడం మామూలే అయింది. పరిచితులైనా అపరిచితులైనా ఇప్పుడు ముఖపరిచయంతో కాదు సోషల్ మీడియా అనుబంధాలతోనే దగ్గరగా ఫీలవుతున్నరూ అంటే అతిశయోక్తి కాదు.

నిజమే. ఫ్రెండ్ షిప్ లు సరే. గొడవలూ పెరిగాయి. ఒకరితో ఒకరు గొడవ పడటానికి వ్యక్తిగత సమస్యలు కూడా కారణం కావడం లేదు. ఫేసు బుక్ లో పంచుకున్న అభిప్రాయాలు, బేదాభిప్రాయాలే ముఖ్యం అవుతున్నాయి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article