Editorial

Wednesday, January 22, 2025
లైఫ్ స్టైల్విజయం తెలుపు - విశ్వ విజయేంద్ర ప్రసాద్ అంతరంగం తెలుపు

విజయం తెలుపు – విశ్వ విజయేంద్ర ప్రసాద్ అంతరంగం తెలుపు

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు

vijayendra

‘ప్రసిద్ధ టీవీ ప్రజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తనని ఇంటర్వ్యూ చేస్తూ ‘మీ విజయ రహస్యం ఏమిటీ? అని అడిగారట. దానికి విజయేంద్ర ప్రసాద్ చిద్విలాసంగా నవ్వి, ‘సింప్లిసిటీ’ అని చెప్పారు.ఆ జవాబుకి ఎలా రియాక్ట్ కావాలో రాజ్‌దీప్‌కు అర్థం కాలేదు.

కందుకూరి రమేష్ బాబు 

దాపు ఆరేళ్ళ క్రితం. అది మణికొండలోని విజయేంద్ర ప్రసాద్ కార్యాలయం. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. తెలుగు ప్రజల నుంచే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ కాల్స్ వస్తున్నాయి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఇంకా ఇతర భాషలు కూడా. అవును మరి. ఆయన అప్పుడు దేశంలోనే నంబర్‌వన్ సినీ రైటర్. బహుశా ఇప్పుడు కూడా.

తొలి అంతస్థులోని ఒక ఫ్లాట్. కొడుకూ తానూ ఒకటే ఆఫీసును షేర్ చేసుకునేలా ఉన్నారు. కాకపోతే ఖాళీగా ఉన్న ఈ చైర్ ఎవరిదీ? అంటే రాజమౌళిది అన్నారాయన. వారి అబ్బాయి రాజమౌళి లేరు. కానీ, ఆయన ఎదురు కుర్చీలో కూచొని ఒక కథకుడిగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఒక పత్రికకోసం చేసిన ఆ ఇంటర్వ్యూను, అందలి రెండు ముఖ్యాంశాలను నేడు వారి జన్మదినం సందర్భంగా పంచుకోవాలనిపిస్తోంది.

భజరంగ్ భాయిజాన్ విజయం నేపథ్యంలో ప్రసిద్ధ టీవీ ప్రజెంటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తనని ఇంటర్వ్యూ చేస్తూ ‘మీ విజయ రహస్యం ఏమిటీ? అని అడిగారట. దానికి విజయేంద్ర ప్రసాద్ చిద్విలాసంగా నవ్వి, ‘సింప్లిసిటీ’ అని చెప్పారు. ఆ జవాబుకి ఎలా రియాక్ట్ కావాలో రాజ్‌దీప్‌కు అర్థం కాలేదు. అప్పుడు విజయేంద్ర ప్రసాదే వివరించారు. ఎంత సంక్షిష్టమైనదైనా సరే, సరళం చేయడమే నా విజయ రహస్యం అన్నారు. ఐతే, ఆ సరళత్వం అన్నది ఒక శైలి. మరి ఆ జీవన శైలి కేవలం జీవించడంలోనే అబ్బదు. ఎటువంటి విలువలతో జీవిస్తామో, మరే విలువలకు కట్టుబడి బతుకుతామో అదే ఆ సరళికి కారణం అవుతుంది తప్పా అది బయటి లోకాలనుంచి గ్రహించేది కాదన్నది ఆయన మాటల్లో ధ్వని. అది విన్న రాజ్ దీప సర్దేశాయ్ తనని పరిశీలనగా చూశారు.

అవును. తనలో అది ఉన్నది. ఆ సరళి ఒకటి తనలో ఉన్నది. బహుశా అందుకే ఆయన మాటలు లోతుగా ఉన్నాయి. కాలు మీద కాలు వేసుకుని రిలాక్సుడ్ గా కూచోవడం ఆయనకు అలవాటు. ముందే చెప్పినట్టు కిటికీ పక్కన కొడుక్కి కుర్చీ వదిలి తాను కథకుడిగానే ఇంటర్వ్యూ ఇస్తున్నారు వినమ్రంగా.

మళ్లీ తానన్నారు. బాహుబలి, భజరంగ్ భాయిజాన్. ఈ రెండు సినిమాలకూ కథ అందించిన రచయితగా నాకు లభించిన ఈ అసాధారణ విజయం గొప్ప ఆనందాన్నే ఇస్తోంది. అయితే, ఆనందం కన్నా ముఖ్యమైన విషయం ఆత్మానందం. అది ఇచ్చే తృప్తీ, శాంతి కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. అదే నా ఆశయం అన్నారు కూల్‌గా.

వీర రసాన్ని ఒకవైపు, కరుణ రసాన్ని మరోవైపు తన కలం ద్వారా ఒలికించి, ప్రేక్షకులను మెప్పించి భారతదేశంలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను సృష్టించిన కథా రచయిత ఆయన. ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్లను దాటి ఆ రెండు సినిమాలూ విజయవంతంగా ప్రదర్శితమౌతున్నాయంటే అది మామూలు విజయం కాదు. అదంతా విజయేంద్ర ప్రసాద్ ఓపికగా మూటగట్టుకున్న విజయమే.

ఎప్పుడో షోలే వంటి సినిమాలకు కథ అందించిన సలీం జావెద్ వంటి రచయితలు పొందినట్లాంటి గౌరవం మళ్లీ ఒక రచయిత, అదీ మన తెలుగు రచయిత పొందుతున్నాడంటే, సినీ పరిశ్రమతోపాటు ఇతర రంగాల్లోనూ ఒక సంచలనం. ఇంటా బయటా అతడి విజయాన్ని అభినందిస్తున్న ఒక అపురూప సందర్భం ఇది. మరి, ఇంతటి విజయం వరించిన సందర్భంలో ఆ రచయిత అంతటి విజయానికి ఎలా స్పదిస్తారన్నది సందేహం. అందుకే ఆయనతో కాసేపు ప్రశాంతంగా గడపడానికి ఎంచుకోవడం.

చూస్తూ అడిగాను. ఈ విజయంలో ఎలా ఉన్నారు? అని అడిగాను.

ఆయన స్థితప్రజ్ఞుడిలా నవ్వారు.

రెండూ సూపర్ డూపర్ హిట్సే. కానీ, తాను ఒక్క మాటలో తేల్చేశారు. ‘విజయం అన్నది పాలపొంగు వంటిదే’ అని అన్నారు.  ‘ఆ విజయానికి తాను పొంగిపోవడం లేదు’ అని చెప్పారు.

‘ఇవ్వాళ ఉన్న విజయం రేపు ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ, శాశ్వతమైంది ఏమిటా అన్నదే ముఖ్యం’  అని తేల్చి వేశారు.

విజయం తెచ్చిన తృప్తీ, ఆనందాన్ని ఆయన ఫీలవడం లేదని కాదు. ఫీలవుతూనే ఉన్నారు. ఆనందిస్తూనే ఉన్నారు. ఆ విషయం అంగీకరించారు కూడా. కానీ, అంతకన్నా ఎక్కువ నాకు బయట కాదు, లోపలి విజయం ముఖ్యం అన్నారు.

‘బయట విజయం పేరిట మూట గట్టుకునేదంతా అనవసరమైందే. అది సూపర్‌ఫ్లుయస్. బావుంటుంది. కానీ, లోపల. లోపల ఆత్మసాక్షి నిన్నటికన్నా ఈ రోజు సంతృప్తిగా ఉన్నావా లేదా? అని చెక్ చేస్తుంది. ఏ రోజు కారోజు జవాబిచ్చుకోవడమే ముఖ్యం. అక్కడ నిన్నటికన్నా నేడు మరింత బెటరుగా, శాంతితో ఉంటే అదే విజయం’ అన్నారాయన.

అయితే, తాను ‘మొన్నటికన్నా’ అనలేదు. ‘నిన్నటికన్నా ఇవ్వాళ బెటరా అన్నదే ముఖ్యం’ అన్నారు. అట్లా తాను నిరంతరం తనను తాను స్థిమిత పర్చుకుంటూ వెళ్లే మనిషి. నేడు ముఖ్యంగా భావించే మనిషి. అంతకన్నా ముఖ్యం. తాను కొన్ని ఉదాత్తమైన విషయాలతో బతుకుతున్న మనిషి. కొన్ని సదాశయాలున్న మనిషి. ఉంటున్నది సినీ పరిశ్రమే అయినా, ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి. తనకంటూ ఒక జవాబుదారీ తనాన్ని ఆకాంక్షించే నిండు మనిషి. ‘సంతృప్తి, ఆత్మశాంతితో జీవించేందుకు ప్రయత్నించడమే నా జీవిత గమ్యం, గమనం, ఆశయం’ అన్నారాయన. ఇక్కదే తాను వాళ్ళ నాన్న అప్పారావు గారిని  తల్చుకున్నారాయన.

నాన్న తిరస్కరిస్తూ చెప్పిన ఆ మాటలు నాకెప్పుడూ వారి సదాశయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి అని ఒక్క క్షణం ఆగారాయన.

ఒకనాడు ఎ వన్ కాంట్రాక్టర్ నా తండ్రి. ఏటా లక్ష రూపాయల ఇన్‌కంటాక్స్ కట్టేవారు. ఒకాయన నాన్నకి సూచించారు, కుటుంబ సభ్యులు ఒక ఫర్మ్‌గా ఏర్పడితే-పదిహేను వేలతో బయట పడొచ్చని! కానీ, నాన్న తిరస్కరిస్తూ చెప్పిన ఆ మాటలు నాకెప్పుడూ వారి సదాశయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి అని ఒక్క క్షణం ఆగారాయన. ‘పదేళ్ల వయసులో నాపై చెరగని ముద్ర వేసిన ఆ మాటలే నాకు స్ఫూర్తి’ అంటూ ఇలా వివరించారాయన.

నాన్న ఆ అవతలి వ్యక్తిని అడిగారు. ‘ఎందుకు నా కుటుంబ సభ్యులతో నేనొక ఫర్మ్‌గా ఏర్పడాలి? వాళ్లేమైనా నాతో కలిసి కష్టపడ్డారా’? అని ప్రశ్నించారు. ‘వాళ్లకు బదులు నా పెద్ద కొడుకుకే ట్యాక్స్ కడతాను అన్నారు. ప్రజల బాగోగులు చూసే ప్రభుత్వమే నాకు పెద్ద కొడుకు. అతడికే నేను ట్యాక్స్ కడతా’ అన్నారు.

ఆవయసులో పెద్ద కొడుకంటే ఎవరో నాకు అర్థం కాలేదు. కానీ, ప్రభుత్వమే అని అర్థమయ్యాక ఆ మాటలు నాపై చెరగని ముద్ర వేశాయి అని గుర్తుచేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ‘విజయం అంటే నమ్మిన విలువలు. వాటికి అంకితం కావడం’ అన్నట్లు మాట్లాడారాయన.

‘అలా బతికారు మా నాన్న. అదొక సదాశయం. ఇట్లా కొన్ని జీవన విలువలున్నాయి. వాటితో మదింపు చేసుకుని, అలాంటి మనిషి ఆచరించిన విలువలకు దగ్గరగా బతకడమే నా దృష్టిలో విజయం. అంతేతప్పా బయట ఒక్కపరి కనిపించే పాలపొంగు వంటి విజయంతో నాకు నిమిత్తం లేదు’ అని వివరించారాయన.

అప్పుడర్థమైంది, తాను జీవితాన్ని అనుసరించి వెళుతున్న విజేత అని! పాలపొంగులా ఉండే విజయం గురించి ఆయనకు భ్రమలు ఎప్పుడో తొలగిపోయాయని! డెబ్భయ్యేళ్ల విశ్వ విజయేంద్ర ప్రసాద్ తన పేరులోనే ఉన్న విజయాన్ని గౌరవంగా హుందాగా మోస్తూనే విజయ వాకిట తన తండ్రిని ప్రతిష్టించి మాట్లాడిన మాటలు బలంగా వినవస్తున్నాయి. అవి తానేమిటో నిజంగానే తెలుపుతున్నాయి.

‘తెలుపు’ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ మరిన్ని కథలతో తానువిశ్వ విజేత కావాలని అభిలషిస్తున్నది.ఈ కథనాన్ని పాఠకులకు పుట్టినరోజు కానుకగా అందిస్తున్నది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article