Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’...

సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’ కాల‌మ్‌

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, ‘బోథ్ లో మొహర్రం’ ఈ వారం.

శ్రీర్ రావు దేశ్ పాండే

బోథ్ తాలూకాలో మొహర్రం ఉత్సవాలు ఒకప్పుడు ఘనంగా జరిగేవి. బోథ్, ధన్నూర్, కన్గుట్ట, సోనాల, కౌఠ, కరత్వాడా తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలకు సవార్లను (పీర్లను) నిలబెట్టే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నది. మునుపటి వైభవం లేనప్పటికీ మొహర్రం ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

బోథ్ లో మా చిన్నప్పటి వైభవోపేతమైన మొహర్రం ఉత్సవాల జ్ఞాపకాలు నా హృదయంలో తాజాగానే ఉన్నాయి. మత సామరస్యానికి, తెలంగాణ సమ్మిళిత సహజీవన సంస్కృతికి ప్రతీకగా నిలచే మొహర్రం సాంప్రదాయం చిన్నగా అయినా ఇంకా కొనసాగడం ఒక ఊరట.

మొహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల. ఈ నెలలో మొదటి 10 దినాలు కర్బల మైదానంలో అమరులైన మహమ్మద్ ప్రవక్త మనుమడు హుసేన్, అతని అనుచరుల త్యాగాలను స్మరించుకుంటూ శోకంలో ఉండే రోజులు. నిజానికి ముస్లింలకు పండుగ రోజులు కావు. శోక దినాలు. అయితే షియా ముస్లింలు కర్బల మైదానంలో జరిగిన యుద్ధంలో అమరులైన వారిని ఐదు వేళ్ళ పంజాను ముఖోటాగా పీర్లను పేర్చి ఆషూర్ ఖానాల్లో నిలిపి 10 రోజులు స్మరించుకుంటారు. 9వ రోజున ముఖ్యమైన మొహర్రం ఊరేగింపు ఉంటుంది. ఆ రోజున పేర్లను ఎగిరిస్తూ ఊరేగిస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఈ మొహర్రం ఊరేగింపు ఘనంగా జరుగుతుంది. పాటలు, నిప్పుల గుండం చుట్టూ ధూలా ఆటలు, పగటి వేషాలు, మలీద ముద్దలు, ఊదు పొగలు.. ఇవన్నీ మొహర్రం ఉత్సవాలకు సంకేతాలు. పదవ రోజున ఈ పీర్లకు నీళ్లు చల్లి పీర్లను విప్పేసి పెట్టెలలో సర్ది మరుసటి సంవత్సరం దాకా భద్రపరుస్తారు.

మొహర్రం ఊరేగింపు రోజున షియా ముస్లిం యువకులు అమరుల త్యాగాలను స్మరిస్తూ మాతం నిర్వహిస్తారు.. అంటే తమ శరీరాలను రక్తాలు కారేటట్టు హింసించుకుంటూ కర్బల అమరుల త్యాగాలకు నివాళి అర్పిస్తారు. హైదరాబాద్ లో ప్రతీ ఏటా బీబీ కా ఆలం ఊరేగింపులో షియా యువకులు ఈ మాతం జరపడాన్ని చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇటువంటి ఊరేగింపులు జరుగుతాయని పత్రికల్లో వార్తల ద్వారా తెలుస్తున్నది. దేశంలో ఎక్కడైనా షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న చోట పీర్ల ఊరేగింపు, మాతం జరుగుతాయి. అయితే హిందువుల ఆధ్వర్యంలో జరిగే మొహర్రం ఊరేగింపుల్లో ఈ మాతం అనేది నేనైతే చూడ లేదు. ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్దమైనా షియాలు మాత్రం పీర్లను ప్రతిష్టించే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మతమరమైన వివాదాల జోలికి పోకుండా ఈ పీర్ల సాంప్రదాయం తెలంగాణలో, ముఖ్యంగా హిందువుల్లో కూడా ఎట్లా స్థిరపడిపోయిందనేది ఆసక్తిదాయకమైన పరిశీలనాంశం.

మొహర్రం అందరి ఉత్సవం

తెలంగాణ గ్రామాల్లో పీర్ల పండుగ ప్రధానంగా హిందువుల ఆధ్వర్యంలోనే జగడం విశేషం. కొద్దిపాటి ముస్లింల బాగస్వామ్యం ఉన్నప్పటికీ ప్రధానంగా మొహర్రం నెలలో పీర్ల పండుగ హిందువుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పీర్ల పండుగపై విస్తారమని మౌఖిక సాహిత్యాన్ని కూడా గ్రామీణ ప్రజలు ఉత్పత్తి చేశారు.

ఉర్దూ రాని వ్యక్తికి దేవుడు ఆవహించిన సమయంలో ఉర్దూ మాట్లాడడం ఎట్లా సాధ్యమో ఆయనను నిత్యం చూసే వారికి కూడా అర్థం కాని మార్మిక వ్యవహారం.

బోథ్ లో తడక పంజా (పంజేశా), కర్బల, పెద్ద మొగులాలు, చిన్న మొగులాలు మొదలైనవి ముస్లింలు నిలబెట్టే పీర్లు. తెనుగు కులస్తులైన బాగోతుల వేంకటరామ్ కుటుంబం ఆధ్వర్యంలో ‘గుండు పంజా’ అని మరొకటి ఉండేది. గూండ్ల (బేస్త వాళ్ళను ఆదిలాబాద్ జిల్లాలో ఈ పేరుతో కూడా పిలుస్తారు) అడెల్లు కుటుంబానికి రెండు పీర్లు ఉండేవి. ఒక పీరును పెద్దగా, మరొక పీరును చిన్నగా పేర్చడం గుర్తున్నది. పెద్ద పీరును పెద్ద అడెల్లు, చిన్న పీరును అతని కొడుకు చిన్నఅడెల్లు ఎత్తుకునేవారు. పెద్ద అడెల్లు గతించిన తర్వాత చిన్నఅడెల్లు బాధ్యతగా ఈ పేర్ల ఉత్సవాన్ని ఇప్పటికీ నిర్వహిస్తున్నాడు. దానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. పేర్లను నిలబెట్టడానికి పెద్ద అడెల్లు జమానాలో ఒక పక్కా ఠికాణా లేకుండినది. వారి ఇంటి ముందు తాత్కాలికంగా వేసిన పందిళ్ళలో నిలబెట్టేవారు. చిన్నఅడెల్లు పీర్లకు శాశ్వత భవనం కట్టించాడు. ఆయనకు ప్రతీ శుక్రవారం తురక దేవుడు ఆవహిస్తాడు. తమ సమస్యల పరిష్కారం కోసం చాలా మంది శుక్రవారం అడెల్లు వద్దకు వస్తారు. దేవుడు ఆవహించిన సమయంలో అడెల్లు ఉర్దూ తప్ప మరే భాష మాట్లాడడు. ఇతర సమయాల్లో అడెల్లు ఉర్దూ మాట్లాడలేడు. అడెల్లుకు తెలుగు తప్ప మరో బాష రాదు. ఉర్దూ రాని వ్యక్తికి దేవుడు ఆవహించిన సమయంలో ఉర్దూ మాట్లాడడం ఎట్లా సాధ్యమో ఆయనను నిత్యం చూసే వారికి కూడా అర్థం కాని మార్మిక వ్యవహారం. ప్రజలు మాత్రం ఇదంతా తురక దేవుని మహిమ అని నమ్ముతారు.

అడెల్లు పేరు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు కూడా పాకింది. అక్కడి నుంచి కూడా భక్తులు రావడం మొదలయ్యింది. అట్లా చిన్నఅడెల్లు కొంత ఆర్థికంగా స్థిరపడినాడు. డానికి తోడు ఒక మ్యాకల మందను కూడా సాకుతున్నాడు. తనకు వస్తున్న ఆర్థిక వనరులతో మొహర్రం నిర్వాహణను వ్యవస్థీకృతం చేయగలిగినాడు చిన్న అడెల్లు. అందుకు నా లాంటి వారు కూడా కొంత మంది చేతనైనంత విరాళాలు అందజేసినారు. చిన్న అడెల్లు ఆ శాశ్వత పీర్ల భవనంలో ఇప్పటికీ రెండు పీర్లు నిలబెట్టి మొహర్రం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు.

అడెల్లు ఇప్పుడు చిన్న వాడేమి కాదు. అతని వయసు 70 సంవత్సరాలకు పైబడే.

అడెల్లు ఇప్పుడు చిన్న వాడేమి కాదు. అతని వయసు 70 సంవత్సరాలకు పైబడే. పెద్ద అడెల్లు, ఆయన తర్వాత చిన్న అడెల్లు మా బోథ్ భూమికి ఎద్దు పాలుకు వ్యవసాయం చేసేది. అడెల్లు కుటుంబంతో దాదాపు నాలుగు ఐదు దశాబ్దాల అనుబంధం. కర్బల జాతరను తన భుజం మీద ఎక్కించుకొని చూపించేవాడు. తన అనంతరం తన కొడుకులు తమ ఇంటి సవార్లను నిలబెట్టడానికి సిద్దం అయి ఉన్నారని చెప్పాడు చిన్నఅడెల్లు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మొహర్రం ఉత్సవాలు ప్రముఖంగా జరిగే చాలా ఊర్లను కూడా సందర్శించాడు. అడెల్లు కుటుంబం ఇంటి దేవత బోథ్ కు దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడెల్లు పోశవ్వ. పోచమ్మ బోనాల సందర్భంగా అడెల్లు పెద్దక్క భూమక్క షిగం ఊగేది. అట్లానే బాగవతుల వెంకటరాం గారి వారసులు కూడా వారి ఇంటి గుండు సవారిని ఎత్తుకొని నిలబెట్టినారు. పంజేషాను నిలబెట్టడానికి వక్ఫ్ బోర్డు వారిచే కొంత డబ్బు రావడంతో పంజేషాకు, కర్బలాకు, పెద్ద ముగులాలు, చిన్న మొగులాలు సవార్లకు కూడా ఆషూర్ ఖానాలు నిర్మించినారని మిత్రులు తెలియజేసినారు.

కర్బల సవారు జాతర

అయితే బోథ్ లో తొమ్మిదవ రోజున జరిగే మొహర్రం ఊరేగింపులో కర్బల సవారు ప్రధాన ఆకర్షణ. కర్బల సవారును ఆ ఒక్క రోజే ఎగిరించేవారు. మిగతా సవార్లు 9 రోజులు వీధుల్లోకి వచ్చేవి. తడక పంజా మాత్రం ఎగిరేది కాదు. హైదరాబాద్ లో ఉండే బీబీ కా ఆలం లాంటిది అన్నమాట.

మా తండ్రి అంబారావు దేశ్ పాండే సవారుకు దట్టి కట్టి రూపాయి, రెండు రూపాయల నోట్ల దండ వేయడం నాకు ఇప్పటికీ యాదికి ఉన్నది.

కర్బల ఊరేగింపు ఎంత వైభవంగా జరిగేదంటే.. ఇప్పుడు వర్ణించలేను. చుట్టూ పక్కల ఓవర్ల నుంచి, పల్లెల నుంచి వందలాది మంది బండ్లు కట్టుకొని వచ్చేది. చీకటి పడే దాకా ఆ ఊరేగింపు సాగేది. రకరాకాల పగటి వేషధారులు భక్తులను అలరించేవారు. అందులో పులి వేషగాడు, తెల్ల కొయ్య గుర్రం బొమ్మతో, చేతిలో కొయ్య కత్తితో ఊరేగింపులో కలియ దిరిగే వ్యక్తి పిల్లలను బాగా ఆకర్షించేది. కర్బల సవారు ఇంటింటికీ పోయేది. ఇంటి యజమానులు దట్టీలు కట్టేవారు. కరెన్సీ నోట్ల దండలు వేసేవారు. అట్లా కర్బల సవారు మా ఇంటికి కూడా తప్పక వచ్చేది. మా తండ్రి అంబారావు దేశ్ పాండే సవారుకు దట్టి కట్టి రూపాయి, రెండు రూపాయల నోట్ల దండ వేయడం నాకు ఇప్పటికీ యాదికి ఉన్నది. ఆయన బతికి ఉన్నంత కాలం కర్బల సవారుకు దట్టి కట్టినారు. ఆయన తర్వాత కర్బలకు దట్టి కట్టే సాంప్రదాయం కొనసాగిందా లేదా నాకు తెలియదు. అయితే కర్బల మాత్రం క్రమం తప్పకుండా ఏటా మా ఇంటికి వస్తుందని మిత్రులు తెలిపినారు.

వ్యవస్థీకృతం అయిన మొహర్రం

నేను ఇంటర్మీడియట్ చదువు కోసం ఆదిలాబాద్ లో రెండేళ్ళు ఉన్నాను. నా క్లాస్ మెట్ లలో ఖప్పర్ల గ్రామ నివాసి గండ్రత్ ఆశన్నతో ఖప్పర్లలో గొప్పగా జరిగే మొహర్రం ఉత్సవం చూడటానికి పోయేవాడిని. అక్కడ ఉత్సవం వారి కుటుంబం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆదిలాబాద్ తాలూకాలో ఖప్పర్లలో అన్నిటికన్నా బాగా, సాంప్రదాయబద్ధంగా, నిష్టగా జరుపుతారు. నేను ఇంటర్ తర్వాత కూడా ఎన్నో సార్లు ఖప్పర్ల వెళ్ళాను. అక్కడ మున్నూరు కాపుల్లో పెద్ద కొడుకు పేరు ఆశన్న, బిడ్డ పుడితే ఆశమ్మ అని పెడతారు. చాకలి కుటుంబాల్లో ఊశన్న/ ఊశమ్మ అని పెట్టుకుంటారు. ఊరి నిండా ఆశన్నలు, ఊశన్నలే కనిపిస్తారు. ఇంటి పేరు చెపితే తప్ప మనం ఆషన్న/ ఊషన్న జాడ తెలుసుకోలేము. (విచిత్రంగా.. బోథ్ పక్కనే ఉన్న కన్గుట్ట గ్రామంలో కూడా బోలెడు మంది ఆశన్నలు, ఊషన్నలు కనిపిస్తారు). ఖప్పర్లలో మున్నూరు కాపులు పీర్లను ఎత్తుకుంటారు. చాకలి వారు వారికి సహాయంగా తాళ్ళతో సవారును బ్యాలెన్స్ చేస్తారు. పీర్లను చాలా అందంగా నిండుగా అలంకరిస్తారు. అటువంటి అలంకరణ ఖప్పర్లలో తప్ప మరెక్కడా చూడలేదు.

ఇక రుయ్యాడి గ్రామంలో జరిగేది మరో రకం ఉత్సవం. ఈ గ్రామంలో హసన్ హుసేన్ దేవస్థానము పేరిట ఒక పెద్ద గుడి కట్టారు. రుయ్యాడిలో మొహర్రం పండుగను ఒక వ్యవస్త నడుపుతుంది. ఏడాది పొడుగునా వేలాదిగా వచ్చే భక్తుల విరాళాలతో ఆస్తులు, ఆభరణాలు సమకూర్చుకొని సంపన్నవంతంగా నడుపుతున్నారు. బండల నాగాపురం, బరంపురం లాంటి ఊర్లలో కూడా బాగా జరుగుతుందని విన్నాను. రుయ్యాడి, ఖప్పర్ల, బండల నాగాపురం పీర్లను చూసాను.

బోథ్ లో మునుపటి వైభవం ఎందుకు తగ్గింది?

బోథ్ లో మా చిన్నప్పటి కర్బల పెద్ద జాతర ఎందుకు మాయం అయ్యింది అనేది పరిశోధించివలసిన అంశం. ముస్లింలలో షియాలు మాత్రమే మొహర్రం నిర్వహిస్తారు. తెలంగాణలో కుతుబ్ షాహిల కాలంలో మొహర్రం స్థిరపడిపోయింది. కుతుబ్ షాహిలు షియాలు కావడంతో మొహర్రం ఉత్సవాలను బాగా ప్రోత్సహించారు. ఆ ఉత్సవాలు హిందువులకు కూడా పాకింది. నిజంగానే మొహర్రం ఉత్సవాలు తెలంగాణ సహజీవన సంస్కృతికి ప్రతీకగా నిలిచాయి. వారి అనంతరం హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన సున్నీలైన అసఫ్ జాహీలు (నిజాం రాజులు) కూడా ఈ ఉత్సవాలను నిరోధించలేదు. వారు కూడా మత సామరస్యానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన వారే.

బహుషా పక్కీరోని చేను ప్రభుత్వం మార్కెట్ యార్డ్ కోసం సేకరించిన తర్వాత మొహర్రం నిర్వాహణకు డబ్బులు లేక అది మెల్లమెల్లగా కళ తప్పిందని నా భావన.

తెలంగాణలో మొహర్రంపై బోలెడంత మౌఖిక సాహిత్యం వచ్చింది. మొహర్రం నిర్వాహణకు భూములను కూడా ఇనాంగా ఇచ్చినారు నిజాం రాజులు. హిందూ పండుగుల నిర్వాహణ కోసం కూడా నిజాం రాజులు భూములను ఇనాంగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బోథ్ లో దసరా రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శావా ఊరేగింపు నిర్వాహణ కోసం రమణయ్య సారు కుటుంబానికి ఇటువంటి ఇనాం భూమి ఉంది. మా బోథ్ 8 ఎకరాల పక్కిరోని చేను అటువంటి ఇనాం భూమే. ఆ భూమి ద్వారా వచ్చిన ఆదాయంతో మొహర్రం నిర్వహించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం. బహుషా పక్కీరోని చేను ప్రభుత్వం మార్కెట్ యార్డ్ కోసం సేకరించిన తర్వాత మొహర్రం నిర్వాహణకు డబ్బులు లేక అది మెల్లమెల్లగా కళ తప్పిందని నా భావన. ఈ నిధుల లేమి ముస్లింలు నిర్వహించే సవార్లపై తీవ్రమైన ప్రభావం చూపింది. దానికి తోడు అయోద్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జమాత్ ల ప్రభావం కూడా ముస్లింలపై ఎక్కువయింది. గ్రామాల్లో కొద్ది సంఖ్యలో ఉండే షియా ముస్లింలు కూడా సున్నీ జమాత్ ల ఒత్తిడికి గురి అయి నామ మాత్రంగానే నిలబెట్టినారు తప్ప మునుపటి జోష్ మాత్రం లేకుండా పోయిందని ఒక అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అదే సమయంలో.. గూండ్ల అడెల్లు లాంటి హిందూ నిర్వాహకులు దాన్ని వ్యవస్తీకృతం చేసుకొని నిర్వాహణకు ఆర్థిక ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. వారి పీర్లు నిలబడినాయి.

సారాంశంలో .. ఎక్కడైతే ముస్లింల ఆధ్వర్యంలో పీర్లు ఉన్నాయో అవి పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. హిందువులు నిర్వహించే పీర్లు నిలచి ఉన్నాయి.

ఖప్పర్లలో మున్నూరు కాపులు భూమి కలిగిన వ్యవసాయదారులు. వారు పీర్లను వ్యవస్తీకృతం చేయనప్పటికి వారి స్వంత ఖర్చులతోనే మొహర్రం పండుగ నిర్వహిస్తున్నారు. రుయ్యాడిలో ఒక దేవస్తానమే మొహర్రం ఉత్సవాలను నిర్వహిస్తున్నది. సారాంశంలో .. ఎక్కడైతే ముస్లింల ఆధ్వర్యంలో పీర్లు ఉన్నాయో అవి పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. హిందువులు నిర్వహించే పీర్లు నిలచి ఉన్నాయి. ఇదే పరిస్థితి అన్నీ చోట్లలో ఉందని చెప్పడానికి లేదు. ఇది బోథ్ పరిస్థితుల నుంచి వచ్చిన ఒక స్థూలమైన అవగాహన మాత్రమే.

మొహర్రం పై పరిశోధన

కొన్నేళ్ల కిందట అమెరికా నుంచి పీర్ల పండుగ మీద పరిశోధన కోసం ప్రముఖ కవి, రచయిత అఫ్సర్ వచ్చినప్పుడు ఆయనను ఆదిలాబాద్ పక్కనే ఉన్న రుయ్యాడి, ఖప్పర్ల గ్రామాలకు తీసుకుపోయాను. ఆయన మొహర్రం నెల సందర్భంగా రాక పోవడం వలన ఉత్సవాలను చూడలేకపోయారు. అయితే ఉత్సవ నిర్వాహకులతో విస్తృతంగా ముచ్చటించినారు. ఆ తర్వాత బోథ్ కూడా వచ్చాము. ఈ మూడు గ్రామాల్లో మొహర్రం నిర్వాహణ పద్దతులను ఆయన అధ్యయనం చేసినారు. ఈ పర్యటన సందర్భంగా నాకు కూడా ఆ అంశంలో కొంత సమాచారం తెలిసి వచ్చింది. తిరిగి హైదరాబాద్ పోయేటప్పుడు ఆర్మూర్ లో ఆగి నా బాల్య మిత్రుడు గంగాధర్ గౌడ్ ఆథిత్యం స్వీకరించాము. ఆ తర్వాత ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మొహర్రం ఉత్సవాలు ప్రముఖంగా జరిగే చాలా ఊర్లను కూడా సందర్శించి తన అధ్యయనాన్ని కొనసాగించినారు.

అఫ్సర్ గారి పరిశోధనా గ్రంథం “The Festival of Peers” శీర్షికతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, అమెరికా వారు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యయనాంశాలు ప్రస్తావనకు వచ్చినాయో లేదో తెలియదు. అట్లే ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డా. జైకిషన్ గారు కూడా మొహర్రంపై రెండు పరిశోధనా పత్రాలు ఇంగ్లీష్ లో చాలా కాలం కిందనే ప్రచురించానని చెప్పారు.

ముక్తాయింపు

కాగా, బోథ్ తాలూకాలో, ముఖ్యంగా సోనాల గ్రామంలో జరిగే మొహర్రం వేడుకలను ప్రముఖ కథా/నవలా రచయిత బి మురళీధర్ గారు “నిరుడు కురిసిన కల” నవలలో సవిస్తరంగా వివరించినారు. ఆ నవలకు 1995 లో ఆంధ్రప్రభ దినపత్రిక వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉన్నది. ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవాలనుకున్న పాఠకులు ఈ నవలను తప్పక చదవాలని సిఫారసు చేస్తున్నాను.

ఇవీ మొహర్రం పై నా జ్ఞాపకాల అలలు.

భారత సమాజం మతపరంగా విభాజితమై విచ్ఛిన్నం అవుతున్న ఈ కాలంలో మత సామరస్యానికి, సమ్మిళిత సాంస్కృతిక జీవనానికి ప్రతీకగా తెలంగాణ గ్రామాల్లో నిలచి ఉన్న మొహర్రం వేడుకను సమున్నతంగా నిలబెట్టుకోవలసిన సందర్భం మన ముందు ఉంది. సమ్మిళిత, సహజీవన సంస్కృతికి ప్రతీకలుగా ఉన్న ప్రతీ దాన్నిఎత్తి పట్టే సమయం సందర్భం ఇదే.

 

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. మీరు చదివింది ఏడో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article