Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌అంగట్లో 'ఝటాంగి' వెతుకులాట : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

అంగట్లో ‘ఝటాంగి’ వెతుకులాట : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

ఝటాంగీ ఊహా చిత్రం : డా. జెపి. వైద్య, ఆదిలాబాద్

‘ప్రతీ మంగళ వారం అంగడికి ఝటాంగి వస్తుందట. అది మామూలు స్త్రీగానే ఉంటదట. అనుమానం రాకుండా తెలిసిన వారి రూపంలోనే ఉంటదట. దాని పాదాలు మాత్రం ఉల్టా వెనక్కి తిరిగి ఉంటాయట. ఝటాంగిని ఎర్క చేయడానికి అదొక్కటే తేడా. పాదాలు కనబడకుండా కింద వరకు చీర కట్టుకుంటుందట”

చదవండి, బొంతల అంగట్లో అందమైన ఝటాంగి వెతుకులాట…ఈ పద్నాలుగో వారంలో…

శ్రీర్ రావు దేశ్ పాండే

బోథ్ లో వారం వారం అంగడి జరిగే సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉన్నదో తెలువదు కానీ నాకు బుద్ది తెలిసినప్పటి నుంచి ప్రతీ మంగళవారం అంగడి జరగడం చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మంగళవారం అంగడి జరుగుతున్నది. అయితే ఇప్పుడు జరిగే అంగడి జాగా మారింది.

తొలినాళ్ళలో .. అంటే మా చిన్నప్పుడు అంగడి బోథ్ ఊరి ప్రధాన బజారు రోడ్డుపై జరిగేది. రూల్ కృష్ణమూర్తి చౌరస్తా నుంచి మొదలైతే వైద్య నరహరి పంతులు ఇంటి వరకు దుకాణాల వెలిసేవి, పెద్ద మసీదు ముందర ఉన్న విశాలమైన జాగాలో ఎండు చేపల దుకాణాలు వెలిసేవి. అంగడిలో దొరకని వస్తువంటూ ఉండేది కాదు. కూరగాయలు, ఆకు కూరలు, అన్ని రకాల పప్పులు, ఎండు మిర్చి, తిను బండారాలు, పండ్లు, చీరలు, ధోతులు, చిన్న పిల్లల బట్టలు, పచడాలు, గొంగళ్ళు, వంట పాత్రలు, ప్లాస్టిక్ వస్తువులు, కుమ్మరుల కుండలు, రొట్టెలు కాల్చడానికి మట్టి పెంకులు, వంటకు అవసరమయ్యే ఇతర మట్టి పాత్రలు, స్త్రీల అలంకరణ సామాగ్రి రిబ్బన్ లు, పిన్నీసులు, కాటుకలు, పౌడర్లు, సౌరాలు.. ఇట్లా దాదాపు ఊరికి కావలసిన అన్ని రకాల వస్తువులు అంగడిలో అమ్మకానికి వచ్చేవి.

వ్యవసాయ ఉత్పత్తులు రైతులే స్వయంగా అమ్మేవారు. ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో గ్రామ పంచాయతీ స్థలాన్ని నిర్దేశిస్తుంది. వాళ్ళ వద్ద గ్రామ పంచాయతీ రసీదులు ఇచ్చి ట్యాక్స్ కూడా వసూలు చేస్తుంది. అంగడి గ్రామ పంచాయతికి ఒక ఆదాయ వనరు. అదే సమయంలో బోథ్ చుట్టూ ఉండే అనేక గ్రామాల ప్రజలకు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి, తమకు అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లకు ఒక అద్భుతమైన వేదికగా ఉండేది. ఆదివాసీ ప్రజలు బండ్లు కట్టుకొని అంగడికి రావడం నాకు యాదికి ఉన్నది. వారి చిన్న చిన్న చక్డా బండ్ల మీద వరుసగా అయిదారుగు మనుషులు ఒకరి వెనుక మరొకరు కూర్చిండి రావడం ఆసక్తికరంగా ఉండేది. రైతులు తమ చేన్లలో పండే కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఆదివాసీలు అయితే తాము సేకరించిన అటవీ ఉత్పత్తులు.. తేనె, సార పలుకులు, కుంకుడు కాయలు, మొర్రి పండ్లు, తునికి పండ్లు, సితపత పండ్లు (సీతాఫలాలు), ఈత పండ్లు, జీడి పండ్లు, ఇప్ప పూలు.. ఇట్లా చాలా రకాల అటవీ ఉత్పత్తులను అగ్గువ సగ్గువకు అమ్మకానికి పెట్టి ఆ పైసలతో తమకు కావలసిన నూనె, ఉప్పు, చాయ పత్తి, బట్టలు, కుండలు, ప్లాస్టిక్ వస్తువులు, తిను బండారాలు కొనుక్కు పోయేవారు. గొల్ల కుర్మలు మ్యాకలు, గోర్లు, గొంగల్లు అమ్మేవారు. గూండ్ల(బేస్తలు) వారు చేపలు అమ్మేవారు. జ్వరాలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు డాక్టర్లకు చూపించుకునేవారు.

గోరటి వెంకన్న సంత పాటలో రాసినట్టు అంగడి పురా మానవుల కలయికలా, ఎగిసిపడే మానవ కోలాహలానికి, అనేక రకాల మానవ లావాదేవీలకు వేదికగా ఉండేది

మధ్యాహ్నం నుండి అంగడిలో అమ్మకాల, కొనుగోళ్ల కోలాహలం మొదలయ్యేది. టెంట్లు వెలిసేవి. చలికాలంలో బోథ్ లో ఎండ తీవ్రంగా ఉండేది కాదు. ఆ రోజుల్లో బోథ్ ఒక హిల్ స్టేషన్ లాంటిది. చలి కాలంలో ఎండ హాయిగా, వెచ్చగా ఉండేది. వానాకాలం మాత్రం వాన పడితే అంగడి ఆగమాగమయ్యేది. వాన లేని రోజుల్లో బాగానే సాగేది. వాన పడితే అంగడి బురదమయం అయ్యేది. ఆ బురద రోడ్ల మీదనే దుకాణాలు వెలిసేవి. వాన పడితే కప్పడానికి ప్లాస్టిక్ కవర్లు రెడీగా ఉంచుకునేవారు. ఎండా కాలంలో మాత్రం ఎండ వేడిని తట్టుకోవడానికి అంగడి పెద్ద వాగు ఒడ్డున మాముళ్లలో (ఊరుమ్మడి మామిడి తోపు) చెట్ల నీడన జరిగేది. తురక రేవు అవుతల అంగడికి ఏర్పాట్లు జరిగేవి. ప్రజలు పెద్దవాగు దాటుకొని మాముళ్లలో జరిగే అంగడికి పోయేవారు. ఎండా కాలంలో కూడా పెద్ద వాగు మోకాళ్ళ కింద వరకు పారేది. రబ్బరు చెప్పులు వేసుకున్న వారు చెప్పులతోనే వాగు దాటేవారు. తోలు చెప్పులు వేసుకున్నవారు మాత్రం చెప్పులు చేతిలో పట్టుకొని వాగు దాటిన తర్వాత వేసుకునేది. బరిగాళ్లతో పోయేవారు బిందాస్ గా వాగు దాటి అంగట్లకు పోయేవారు. ప్యాంట్లు వేసుకునేవారు పైకి మడుచుకొక తప్పేది కాదు. చెడ్డీలు వేసుకునే మాకు మాత్రం పెద్ద వాగు దాటడం ఉత్సాహంగా ఉండేది.

మొత్తం మీద గోరటి వెంకన్న సంత పాటలో రాసినట్టు అంగడి పురా మానవుల కలయికలా, ఎగిసిపడే మానవ కోలాహలానికి, అనేక రకాల మానవ లావాదేవీలకు వేదికగా ఉండేది. ఛీకటి పడే వేళకు ఆ కోలాహలం అంతా చప్పున చల్లారిపోయేది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంగడి నడిచిన బజారు వీధి అంతా చెత్తా చెదారంతో నిండి పోయి బోసిగా కనిపించేది. మరుసటి రోజు గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు అంగడి చెత్తను తొలగించి శుభ్రం చేసేవారు.

అంగడి రోజున ఒంటిపూట బడి

ఇక అంగడికి సంబందించి రెండు ముచ్చట్లు, చెప్పాలి. అంగడి రోజైన మంగళవారం మా బడికి మధ్యాహ్నం సెలవు ఉండేది. టీచర్లు వారానికి సరిపడే సరుకులు కొనుక్కోవాలి. పిల్లలు వారి తల్లిదండ్రులకు సామాన్లు తెచ్చి పెట్టడానికి టీచర్లు అనధికారికంగా సెలవు ఇచ్చుకునేవారు.

మాకు అంగట్లో తిరగడం సరదాగా ఉండేది. మమ్ములను తినుబండారాల కుప్పలు ఆకర్షించేవి. ముర్మురాలు, ఛుడ్వా, జిలేబీలు, బాలుషాలు, లడ్డూలు, ఈత పండ్లు, తునికి పండ్లు, మిర్చి బజ్జీలు .. వీటి మీద మా చిత్తం. అంగడికి పోయి కూరగాయలు తెమ్మని చెపితే అందులో చారాన, ఆటాన, రూపాయి మిగిల్చుకొని వీటిలో ఇష్టమున్నవి కొనుక్కొని తినడం అంగట్లో మేము చేసే పని. కొన్నిసార్లు సామాన్లు తెచ్చే అవకాశం దక్కేది. కొన్నిసారు దక్కకపోయేది.

అంగడి అంటే పిల్లలం మాకు ప్రతీ మంగళవారం దొరికే ఒక పండుగ సంరంభం. రకరకాల ఆట వస్తువులు కూడా అంగట్లో దొరికేవి. విజిల్స్, పిల్లనగ్రోవి, గులేర్లు, మౌత్ ఆర్గాన్, రబ్బర్ బాల్స్, కురుం బాల్స్. ఇవి కొనడానికి డబ్బులు దొరికేవి కావు.

దోస్తులం అందరం కలిసే అంగడికి పోయేది. కలిసే అంగట్లో కలియ దిరిగేది. కొనుక్కొని తినేది. అంగడి మా మధ్య స్నేహాన్ని, ప్రేమను పెంచింది. అంగడి అంటే పిల్లలం మాకు ప్రతీ మంగళవారం దొరికే ఒక పండుగ సంరంభం. రకరకాల ఆట వస్తువులు కూడా అంగట్లో దొరికేవి. విజిల్స్, పిల్లనగ్రోవి, గులేర్లు, మౌత్ ఆర్గాన్, రబ్బర్ బాల్స్, కురుం బాల్స్. ఇవి కొనడానికి డబ్బులు దొరికేవి కావు. దొరికిన కొన్ని చిల్లర పైసలతో తిను బండారాలు మాత్రమే కొనుక్కునే వీలు ఉండేది. అయితే వాటికి కూడా ఎవరో ఒక కనుగోలుదారులు ఉండేవారు. ఎండాకాలం మాముళ్లలో అంగడి జరిగేది. అప్పుడు మామిడి సీజన్ కాబట్టి మామిడి కాయలు తెంపుకోవడం, ఇంటి నుంచి తెచ్చుకున్న ఉప్పు కారం అద్దుకొని పండ్లు కోరలు పోయేదాకా తినడం, అదృష్టం ఉంటె చెట్టు మీదనే పండిన మామిడి పండ్లు కూడా దొరికేవి. చెట్టు ఎక్కిన పోరలకు కోగుల(పెద్ద ఎర్ర చీమలు) బాధ తప్పేది కాదు. అవి కుడితే పెయిలో దద్దుర్లు లేచేవి. అయినా తగ్గేదే లేదు అన్నట్లు మామిడి కాయలు తెంపుకునేది.

అంగడి ఝటాంగి ముచ్చట

అంగడికి సంబందించి మరొక ముచ్చట ఎందంటే .. ప్రతీ మంగళ వారం అంగడికి ఝటాంగి వస్తుందట. అది మామూలు స్త్రీగానే ఉంటదట. అనుమానం రాకుండా తెలిసిన వారి రూపంలోనే ఉంటదట. దాని పాదాలు మాత్రం ఉల్టా వెనక్కి తిరిగి ఉంటాయట. ఝటాంగిని ఎర్క చేయడానికి అదొక్కటే తేడా. పాదాలు కనబడకుండా కింద వరకు చీర కట్టుకుంటుందట.

మేము ఈ ఝటాంగిని ఎర్క చేయాలనే ప్రయత్నంలో ఒక జాగాలో కూచొని స్త్రీల పాదాల వంక చూస్తూ ఉండేది. కానీ పాదాలు వెనక్కి ఉన్న ఒక్క స్త్రీ కూడా కనిపించేది కాదు.

బాగా గిరాకీ అయిన వారిని “అరే నీ దుకాండ్లకు ఝటాంగి వచ్చిందిరా. గందుకే గిరాకీ బాగా అయ్యింది” అని బనాయించే వాళ్ళు.

ఝటాంగి ఎవరి దగ్గర కొనుగోలు చేసే ఆ రోజు వారి పంట పండినట్టే. ఆ దుకాణంలో విపరీతంగా కొనుగోళ్లు జరుగుతాయట. తాము తెచ్చిన వస్తువులు అన్నీ అమ్ముడు పోయినాయంటే తమ దుకాణానికి తప్పకుండా ఝటాంగి వచ్చిందని నమ్ముతారు.

ఝటాంగి అందానికి ముగ్దుడై దాని ఏంబడి బడితే వాడిని తన వెంట దూరంగా ఏకాంత ప్రదేశానికి తోల్కపోయి ఒక గిరి గీసి అందల కూసో బెడుతుంది. ఆకలైతే అన్నం పెడుతుంది. ఏది అడిగితే అది పెడుతుంది. నీళ్ళు అడిగితే మాత్రం ఉచ్చ తాగమంటుందట. ఇగ ఉచ్చ తాగలేక, నీళ్ళు లేక విలవిలలాడి సచ్చపోతారట. పారిపోయేందుకు ప్రయత్నిస్తే గిరి బయట అడుగుపెట్టగానే బగ్గున మంటలు లేస్తాయట. ఆ మంటల్లో కాలి సచ్చి పోతారట.

మేము ఈ ఝటాంగిని ఎర్క చేయాలనే ప్రయత్నంలో ఒక జాగాలో కూచొని స్త్రీల పాదాల వంక చూస్తూ ఉండేది. కానీ పాదాలు వెనక్కి ఉన్న ఒక్క స్త్రీ కూడా కనిపించేది కాదు. ఇంకో మంగళవారం జాగా మార్చేది. అక్కడా అంతె. ఆ రోజు ఝటాంగి అంగడికి రాలేదని నిరాశ పడేది. అయితే ఎవరో ఒకరు బాగా గిరాకీ అయిన వారిని “అరే నీ దుకాండ్లకు ఝటాంగి వచ్చిందిరా. గందుకే గిరాకీ బాగా అయ్యింది” అని బనాయించే వాళ్ళు. “అరే ఎప్పుడు వచ్చిందిరా. మనకు కనవడక పాయే” అని అనుకొని “వచ్చే మంగళవారం అంగడి అంతా తిరిగి చూద్దామురా” అని సమాధానపడేవాళ్ళం. వచ్చే మంగళవారం కూడా అంగడి అంతా తిరిగినా ఝటాంగి మాత్రం కనిపించకపోయేది.

హైస్కూల్ అయిపోయాక కాలేజీ చదువులకు ఆదిలాబాద్ పోయినాన్డు వలన నాకు ఇక అంగడికి పోయే అవకాశం చిక్కలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఝటాంగిని మాత్రం చూడలేకపోయాము. ఝటాంగిని చూసిన వాళ్ళు ఎవరూ మాకు కనబడలేదు. ఝటాంగిని చూసిన వాడు ఇక తిరిగి రాలేరట. అందుకే అంగట్లో స్త్రీల వెంట పడవద్దు. ఎవరు ఝటాంగినో తెలువదు కదా అని యువకులకు పెద్దలు చెప్పేవారు. ఇదీ మా అంగడి ఝటాంగి ముచ్చట.

అంగట్లో పోకిరి పోరలు ఆడవాళ్లను అల్లరి చేయకుండా ఉండడానికే ఈ ఝటాంగిని ఆనాటి పెద్దలు సృష్టించి ఉంటారని ఇప్పుడు అర్థం అయ్యింది. ఝటాంగి అన్వేషణ విఫలమైనా ఇన్నేళ్లయినా ఝటాంగిని మరచిపోవడం సాధ్యం కాలేదు. వేరే ఊళ్ళలో ఈ అంగడి ఝటాంగి ముచ్చట ఉందో లేదో తెలియదు.

మారిన బొంతల అంగడి రూపు రేఖలు

ఇప్పుడు వారాంతపు అంగళ్ళు నగరంలో కూడా అన్ని బస్తిలలో, కాలనీలలో జరుగుతున్నాయి. మేము ఉండే గుర్రంగూడలో ప్రతీ శనివారం అంగడి జరుగుతుంది, నేను చిన్నప్పుడు చూసిన అంగడి లాగానే అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఆధునికమైన వస్తువులు ఈ కొత్త అంగళ్లలో కనిపిస్తున్నాయి. సహజమే కదా! మళ్ళీ బొంతల అంగడి దగ్గరకి వస్తాను. ఈ 25 ఏళ్లలో ఊరు మారింది. పరిస్థితులు మారాయి. ఊరు దక్షిణ, తూర్పు దిక్కులకు విస్తరించింది.

వ్యాపారం పాత బజారు వీధి నుంచి బస్టాండ్ వద్దకు మారిపోయింది. అందువల్ల మంగళవారం అంగడి కూడా పాత బజారు వీధి నుంచి బస్టాండ్ వైపుకు మారిపోయింది. అంగడి విస్తృతి, వైవిద్యం కూడా పెరిగింది. ఈ కొత్త జాగాలో అంగడి జరుగుతున్నట్టు తెలుసు కానీ ఈ కొత్త అంగడిని చూసే అవకాశం మాత్రం రాలేదు. మా చిన్నప్పుడు బోథ్ లో మాత్రమే అంగడి జరిగేది. ఇప్పుడు మరి కొన్ని పెద్ద గ్రామాల్లో కూడా .. ఇచ్చోడలో సోమవారం, సోనాలలో బుధవారం, నేరేడిగొండలో శనివారం అంగళ్లు జరుగుతున్నాయని మిత్రులు చెప్పారు. ఈ ఊర్లకు దగ్గరలో ఉన్న గ్రామాల నుంచి ప్రజలు బొంతల అంగడికి రావడం తగ్గిందని చెప్పారు. కొనుగోలుదారులు రాకపోయినా తమ ఉత్పత్తులను అమ్ముకునేవారు బొంతల అంగడికి వస్తున్నారట. ఎడ్ల బండికి బదులు ఇప్పుడు ఆటోల్లో వస్తున్నారట.

ఈ సారి ఊరికి పోయినప్పుడు కొత్త జాగాలో బొంతల అంగడిని చూసి వస్తాను. ఝటాంగి వస్తుందేమో కూడా చూస్తాను.

బొంతల అంగడి ఝటాంగి కథ ఇప్పటి తరానికి తెలుసో లేదో తెలియదు. మా లెక్క అంగట్లో ఝటాంగిని వెతికే పిల్లలు ఇప్పటి తరంలో ఉన్నారో లేదో తెలియదు. ఈ సారి ఊరికి పోయినప్పుడు కొత్త జాగాలో బొంతల అంగడిని చూసి వస్తాను. ఝటాంగి వస్తుందేమో కూడా చూస్తాను.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం.  తొమ్మిదో భాగం బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ. పదో భాగం బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసు. పదకొండో భాగం బాపు స్మృతిలో. పన్నెండో భాగం నేను నిజంగానే ‘సుడిగాలి’ బాధితుడిని. పదమూడో వారం నా ఉన్నతికి చోదక శక్తి ‘ఆయి’. మీరు చదివింది పద్నాలుగో వారం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article