Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌నా ఉన్నతికి చోదక శక్తి 'ఆయి' : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

నా ఉన్నతికి చోదక శక్తి ‘ఆయి’ : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా.

చదవండి,నా ఉన్నతికి చోదక శక్తిగా నిలిచినా మా ‘ఆయి’ గురించి ఈ పదమూడో వారంలో…

శ్రీర్ రావు దేశ్ పాండే

మా ఆయి (మరాఠీలో అమ్మ) సుశీలా బాయి. మా బాబ (నాన్న) అంబారావు దేశ్ పాండే. మా తండ్రి గురించి ఇంతకు ముందే ఈ శీర్షికలో రాసి ఉన్నాను. సంక్రాంతి రోజు మా ఆయి వర్ధంతి కాబట్టి మా ఆయి గురించి మాత్రమే చెపుతాను.

నేను ఎప్పుడు పుట్టానో చెప్పడానికి ఆమెకు ఒక సంఘటన చాలా సార్లు గుర్తు చేసేది. పోచంపాడు ప్రాజెక్టు (శ్రీరాంసాగర్) శంఖు స్థాపన కోసం ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వచ్చినప్పుడు నేను ఒక సంవత్సరం పిల్లవాడినట. నెహ్రూను చూడడానికి బండ్లు కట్టుకొని వేలాది మంది జనం పోచంపాడు పోయినారని చెప్పేది. ఆయన 1964 లో ప్రాజెక్టు శంఖు స్థాపన చేశాడు. అంటే నేను పుట్టింది ఖచ్చితంగా 1963 లోనే. తేదీ, నెల గురించి ఖచ్చితంగా నిర్ధారించే సాక్ష్యాలు లేవు. స్కూల్ రికార్డుల ప్రకారం నా పుట్టిన రోజు 5 ఏప్రిల్, 1963.

ఆయిని సతాయించిన నా పసితనం

చిన్నప్పుడు చాలా సన్నగా, అనారోగ్యంతో, పుండ్లతో, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడినని చెప్పేది. నా తర్వాత ఒక సంవత్సరానికే మా చెల్లి పుట్టడం వలన అటు మా చెల్లిని ఇటు నన్ను చూసుకోలేక సతమతమయ్యేదని చెప్పేది. మాది పెద్ద కుటుంబం. మా తండ్రి ఊరికి సర్పంచ్, తాలూకా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో సందడిగా ఉండేది. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో, సర్పంచ్ గా ఇతర వ్యాపకాలతో తీరిక లేకుండా ఉండేవాడు. మా ఆయి ఐదుగురు పిల్లలను, ఇంటిని, బోథ్ లో మూడు అరకల వ్యవసాయాన్ని సంభాళించుకునేది. 5 గురు పిల్లలను పెంచింది.

నా చోదక శక్తి ఆయి

నా ఎదుగుదలకు ఆమెనే ఒక చోదక శక్తి. ఆమె ప్రోద్బలమే నేను ఈ స్థితికి ఎదగడానికి దోహదం చేసింది. నేను చదువులో చురుకైన వాడినని ఆమె పసిగట్టింది. పిల్లల చదువు విషయంలో కఠినంగానే ఉండేది. బడికి పోవడానికి మొండికేస్తే మా జీతగాళ్లు ఎత్తుకొని పోయి బడిలో దింపేవారు. ఉదయం 7 నుంచి 8.30 వరకు నాగనాథం సారు వద్దకు ట్యూషన్ పోవలసిందే. అప్పట్లో ఆయన ట్యూషన్ ఫీజు నేలకు 5 రూపాయలు. అప్పుడప్పుడు చెణలో నుంచి వచ్చే కూరగాయలు, కంది పప్పు పంపించేది. నాగనాథం సారు నా చదువుకు పునాది వేసిన గురువు( ఆ ముచ్చట్లు తర్వాత ఎప్పుడైనా చెపుతాను).

మొండితనంతో, ఏడ్చి ఆమెను లొంగదీయడం సాధ్యం అయ్యేది కాదు.

సినిమాకు వెళ్ళడానికి అసలు ఒప్పుకునేది కాదు. “ రాము ” సినిమా వచ్చినప్పుడు పోదాము అనేది. రాము సినిమా వచ్చేది కాదు .. ఆమె సినిమా చూడనిచ్చేది కాదు. ఆమె సామాన్ల కోసం బజారుకు పంపినప్పుడు మిగిల్చుకున్న పైసలతో, దేవుడి గూట్లో డబ్బాలో ఆమె దాచుకున్న చిల్లర పైసలు ఆమెకు తెలియకుండా తీసుకొని దొంగతనంగా మ్యాట్ని షో చూసి ఇంటికి వచ్చేది. ఆటలకు అభ్యంతర పెట్టేది కాదు. పెద్ద వాగులో ఈతలకు పోతే కూడా అభ్యంతరం ఉండేది కాదు. కానీ పొచ్చేర గుండం, కుంటాల జలపాతానికి పిక్నిక్ పోతున్నామంటే తల్లడిల్లి పోయేది. జాగ్రత్తలు చెప్పేది. హైస్కూల్ కు వచ్చేదాకా కుంటాలకు మాత్రం ఎడ్ల బండి కట్టిచ్చి అడెల్లును తోడుగా పంపేది. మొండితనం అసలు సహించేది కాదు. అర్రలో పెట్టి ఏడుపు మానేసినాకనే తలుపు తీసేది. మొండితనంతో, ఏడ్చి ఆమెను లొంగదీయడం సాధ్యం అయ్యేది కాదు.

లైబ్రరీకి ఆయికి వారధిగా…

ఆమె మాతృ భాష మరాఠి అయినా తనకు తాను తెలుగు చదవడం నేర్చుకున్నది. బోథ్ లైబ్రరీ నుంచి ఆమె కోసం నవలలు తీసుకు వచ్చే పని నాదే. అట్లా లైబ్రరీకి దగ్గరయ్యాను. నా ఉన్నతికి మా ఆయి ఎంత దోహదం చేసిందో మా బోథ్ లైబ్రరీ కూడా అంతే దోహదం చేసింది. లైబ్రరీ నాకు కొత్త లోకాన్ని చూపించింది. కొత్త చూపునిచ్చింది. ఆయి కోసం రంగనాయకమ్మ బలిపీఠం, కృష్ణవేణి, యద్దనపూడి సులోచనా రాణి జీవన తరంగాలు, పోల్కంపల్లి శాంతాదేవి వారధి, కుటుంబరావు చదువు నవలలు లైబ్రరీ నుంచి తెచ్చిన జ్ఞాపకం ఉన్నది. ఇంటికి వారం వారం ఆంధ్ర ప్రభ వార పత్రిక వచ్చేది. అందులో సీరియళ్ళు కూడా చదివేది.

ఆయి ఉత్తర దక్షిణ భారత తీర్థ యాత్రలు

ఉత్తర భారతానికి తీర్థ యాత్ర అంటే వారి భాషలో కాశీ యాత్రకు రెండు సార్లు వెళ్ళింది. ఒకసారి దక్షిణ యాత్రకు .. అంటే రామేశ్వరం యాత్రకు ఒకసారి వెళ్ళింది. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. ఇది ఆమె చెప్పిన ముచ్చటనే.

మొత్తం మీద గంగ నీళ్ళను రామేశ్వరంలో, రామేశ్వరం నీళ్ళను గంగలో కలిపి తీర్థ యాత్రను సఫలం చేసుకున్నది. అదొక తృప్తి ఆమెకు.

మొదట కాశీ యాత్రకు పోయి గంగ నీళ్ళు తీసుకొని వచ్చి తర్వాత యాత్రలో రామేశ్వరం వెళ్ళి గంగ నీళ్ళను అక్కడ సముద్రంలో కలపాలి. రామేశ్వరం సముద్రపు నీళ్ళను తీసుకొని వెళ్ళి మళ్ళీ కాశీ యాత్రలో గంగలో కాలపాలట. అప్పుడే యాత్రా ఫలం సిద్ధింస్తుందని వారి నమ్మకం. ఈ యాత్రకు బోథ్ నుంచి ఒక ప్రత్యేకమైన బస్సు బయలుదేరుతుంది. తీర్థ యాత్రలు నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఒకాయన ఈ యాత్రలను చేపడతాడు. వంట పాత్రలు, బియ్యం పప్పులు, వంట చెరుకు .. తదితర సరంజామాతో బస్సు బయలుదేరుతుంది. ఆయి మొదటి కాశీ యాత్ర యాదికి లేదు కానీ రామేశ్వరం యాత్ర, రెండవ కాశీ యాత్ర మాత్రం యాదికి ఉన్నాయి. అవి నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే చేపట్టిన యాత్రలు. రామేశ్వరం పోయినప్పుడు తన వెంట వర్షకొండ(మెట్ పల్లి దగ్గర ఈ ఊరు ఉంటుంది) అత్తను కూడా తన వెంట తీసుకుపోయింది. పోయేటప్పుడు ఆయికి వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాను. అత్తకు కూడా ఇవ్వురా అని సిఫారసు చేసింది. ఆమెకు కూడా అయిదు వందలు చేతిలో పెట్టాను. పాపం అత్త మధ్య దారిలో జారి పడి కాలు విరిగిపోయింది. తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆమెను జాగ్రత్తగా కనిపెట్టుకునే యాత్రను పూర్తి చేసిందట.

ఇక రెండవ కాశీ యాత్రకు పోయినప్పుడు తన వెంట తన పెద్ద వదినను వెంట తీసుకుపోయింది. ఇక యాత్ర మొత్తం ఆమెకు సేవలు చేయడంతోనే దం దం అయిపోయిందట. మొత్తం మీద గంగ నీళ్ళను రామేశ్వరంలో, రామేశ్వరం నీళ్ళను గంగలో కలిపి తీర్థ యాత్రను సఫలం చేసుకున్నది. అదొక తృప్తి ఆమెకు. ఆమె తీర్థ యాత్రలకు పోయినప్పుడు కొన్ని పోస్ట్ కార్డుల మీద నా అడ్రస్ రాసి ఇచ్చాను. మరాఠీలో ఉత్తరాలు రాసేది. అట్లా రాసిన ఆమె లేఖలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

నా శక్తి సామర్థ్యాలను పసి గట్టిన ఆయి

పదవ తరగతి పరీక్షల కోసం మా ఇంట్లో నేను, నర్సయ్య, గంగాధర గౌడ్ కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. రాత్రి నిద్ర వస్తే తాగడానికి ఫ్లాస్క్ లో చాయ పోసి ఇచ్చేది. అయితే చాయ తాగి నిద్ర పోయేవారం. ఆమె ఆశించిన రీతిలో 1978 లో పదవ తరగతిలో నేను ఫస్ట్ క్లాస్ లో, గౌడ్ సెకండ్ క్లాస్ లో, నర్సయ్య థర్డ్ క్లాస్ లో పాసయ్యాము. మా ఆయి చిన్నప్పుడే నాలో పసిగట్టిన శక్తి సామర్థ్యాలు నాకు అప్పుడే తెలిసి వచ్చాయి. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి వరకు సిగ్గరిగా, ఆత్మ విశ్వాసం లోపించిన వ్యక్తిగా ఉన్న నేను (నన్ను అజ్జ మొఖం అని అనడం నాకు ఇప్పటికీ గుర్తుంది) పూర్తిగా మారిపోయాను. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. లెక్కల సబ్జెక్టు బోథ్ కాలేజీలో లేకపోవడంతో మా ఆయి నన్ను ఆదిలాబాద్ కు పంపింది. అక్కడ మా మేన మామ గోవిందరావు దేశ్ పాండే ఇంట్లో ఉండి ఇంటర్ పూర్తి చేశాను. మామ ఇంట్లో నాకు మా మేన బావ సతీష్ తోడు దొరికింది. ఆయన అప్పుడు డిగ్రీ చదువుతుండేవాడు. మా 1980 ఇంటర్ బ్యాచ్ లో కాలేజీ ఫస్ట్ నేనే. కాలేజీ డే సందర్భంగా నా మెడలో వేసిన మెడల్ ను ఆమెకే ఇచ్చాను. మెడల్ ను చూసి మురిసిపోయింది. చాలా ఏండ్లు ఆ మెడల్ ను ఆమె భద్ర పరచింది. నా నిర్లక్ష్యం కారణంగా తర్వాత ఆ మెడల్ ను పోగొట్టుకున్నాను.

అయితో శ్రీధర్ రావు దేశ్ పాండే – భారతి

నా చదువు కోసం సర్వే నంబరు అమ్మకం

ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో కొద్ది మార్కులతో ప్రభుత్వ కాలేజీలో సీటు మిస్ అయ్యాను. నేను వద్దన్నా పార్డి గ్రామంలో తన పేరు మీద భూమి అమ్మి నన్ను ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించింది. అయిష్టంగానే బంజారా హిల్స్ లో ఉన్న ముఫఖం జా ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ బ్రాంచ్ లో చేరాను. 1985 లో ఇంజనీరింగ్ పాసవడం, 1987 లో సాగునీటి శాఖలో ఉద్యోగంలో చేరడం, 1988 లో నేను కోరుకున్న అమ్మాయి(భారతి)తో కట్న కానుకలు లేకుండా పెండ్లి .. అన్నీ సహజంగా జరిగిపోయాయి. ఇవన్నీ ఆమె ఊహించినవే అని నేను భావిస్తున్నాను. కట్న కానుకలు ఆడగక పోయినా హైదరాబాద్ రాకపోకలకు బస్సు ఖర్చులు మాత్రమే అడిగింది. దాన్ని మాత్రం నిరోధించలేకపోయాను.

ఆయి అంటే పిల్లలకు ప్రేమ

ఆయితో అంజలి, వెన్నెల

ఆయికి మా పిల్లలు అంజలి, వెన్నెల అంటే ఎంతో ఇష్టం. వాళ్ళ కాన్పులప్పుడు తానే దగ్గరుండి అన్ని సేవలు చేసింది. పిల్లలకు కూడా ఆయి వచ్చిందంటే మహా సంబురంగా ఉండేది. ఆమెతో బోలెడంత సరదా ఉండేది వారికి. తన కాలపు సంగతులు అన్నీ చెప్పేది. తమ పెద్దత్త చేసే కట్టడి, వచ్చిపోయేవారికి నిరంతరం వండి పెట్టే కష్టం, చిన్నప్పుడు తమ తండ్రి రామారావు దేశ్ పాండేకు ఆస్తి ఇవ్వకుండా ఆయన అన్న యశ్వంత్ రావు  పెట్టిన కష్టాలు, కోర్టు కేసులు, తాము తిండికి కూడా పడిన తిప్పలు, చివరకి కోర్టు తమ తండ్రికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఆ ఆస్తిని అనుభవించకుండానే తమ తండ్రి చనిపోవడం, తన పెండ్లి విశేషాలు, రజాకార్ జమానాలో భయంకరమైన పరిస్థితులు.. ఇవన్నీ ఆమె ముచ్చట్లలో వచ్చేవి.

ఆమెకు పిల్లలు ఇంగ్లీష్ పాఠాలు చెప్పేవారు. ఎ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్.., ఇంగ్లీష్ లో అంకెలు లెక్క పెట్టడం ఇట్లా.. తనను పిల్లలు ఆటపట్టిస్తున్నారని తెలిసినా వారి సంతోషం కోసం వారు ఏమి చెపితే అది అనేది. వారికి తిరిగి అప్ప జెప్పేది. ఆ ముచ్చట్ల వీడియోలు చూస్తూ పిల్లలు ఇప్పటికీ మురిసిపోతారు. చివరి రోజుల్లో చంటి పిల్లగా మారిన ఆయిని భారతి, పిల్లలు జాగ్రత్తగా చూసుకున్నారు.

ఆయి దోస్తులు

ఆయికి ఊర్లో చాలా మంది దోస్తులు ఉండేవారు. సబ్బని రాజాయి, దీకొండ నర్సాయి, ఆకుల రాధ, గంగాయి, సెషన్స్ జడ్జి భార్య భాగిర్తాయి, చాకలి భోజవ్వ, భూమక్క, పోసాని, మేతిరోళ్ళ యమున .. వీళ్ళతో నిత్యం సంబంధంలో ఉండేది. వారు తమ ముచ్చట్లు అరమరికలు లేకుండా మాట్లాడుకునే వారు.

ఒక కాలుతో ఉన్న మా నాయనమ్మకు 25 ఏళ్ళ పాటు యమున చేసిన సేవలకు కృతజ్ఞత ప్రకటించడానికే వారి ఇంటికి పోయిందని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది.

దీకొండ నర్సాయితో అందరి కంటే చనువు ఎక్కువ. నర్సాయి ఆయి మీద అరిచేది అలిగేది. వారిద్దరి అనుబంధం ప్రత్యేకమైనది. నర్సవ్వ అలిగి ఇంటికి రాకపోతే, లేకుంటే ప్రాణం బాగా లేక మంచం పట్టి ఇంటికి రాకపోతే దిక్కు తోచేది కాదు. ఇంటికి పోయి పిలుచుకునేది. నర్సాయి పోయిన తర్వాత ఆయికి పెద్ద దిక్కు పోయినట్లు అయ్యింది. ఇక సబ్బని రాజవ్వ పాటలు, ముచ్చట్లు అందరినీ అలరించేవి.

కుటుంబం మొత్తం ఆమెకు ఫిదా. భూమక్క, పోసాని తదితరులు పప్పులు దంచే పనికి వచ్చినప్పుడు వారి ముచ్చట్లకు అంతు ఉండేది కాదు. సాయంత్రం అందరికీ చాయ చేసి ఇవ్వడం ఒక ఆనవాయితీ. నాకు ఆశ్చర్యం కలిగించే, నేను ఎన్నటికీ మరువలేని సంఘటన. మేతరోల్ల యమున చనిపోయినప్పుడు నల్లా టాకీ దగ్గర ఉన్న వారి చావనికి వెళ్లి పరామర్శించడం. మడి, అంట్లు ఆచారాలు పాటించి ఆమెకు ఇది ఎట్లా సాధ్యం అయ్యింది? ఆమె బతికి ఉన్నప్పుడు అడుగవలసింది. ఒక కాలుతో ఉన్న మా నాయనమ్మకు (కథలు చెప్పే మా చిన్నాయి) 25 ఏళ్ళ పాటు యమున చేసిన సేవలకు కృతజ్ఞత ప్రకటించడానికే వారి ఇంటికి పోయిందని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. మూడు పండుగలకు .. ఉగాది, పొలాల, దసరా కు యమునను తప్పక ఇంటికి పిలిచి పండుగ భోజనం ఇచ్చి పంపించేది.

ఆయి-అన్నలు- చెల్లెళ్లు

ఆయికి తన రెండో అన్న, మా మేన మామ గోవిందరావు దేశ్ పాండే అంటే వల్ల మాలిన ప్రేమ. ఆయన ఇంటికి వచ్చాడంటే అర్ధ రాత్రి దాటే వరకు ముచ్చటల వరద పారేది. ఆయన ఒక్కడు వచ్చేది కాదు. ఆయన వెంట ఆయన పెద నాన్న యశ్వంత్ రావు దేశ్ పాండే కొడుకు గోవర్ధన్ రావు మామను వెంటేసుకొని వచ్చేది. వాళ్లిద్దరు జంట కవుల లాగా తిరిగేది. ఇద్దరు గణేష్ బీడీలు తాగేది. ఒక బీడీ కాల్చడానికి పది అగ్గి పుల్లలు ఖర్చు అయ్యేది. ముచ్చట్లలలో పడి బీడీని మార్చి పోయేది. ఈ లోపల అది ఆరిపోయేది.

మళ్ళీఅగ్గి పుల్ల వెలిగించేది. రాత్రి భొజనాల తర్వాత రెండు మూడు సార్లు ఛాయ డిమాండ్ చేసేవారు. ఇప్పుడే గదా తాగింది అంటే “నేను సర్కారీ ములాజిమ్ ను. ఎన్నిసార్లయినా తాగుతా” అనేవాడు. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి. చాలా ఏళ్లు మహారాష్ట్రా సరిహద్దులో ఉండే చెక్ పోస్ట్ ల వద్ద పోస్టింగ్ ఉండేది. అట్లా కొన్ని రోజులు బోథ్ కు దగ్గరలో కిన్వట్ రోడ్డుపై ఉన్న ఘన్పూర్ చెక్ పోస్ట్ వద్ద కూడా కొన్నేళ్ళు పని చేశాడు. తాను చేసుకునే వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయికి వర్ణించి చెప్పేవాడు. అట్లా బోలెడు ముచ్చట్లు కొనసాగుతూ ఉండేవి. అదేమీ ప్రేమనో తెలియదు కానీ ఆయన తన ప్రియమైన చెల్లెళ్ళు ఇంట్లోనే ప్రయాణం విడిచాడు. ఆయన 12 రోజుల కర్మ కాండలు బోథ్ లోనే జరిపించింది ఆయి. ఆయికి తన చెల్లెళ్ళు అన్నా విపరీతమైన ప్రేమ. ఒక అక్క, ముగ్గురు అన్నల తర్వాత ఆయి, ఆయి తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు. ఒకరు నిర్మల్ లో, ఇద్దరు మహారాష్ట్రాలో పర్భణీ, అంబేజోగాయి లో ఉండేవారు. ఎండా కాలం నెలన్నర పిల్లలతో సహా బోథ్ కు వచ్చేవారు. పోయే ముందు వారికి డబ్బాల్లో సంవత్సరానికి సరిపోయే ఊరగాయలు కట్టిచ్చి పంపేది. నిర్మల్ ఉన్న చెల్లె కొడుకు వసంత్ ను బోథ్ కు తెచ్చుకొని తానే పెంచింది. వాడు మా ముగ్గురికి తమ్ముడు. వాడు ఇంటర్ చదువు అయ్యాకనే నిర్మల్ వెళ్ళాడు. సంక్రాంతి సెలవులకు వాడితో నిర్మల్ పోయేది.

రాజేషుడు మామ ప్రసంశ

రాజేషుడు మామను ఆమె జీవితాంతం తలుచుకునేది. ఆయన ఇచ్చిన ఒకే ఒక ప్రశంస ఆయనను జీవిత కాలం గుర్తుంచుకునేటట్టు చేసింది. ఎప్పుడో .. “సుశీల నీ వంట జోర్ దార్ గున్నదే. ఉప్పు కారం ఎంత పడాలనో అంతే ఉన్నది.” అని మెచ్చుకున్నాడట. ఇగ అంతే.. రాజేషుడు మామ ప్రసంశ ఆమెకు ఒక గోల్డ్ మెడల్ లాంటిది. ఎన్ని వందల సార్లు గుర్తు చేసుకునేదో చెప్పలేను. మా మామ తన వంట గురించి గొప్పకు పోతే ఈ ముచ్చట చెప్పి ఆయనకు కౌంటర్ ఇచ్చేది.

ముందర పడకురా…

నేను తెలంగాణ ఉద్యమంలో చురుకుగా తిరుతున్నప్పుడు ఆందోళన పడేది. “ముందర పడకురా” అని హెచ్చరించేది. తల్లి హృదయం కదా! 1969 ఉద్యమంలో పోలీసుల కాల్పులకు పిల్లల మరణాలు ఆమెకు తెలుసు. “మహాత్మా గాంధీ ముందర పడకపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు కదనే! ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ ముందర పడ్డాడు. నా జాగలో నేను కూడా ముందర పడాల కదా” అని అంటే అవునని ఒప్పుకునేది. ఒప్పుకుంటూనే ముందర ఉండకురా అని మళ్ళీ చెప్పేది.

టీవిలో కేసీఆర్ కనిపిస్తే “అగో కేశిఆర్ “ అని గుర్తు పట్టి సంబురపడేది. 2004 ఎన్నికల సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున తెలంగాణ జిల్లాల్లో ప్రొ. కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య, దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి తదితరులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశాము. అప్పుడు అందరం బోథ్ లో కూడా ఒక సభ ఏర్పాటు చేశాము. ఆ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసిన అని చెప్పింది. ఆ ఎన్నికల్లో బోథ్ నియోజక వర్గంలో టి ఆర్ ఎస్ గెలిచింది. ఇప్పుడు బి జె పి తరపున ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సోయం బాపురావు ఆ ఎన్నికల్లో బోథ్ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మొదటి కట్నం మాదిగ ముత్తైదువకే..

మావురాల ఎల్లమ్మ

మా ఇంటి దేవత మావురం ఎల్లమ్మ. మహారాష్ట్రాలో యవత్మాల్ జిల్లాలో వెలసిన ఈ మావురాల ఎల్లమ్మ ఆదిలాబాద్ జిల్లాలో చాలా కుటుంబాలకు ఇంటి దేవత. ఈ ఆచారం ఎప్పటిదో తెలియదు కానీ మా కుటుంబాల్లో పెండ్లి జరిగినప్పుడు మొదటి కట్నం మాదిగ ముత్తయిదువకే ఇస్తారు. ఆ ఆచారాన్ని ఆయి తన ఐదుదురు సంతానంలో నలుగురికి అమలు చేసింది. నా పెండ్లీ లో కూడా అమలు అయ్యింది. మా చెల్లి పెండ్లి ఆమె చేతుల్లో లేని కారణంగా ఆ ఆచారాన్ని పాటించే అవకాశం రాలేదు. తండ్రి జమదగ్ని ఆదేశాల మేరకు తల్లి రేణుక ఎల్లమ్మ ను మూడు ముక్కలుగా నరుకుతాడు కొడుకు పరుశురాముడు. తల మాహోర్ లో పడిందట. అందుకే మాహోర్ లో ఎల్లమ్మ తలతోనే ఉంటుంది. పొట్ట భాగ్య నిర్మల్ దగ్గర ఉన్న దిలావర్ పూర్ లో పడిందట. అక్కడ కూడా ఎల్లమ్మ గుడి ఉంది. మా వాళ్ళు దిలావర్ పూర్ కు కూడా మొక్కులు చెల్లించు కోవడానికి వెళతారు. నా పెండ్లికి ముందు ఉపనయనం దిలావర్ పూర్ లోనే జరిపించింది ఆయి. ఇక కింది భాగం ఆలంపూర్ లో పడిందట. అక్కడ జోగుళాంబ రూపంలో ఎల్లమ్మ వెలిసిందని పెద్దలు చెప్పగా విన్నాము. ఆలంపూర్ మాకు చాలా దూరం కాబట్టి అక్కడకు వెళ్ళడం చాలా అరుదు. ఎల్లమ్మ మాదిగ కులానికి చెందిన స్త్రీ కాబట్టి ఆమెకు మొదటి కట్నం సమర్పించడం అనే ఆచారం ఏర్పడి ఉంటుంది. ఇది మరింత పరిశోధించవలసిన అంశం. ఎల్లమ్మకు సజీవ ప్రతినిధి మాదిగ ముత్తైదువ కాబట్టి ఆమెను సగౌరవంగా ఇంటికి పిలిచి చీర జాకేటు గుడ్డ కట్నంగా సమర్పించిన తర్వాతనే మిగతా పెండ్లి కార్యక్రమాలు జరుగుతాయి.

గృహ ప్రవేశానికి మిత్తుల అయ్యవారి కచేరీ

హైదరాబాద్ లోని ఆల్కాపురిలో 2002 లో ఒక చిన్నఅ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు గృహ ప్రవేశం రోజున ఆదిలాబాద్ దగ్గర ఉన్న వడ్డాడి గ్రామం నుంచి మిత్తుల అయ్యవారు తుమ్మపురి రామస్వామిని ఆహ్వానించాను. మాల దాసరులను ఆదిలాబాద్ ప్రాంతంలో మిత్తుల అయ్యవార్లు అని పిలుస్తారు. వారు రామానుజుల వారి శిష్యులు. వైష్ణవ తత్వాన్ని సమాజంలో ప్రచారం చేయడానికి రామానుజుల వారు మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి నట్టు రామస్వామి చెప్పినాడు. పై అంతస్తులో శ్రీ వైష్ణవులు, మధ్యస్థ కులాలలో సాతాని అయ్యవార్లూ, కింది కులాలలో మాల దాసరులను ఆయన నియమించినట్టు రామస్వామి చెప్పాడు. మిత్తుల అయ్యవార్లు కడ్డి తంత్రర వాద్యం ఆధారంగా రామాయణాన్ని, వైష్ణవ తత్వ గీతాలను ఆలపిస్తూ జీవనం గడుపుతారు. మా గృహ ప్రవేశం రోజున సాయంత్రం ఆయన సంగీత కచేరీ జరిగినది. ఆ కచేరికి శివలక్ష్మి గారిచే రావు బాల సరస్వతి కూడా హాజరు కావడం మాకు సంతోషం కలిగించింది. ఆమె అతని గాన కౌశలానికి ఫిదా అయి 500 రూపాయలు కట్నం సమర్పించింది. ఆ రోజు రామస్వామి రామాయణంలో రావణుడి భార్య మండోదరి విలాపాన్ని పాడి వినిపించాడు. అప్పుడు రామస్వామి కంట నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు రామస్వామి మండోదరిగా మారిపోతాడు. ఆ దృశ్యం అందరినీ కంట నీరు పెట్టించింది. ఆయి కూడా కొంగుతో కళ్ళు తుడుచు కోవడం చూశాను. కచేరీ తర్వాత ఆయనకు బట్టలు, పైసలు కట్నంగా ఆమె చేతుల మీదుగానే ఇప్పించాను. ఆయన కాళ్ళు మొక్కడం కూడా మరచి పోలేని సన్నివేశం.

టీవి అడిక్షన్

రామచంద్రం పంతులు గారు కాల ధర్మం చెందిన తర్వాత పురాణ పఠనం చేసేవారు కరువయ్యారు. ఆమె దోస్తులు చాలా మట్టుకు లోకాన్ని విడిచి వెళ్లిపోయినారు. తొంభై వ దశకం మధ్య కాలంలో టివి లో సీరియల్లా ప్రభంజనం మొదలయ్యింది. సాయంత్రం 6 నుంచి మొదలయ్యే అత్తా కోడళ్ళ సీరియళ్లకు వీక్షకుల సంఖ్య పెరిగింది. ఆయికి వేరే కాలసకహెపమ్ లేకపోవడం చేత తాను కూడా టివి కి అడిక్ట్ అయిపోయింది. అత్తలు కోడళ్ళను పెట్టె సాధింపులు, ముసలి అసహాయ అత్తలను కోడళ్ళు పెట్టె సాధింపుల పట్ల సానుభూతితో రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉండేది. హైదరాబాద్ వచ్చినా సీరియళ్ళు చూడక ఉండేది కాదు. పిల్లలు ఆమె రన్నింగ్ కామెంటరీని బాగా ఎంజాయ్ చేసేది. చున్నీ ని మెడకు చుట్టుకునే అమ్మాయిలని టివిలో చూసి “మెడకు చుట్టుకునే తట్టయితే చున్నీ ఎందుకే” అని పిల్లలతో వాదులాటకు దిగేది. సినిమాల్లో “మొగవాళ్లకు శరీరం అంతా కప్పే బట్టలు వేసి ఆడవాళ్లకు మాత్రం అర్ధ నగ్నంగా ఉండే బట్టలు ఎందుకు వేస్తారే” అని అమాయకంగా అడిగేది. ఆమె సీరియళ్ళు ముగిసిన తర్వాతనే నాకు వార్తలు చూసే అవకాశం చిక్కేది.

ఆయి చివరి రోజులు

ముదిమి వయసులో ఆయి

అయితే తెలంగాణ రాక ముందే ఆమె ఈ లోకాన్ని విడిచి పోవడంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ వద్దనే నేను ఒ ఎస్ డి గా పని చేస్తున్న సన్నివేశాన్ని ఆమె చూడలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత నా ఎదుగుదలను చూడలేకపోయింది. చివరి రోజుల్లో జ్ఞాపక శక్తి కోల్పోయి నన్ను, నా భార్య భారతిని తప్ప ఎవరినీ గుర్తు పట్టలేకపోయేది. ఇక తాను జీవితేచ్ఛ కోల్పోయిన తర్వాత తిండి తినడం పూర్తిగా మానేసింది. పెట్టిన తిండిని రిజెక్ట్ చేసేది. పాలు మాత్రమే తాగేది. అయితే ఉత్తరాయణం జరిగే దాకా బతికి ఉండి 2013 లో సంక్రాంతి రోజున గుర్రంగూడ ఇంట్లో నా చేతుల్లోనే ఆఖరి శ్వాస విడిచింది.

బోథ్ లో ఆమె ప్రతీ రోజు సాయంత్రం ఒక రెండు గంటల పాటు వైద్య రామచంద్రం గారి పురాణ శ్రవణం వినడానికి విఠలేశ్వర గుడికి పోయేది. పురాణ శ్రవణం ప్రభావం ఆయిపై గాఢంగా ఉండింది. మహా భారతంలో యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై పడుకొని సూర్యుడి ఉత్తరాయణం తర్వాతనే ఆయన తనువు చాలించాడు. తాను కోరుకున్న రోజు తనువు చాలిచే వరం ఆయనకు ఉన్నది. ఆయి కూడా ఉత్తరాయణం జరిగిన తర్వాతనే సాయంత్రం 6 గంటలకు సంక్రాంతి రోజున ప్రాణం విడిచింది. చనిపోయే ముందు ఆయి అని పిలిచాను. ఓ అన్నది. అంతే నోరు అట్లాగే తెరిచి ఉండిపోయింది. అదే ఆమె ఆఖరు శ్వాస. ఆమె జ్ఞాపకంగా ఆమె గుండ్రటి ఇత్తడి పూజ డబ్బా, జపమాల, కళ్ళద్దాలు, ఆమె కాశీ యాత్రకు పోయినప్పుడు మరాఠీలో రాసిన కారట్లు మిగిలిపోయాయి. ఆమె వెంట ఒక రాగి చెంబు ఉండేది. దాంట్లో నీళ్ళు రాత్రి నింపి పెట్టుకొని ఉదయం తాగేది. ఆ చెంబు ఆదిలాబాద్ లో మా తాయి వద్ద ఉండిపోయింది.

ఆయికి నివాళి

మా తండ్రి అంబారావు దేశ్ పాండే పోయిన తర్వాత (1995) 18 ఏండ్లు బతికిన గుండె నిబ్బరం ఆమెది. ఎందరికో అన్నం పెట్టిన చేతులు ఆమెవి. అందరి అమ్మల లాగానే మా ఆయి కూడా మా ఉన్నతికి తన శక్తిని ధారపోసింది. సంక్రాతి రోజునే ఆయి వర్ధంతి. ఈ సందర్భంగా ఈ శీర్షిక ద్వారా ఆమెకు నివాళి అర్పిస్తున్నాను.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం.  తొమ్మిదో భాగం బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ. పదో భాగం బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసు. పదకొండో భాగం బాపు స్మృతిలో. పన్నెండో భాగం నేను నిజంగానే ‘సుడిగాలి’ బాధితుడిని. మీరు చదివింది పదమూడో వారం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article