Editorial

Tuesday, January 28, 2025
కాల‌మ్‌నేను నిజంగానే 'సుడిగాలి' బాధితుడిని : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

నేను నిజంగానే ‘సుడిగాలి’ బాధితుడిని : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

చిన్నప్పుడు నేను బక్కగా, గట్టిగా గాలి వీస్తే లేచిపోయేంత బలహీనంగా ఉండేవాడిని. అందుకే నన్ను అందరూ “బక్క తట్టు” అని బనాయించేవారు. దీనికి సంబందించి నన్ను ఇప్పటికీ వెంటాడుతున్న సుడిగాలి ముచ్చట ఇప్పుడు చెపుతాను. నేను ‘నిజంగానే’ సుడిగాలి బాధితుడిని అని ఎందుకు అన్ననో అప్పుడు మీకు అర్థమవుతుంది!

శ్రీర్ రావు దేశ్ పాండే

మా ఇంటి ముందు ఎడ్లు, బర్లను కట్టేయ్యడానికి బెంగుళూరు గూనల కొట్టం ఉండేది. ఆ కొట్టం వెనుక కొంత ఖాళీ జాగా ఉండేది. వానా కాలం ఆ ఖాళీ జాగాలో ఆయి తినడానికి మక్క పంట వేయించేది. ఆ సంవత్సరం ఎండాకాలం .. నా వయసు 5,6 ఏండ్లు ఉండవచ్చు.. కొట్టం గూన పెంకులు పాడయినవి, పగిలిపోయినవి తీసి వేసి కొత్తవి వేసే పని పెట్టుకున్నారు. పైన పెంకులు కప్పే పని జరుగుతున్నది. కింద నుంచి ఆడవాళ్ళు బంక మట్టి ముద్దలను పైకి విసురుతే పైన గూనలు కప్పే మనిషి వొడుపుగా అందుకొని మట్టిని సాపు జేసి గూనలు పరిచే పని నేర్పుగా చేసున్నాడు. కింద నిలబడి ఈ పనిని చాలా సేపటి నుండి ఆసక్తిగా చూస్తున్న నాకు పైన జరుగుతున్న పని కూడా చూడాలని అనిపించింది..

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, నా ‘సుడిగాలి’ జ్ఞాపకాలు ఈ పన్నెండో వారంలో…

గూనలు కప్పే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కేశవులు…తాను మా వ్యవసాయానికి ఎద్దుపాలుకు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నడు… ఆయన నీళ్ళు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్ళాడు. నిచ్చెన ఖాళీగా ఉన్నది. ఇంకేమీ .. నిచ్చెన ఎక్కి చివరి మెట్టు మీద నిలబడి గూనలు కప్పే పని చూస్తూ ఉన్న.

ఇంతలో కేశవులు రెండు చేతుల్లో రెండు బకెట్ల నీళ్ళు తెచ్చి బంక మట్టి కలుపుతున్న ఆడవాళ్ళు ముందు పెట్టి నిచ్చెన మీద చివరి మెట్టు మీద ఉన్ననన్ను చూశాడు. దిగమని ఒకటే వొర్రుతున్నడు. ఆయికి తెలిస్తే ఊకోదని కేశవులుకు తెలుసు.

సుడిగాలి ఊహా చిత్రం

ఇంతలో సుడి గాలి కామిడి బొగుడ వైపు నుంచి మా ఇంటి దిక్కు ప్రయాణిస్తున్నది. సుడిగాలి ఉదృతికి ఆకులు, కాగితాలు, మన్ను, దుబ్బా సుడులు తిరుగుతూ ఆకాశంలోకి తోసుకుపోతున్నాయి. నేను సుడిగాలి ఉదృతిని, దాని గమనాన్ని అబ్బురంగా చూస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాల్లోనే సుడిగాలి మా కొట్టాన్నితాకింది. నిచ్చెన ఎడమ పక్కకు వొరిగి కింద పడింది. దాని మీద నిలబడిన నేను సరిగ్గా నిచ్చేన కింద ఉన్న పెద్ద బండ రాయి మీద పడ్డాను. బండరాయికి నుదురు ఎడమ వైపు కొట్టుకున్నది. రక్తం కారడం మొదలయ్యింది. నా ఏడుపు కూడా. కేశవులు వచ్చి నన్ను లేపి ఇంట్లోకి తోలుకుపోయాడు. ఆయి గాయాన్ని కడిగి పసుపు పెట్టి ప్రథమ చికిత్స చేసింది. ఆ తర్వాత డాక్టర్ ముకుంద రావు వద్దకు తీసుకుపోతే ఆయన మళ్ళీ గాయాన్ని స్పిరిట్ తో కడిగి దూదిని అయోడిన్ తో తడి చేసి నుదుటి గాయం మీద పరచి పట్టి కట్టి ఇంటికి పంపాడు. అయోడిన్ పెట్టినప్పుడు లేచే మంట ఇప్పటికీ యాదికి ఉన్నది. టేబుల్ మీద ఉన్న నన్ను కదల కుండా ఉండటానికి నా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని ఒగ దిక్కు కేశవులు, మరో దిక్కు కాంపౌండర్ అదిమి పడితే డాక్టర్ ముకుంద రావు నా అరుపులు కేకల మధ్య పట్టి కట్టే పని పూర్తి చేయగలిగినాడు.

నుదుటికి ఎడమ వైపున చిన్నగా సుడిగాలి గాయం మచ్చ ఇప్పటికీ ఉన్నది. ఇదీ సుడిగాలి అసలు కథ.

ప్రచారం అయిన సుడిగాలి థియరీ

అయితే దీనికి చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఎన్నెన్ని జోడించి, ఎన్నెన్ని కథనాలు తయారు చేసినారో!!

సుడిగాలి సుడిలో గిరాగిరా తిరుగుతూ ఆకాశ విహారం చేసి సుడిగాలి ఉదృతి తగ్గగానే మా ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్నకామిడి బొగుడ వద్ద పడ్డానట.

“అరే రామా.. దీన్ని వదిలించుకోవడం ఎట్లరా” అనుకున్నాను. ఇగో ఇప్పుడు.. ఇన్నేళ్లకు నా సుడిగాలి అసలు ముచ్చట రాస్తున్నాను. “ఇప్పటికైనా నమ్మండి నా బంధు మిత్రులారా. నేను సుడిగాలికి ఎగిరిపోలేదు.. నిచ్చెన మీద నుంచి కింద పడ్డాను .. అంతే.”

ఇది చూసిన వాళ్ళు చూడని వాళ్ళు నాకు 59 ఏండ్ల వయసు వచ్చినా నన్ను బనాయిస్తూనే ఉంటారు. మా అక్కలు, అన్నలు, బావలు, అత్తలు, మామలు, మావుషిలు, పెద్ద వయసు దోస్తులు, నా తోటోళ్ళు .. వీళ్ళు వాళ్ళని కాదు పతొక్కరు ఆ సంఘటనను నమ్మారు. ప్రచారంలో పెట్టారు. అది ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నది. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి కేశవులు మాత్రమే. ఆయన నేను సుడి గాలికి ఎగిరిపోయినట్టు దృవీకరించిన దాఖలాలు లేవు. అయినా సరే సుడిగాలి కథ ప్రచారం అయ్యింది. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ లో మా బంధువు డాక్టర్ దేవిదాస్ గారి సతీమణి నీలిమక్క కూడా ఈ సంఘటన యాది చేసుకుంటూ ఒకటే నవ్వుడు. “అరే రామా.. దీన్ని వదిలించుకోవడం ఎట్లరా” అనుకున్నాను. ఇగో ఇప్పుడు.. ఇన్నేళ్లకు నా సుడిగాలి అసలు ముచ్చట రాస్తున్నాను. “ఇప్పటికైనా నమ్మండి నా బంధు మిత్రులారా. నేను సుడిగాలికి ఎగిరిపోలేదు.. నిచ్చెన మీద నుంచి కింద పడ్డాను .. అంతే.”

కొన్ని ప్రశ్నలు

సుడిగాలి థియరీని నమ్మిన వారికి నావి కొన్ని ప్రశ్నలు. ఒకటి.. అంత ఎత్తు నుంచి కింద పడ్డ ఒక బక్కతట్టు పోరడు బతికి ఉండగలడా? రెండవది మా ఇంటికి దక్షిణం దిక్కున ఉన్న కామిడి బొగుడ వైపు నుంచి వస్తున్నసుడిగాలికి నేను ఎగిరిపోతే నేను ఉత్తరం దిక్కున ఉన్న పోచమ్మ గుడి వద్దనో లేక పెద్దవాగు ఒడ్డునో పడాలి కానీ మళ్ళీ కామిడి బొగుడ వద్ద ఎట్లా పడతాను? ఈ రెండు ప్రశ్నలకు జవాబు “నో” అయితే నా మీద అల్లిన సుడిగాలి కథనం అబద్దం అని రుజువు అవుతున్నది. “ఎస్” అనేవాళ్లకు ఇక చెప్పేది ఏమీ లేదు. నమ్మితే సంతోషం. నన్ను ఇన్నేళ్లుగా వెంటాడుతున్న సుడిగాలి భూతం వదిలిపోతుంది. నమ్మకపోతే కొత్తగా పోయేది ఏమీ లేదు.

సుడిగాలి ప్రకృతి సృష్టించే మహాద్భుత సప్తవర్ణ చిత్రం

అయితే మా చిన్నతనంలో అంటే 60-70 దశకాల్లో ఎండాకాలంలో బోథ్ లో సుడి గాలులు బాగానే వచ్చేవి, కొన్ని చిన్నగా ప్రారంభం అయి అక్కడే అంతం అయ్యేవి. మరి కొన్ని ఎంత ఉదృతంగా వచ్చేవంటే కిలోమీటర్ల కొద్ది ప్రయాణించేవి. ఆకాశంలో కూడా ఒక కిలోమీటర్ ఎత్తుకు లేచేవి. అది ప్రయాణించే దారిలో ఆ సుడిలో రంగు రంగుల చీరలు, ధోతులు, బట్టలు, కాగితాలు, బీడీ ఆకులు, దుమ్ము, ధూళి .. అదొక మహాద్భుత సప్త వర్ణాల దృశ్యంగా కనిపించేది. భూమి నుంచి ఆకాశానికి విస్తరించిన ఒక సొరంగం లెక్క అనిపించేది.

నీటి ఉపరితలంపై, సముద్రంపై ఏర్పడే సుడి గాలులు నీటిని, నీటితో పాటూ చేపలను కూడా పైకి లేపుకు పోతాయి. అందుకే వర్షం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆకాశంలో నుంచి చేపలు కిందకు రాలుతాయి.

ఇవి ఎట్లా ఏర్పడతాయో అప్పట్లో తెలిసేవి కావు. కానీ ఎండాకాలంలో మాత్రమే వచ్చేవి. తీవ్రమైన ఎండకు ఏర్పడే అల్ప పీడనం వలన ఈ సుడి గాలులు ఏర్పడతాయని పెద్దయ్యాక తెలిసింది. నీటి ఉపరితలంపై, సముద్రంపై ఏర్పడే సుడి గాలులు నీటిని, నీటితో పాటూ చేపలను కూడా పైకి లేపుకు పోతాయి. అందుకే వర్షం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆకాశంలో నుంచి చేపలు కిందకు రాలుతాయి. సముద్రం మీద అల్ప పీడనం వలన ఏర్పడిన సుడిగాలులు తుఫానులుగా మారి తీరాన్ని తాకినప్పుడు జరిగే నష్టం మనకు తెలిసిందే. ఇవి రకరకాల సైజుల్లో ఏర్పడే అవకాశం ఉంది. సుడిగాలులు గంటకు 65 నుంచి 180 కిమీ వేగంతో ప్రయాణిస్తూ 75 మీటర్ల వెడల్పుకు చేరుకోగలవు.

టోర్నడో

మేము మా చిన్నప్పుడు చూసినవి స్థానికంగా ఏర్పడే సుడి గాలులే తప్ప టోర్నడోలు కావు.

సుడిగాలి అది ఏర్పడిన చోటనే ఆగదు. భూభాగం గుండా చాలా దూరం వెళుతుంది. అల్ప పీడనం బలహీనపడి అవి అదృశ్యమయ్యే ముందు చాలా కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అత్యంత తీవ్రమైన సుడిగాలులు గంటకు 450 కిమీ లేదా అంతకంటే ఎక్కువ, 2 కి.మీ వెడల్పు వరకు వెడల్పుతో,100 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. వీటి గమనాన్ని, ఉదృతిని స్థానిక వాతావరణ పరిస్థితులే నిర్ధారిస్తాయి. తరచూ అమెరికాలో సంభవించే టోర్నడోలు ఇటువంటివే. అవి సృష్టించే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అపారం. మేము మా చిన్నప్పుడు చూసినవి స్థానికంగా ఏర్పడే సుడి గాలులే తప్ప టోర్నడోలు కావు.

సుడిగాలి తిప్పలు

సుడిగాలి వచ్చినప్పుడు పెద్ద వాగు ఒడ్డున చాకలి వారు ఉతికి ఆరవేసిన ఊరి వాళ్ళ చీరలు, ధోతులు, ఇతర బట్టలను లేపుకు పోయేవి. కింద పడితే తెచ్చుకుందామని పాపం వారు సుడిగాలి వెంట పరుగులు పెట్టేది. అవి ఆఖరికి ఏ ముండ్ల చెట్టు మీదనో పడి చినిగిపోయేవి. లేదంటే వీరు అక్కడికి పోయే లోపల చోరీ అయ్యేవి. సుడిగాలి వస్తే చాకలి వారికి తిప్పలు తప్పేవి కావు. ఆరవేసిన బట్టల మీద రాళ్ళు పెట్టినా కూడా బలమైన సుడి గాలులు రాళ్ళను తప్పించి బట్టలను లేపుకుపోయేవి.

మేము పెద్దవాగులో ఈతలు కొట్టే సమయాల్లో వచ్చిన సుడిగాలి భీభత్సాన్ని, చాకలి వారి తిప్పలను చూసే అవకాశం చిక్కేది. అయితే మా చిన్నతనంలో చూసినటువంటి సుడిగాలులు ఇప్పుడు ఇప్పుడు రావడం లేదని నా బాల్య మిత్రులు చెపుతున్నారు.

సుడిగాలి – భాగవత కథ

అప్పట్లో సుడిగాలి ఒక భూతం ప్రభావం వలన వచ్చేదని పెద్ద వాళ్ళు చెపితే నమ్మేది. భాగవతంలో చిన్నికృష్ణుడి లీలలకు సంబందించి ఒక సుడిగాలి కథ చిన్నప్పుడు వినే వాళ్ళం.

ఆ రాక్షసుడి పేరు మిత్రులను అడిగి తెలుసుకున్నాను. “తృణావర్తుడు” అని చెప్పారు.

తృణావర్తుడు

శ్రీకృష్ణుడు, సుధాముడు, ఇతర రేపల్లె గోపాలురు ఆవులను మేపుతూ అడవికి వెళతారు. శ్రీకృష్ణుడిని చంపడానికి ఒక రాక్షసుడు సుడిగాలి రూపంలో చిన్ని కృష్ణుడిను ఎత్తుకుపోతాడు. చిన్ని కృష్ణుడు ఆ రాక్షసుడి మెడను పిసికి ఊపిరి ఆడకుండా చేస్తాడు. రాక్షసుడు ఊపిరి ఆడక గావు కేక పెట్టి ఆకాశం నుంచి దబ్బున కింద పడి తల పగిలి మరణిస్తాడు. చిన్ని కృష్ణుడు అతని గోపాల మిత్రులు ఆవులతో సహా సురక్షితంగా ఇంటికి వస్తారు.

ఆ రాక్షసుడి పేరు మిత్రులను అడిగి తెలుసుకున్నాను. “తృణావర్తుడు” అని చెప్పారు. బహుశా ఈ కథ నుంచే సుడిగాలి ఒక భూతం ప్రభావంవలన ఏర్పడతాయని పెద్దలు నమ్మే వారని ఇప్పుడు అనిపిస్తున్నది.

సుడిగాలిపై చివరి మాట

సుడి గాలికి ఎగిరిపోయి శ్రీకృష్ణుడు బతికాడు. కానీ నేను ఎగిరిపోయి ఉంటే బతికి బట్ట కట్టి ఇప్పుడు ఈ రకంగా మీ ముందు బొంతల ముచ్చట్లు చెప్పి ఉండేవాడిని కాదు. మరి, వచ్చేవారం మా బోథ్ అంగడి కథ చెపుతాను.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం.  తొమ్మిదో భాగం బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ. పదో భాగం బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసు. పదకొండో భాగం బాపు స్మృతిలో. మీరు చదివింది పన్నెండో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article