మా బాబా గురించి నా చిన్నప్పటి జ్ఞాపకాలు రాయాలని చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది.
మా బాబా (బాపు) పుట్టిన రోజు ఏ రోజో తెలియదు గాని ఆయన చనిపోయింది మాత్రం ఈ రోజే. అంటే…1994 డిసెంబర్ 25 న. ఆ రోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజు. అట్లాగే ఈ రోజు అటల్ బిహారీ వాజపేయి పుట్టిన రోజని కూడా గుర్తున్నది.
శ్రీధర్ రావు దేశ్ పాండే
నాకు బుద్ది తెలిసినప్పటి నుంచి మ బాబా బోథ్ కు సర్పంచ్ గా చూస్తూ ఉండేవాడిని. పొద్దున్నే తానం చేసే ముందు బస్కీలు తీయడం గుర్తుంది. ఆ తర్వాత తానం చేసి తెల్లటి ధోతి, తెల్లటి కుర్తా, తలపై గాంధీ టోపీతో బయటకు వచ్చేవాడు. అప్పటికే పంచాయతీ కార్యదర్శి, అటెండర్ షేక్ హుసేన్, ఆయనను కలవడానికి వచ్చిన జనం అందరూ కలిసి ఊర్లో ఇన్స్పెక్షన్ కు బయలుదేరి వెళ్ళేది. ఏమి పంచాయతిలో, ఏ సమస్యల పరిష్కారానికి బయలుదేరే వాడో అప్పట్లో తెలిసేది కాదు. అయితే మొరీల పంచాయతీ, చేన్ల గట్టు పంచాయతీలు, కుటుంబ ఆస్తుల పంపకాల పంచాయతీలు, భార్యా భర్తల గొడవలు .. ఇటువంటివే ఏవో ఉండేవి.
‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, బాబా – నేనూ – పట్నం పర్యటన- జ్ఞాపకాలు, ఈ పదకొండో వారంలో..
వాటికి ఆయన చెప్పిన పరిష్కారాలకు ఇక తిరుగు ఉండేది కాదు. ఆయన చెప్పినట్టే అందరూ నడుచుకునేవారు. పదవ తరగతి వరకు చదుకున్నాడు. ఇంకా చదవాలని ఉన్నా కుటుంబ అవసరాల కోసం చదువు మానేసి ఊరికి తిరిగి వచ్చాడు. చదువుకొని ఉంటే హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ అయి ఉండేవాడినని మాతో చాలా సార్లు అన్నాడు.
తాలూకా కాంగ్రెస్ నాయకుడిగా ..
ఆయన ఊరికి సర్పంచే కాకుండా తాలూకా కాంగ్రెస్ నాయకుడు కూడా. కాంగ్రెస్ పార్టీ పదవి ఏదైనా ఆయనకు ఉండేదో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆయన దగ్గరకి వచ్చేవారు.
ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు గ్రామాల్లో ఆయన ప్రచారం మీదనే ఆధారపడేవారు. మా బోథ్ నియోజక వర్గం 1962 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మొదటి సాధారణ ఎన్నికలప్పుడు జెనరల్ సీటు గానే ఉండేది. అప్పుడు మా బాబాని పోటీ చేయమని పార్టీ నాయకత్వం అడిగితే సున్నితంగా తిరస్కరించి పార్టీ ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తామని మాటిచ్చాడట. అప్పుడు స్థానిక అభ్యర్తి ఎవరూ దొరకక పోవడంతో బయట నుంచి మాధవరెడ్డి గారిని నిలిపినారు. ఊరూరూ తిరిగి ప్రచారం చేసి మాధవరెడ్డిని గెలిపించారు. 1967 లో రెండవ ఎన్నికల నాటికి బోథ్ నియోజకవర్గం ఎస్ టి రిజర్వ్ నియోజకవర్గంగా మారిపోయింది. ఇక మా బాబాను పోటీ చేయమని అడిగే అవసరం పార్టీకి లేకపోయినా తాలూకాలో ఆయనకున్న పరపతి కారణంగా అభ్యర్తిని గెలిపించే బాధ్యత బాబా మీదనే ఉంచేది.
ఆయన ఒక మల్టీ లింగ్విస్ట్. తెలుగు మాతృ భాష. మరాఠీ సహజంగా ఆదిలాబాద్ జిల్లా వాసులందరికి వచ్చే భాష. ఉర్దూ ఆయన చదువుకున్న భాష. ఇంగ్లీష్, హిందీ స్కూల్లో నేర్చుకున్న బాషలు. ఇక స్థానిక ఆదీవాసీ, గిరిజన భాషలైన గోండి, కొలామి, నాయకపోడు, బంజారా, మథుర భాషలు అనర్ఘలంగా మాట్లాడగలిగేవాడు. కాబట్టి గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు వారి భాషలో ఉపన్యాసం ఇవ్వగలిగేది మా బాబా ఒక్కడే కావడంతో ఆయన ప్రచారం కీలకంగా పని చేసేది. ఆయన ఏ గుర్తుకు ఓటు వేయమని చెపితే దానికే ఓటు వేసేది. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి ఆవు ల్యాగ గుర్తు ఉండేది. ఆ తర్వాత చేయి గుర్తు వచ్చింది. ఇప్పటికీ అదే గుర్తు కొనసాగుతున్నది.
మా బాబా ఇప్పటి తరహా కాంగ్రెస్ నాయకుడు కాదు. నెహ్రూ విధానాలతో ప్రభావితం అయిన స్వాతంత్రియోద్యమ స్పూర్తి కలిగిన నాయకుడు.స్వామీ రామానంద తీర్థ అనుయాయుడు.
మా బాబా ఇప్పటి తరహా కాంగ్రెస్ నాయకుడు కాదు. నెహ్రూ విధానాలతో ప్రభావితం అయిన స్వాతంత్రియోద్యమ స్పూర్తి కలిగిన నాయకుడు. స్వామీ రామానంద తీర్థ అనుయాయుడు. ఆయన జీవిత పర్యంతం ఆ స్పూర్తిని కొనసాగించినాడు. ఆయన నిజాయితీ ఎటువంటిదో ఆయన అభిమానులు, మా కుటుంబ సభ్యులు చాలా మంది ప్రస్తావించగా చాలా సార్లు విన్నాను. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం 40, 50 వేలు ఆయన చేతిలో పెట్టి వెళ్ళేవారు. అప్పుడు ఎన్నికల ఖర్చు ఆ స్థాయిలోనే ఉండేది. ఎన్నికలు అయినాక ఎన్నికల ఖర్చుల పద్దు రాసుకొని మిగిలిన రకంను ఆణా పైసలతో సహా పార్టీ నాయకులకు వాపస్ ఇచ్చేవాడట. ఇది పార్టీ నాయకులను ఆశ్చర్య చకితులను చేసేదని చెప్పీవారు. ఇది ఆనాడే కాదు ఏనాడూ ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎదుర్కోలేని వింత అనుభవం.
బాబాతో పట్నం ప్రయాణం
పట్నం .. అంటే హైదరాబాద్ కు ప్రతీ నెల ఏదో ఒక పని మీద.. తనకు తెలిసిన వాళ్ళ చికిత్స కోసమో, సెక్రటేరియట్ లో ఫైళ్ళ పరిష్కారానికో, మంత్రులను కలువడానికో హైదరాబాద్ వెళ్ళేవాడు. తనతో వచ్చే వాళ్ళ రానుపోనూ ఖర్చులు ఆయనే భరించేవాడు. పోయినప్పుడు ఆయన వెంట ఒక బెడ్డింగ్ ఉండేది. అందులో తన బట్టలు, పడుకోడానికి బెడ్, దుప్పటి కూడా ఉండేది. పోయినప్పుడు హైదర్ గూడ ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ బోథ్ ఎంఎల్ఏ గారి క్వార్టర్ లో బస చేసేది. రెండు మూడు రోజులు పని అయిన తర్వాత తిరిగి వచ్చేది. ఒకసారి నేనూ వస్తానని బాబాతో అంటే ఏ మొఖాన ఉన్నాడో ఏమో సరే అని తనతో నన్ను హైదరాబాద్ తీసుకుపోయాడు. ఇది 1973లో అని ఖచ్చితంగా చెప్పడానికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో బోథ్ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ కు బస్సు లేదు. నిర్మల్ వెళ్ళి అక్కడి నుండి హైదరాబాద్ బస్సు పట్టుకొని పోవాలి. 1980 ల నాటికి హైదరాబాద్ నుండి మహారాష్ట్రాలో ఉన్న ఎల్లమ్మ దేవి క్షేత్రమైన మాహోర్(మావురం) కు ఒక బస్సు వేశారు. ఆ బస్సు ఇప్పటికీ నడుస్తున్నది. ఇక నా మొదటి హైదరాబాద్ పర్యటన వద్దకు వస్తాను. బాబాతో రాత్రి 7 గంటలకు నిర్మల్ బస్సు ఎక్కాము. నిర్మల్ లో రాత్రి హైదరాబాద్ బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఒక కారు డ్రైవర్ హైదరాబాద్ వెళ్ళే ప్రయాణీకుల కోసం వెదుకుతూ మా వద్దకు వచ్చాడు. బస్సు చార్జీల తోనే హైదరాబాద్ తీసుకు పోతానని చెప్పాడు. బాబా వెంటనే ఒప్పుకోని కారు డిక్కిలో బెడ్డింగ్ పెట్టించాడు. వెనుక సీట్లో మా ఇద్దరినీ కూచోబెట్టాడు డ్రైవర్. తెల్లారుజామున హైదర్ గూడాలో ఎంఎల్ఏ క్వార్టర్స్ వద్ద దింపి వెళ్ళిపోయాడు. అప్పుడు మా బోథ్ ఎంఎల్ఏ గా శ్రీ దేవుషా గారు ఉన్నట్టు గుర్తు. దేవుషా గారి క్వార్టర్ కి మేము పొగానే ఎంఎల్ఏ గారు మమ్ములను సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. ఇంకా తెల్లవార లేదు కాబట్టి ఒక రెండు గంటల నిద్ర తర్వాత కాలకృత్యాలు పూర్తి చేసుకున్నాము. ఎంఎల్ఏ గారే టిఫిన్, ఛాయ్ తెప్పించారు.
చార్మినార్ సందర్శన
ఉదయం పది గంటలకు బయట పడినాము. ఆటోలో చార్మినార్ వెళ్ళాము. చార్మినార్ చూడటం గొప్ప అనుభవం. అప్పట్లో చార్మినార్ మినార్ల పైకి కూడా పోనిచ్చేవారు. అయితే బాబా చివరి అంతస్తు వరకే తీసుకుపోయాడు. అక్కడి నుంచి సుందర హైదరాబాద్ నగరం చాలా దూరం వరకు కనిపిస్తుంది. అక్కడి నుంచి అఫ్జల్ గంజ్ వరకు నడిపించాడు. ఆ బజార్లు, దుకాణాలు చూస్తూ మైమరచిపోయి నడుస్తూ ఉన్నాను. అఫ్జల్ గంజ్ లో ఒక ఉడిపి హోటల్ భోజనం చేసిన తర్వాత మా బావుజీ(బావ) డా. వినోద్ రావు చదువుకుంటున్న గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకుపోయాడు. ఆయన బాబాకు స్వంత మేనల్లుడు. మా పెద్దక్కతో సంబంధం కూడా ఖాయం అయ్యింది. అప్పుడు గాంధీ మెడికల్ కాలేజీ బషీర్ బాగ్ లో ఉండేది. అక్కడ మా బావుజీ తో ఒక గంట సేపు గడిపి సాయంత్రానికి ఎంఎల్ఏ క్వార్టర్స్ చేరుకున్నాము.
భక్త తుకారాం సినిమా
ఫ్రెష్ అయిన తర్వాత నారాయణ గూడాలో ఉన్న వెంకటేశ టాకీసుకు నడిపించుకుంటూ తీసుకుపోయాడు. అక్కడ ఆడుతున్న సినిమా నాగేశ్వర రావు, అంజలి జంటగా నటించిన భక్త తుకారాం. ఇది 1973 జూలై లో విడుదల అయింది. కాబట్టి మా హైదరాబాద్ పర్యటన 1973 అని రూడీగా చెప్పగలుగుతున్నాను. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. 5 వ తరగతి. భక్త తుకారాం కలర్ సినిమా. పాటలు, సన్నివేశాలు బాగా గుర్తుకు ఉన్నాయి.
హైదరాబాద్ నేను చూసిన మొదటి హిట్ సినిమాను ఎప్పటికీ మరచి పోలేను. రాత్రి నారాయణ గూడా తాజ్ మహల్ హోటల్ లో భోజనం చేసి తిరిగి నడుచుకుంటూ ఎంఎల్ఏ క్వార్టర్స్ కు వచ్చేసాము. దారి పొడుగునా లైట్ల వెలుగుల్లో మెరిపోతున్న దుకాణాలను చూస్తూ అబ్బుర పడుతూ, పట్నం సోయగాలను అనుభవిస్తూ ఎంఎల్ఏ క్వార్టర్ చేరుకున్న సంగతి కూడా తెలియలేదు. నేను నిద్రకు ఉపక్రమించాను. మా బాబా, ఎంఎల్ఏ దేవుషా గారు రాజకీయాలు మాట్లాడుకుంటూ ఏ రాత్రికి నిద్రపోయారో తెలియదు. మళ్ళీ తెల్లవారి 7 గంటలకు నిద్ర లేపారు.
రెండవ రోజున నడుచుకుంటూనే అసెంబ్లీ వద్దకు వెళ్ళాము. దూరం నుంచే బాబా అసెంబ్లీ భవనాన్ని చూపించాడు.
తిప్పలు తెచ్చిన డబుల్ డెక్కర్ సరదా
అక్కడ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కుదామని బాబాను అడిగాను. సరే నని మెహదీపట్నం నుంచి అఫ్జల్ గంజ్ వరకు వెళ్ళే డబులు డెక్కర్ బస్ ఎక్కాము. నేను పై అంతస్తుకు వెళదామని అడిగితే నాతో పాటూ పై అంతస్తుకు వచ్చాడు. నా ఆసక్తి ఏమిటంటే .. మా దోస్తులు చెప్పినట్టు పైన కూడా ఒక డ్రైవర్ ఉంటాడా అని చూడటానికే. కింద ఒక డ్రైవర్, పైన ఒక డ్రైవర్ ఉంటాడని మేము ముచ్చట్లు చెప్పుకునేవారం. చూస్తే పైన డ్రైవర్ లేదు కానీ కండక్టర్ ఉన్నాడు. డబుల్ డెక్కర్ లో ఇద్దరు డ్రైవర్ లు కాదు ఇద్దరు కాండక్టర్లు ఉంటారని అప్పుడు తెలిసింది. ఆ ముచ్చటనే బోథ్ కు వెళ్ళిన తర్వాత దోస్తులకు చెప్పాను. మమ్ములను బనాయించడానికే పెద్దవాళ్ళు ఆ రకంగా చెప్పారని అర్థం అయ్యింది. అమెరికాలో మా పెద్ద బిడ్డ కారు కొన్నానని చెప్పినప్పుడు ఆమెను ఇట్లానే బనాయించాను. అక్కడ కార్ల స్టీరింగ్ ఎడమ వైపు ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట. మనది రైట్ హ్యాండ్ డ్రైవ్. “జాగ్రత్తనే. అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవట. ఎడమకు తిప్పితే కుడికి, కుడికి తిప్పితే ఎడమకు పోతదట. మా డ్రైవర్లు మాట్లాడుకుంటుంటారు” అని అంటే “ నాన్నా “ అంటూ ఫోన్ లో ఒకటే అరుపులు.
అఫ్జల్ గంజ్ నుంచి ఆటోలో ఎంఎల్ఏ క్వార్టర్ చేరుకొని జరిగిన సంఘటన దేవుషా గారికి చెప్పి ఆయన వద్ద 300 రూపాయలు అప్పు తీసుకొని అదే రాత్రి బోథ్ కు తిరుగు ప్రయాణం అయినాము.
సరే ఇక అసలు సంగతికి వస్తే.. డబుల్ డెక్కర్ పై అంతస్తుకు పొగానే కండక్టర్ టికెట్ అడిగాడు. బాబా అఫ్జల్ గంజ్ అని చెప్పి బనియన్ జేబు లో నుంచి పైసలు తీయ బోయాడు. జేబు కట్. చిల్లర పైసలు కింద రాలి పడినాయి. జేబు దొంగ ఎప్పుడు కట్ చేశాడో అసలు పతానే లేదు. ఆయన ఒకటే ఆశ్చర్యపోతున్నాడు. సైను బట్టతో కుట్టిన బనియన్ లోపల ఒక రహాస్య జేబు ఉంటది. దాన్ని కట్ చేసి పైసలు దొబ్బుకు పోయిన జేబు దొంగ చాతుర్యం ఆయనను విస్మయానికి గురి చేసింది. హైదరాబాద్ లో ఇటువంటి పాకెట్ మార్ సంఘటన ఆయన జీవితంలో ఇదే మొదటిసారి కావచ్చు. మొత్తం మీద అఫ్జల్ గంజ్ వరకు టికెట్ కు చిల్లర పైసలు సరిపోయినాయి. నా డబుల్ డెక్కర్ సరదా బాబా పాకెట్ మార్ కు దారి తీసింది. అఫ్జల్ గంజ్ నుంచి ఆటోలో ఎంఎల్ఏ క్వార్టర్ చేరుకొని జరిగిన సంఘటన దేవుషా గారికి చెప్పి ఆయన వద్ద 300 రూపాయలు అప్పు తీసుకొని అదే రాత్రి బోథ్ కు తిరుగు ప్రయాణం అయినాము. దేవుషా గారి బాకీ తర్వాత ఎప్పుడో తీచి ఉంటాడని నా నమ్మకం.ఇదీ నా పట్నం మొదటి పర్యటనానుభవం. చార్మినార్, అసెంబ్లీ భవనం, భక్త తుకారాం సినిమా, డబుల్ డెక్కర్ బస్ ప్రయాణం మరచిపోలేని అనుభవాలను మిగిల్చింది.
జెండా వందనం
బాబా ఊరికి సర్పంచ్ అని చెప్పాను కదా. చెబ్బీస్ జన్వరి, పంద్రాగస్టు నాడు బస్టాండ్ పక్కన ఖాళీ స్థలంలో ఉన్నగాంధీ విగ్రహం వద్ద జెండా వందనం జరిగేది. ఊరి సర్పంచ్ గా బాబానే జెండా ఎగురవేసేది. మేము శాఖా బడి నుంచి ఊరేగింపుగా నినాదాలు ఇస్తూ ఊరంతా తిరిగి గాంధీ విగ్రహం వద్దకు వచ్చేది. ముందు వరుసలో స్కౌట్స్ పిల్లలు యూనిఫాంలో బ్యాండ్ వాయిస్తూ ముందు నడిచేవారు. వారి వెనుక పెద్ద తరగతుల పిల్లలు, ఆ తర్వాత చిన్న తరగతుల పిల్లలు జతగా నడిచేవారు. తెల్ల రంగులో గాంధీ విగ్రహం చాలా బాగుండేది. మంచి కొలతలతో అసలైన గాంధీ పోలీకలతో ఉండేది. అక్కడ బాబా జాతీయ జెండా ఎగురవేయడం మాకు చాలా గర్వంగా ఉండేది. జెండా వందనం తర్వాత ఊరేగింపు పెద్ద బడికి పోయేది. తర్వాతి కాలంలో గాంధీ విగ్రహం ఉన్న ఆ స్థలంలో కొత్త బస్టాండ్ నిర్మించడంతో గాంధీ విగ్రహం కూడా తీసి వేశారు. మరొక కొత్త విగ్రహాన్ని రూల్ కృష్ణమూర్తి గారి దుకాణం ఉన్నచౌరస్తాలో ఏర్పాటు చేశారు. పాత గాంధీ విగ్రహానికి ఉన్న పోలికలు, గంభీరత ఇందులో లేదు. అదొక గాంధీ క్యారికేచర్ లాగా ఉంది. ఇప్పుడు చాలా ఊళ్ళలో పెట్టిన గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్ర బోస్, నెహ్రూ, ఇందిరా గాంధీ విగ్రహాలు ఇట్లా క్యారికేచర్ లాగానే ఉంటున్నాయి తప్ప అసలైన పోలీకలతో లేవు.
గాంధీ విగ్రహం లేని కాలంలో దాన్నిరూల్ కృష్ణమూర్తి చౌరస్తా అనేవారు. వారి ఇంటి ముందు చాలా ఎండ్లు 10 టన్నుల ఇనుప రోడ్డు రోలర్ ఒకటి పడి ఉండేది. అది ఎప్పటిదో, అక్కడ ఎందుకు ఉండేదో తెలియదు. ఆ రోడ్డు రోలర్ పిల్లలకు ఆట వస్తువుగా ఉండేది. అట్లా ఆ చౌరస్తాకు ఆ పేరు స్థిర పడిపోయింది. గాంధీ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని గాంధీ చౌక్ అని పిలవడం మొదలయ్యింది.
చక్డాలో పార్డీకి ప్రయాణం
మా కుటుంబానికి బోథ్ లోనే కాదు బోథ్ కు ఉత్తరాన పార్డీ అనే ఒక పల్లెలో కూడా వ్యవసాయం సాగుతూ ఉండేది. అక్కడ మా బాబా ఒక మంచి పెంకుటిల్లు కూడా కట్టించాడు. ఇంటి వెనుక ఒక గుట్ట. వారానికి ఒకసారి పార్డీకి వెళ్ళేవాడు. పోవడానికి ఒక గూడు బండి ఉండేది. దాన్ని మా ఆదిలాబాద్ ప్రాంతంలో చక్డా అనేది. ఈ చక్డా కు ఎడ్లకు బదులు కంకలను(కోడెలు) కట్టేవారు. వాటిని ఎడ్లుగా మార్చడానికి ముందు చక్డాకు కట్టి బండికి అలవాటు చేసేవారు. మన పిల్లల ప్రీ స్కూల్ లాంటిదన్నమాట.
కోడెలను అదుపు చేయడం అందరికీ సాధ్యం కాదు. ఆవులను చూస్తే అదిరిపోయేవి. వాటిని అదుపులోకి తీసుకు రావడం నైపుణ్యంతో కూడన పని. బాబా చాకచక్యంతో కోడెల చక్డాపై పార్డీకి వెళ్ళేవాడు.
అప్పుడప్పుడు మేమూ పార్డీకి వెళ్ళి బాబాతో రెండు రోజులు పార్డీలో గడిపేవారం. చక్డాలో పార్డీ వెళ్లేటప్పుడు దారిలో ఎవరెవరో “రాంరాం మహారాజ్” అని పలకరించేవారు. ఆయన కూడా వారికి రాంరాం చెప్పి వారి భాషలో మాట్లాడేవాడు. “మీవ బద్నార్?” (మీది ఏ ఊరు) అని గోండి భాషలో అడిగేవాడు. వాళ్ళు ఏదో ఊరి పేరు చెప్పేవారు. పార్డీలో గోండులు, కోలాములు, నాయకపోడులు ఉన్నప్పటికీ అది ప్రధానంగా మథురల గ్రామం. మథుర స్త్రీల తలపై ఒక కొమ్ము ఉంటుంది. అందుకే వీరిని కొమ్ము బంజారాలని కూడా అంటారు.
ఈ తరం స్త్రీలు ఈ కొమ్ము జడ వేసుకోవడం లేదు. పాత తరం స్త్రీలు మాత్రం ఆ సాంప్రదాయాన్నిఇంకా కొనసాగిస్తున్నారు. బోథ్ ప్రాంతంలో వీరి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా వీరి ఉనికి ఉంది. పార్డీలో వ్యవసాయ పనుల పర్యవేక్షణ అంతా బాబానే చూసుకునేవాడు. బోథ్ వ్యవసాయ వ్యవహారాలు ఆయి చూసుకునేది. వానాకాలం పెద్దవాగు ఉదృతంగా పారుతుంది కనుక చక్డాలో పార్డీ పోవడం వీలయ్యేది కాదు. అప్పుడు సోనాల వరకు బస్సులో పోయి అక్కడి నుండి 5 కిలోమీటర్లు నడుస్తూ పార్డీకి పోయేవాడు.
మీసా కింద కొడుకు అరెస్ట్
1975 ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ సంస్థలు, ప్రజా సంఘాలు, పార్లమెంటరీ పార్టీలపై నిషేధం విధించారు. వేలాది మందిని ఏ కారణం లేకుండానే అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉండేవారు. అటువంటి నిషేదిత సంస్థల్లో ఆర్ ఎస్ ఎస్ ఒకటి.
మా అన్నతో పాటూ మరో ముగ్గురికి రిమాండ్ అయ్యింది. ఇక కేసు విచారణ లేదు ఏమీ లేదు. లాయర్ ఎంత ప్రయత్నం చేసినా బెయిల్ ఇప్పించలేకపోయాడు.
మా చిన్నన్నగిరిధర్ దేశ్ పాండే అప్పుడు పదవ తరగతిలో ఉన్నాడు. ఎవరి ప్రొద్బలమో తెలియదు.. కొందరు మిత్రులతో కలిసి ఊర్లో గోడలపై “ఆర్ ఎస్ ఎస్ పై నిషేధం ఎత్తివేయాలి” అని జాజుతో నినాదాలు రాసినారు. వెంటనే పోలీసుల విచారణ షురూ అయ్యింది. అప్పుడు డేవిడ్ అనే వ్యక్తి బోథ్ లో ఇన్స్పెక్టర్. ఈ సంగతి తెలిసి మా ఆయి రాత్రికి రాత్రి బండి కట్టించి అడెల్లును తోడిచ్చి పార్డీకి పంపించి తెల్లవారు జామున సోనాలలో మహారాష్ట్రా కిన్వట్ కు పంపించి అక్కడి నుంచి రైల్లో పర్భణీలో ఉండే అనసూయ మావుషి వద్దకు పంపించింది. ఒక నెల రోజులు అక్కడ ఉన్నాడు. సర్పంచ్ గారి కొడుకు ఇందులో ఉన్నాడని తెలుసుకున్న ఇన్స్పెక్టర్ మా తండ్రి వద్దకు వచ్చి “ఏమీ కాదు. చిన్న కేసే. రిమాండ్ కూడా అవసరం రాదు. స్టేషన్ బెయిల్ ఇప్పిస్తాను పిలిపించండి” అని నమ్మబలికాడు. ఆయన మీద నమ్మకంతో పర్భణీ నుంచి చిన్నన్నను బోథ్ రప్పించారు. రాగానే అరెస్ట్ చేసి మీసా కింద కేసు నమోదు చేసి నిజామాబాద్ జెయిల్ కు రిమాండ్ చేశారు. మా అన్నతో పాటూ మరో ముగ్గురికి రిమాండ్ అయ్యింది. ఇక కేసు విచారణ లేదు ఏమీ లేదు. లాయర్ ఎంత ప్రయత్నం చేసినా బెయిల్ ఇప్పించలేకపోయాడు.
అన్న పదవ తరగతి పరీక్షలు తప్పిపోయాయి. మా బాబా కొడుకు బెయిల్ కోసం కాంగ్రెస్ నాయకులను అందరినీ కలిశాడు. ఆదిలాబాద్ జిల్లా మంత్రి పి. నరసారెడ్డి గారిని, పి వి నరసింహారావు గారిని కూడా కలిసి బెయిల్ కోసం సహాయం చేయమని కోరినాడు. “ రావు సాబ్ ఇది మీసా కేసు. ఏమీ చేయలేమని” వారు నిస్సహాయత వ్యక్తం చేశారు.
మనస్థాపంతో బ్రెయిన్ స్ట్రోక్
తిరిగి తిరిగి విసగి వేసారిపోయి ఆఖరుకి కాంగ్రెస్ రాజకీయాలకే గుడ్ బై చెప్పేశాడు బాబా. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో పాల్గొనలేదు. మనస్థాపంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయి పూర్వపు గంభీరతను, జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. మనుషులను కూడా గుర్తు పట్టేవాడు కాదు. డాక్టర్ గా మా బావుజీకి అతనే మొదటి పేషంట్. ఆయనను మామూలు మనిషిని చేయడానికి హైదరాబాద్ తీసుకుపోయారు. అక్కడ నెల రోజుల ట్రీట్మెంట్ వలన పెద్దగా ప్రయోజనం రాలేదు. డాక్టర్ల సలహా మేరకు ఆయనను తమిళనాడు వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకుపోయాడు భావుజీ. అక్కడ రెండు నెలల ట్రీట్మెంట్ తర్వాత కొలుకున్నాడు. కానీ మునుపటి గంభీరమైన వ్యక్తిగా మాత్రం తిరిగి రాలేదు.
1977 లో ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోరంగా ఓటమి పాలై జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ కేసులను ఎత్తివేసి జైలులో మగ్గుతున్న వేలాది మందిని విడుదల చేశారు. అట్లా మా చిన్నన్న అతని మిత్రులు కూడా విడుదల అయినారు. అతని చదువు కుంటు పడింది. నిజామాబాద్ జైల్లో ఎవరి పరిచయం వల్లనో అతనిలో, సహచర డెటెన్యూల భావజాలంలో పూర్తి మార్పు వచ్చింది. ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని వదిలి భౌతికవాద దృక్పథానికి మళ్ళినారు.
బాబా సియాసత్ పాఠకుడు, సెక్యులరిస్టు
బాబా ప్రతీ రోజు సియాసత్ ఉర్దూ పత్రిక చదివేవాడు. అట్లా మాకు కూడా కొద్ది పాటి ఉర్దూ నేర్పించాడు. ఉర్దూ బాల శిక్ష పుస్తకాలు తెప్పించాడు. మా ముగ్గురు అన్నదమ్ములకు టేకుతో ఒక టేబుల్, ఒక కుర్చీ చేయించడం యాదికి ఉన్నది. సెక్యులర్ ఆలోచనలు కలిగిన ఆయన అన్ని మతాల ప్రజలను ఆదరించినాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉండేవారు. జిల్లాలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ముఖ్ షీర్ షా బాబాకు మంచి స్నేహితుడు. మొహర్రం సందర్భంగా కర్బల పీరు మా ఇంటికి తప్పక వస్తుంది. బాబా ఆ పీరుకు దట్టీ కట్టి రెండు రూపాయల దండ వేయడం యాదికి ఉన్నది. ఆయన మరణించే వరకు కర్బల పీరుకు దట్టి కట్టినాడు. ఆ తర్వాత కూడా కర్బల మా ఇంటికి క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నది.
మరాఠీ అభంగ్, భావ గీతాలు, భజన్ ల అభిమాన శ్రోత
బాబాకు భీమసేన్ జోషి, సురేష్ వాడ్కర్, సుధీర్ ఫడ్కే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, సుమన్ కళ్యాణ్ పూరీ తదితరులు పాడిన మరాఠీ అభంగ్ లు, భావ గీతాలు, భజన్ లు చాలా ఇష్టం. బడే గులాం అలీ ఖాన్ ఖయాళ్ళూ, టుంరీ కూడా ఇష్టమే. మా ఇంట్లో తొలి రోజుల్లో ఒక పెద్ద చెవుల రేడియో ఉండేది. దానికి ఇంటి పై కప్పు దాకా ఒక అంటీనా ఉండేది. ఆ రేడియోలో ఉదయం 6 గంటలకు మొదలయ్యే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో మొదలై 7 గంటల వరకు నాగ్ పూర్ స్టేషన్ నుంచి ప్రసారం అయ్యే మరాఠీ సంగీత కార్యక్రమం తప్పక వినేది. హైదరాబాద్ కేంద్రం నుంచి ఉర్దూలో ప్రాంతీయ వార్తలు రోజుకు మూడు సార్లు ప్రసారం అయ్యేవి. వాటిని కూడా బాబా ఇష్టంగా వినేవాడు. ఉదయం ఉర్దూ వార్తలు విన్న తర్వాతనే అతని దిన చర్య మొదలయ్యేది. తర్వాతి కాలంలో ఆంటీనా అవసరం లేని పోర్టబుల్ రేడియోలు వచ్చిన తర్వాత ఫిలిప్స్ రేడియో కొన్నాడు. బోథ్ లో ఒకటి పార్డీలో ఒకటి.
బుధవారం బినాకా గీత్ మాలా వినేది. క్రికెట్ ఉంటే కామెంటరీ వినేది. బాబా రేడియో వినే సమయానికి మాకు రేడియోతో పెద్ద అవసరం ఉండేది కాదు. కాబట్టి ఆయనతో పాటూ మరాఠీ అభంగాలు, భావ గీతాలు, భజన్ లు వినడం ఒక అలవాటుగా మారింది.
ఆయన రేడియో వినే కార్యక్రమం ముగిసిన తర్వాతనే రేడియో మా చేతుల్లోకి వచ్చేది. మాకు రేడియో సిలోన్ లో పాత హిందీ పాటల కార్యక్రమం వినాలని ఉండేది. అందులో చివరి పాట సైగల్ ది వేసేవారు. ఇప్పటికీ ఆ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. బుధవారం బినాకా గీత్ మాలా వినేది. క్రికెట్ ఉంటే కామెంటరీ వినేది. బాబా రేడియో వినే సమయానికి మాకు రేడియోతో పెద్ద అవసరం ఉండేది కాదు. కాబట్టి ఆయనతో పాటూ మరాఠీ అభంగాలు, భావ గీతాలు, భజన్ లు వినడం ఒక అలవాటుగా మారింది. భీమ్ సేన్ జోషి పాడిన “ మాజ్హే మాహేరే పండరి”, లతా మంగేశ్కర్ పాడిన “కేశవా మాధవా తుజా నామాతరే గోడవా” పాటలు ఇప్పటికీ యాదికి ఉన్నాయి. పాత చెవుల రేడియో చాలా కాలం పాటు చెత్తలో పది ఉండేది. అందులో అయస్కాంతం కోసం దాన్ని ఛిద్రం చేసి పారేశాము. ఆ అయస్కాంతం చాలా కాలం మాకు ఆట వస్తువుగా ఉండింది.
బాబా చివరి రోజులు
1994 వానాకాలం ఒక రోజున రాత్రి బోరున వర్షం పడుతుంటే వద్దన్న కూడా మూత్రానికి బయటకు పోయినాడు. కాలు జారీ గద్దె మీద నుంచి కింద పడిపోయినాడు. తుంటి ఎముక విరిగింది. మా పెద్దన్నగంగాధర్ రావు దేశ్పాండే కరీంనగర్ లో ఉద్యోగ రీత్యా ఉండేవాడు. అక్కడ తుంటి ఎముకకు ఆపరేషన్ జరిపి తొడలో రాడ్ పెట్టినారు డాక్టర్లు. అయినా ఆయనకు నడక రాలేదు.
ఇక తన రోజులు దగ్గర పడినాయని అతనికి తెలిసి పోయిందేమో.. కరీంనగర్ నుంచి బోథ్ మట్టి గోడల ఇంట్లోనే తన ఊరిలో, తన మనుషుల మధ్య చివరి రోజులు గడపాలను అనుకున్నాడు. కరీంనగర్ లో మా పెద్దన్న ఇంట్లో ఉండలేక తనను బోథ్ పంపించమని రోజూ పోరు పెడితే, ఆయనను బోథ్ తీసుకు వచ్చారు. చివరి రోజుల్లో ఆయన మల మూత్రాలు మంచంలోనే జరిగేవి.
అడెల్లుతో చికెన్ కూర తెప్పించి అన్నం కలిపి ముద్దలు తినిపించాను. ఇష్టంగా తృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఆయన తుది శ్వాస విడిచాడు.
నా ఉద్యోగం హైదరాబాద్ లో. ఒక నెల రోజులు సెలవు పెట్టి నేను, భారతి బాబాతోనే ఉన్నాము. బాబా ఇంట్లో నాన్ వెజ్ తినేవాడు కాదు కానీ పార్డీలో వండించుకునేవాడు. ఆ సంగతి మాకు తెలుసు. ఒకరోజు “బాబా చికెన్ తింటావా” అని అడిగాను. తల ఊపాడు. అడెల్లుతో చికెన్ కూర తెప్పించి అన్నం కలిపి ముద్దలు తినిపించాను. ఇష్టంగా తృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఆయన తుది శ్వాస విడిచాడు.
బాబా జీవితాచారణే నాకు స్పూర్తి
బాబా మా అందరికీ ఆదర్శం. ఆయన లెగసీని కొనసాగించాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఆయన ఆచరించిన నీతి నిజాయితీ, సెక్యులర్ భావజాలం, ఉర్దూ భాష మీద ప్రేమ, చాతనైనంత ఇతరులకు సహాయం చేయడం, పని పట్ల కమిట్మెంట్, సింప్లిసిటీ, ఉఛ్చనీచాలు లేకపోవడం .. ఇవన్నీ ఆయన ఆచరణ నుంచి నేర్చుకున్నవే. తన పరపతిని ఉపయోగించి ఎందరికో ఉద్యోగాలు ఇప్పించినాడని ఆయన సహాయం పొందిన వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
ఈ ఒక్క విషయంలో తప్ప ఆయన జీవితాచరణ మాకు ఎప్పుడూ స్పూర్తిని ఇచ్చేదే. ఈ క్రిస్మస్ సందర్భంగా బాబా జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకోవడం నాకు గర్వంగా ఉన్నది.
ఒకే ఒక్క విషయంలో ఆయనతో బేధం. ఆయన స్వామీ రామానంద తీర్థ అనుయాయి. రామానంద తీర్థ సమైక్యవాది. తెలంగాణ ఆంధ్రా విలీనానికి అనుకూలుడు. ఆయన అనుయాయిగా బాబా కూడా సమైక్యవాదిగా ఉన్నాడు. 1969 ఉద్యమంలో విద్యార్తులు ఆయన మీద దాడికి ప్రయత్నించారట. అయితే పెద్దలు వారించిన పిదప దాడి చేయకుండా వెనుదిరిగి పోయారని అప్పుడు విద్యార్తి ఉద్యమంలో పాల్గొన్న వారు చెప్పగా విన్నాను. మేము పిల్లలం మొదటి నుంచి తెలంగాణ వాదులమే. 1969 ఉద్యమ ఘటనలు నాకు లీలగా జ్ఞాపకం ఉన్నాయి. ఆ తరవాత 2000 సంవత్సరం నుంచి మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాను. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం లోనూ ఇంజనీరుగా నా వంతు పాత్ర నిర్వహిస్తున్నాను.
ఈ ఒక్క విషయంలో తప్ప ఆయన జీవితాచరణ మాకు ఎప్పుడూ స్పూర్తిని ఇచ్చేదే. ఈ క్రిస్మస్ సందర్భంగా బాబా జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకోవడం నాకు గర్వంగా ఉన్నది.
కాలమిస్టు పరిచయం
శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం. తొమ్మిదో భాగం బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ. పదో భాగం బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసు. మీరు చదివింది పదకొండో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com