Editorial

Monday, December 23, 2024
స్మరణజయంతివట్టికోట ఆళ్వారుస్వామి రూప చిత్రం - ఇది కొండపల్లి అక్షర చిత్రం

వట్టికోట ఆళ్వారుస్వామి రూప చిత్రం – ఇది కొండపల్లి అక్షర చిత్రం

పుస్తకాల పెట్టెను మోసే కూలీతో తెలంగాణములో తిరుగాడే ఒకే ఒక వ్యక్తి, వైతాళికుడు, ఆంధ్రమహాసభ ఆర్గనైజరు, వట్టికోట ఆళ్వారుస్వామి. నేటికి వారి రూపం, ప్రసన్నవదనం నాస్మృతి పథంలో ఫ్రేముగట్టిన రూప చిత్రం (Portrait) గోచరిస్తుంది. ఆయన నాకు చేసిన సాయం నాజన్మాంతం మరువలేనిదని సగర్వంగా చెప్పుకోవడానికి   గర్వపడుతున్నాను.

శ్రీ కొండపల్లి శేషగిరి రావు 

Sri Kondapalli Sheshagiri Rao. Pic by Kandukuri Ramesh Babu

నిండైన విగ్రహం- జామపండులాంటి ఛాయ, గుండ్రని ముఖమండలం, ఆజానుబాహువులు, ప్రసన్న వదనం, ఖద్దరు బట్టలు, సన్నని తిరుమణికాపు, క్రాఫింగు చేతిలో నొక లెదరుబ్యాగు (చిరుతపులిచర్మం) ధరించి కాలినడకనైనా బండిలో బస్సుల్లో ప్రయాణించి ఊరూరు తిరిగేవాడు. పుస్తకాల పెట్టెను మోసే కూలీతో తెలంగాణములో తిరుగాడే ఒకే ఒక వ్యక్తి, వైతాళికుడు, ఆంధ్రమహాసభ ఆర్గనైజరు, వట్టికోట ఆళ్వారుస్వామి, ఒకవైపు పుస్తకాలను అణా పైసలకు పంచిపెట్టి మరొకవైపు రాజకీయ విజ్ఞానాన్ని రగిలించి పటేలు పట్వారీలను, దేశముఖులు మభ్తే దార్లును, జాగీర్దారులను, వకీళ్లను, విద్యార్థులను జాతీయోద్యమ సానుకూలురుగా, చందాదార్లుగా చేర్చి, గ్రంథాలయాలను నెలకొల్పడానికి పాటుబడిన వ్యక్తి ఆళ్వారుస్వామి. నేటికి ఆరూపం, ప్రసన్నవదనం నాస్మృతి పథంలో ఫ్రేముగట్టిన రూప చిత్రం (Portrait) గోచరిస్తుంది. ఇది 1938 నుండి 1945లోని రూపచిత్రం. రానురాను నొసట తిరుమణికాపు పోయి నిర్మల విశాలఫాలం, నిష్కల్మతకు ప్రతీకగా నిలచిపోయింది. మొదలు శ్రీవైష్ణవుడు, తర్వాత గాంధీవాది, చివరికి కమ్యూనిష్టుగా భావపరిణతి చెంది. నిజాం నిరంకుశపాశాలకు బందీగా జైలుశిక్ష ననుభవించినాడు ఆళ్వారుస్వామి.

ఆళ్వారుస్వామి స్వయంగా అనేక సామాజిక కుటుంబ పోరాటాలను చవి చూచిన వ్యక్తి. ఎట్టి పరిస్థితులలోనైనా గట్టిగా నిలదొక్కుకొని నిటారుగా విజయం సాధించిన వ్యక్తి! ఆయన మాటల్లో క్రియల్లో దయాదాక్షిణ్యం, విజ్ఞానం, వినోదం, హాస్యాన్ని ప్రతిబింబిస్తుండేవాడు. (Wit Jokes) కోకొల్లలు నవ్వించేవాడు. ఎటువంటి గంభీర విషయాన్నైనా చులకనగా నవ్వు ముఖంతో చర్చించేవాడు.

Seriousness ను హాస్యాన్ని రంగరించి రుచింప జేయడంలో అతనికి అతనే సాటి.

ఆళ్వారుస్వామి ఎందరో యువకులకు అనేక రకాల సాయం చేసినాడని విన్నాను. కాని ఆయన నాకు చేసిన సాయం నాజన్మాంతం మరువలేనిదని మూలకారుకుడు వట్టికోట ఆళ్వారుస్వామి అని సగర్వంగా చెప్పుకోవడానికి భారతదేశములో పేరెన్నికగన్న ఒక చిత్రకారునిగా గుర్తింపు పొందడానికి గర్వపడుతున్నాను. ఆ ఉదంతాన్ని ఈ క్రింద ఉదహరిస్తున్నాను.

హన్మకొండలో కలిగిన పరిచయాన్ని పురస్కరించుకొని నా విషయమంతా ఆళ్వారుస్వామికి నివేదించుకొన్నాను. నేను ఆర్టిస్టును కావాలని, స్కూల్ ఆఫ్ ఆర్డులో చేరాలని, వారాలు చేసుకొంటానని చెప్పుకొన్నాను. ఆయన నా అమాయకత్వానికి నిస్సహాయ సాహసానికి ఆశ్చర్యపడి నావారాలకు ప్రయత్నిస్తానని తనకు పరిచయమున్న కొందరిని కలిసి నా విషయమంతా చెప్పాడు.

నేను విద్యార్ధిగా మెట్రికులేషను చదువుతున్న రోజులవి. 1939 నుండి 1941లో హన్మకొండలో హయగ్రీవాచుర్యుల వద్దకు అప్పుడప్పుడు వస్తూ పోతుండేవాడు ఆళ్వారుస్వామి. అప్పుడే నాకతనితో పరిచయం కాళోజీ నారాయణరావు, రామేశ్వర్ రావు పర్సా రంగారావు గారింటిలో కూడా విడివిడిగా వారు రాజకీయ చర్చలు జరుపుతున్న సందర్భంలో నేను ప్రత్యక్షంగా తిలకించేవాడిని. అప్పటికే నాకు చిత్రకళలో ప్రవేశంతో బాటు ఉత్సాహమును ప్రోత్సాహమూ కల్గినదని చెప్పవచ్చును. 1941లో మేట్రికులేషను ముగించి హైదరాబాదుకు వచ్చాను. రెడ్డి హాస్టలులో నా బాల్య మిత్రుడు రాఘవరెడ్డి వద్ద మకాం పెట్టాను. నేను వచ్చింది. స్కూల్ ఆఫ్ ఆర్డు అండ్ క్రాఫ్ట్ లో చిత్రకళా విద్యార్థిగా చేరుదామని, కాని హైదరాబాదులో నాకేవ్వరూ పరిచయస్తులు లేరు. పైగా నిత్యభోజనానికి వారాలు చేసుకొని, స్కాలర్ షిప్ తో 5 సంవత్సరాల డిప్లొమా కోర్సు చేయాలని నాతపన. నిరామయంగా గుడ్డిగా వెనకాముందు ఆలోచించకుండా హైదరాబాదుకు చేరుకొన్నాను. Where there is a will there is a way అనే వాక్యం నాపట్ల చాలా పని చేసిందని చెప్పవచ్చు. నాలోని అమాయకత్వానికి దృఢ సంకల్పానికీ దైవం తోడు నీడై కాపాడినట్టు హైదరాబాదుకు చేరుకున్న మరునాడే ఏదో మీటింగులో పాల్గొనడానికి ఆళ్వారుస్వామి రెడ్డి హాస్టలుకు రావటం తటస్థించింది. అక్కడ గేటు ముందు కలిశాం! హన్మకొండలో కలిగిన పరిచయాన్ని పురస్కరించుకొని నా విషయమంతా ఆళ్వారుస్వామికి నివేదించుకొన్నాను. నేను ఆర్టిస్టును కావాలని, స్కూల్ ఆఫ్ ఆర్డులో చేరాలని, వారాలు చేసుకొంటానని చెప్పుకొన్నాను. ఆయన నా అమాయకత్వానికి నిస్సహాయ సాహసానికి ఆశ్చర్యపడి నావారాలకు ప్రయత్నిస్తానని తనకు పరిచయమున్న కొందరిని కలిసి నా విషయమంతా చెప్పాడు.

ఇంతలో పెండ్యాలరాఘవరావు రెడ్డి హాస్టల్ కు వచ్చిన సందర్భంలో ఆళ్వారుస్వామి నన్ను గురించి పరిచయం చేసినాడు.

కాని హైదరాబాదులో వారియిండ్లు చాలా దూరంగా ఉండటం చేత నేను ఆర్డు స్కూలులో చదవటానికి, వారి యిండ్లలో తిరగటానికి చాలా యిబ్బందిగా ఉంటుందని ఆలోచించడం మొదలు పెట్టాం. ఇంతలో పెండ్యాలరాఘవరావు (తర్వాత 1954 ఎలక్షన్లలో యం.పి. గా ఎన్నికయ్యాడు) రెడ్డి హాస్టల్ కు వచ్చిన సందర్భంలో ఆళ్వారుస్వామి నన్ను గురించి పరిచయం చేసినాడు. ఆయన 15 రోజులు వరకు నాకక్కడే భోజన సదుపాయం కల్పించాడు. ఇది వేరే విషయం. ఈ మధ్యలో ఆళ్వారుస్వామి నా వారాల కోసం ప్రయత్నం చేయమొదలు పెట్టి వెంకటయ్యగారి వద్ద (పి.డబ్ల్యూ.డి లో ఉద్యోగి, ఆళ్వారుస్వామి స్నేహితుడు) నాకు వారాలు కుదిరేంతవరకు భోజన సదుపాయం ఏర్పాటు చేయగల్గినాడు. మరో 15 రోజులు వెంకటయ్య గారి వద్ద మకాం మార్చినాను. ఈ మధ్యకాలంలో ఆళ్వారుస్వామి ఇంటింటికి పిల్లిపిల్లను చంకన బెట్టినట్టుగా తిప్పి అనేకులతో పరిచయం చేయించసాగినాడు.

మాడపాటి హన్మంతరావు గారితో కలిపి నా కథంతా సవిరంగా తెలిపి పరిచయం కలిగించినాడు, ఆయన గారు తలపై చేయి పెట్టుకొని నా విషయం ఆలోచించి,ఒక ఉచిత సలహా నిచ్చినాడు. నన్ను తీసుకొని వెళ్ళి మందుముల నర్సింగరావు (రయ్యత్ పత్రికా సంపాదకుడు) తో కలప మని చెప్పినాడు. ఆ మరునాడే మేము శ్రీ నర్సింగరావు గారిని కలిసినాము. ఆయనకు నన్ను మెహదీ నవాజుజంగు వద్దకు తీసుకొని పొమ్మని తాను వ్రాసిన ఉత్తరం కవరులో బంధించి ఆళ్వారుస్వామి చేతికిచ్చాడు. మేము వెళ్ళినప్పుడు,
పెండాల్య రాఘవరావు, గుండవరపు హన్మంతరావు గారలను కూడా వెంట బెట్టుకొని పొమ్మని, నేనిదివరకే వేసిన కొన్ని చిత్రాలు చూపించవలసిందని చెప్పినాడు. మేమంతా మరునాడే బంజారాహిల్స్ లో మోహదీనవాజ్ జంగ్ గారింటికి వెళ్లాం. ఆళ్వారుస్వామి నవాబుగారికి నర్సింగరావు రాసిన
కవరు నందింపచేసి నా విషయమై చెప్పుతుండగా ఉత్తరం చదివాడు, నేను వేసిన చిత్రాలు చూసి ఇది నీవే వేసినావాయని ఆశ్చర్యంగా నన్నడిగినాడు. నేనే అని చెప్పాను. ఆయన విశ్వసించి “అచ్చాబేటే, తుమ్ హమారే ఘర్ మేఁరహజావో తుమారే పడ్నేకా ఇంతేజామ్ కర్దేంగే- తుఝరా సామాన్కల్ యహాలాలేనా” అని ఆయన బేగం (తాహెరా)ను పిలిచాడు. ఆమెకు సంగతి చెప్పాడు. ఆమె కూడా నన్ను చూచి మంచిదని అంగీకరించింది.

ఈ అనుకోని సంఘటన జరగడం చేత నేనూ, ఆళ్వారుస్వామి, రాఘవరావు, హన్మంతరావు గారలు అమితాశ్చర్యం పొంది ఆనందపరవశులమైనాం! నవ్వాబు మెహదీనవాజ్ జంగు నాకు ఇతరుల సహాయం అవసరం లేకుండా స్కూల్ ఆఫ్ ఆర్టులో చేర్పించి ఐదు సంవత్సరాలు చదువు చెప్పించాడు. తర్వాత నేను నా బ్యాచ్ లో ఫస్టు క్లాస్, ఫస్ట్ గా డిప్లోమా పరీక్షలో ఉత్తీర్ణుణ్ని అయ్యాను.

నా కళా జీవితానికి ఆళ్వారుస్వామి మూలపురుషుడనే విషయంతో ముడిపడిన ఉదంతం స్పష్టమౌతుంది. ఆయన ఒక ధ్యేయాన్ని దృష్టిలో నుంచుకొన్నారు- అదినేను ఆర్టిస్టు కావాలని. ఇటువంటి నాయకులు నేటి వ్యవస్థలో వెతకినా కనిపించరు.

ఆయన మరొక సంవత్సరం శాంతినికేతనానికి పంపించాడు. నేను తిరిగివచ్చి రజాకారు ఉద్యమ కాలంలో (Under Ground) లో నుండి పోలీస్ ఆక్షన్ తర్వాత 1950లో స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్టులో ఆర్టు టీచరు గా నియమింపబడి, 1984లో ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్ అయ్యి రిటైర్ అయ్యాను. ఈ మధ్యకాలంలో అనేక కళా ప్రదర్శనలలో అనేక బహుమతుల నందుకొని (Artist Emiritus) గౌరవాన్ని పొందాను. నా కళా జీవితానికి ఆళ్వారుస్వామి మూలపురుషుడనే విషయంతో ముడిపడిన ఉదంతం స్పష్టమౌతుంది. ఆయన ఒక ధ్యేయాన్ని దృష్టిలో నుంచుకొన్నారు- అదినేను ఆర్టిస్టు కావాలని. ఇటువంటి నాయకులు నేటి వ్యవస్థలో వెతకినా కనిపించరు.

ఆళ్వారుస్వామి స్వయం కృషితో త్యాగంతో అనేక ఆర్థిక ఇబ్బందులతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో సత్యాగ్రహంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. 1947లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అరెస్టయి మూడేండ్లు డిటీన్యూగా బాధలనుభవించాడు. 1938లో సికింద్రాబాదులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి దాదాపు 33 గ్రంథాలను ప్రచురించాడు. వానమామలై వరదాచార్యుల వారి ‘పోతన’ కావ్య ప్రచురణ కోసం పడిన పాట్లు ఆయన స్నేహ వర్గానికి తెలియనవి కావు. గ్రామగ్రామాలలో చందాలు వసూలు చేసి, కొన్ని వేలు సేకరించి, ఒక సంక్షిప్త గ్రంథాన్ని అసంపూర్తిగా ప్రింటు చేయించాడు.

దురదృష్టవశాత్తు ఆ కార్యం ముగియక ముందే ఆళ్వారుస్వామి 1961 ఫిబ్రవరి 5న అకాల మరణానికి గురి అయ్యాడు. తెలంగాణం అనే 2 వాల్యూములు అనేక విషయాలపై అనేక రచయితల చేత వ్రాయించాడు. అందులో నా వ్యాసం కూడా ప్రచురించాడు.

తెలంగాణంలో మొదటిసారి సమకాలీన రాజకీయ దృక్పథంతో వ్రాసిన నవల రచించిన వాడు ఆళ్వారుస్వామే. ఈయన రచించిన ‘ప్రజలమనిషి’ సుప్రసిద్ధం. నాచేత తెలంగాణ ప్రజల పోరాటానికి సంబంధించిన అనేక కార్టూన్లు, చిత్రాలు వేయించి, ప్రచురించాడు.

ఆళ్వారు స్వామి మానవతావాది. సుప్రసిద్ధ సంఘ సేవకుడు మౌలికమైన అభ్యుదయ కార్యక్రమాలకు నాంది పలికినవాడు కావడం వల్ల, ప్రథమ ప్రపంచ మహాసభల సందర్భంగా అనేక ఇతర నాయకుల కలిసిన ఆయన జీవితానికి ప్రతీకగా ఆయన వ్రాసిన గ్రంథాలు, చిత్రపటం చిత్రాలతో బాటు ఇతని ఫోటోను కూడా చేర్చి ప్రదర్శించాము కాలగర్భంలో కలిసిన ఆయన జీవితానికి ప్రతీకగా ఆయన వ్రాసిన గ్రంథాలు, చిత్రపటం మాత్రం మనకు మిగిలి ఉన్నాయి.

రచన తేది: 26-02-1991. ఈ వ్యాసం ‘చిత్రశిల్పకళా రామణీయకము – డా॥ కొండపల్లి శేషగిరిరావు గారి వ్యాసాలు’ నుంచి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article