ఈతచెట్టు దేవుడు: గోపీనాథ్ మహంతి గారి ‘అమృతసంతానం’ తరువాత నేను చదివిన రెండో నవల ఇది.
మార్కొండ సోమశేఖరరావు
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ గోపీనాథ్ మహంతి గారు 1944లో ఒరియాభాషలో రాసిన తన మొదటి నవల ‘దాదీబుఢా’ను తుర్లపాటి రాజేశ్వరి గారు ‘ఈతచెట్టు దేవుడు’గా తెలుగులో అనువదించగా, సాహిత్య అకాడమీ వారు 2021లో ప్రచురించారు. రాజేశ్వరి గారు చాలా బాగా అనువదించారు.
దాదీబుఢా నవలను ‘The Ancestor’ గా అరుణ్ కుమార్ మహంతి గారు ఇంగ్లీష్ లోకి అనువాదం చేయగా సాహిత్య అకాడమీ వారు 2013 లో ప్రచురించారు.
కోరాపుట్ జిల్లా కొండల్లో, ఆదీవాసీ గ్రామాల్లో నివసించే వారి జీవితాలను, వారి విశ్వాసాలను, సంప్రదాయాలను గోపీనాథ్ మహంతి గారు అక్షరబద్ధం చేసినట్లు ఇంకెవరూ చేయలేరనిపించింది. కోరాపుట్ జిల్లాలో ఉద్యోగరీత్యా మహంతిగారు ప్రత్యక్షంగా వారితో కలిసి జీవించి ఉండటం వల్లనే ఇది సాధ్యమయిందనిపించింది.
గోపీనాథ్ మహంతి గారి ‘అమృతసంతానం’ తరువాత నేను చదివిన రెండో నవల ఇది.
“నిజానికి అంతరిక్షం భువికి దూరమే. కానీ అక్కడ భూమ్యాకాశాలు ఏకమైనట్లు కన్పిస్తున్నాయి. అలా చూస్తుంటే అందమైన గుండ్రటి కొండ కన్పిస్తోంది.”అంటూ నవల ప్రారంభించి మనల్ని లుల్లా గ్రామంలో మురాన్ నది చుట్టూ తిరుగాడేట్టు చేస్తారు.
“ఎంతోమంది హృదయగాధలు బయటికి చెప్పరు! శరీరమనే జైలులో చివరివరకూ ఆ హృదయవేదనలన్నీ ఉండిపోతాయి. కొన్ని సందర్భాలలో కొన్ని జీవితాల్లో – ఒకరినొకరు అర్థం చేసుకోవటమే ఉండదు. వాళ్ళు జీవితాంతం తమకిష్టమైన భాగస్వాములను వెతుక్కుంటూ తిరుగుతారు.
పుస్తకంలో అనేక వాక్యాలు తరచి తరచి చదివించేలా ఉంటాయి.
“ఎంతోమంది హృదయగాధలు బయటికి చెప్పరు! శరీరమనే జైలులో చివరివరకూ ఆ హృదయవేదనలన్నీ ఉండిపోతాయి. కొన్ని సందర్భాలలో కొన్ని జీవితాల్లో – ఒకరినొకరు అర్థం చేసుకోవటమే ఉండదు. వాళ్ళు జీవితాంతం తమకిష్టమైన భాగస్వాములను వెతుక్కుంటూ తిరుగుతారు. కానీ ఆ అన్వేషణ వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు.”
“విశాలమైన ఈ విశ్వం వెలుగులో విస్తరిస్తూ, చీకట్లో సంకోచిస్తూ ఉంటుంది. రాత్రివేళ లోకం చిన్నదై చీకటి దుప్పటి కప్పుకుని నిద్రకి ఉపక్రమిస్తుంది. మనసు పొరల్లో దాగిన స్మృతులలాగ చంద్రుడు అర్ధచంద్రాకృతిలో ఆకాశంలో కనిపిస్తున్నాడు. ఎవరో నక్షత్రాలని పేలాలలాగ ఆకాశంలోకి విసిరారు. కొన్ని ఆకాశంలో తళుకులీనుతుంటే కొన్ని ఏమూలకో అదృశ్యమైపోయాయి. ఆశా నిరాశల అనుభూతుల వెలుగులలో ఎందరో మిణుగురు పురుగుల్లా కాస్సేపు మెరిసి కొట్టుమిట్టాడుతుంటారు.”
అన్నట్టు, గోపీనాథ్ మహంతి గారు తన 77 వ ఏట 1991లో తనువు చాలించారు.