Editorial

Wednesday, January 22, 2025
ఆటలు2021 Sports Roundup : ఏడాది క్రీడా సమీక్షణం

2021 Sports Roundup : ఏడాది క్రీడా సమీక్షణం

 కొవిడ్‌ వైరస్‌ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉండడంతో ఈ ఏడాది క్రీడాకారుల జయాపజాయలను వారి ప్రతిభకు గీటురాయిగా తీసుకోకుండా వారి ప్రయత్నాలను అభినందిస్తూ భవిష్యత మరింత బాగుండాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.

శ్రావ‌ణి ల‌క్ష్మీ

కొవిడ్‌ మహమ్మారి కారణంగా కిందటి ఏడాది మాదిరే ఈ సంవత్సరం ప్రథమార్ధం కూడా నిస్తేజంగా ముగిసింది. ద్వితీయార్థంలో బాలరిష్టాలన్ని అధిగమించి టోక్యో ఒలింపిక్స్‌ సందడి షురూ కావడంతో క్రీడాకారులు పురి విప్పారు. విశ్వక్రీడల పండుగతో క్రీడాభిమానుల సంతోషానికి రెక్కలొచ్చాయి. ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఆ తర్వాత ఇతర క్రీడా పోటీలూ ఊపందుకున్నాయి. ఒలింపిక్స్‌లో భారతకు ఆశించిన స్థాయిలో పతకాలు లభించకపోయినా కొందరి అథ్లెట్ల అద్భుత ప్రదర్శనతో త్రివర్ణ పతకం రెపరెపలాడింది. ఇక, భారత జట్టు వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని తప్పించడం, ఎఫ్‌-1 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఏడుసార్లు టైటిల్‌ నెగ్గిన హామిల్టన్‌కు షాకిచ్చి తొలిసారిగా వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలవడం, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరవడంతో పాటు మరికొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి నెమరవేసుకుందాం.

టోక్యో ఒలింపిక్స్‌తో మొదలు పెడితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన వాతావరణంలో ఈ పోటీలు జరిగాయి. కోటి ఆశలతో బరిలోకి దిగిన కొందరు క్రీడాకారులు ఒత్తిడికి చిత్తయితే పలువురు అనామక అథ్లెట్లు పతకాలతో మెరిశారు. పురుషుల 100 మీటర్ల పరుగులో జమైకా చిరుత ఉస్సేన్‌ బోల్ట్‌ వారసుడిగా పరిగణించిన అమెరికా అథ్లెట్‌ బ్రోమెల్‌, జిమ్నాస్టిక్స్‌లో సిమోన్‌ బైల్స్‌, భారత బాక్సర్‌ మేరీకోమ్‌, ఆర్చర్లు మను-దీపికా, షూటర్లు మనుభాకర్‌, అభిషేక్‌ నిరాశపర్చారు. ఓవరాల్‌గా అమెరికా మరోసారి 39 పసిడి పతకాలతో అగ్రస్థానం కైవసం చేసుకోగా చైనా (38 మెడల్స్‌), జపాన్ (27 మెడల్స్‌) తర్వాతి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. భారత విషయానికొస్తే 7 పతకాలతో 48వ స్థానాన్ని సంపాదించింది. నాలుగు దశాబ్దాల్లో భారతకిదే అత్యుత్తమ స్థానం. బీజింగ్‌లో 51, లండనలో 57, రియోలో 67వ స్థానంలో నిలిచిన భారత ఈసారి పతకాల పట్టికలో ఎగబాకింది. వాస్తవానికి షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌లో దాదాపు పది పతకాలు వస్తాయని ఆశించిన భారత శిబిరానికి నిరాశే ఎదురైంది. అయితే, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లోని జావెలిన్‌ త్రోలో నీరాజ్‌ చోప్రా పసిడి పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో రవి దహియా రజతాలతో మెరవగా, పురుషుల హాకీ జట్టు, బాక్సింగ్‌లో లవ్లీనా, రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా, షట్లర్‌ పీవీ సింధు కాంస్యాలతో సత్తా చాటారు. గోల్ఫ్‌లో బెంగళూరు అమ్మాయి అదితి అశోక్‌, అమ్మాయిల హాకీ జట్టు, రెజ్లర్‌ దీపక్‌ పూనియా త్రుటిలో పతకాలు కోల్పోయినా అద్భుత పోరాట పటిమ చూపించారు.

ఫార్ములావన్‌ నయా చాంపియన్‌

ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌ టైటిల్‌ను తొలిసారిగా మెర్సిడెస్‌ యేతర డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఈ హోండా-రెడ్‌బుల్‌ డ్రైవర్‌ ఏడుసార్లు వరల్డ్‌ చాంపియనైన లూయిస్‌ హామిల్టన్‌ను వెనక్కినెట్టి విజేతగా నిలవడం విశేషం. ఇక, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ దూరమైనా ఎఫ్‌-1 కెరీర్‌లో హామిల్టన్‌ ఇప్పటివరకు సాధించిన విజయాల గౌరవార్థం అతడికి నైట్‌హుడ్‌ మెడల్‌తో పాటు సర్‌ అనే బిరుదును ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్రదానం చేశారు.

జొకో గోల్డ్‌స్లామ్‌ మిస్‌

టెన్నిస్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జొకోవిక్‌ గోల్డ్‌స్లామ్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఒక ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గితే గోల్డ్‌స్లామ్‌ అంటారు. వింబుల్డన్‌, ఆసే్ట్రలియా, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లను కైవసం చేసుకొని గోల్డ్‌స్లామ్‌ను అందుకునేందుకు యూఎస్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన జొకోకు 25 ఏళ్ల రష్యన్‌ స్టార్‌ మెద్వెదేవ్‌ షాక్‌ ఇచ్చాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జొకోను ఓడించి మెద్వెదేవ్‌ చాంపియన్‌గా నిలిచాడు. విశ్వక్రీడల పురుషుల సింగిల్స్‌లోనూ సెమీస్‌లోనే నిష్క్రమించిన జొకోకు ఒలింపిక్స్‌ స్వర్ణం అందని ద్రాక్షాగానే మిగిలింది. 13 సార్లు ఫ్రెంచ ఓపెన నెగ్గిన నడాల్‌ను ఓడించి జొకో టైటిల్‌ కైవసం చేసుకోవడం ఈ ఏడాది అతడి కెరీర్‌లో హైలైట్‌. అంతేకాక, రికార్డు స్థాయిలో ఏడోసారి నెంబర్ వన్‌ ర్యాంక్‌తో జొకో 2021ని ముగించాడు. మహిళల టెన్నిస్‌లో హెలెప్, ఒసాక, సెరీనా వంటి స్టార్లు కాకుండా 18 ఏళ్ల బ్రిటన్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను అర్హత పోటీల ద్వారా యూఎస్‌ ఓపెన్‌లో అడుగుపెట్టి ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ఫ్రెంచ ఓపెన్‌, వింబుల్డనను వరల్డ్‌ నెంబర్ వన్‌ ఆష్లే బార్టీ, ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఒసాక నెగ్గి పాత తరానికి చెక్‌ చెప్పారు.

బయోబబుల్‌ కష్టాలు

భారత్‌లో జరిగిన ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి ఫేజ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్‌ జంపా, రిచర్డ్‌సన్‌ బయోబబుల్‌ సుదీర్ఘకాలం ఉండలేక లీగ్‌ నుంచి తప్పుకున్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి టెన్నిస్‌ యువ కెరటం నవోమి ఒసాక మానసిక ఒత్తిడి వల్ల తప్పుకోగా, దీర్ఘకాలం నుంచి బబుల్‌లో ఉండడంతో మానసిక ఒత్తిడిలోనైన అమెరికా జిమ్నాస్ట్‌ బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. మొత్తానికి కొవిడ్‌ మహమ్మారి వల్ల వచ్చిన బయోబబుల్‌ విధానం క్రీడాకారులకు కొత్త కష్టాలను తీసుకొచ్చిందనే చెప్పొచ్చు.

తెలుగుతేజాలు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని ముద్దాడిన తెలుగమ్మాయి పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో విశ్వక్రీడల మెడల్‌ను నెగ్గిన తొలి షట్లర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 2016 రియోలో రజతం, ఈ ఏడాది టోక్యోలో కాంస్యం నెగ్గిన సింధు, ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ క్వార్టర్స్‌లో నిష్క్రమించి ఈ క్యాలెండర్‌ ఈయర్‌ను ముగించింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో గుంటూరు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఖ్యాతి గడించాడు. ఇక, ఇదే టోర్నీలో యువ కెరటం లక్ష్యసేన కాంస్యంతో మెరిశాడు. పురుషుల డబుల్స్‌లో ఆంధ్ర కుర్రోడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌తో కలిసి వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉండగా సింగిల్స్‌లో సాయిప్రణీత ప్రపంచ 18వ ర్యాంక్‌లో కొనసాగుతూ వచ్చే ఏడాది మెగా టోర్నీలపై ఆశలు రేపుతున్నారు. వరంగల్‌కు చెందిన చెస్‌ క్రీడాకారుడు రాజా రిత్విక్‌ గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించి అబ్బురపరిచాడు. ఇక, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా కేంద్ర క్రీడాశాఖ అమలు చేస్తున్న టార్గెట్‌ ఒలింపిక్స్‌ పోడియం (టాప్స్‌) స్కీమ్‌లో తెలుగు రాషా్ట్రల నుంచి షూటర్లు ఇషా సింగ్‌, ధనూష్‌, చినాయ్‌, టీటీ ప్లేయర్లు శ్రీజ, స్నేహిత, వెయిట్‌ లిఫ్టర్‌ వరలక్ష్మీ, బ్యాడ్మింటనలో గాయత్రి గోపీచంద్‌, విష్ణువర్దన గౌడ్‌, ప్రణవ్‌ రావు, బాక్సింగ్‌లో నిఖత జరీన, హుస్సాముద్దీన టాప్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌లో స్థానం సంపాదించారు.

బడ్డింగ్‌ స్టార్స్‌

బడ్డింగ్‌ స్టార్స్‌ దగ్గరికి వస్తే టెన్నిస్‌లో ఐటీఎఫ్‌ టోర్నీల్లో ప్రాంజల, సంజన సిరిమల్ల, భమిడిపాటి రష్మిక, సంహిత సత్తా చాటుతూ సానియా వారసురాళ్లగా తెర మీదకు వస్తున్నారు. టేబుల్‌ టెన్నిస్‌లో స్నేహిత, శ్రీజ నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ పోటీల్లో ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుకుంటున్నారు. నవంబరులో బెంగళూరులో ముగిసిన జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లోనూ తెలుగు స్విమ్మర్లు అదరగొట్టారు. ఆంధ్ర నుంచి తీర్థు, తెలంగాణ నుంచి సాయినిహార్‌, విృతి అగర్వాల్‌ సీనియర్‌ కేటగిరీలో పతకాల మోత మోగించారు.

విరాట్‌ వెర్సెస్‌ బీసీసీఐ

భారత క్రికెట్‌లో మోహిందర్‌ అమర్‌నాథ్‌ తర్వాత గడిచిన మూడు దశాబ్దాల్లో మరే క్రికెటర్‌ బీసీసీఐపై నేరుగా విమర్శలు చేసింది లేదు. అప్పట్లో సెలెక్టర్లను జోకర్లుగా అభివర్ణించి అతడు గత్తరు లేపాడు. మళ్లీ ఇంతకాలం తర్వాత వన్డే, టీ20 కెప్టెన్సీ మార్పు సందర్భంగా జరిగిన పరిణామాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సెలెక్టర్లపై విరాట్‌ కోహ్లీ అంత తీవ్రతతో విమర్శణ బాణాలు ఎక్కుపెట్టడం సంక్షోభానికి దారితీసింది. ఈ ఏడాది నవంబరులో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందే తాను పొట్టి క్రికెట్‌ నాయకత్వ బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించగా, వన్డేలకు కెప్టెన్‌గా 2023 ప్రపంచకప్‌ వరకు కొనసాగుతానని అప్పుడే చెప్పాడు. అయితే, టీ20కప్‌లో భారత కనీసం నాకౌట్‌ దశ కూడా చేరకుండా ఇంటిముఖం పట్టడం. గ్రూప్‌ దశలో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలవడంతో పాటు టెస్టుల్లో కూడా వరల్డ్‌ చాంపియనషిప్‌ ఫైనల్లో భంగపడడంతో పరిస్థితులు కోహ్లీకి ప్రతికూలంగా మారాయి. దాదాపు ఐదేళ్లపాటు మూడు ఫార్మాట్లలో సారథిగా ఉన్నా ఒక్క ఐసీసీ మేజర్‌ టైటిల్‌ కూడా భారతకు అందించకపోవడం అతడి కెప్టెన్సీ సమర్థతను ప్రశ్నించేలా చేశాయి. మరోవైపు రోహిత్‌ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకోవడం అతడి వ్యూహాలు, ఒత్తిడిలోనూ నాయకుడిగా రాణించడం, కోహ్లీ తర్వాత జట్టులో అతడే సరైన ప్రత్యమ్నాయంగా కనపడడంతో సెలెక్టర్లు, బోర్డు రోహిత్‌ను వైట్‌బాల్‌ క్రికెట్‌కు కొత్త కెప్టెనగా ప్రకటించారు. అయితే, తనకి సరైన రీతిలో సమాచారం ఇవ్వకుండా ఉన్నఫలంగా కెప్టెన్సీ నుంచి తప్పించారని, గంగూలీ, సెలెక్టర్లు ఈ విషయాన్ని తనకు ముందుగా చెప్పలేదని కోహ్లీ చేసిన విమర్శలు దుమారం రేపాయి. ఇక, ప్రపంచ క్రికెట్‌ విషయానికొస్తే టెస్టుల్లో న్యూజిలాండ్‌ తొలి వరల్డ్‌ చాంపియనషిప్‌ ట్రోఫీని కైవసం చేసుకోగా ఆస్ట్రేలియా మొట్టమొదటిసారిగా టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడింది.

అజాజ్‌ ‘దస్‌ కా దస్‌’

భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. డిసెంబరు మొదటి వారంలో వాంఖడే స్టేడియంలో భారత-కివీస్‌ మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు అజాజ్‌నే పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇంగ్లండ్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ 1956లో ఆసే్ట్రలియాపై, 1999లో అనీల్‌ కుంబ్లే పాకిస్థానపై ఇదే రికార్డును నెలకొల్పారు. 22 ఏళ్ల తర్వాత అజాజ్‌ 10 వికెట్లు ఒక్కడే తీసి వారి సరసన చేరాడు. వాస్తవానికి అజాజ్‌ భారత సంతతి క్రికెటర్‌నే. 1988లో అతడు ముంబైలోనే పుట్టాడు. 1996లో అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లడంతో అజాజ్‌ అక్కడే క్రికెట్‌ ఓనమానులు నేర్చుకొని కివీస్‌ క్రికెటర్‌గా మారాడు.

మొత్తానికి కొవిడ్‌ వైరస్‌ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉండడంతో ఈ ఏడాది క్రీడాకారుల జయాపజాయలను వారి ప్రతిభకు గీటురాయిగా తీసుకోకుండా వారి ప్రయత్నాలను అభినందిస్తూ భవిష్యత మరింత బాగుండాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article