తన పౌరాణిక అధ్యయనం నుంచి, లోతైన తాత్వకత నుంచి, అంతకు మించి గొప్ప ధ్యానంతో తన మనోనేత్రంతో దుర్గామాతలను వీక్షించి, అత్యంత ఆరాధనీయంగా అమ్మవారిని చిత్రించేవారట. అందుకే చిత్రకళకు సంబంధించి వినాయక చవితి అంటే శ్రీ పి.టి.రెడ్డి గారు. బతుకమ్మ అంటే కాపు రాజయ్య గారు. దసరా అంటే కొండపల్లి శేషగిరి రావు గారు.
కందుకూరి రమేష్ బాబు
దసరా వస్తున్నదంటే శ్రీ కొండపల్లి శేషగిరి రావు బాగా గుర్తొస్తారు. ఈ నవరాత్రుల సందర్భంగా వారు భక్తి శ్రద్దలతో ప్రతిరోజూ ధ్యానంలోకి వెళ్లి అమిత శ్రద్ధతో ఆ ఏడు ఒక చిత్రాన్ని పూర్తి చేసిన ఆ అపురూప దివ్యస్వరూపాలు గుర్తొస్తాయి. చిత్రకళలో దుర్గామాతను వారివలే కొలిచి, పునీతులు ఐన భారతీయ చిత్రకారులు మరొకరు ఉండరనే అనుకుంటాను. పండుగ సందర్భంగా వారి దివ్య స్మృతిలో రెండు మూడు మాటలు పంచుకోవడం తృప్తి, ఒక గొప్ప భావన.
భారతీయ పురానేతిహాసాల పాత్రలెన్నిటినో తన కుంచెతో అపూర్వంగా మనకు అందించిన కొండపల్లి గారు తన ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకుని చిర్నవ్వులు చిందించే ఈ చిత్రం విభిన్నమైనప్పటికీ అది తన ప్రర్తఎకత మాదిరే సంప్రదాయత – ఆధునికతల మేలుకలయిక వంటిది. అది వారి ప్రత్యేకతనే కాదు, ప్రయోగాత్మను వెల్లడి చేసే మంచి జ్ఞాపకం. పదేళ్ళక్రితం వారింట తీశాను ఈ చిత్రం. అదలా ఉంచితే, మీకు తెలుసు. కొండపల్లి గారి ఘనత. వరంగల్ జిల్లాలో జన్మించిన వారు శాంతినికేతన్ లో చదువుకున్నారు. మన దగ్గరి జే ఎన్ టియూ లో అధ్యాపకులుగా పని చేశారు.
వారి చిత్రాలలో శకుంతల, దమయంతి వంటి పురాణ పాత్రల రమణీయత చూడవలసిందే తప్ప చెప్పదగినది కాదు. విశ్వామిత్రుడు మొదలు కొలనులో రంగి దాకా వారు చూడని జీవితం లేదు. చిత్రించని శైలి లేదు.
వరూధినీ- ప్రవరాఖ్యుడు మొదలు రాణి రుద్రమ, గణపతి దేవుళ్ళను, అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు మొదలు శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చారిత్రక వ్యక్తుల దాకా. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నుంచి వరకూ మన తెలుగుతల్లి వరకూ వారి చేతుల్లో జీవం పోసుకున్నవే అన్న గ్రహింపు మీకు ఉన్నదే.
దేశంలో శిల్పకళకు పేరొందిన ఎన్నిటినో, మన దక్కనీ రాళ్ళను రప్పలనూ, అజంతా ఎల్లోరా రామప్ప రాచకొండలను వారు ఎంత గొప్పగా చిత్రించి పదిలం చేశారో చెప్పనవసరం లేదు. చేర్యాల కాకిపడగల చిత్రకళను తొలిసారిగా లోకానికి చాటి చెప్పినదీ వీరే.
ఇవన్నీ ముఖ్యమైనవే. ఐతే, దసరా సందర్భంగా మటుకు కొండపల్లి గారు సృజియించిన అమ్మవార్లను తలుచుకోవాలనే ఈ ప్రస్తావన.
ఇవన్నీ ముఖ్యమైనవే. ఐతే, దసరా సందర్భంగా మటుకు కొండపల్లి గారు సృజియించిన అమ్మవార్లను తలుచుకోవాలనే ఈ ప్రస్తావన. బతుకమ్మ సంపాదకులుగా ఉన్నప్పుడు వాటిని ప్రచురించే అదృష్టం లభించింది. నిజానికి ఆ నవరాత్రుల చిత్రాలను ప్రతి ఏటా సాంస్కృతిక శాఖ అధ్య్వర్యంలో ఒక ప్రదర్శనగా పెడితే జనులెల్లరూ చూసి తరిస్తారు.
కొండపల్లి గారు పోతన భాగవతాన్ని పదహారు సార్లు చదివి అందంగా ప్రశాంతంగా భక్తిభావం వోలికేల చిత్రించిన మాదిరే, నిజానికి అంతకన్నా గొప్ప ఏకాగ్రతతో పూర్ణ దీక్షతో ఈ నవరాత్రుల సందర్భంగా ఉండేవారట.
తన పౌరాణిక అధ్యయనం నుంచి, లోతైన తాత్వకత నుంచి, అంతకు మించి గొప్ప ధ్యానంతో తన మనోనేత్రంతో దుర్గామాతలను వీక్షించి, అత్యంత ఆరాధనీయంగా ఏడాదికి ఒకటి చొప్పున అమ్మవారిని చిత్రించేవారట. ఆ జ్ఞాపకాలను వారి కుమారులు శ్రీ వేణుగోపాల్ గారు మననం చేసుకుంటూ “దాదాపు ఐదేళ్ళు ఇలా గీశారు. ఆ తర్వాత వారి జ్ఞాపకశక్తి మందగించడంతో చేయలేక పోయారు” అని వారు చెప్పి, ఈ వ్యాసం కోసం ప్రచురణకు అలా గీసిన ‘మహిషాసుర మర్ధిని’ చిత్రాన్ని అందించారు.
అత్యంత భక్తి శ్రద్దలతో కళలోనే అమ్మవారిని కొలిచిన తీరు అరుదైనది. అందుకు ఈ చిత్రం ఉదాహరణ.
అందుకే చిత్రకళకు సంబంధించి వినాయక చవితి అంటే నాకు శ్రీ పి.టి.రెడ్డి గారు. బతుకమ్మ అంటే కాపు రాజయ్య గారు. దసరా అంటే కొండపల్లి శేషగిరి రావు గారు. ఇట్లా ఒక్కో పండుగకు ఒకరు కళామతల్లిని సేవిస్తూ, ఆ చిత్రకళాధీ దేవతకు తమ జీవితాలను నైవేద్యంగా తర్పణం చేసిన మహానుభావులు తప్పక స్మరణలోకి వస్తారు.
దసరా పండుగ వస్తున్న సందర్భంలో కొండపల్లి దివ్య స్మృతిలో ఈ నాలుగు మాటలు చెప్పడం ఆత్మశాంతి. అలాగే తెలుగు వారి తరపున ఋణం తీర్చుకునే ఒక సగౌరవ అక్షర నివాళి.
CONGRATS a good article