మన సైతాని భూతాని ప్రణమేత్ బహుమానయన్
ఈశ్వరో జీవకళయా ప్రవిష్టోభగవానితి
సృష్టిలోని ప్రతిప్రాణిలోనూ పరమాత్మను దర్శించి గౌరవించడమే నిజమైన ఆధ్యాత్మికత. భారతీయ ప్రాచీన గ్రంథాలు, శాస్త్రాలు, స్మృతులు మొదలైన అన్నింటిలోనూ ఈ నిత్య ఆధ్యాత్మిక సత్యమే ప్రధాన ధర్మంగా దర్శనమిస్తుంది.
శ్రీ మద్భాగవతంలో వేదవ్యాస మునీంద్రులు ఈ విషయాన్నే వివరిస్తూ చెప్పిన పై శ్లోకాన్ననుసరించి సర్వప్రాణులలోనూ భగవంతుడే జీవాత్మ స్వరూపంలో కొలువుంటాడు. అందువల్లనే ఏ ప్రాణినీ చులకనగా చూడరాదు. పరమాత్ముడే జీవాత్మరూపంలో ఆ ప్రాణిలో ఉన్నాడని తలచి అన్ని ప్రాణులకు నమస్సులు చేసి గౌరవించుకోవాలి అని భావించవచ్చు.
సాధారణంగా ఆధ్మాత్మికత ప్రసక్తి రాగానే మనకు స్ఫురించేవి గుళ్ళు, గోపురాలు, పూజలు మొదలైనవి. కాని ప్రాణికి దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని కూడా మన పెద్దలు చెబుతారు. కాబట్టి సృష్టిలోని ప్రతిజీవిని గౌరవించడమే గొప్ప పూజావిధానం.
ఇతరుల విషయం వచ్చేసరికి కుట్రలను కుతంత్రాలను చూపించి వారిని బాధపెట్టరాదు. ఆ విధంగా చేయడమంటే అది ఆ పరమాత్మను క్షోభపెట్టడమేనన్నమాట. అసలు ఆ మార్గంలో ఆలోచించడమే తప్పు అంటూ శుక్రనీతి కూడా ఈ విధంగా చెబుతున్నది.
కూటేన వ్యవహారం తు వృతిలోపంచ కస్యచిత్
నకుర్యాత్ చింతయేత్ కస్య మనసా వ్యవహితం నతు
అంటే మనం ఎవరితోనూ ఎటువంటి కపట బుద్ధితో వ్యవహరించరాదు. ఎవరి జీవనోపాధిని చెడగొట్టరాదు. మన మనస్సుల్లో కూడా ఎవరికీ ఎటువంటి ఇష్టం కాని పనులను చేయాలని అనుకోరాదు. అసలు అటువంటి ఆలోచననే రానివ్వరాదు. అని చెప్పిన ఈ మాటల వెనుక ఆ ఎటుటి వ్యక్తిలో పరమాత్మను మనం గౌరవించినట్లవుతుందన్న ఆధ్యాత్మిక సత్యం దాగి వుంది.
సాధారణంగా ఆధ్మాత్మికత ప్రసక్తి రాగానే మనకు స్ఫురించేవి గుళ్ళు, గోపురాలు, పూజలు మొదలైనవి. కాని ప్రాణికి దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని కూడా మన పెద్దలు చెబుతారు. కాబట్టి సృష్టిలోని ప్రతిజీవిని గౌరవించడమే గొప్ప పూజావిధానం. గుళ్ళు గోపురాలు, పూజవంటివి మనకు స్ఫూర్తి కేంద్రాలు. వాటి నుండి స్ఫూర్తిని పొంది దైవభావనను నింపుకొని మానవసేవకు సిద్ధపడినప్పుడే ఆధ్మాత్మికతను ఆచరించిన వాళ్ళమవుతాము. అంతేకాని మానవుల మధ్య భేదభావాలతో జీవిస్తూ, హెచ్చుతగ్గులను గణిస్తూ ఎదుటివారిలోని దైవాన్ని విస్మరించి ప్రవర్తిస్తూ జీవించడం ఆధ్మాత్మికత అనిపించుకోదు. మానవ విలువలకు మంగళం పాడి ఎన్ని పుణ్యతీర్థాలను దర్శించుకున్నా, ఎన్ని పుణ్యనదుల్లో పవిత్ర స్నానాలను చేసినా, ఎందరు దేవుళ్ళకు దండాలు పెట్టినా అవన్నీ వృథాయే తప్ప పుణ్యఫలితాలను ఇవ్వవు.
ఇతడు నా బంధువు, ఈయన కాడు, అని విచారించే వాడు నీచ హృదయుడు, ఉదారచరితులైన ధీమంతులకు ఇటువంటి ఆలోచన, విచారణ ఉండదు
మనుషుల మధ్య భేద భావాలు మానవ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. మన హృదయాల్లో సంకుచిత భావాలకు చోటిచ్చినట్లవుతుంది. యోగ వాసిష్ఠము చెప్పిన ఈ మాటలు గమనిస్తే నీచ హృదయాలంటే అర్థమవుతుంది.
అయం బంధురయం నేతి గణనాం లఘుచేతసామ్
ఉదారచరితానాంతు మిగతా వరణైవ థీః
అంటే ఇతడు నా బంధువు, ఈయన కాడు, అని విచారించే వాడు నీచ హృదయుడు, ఉదారచరితులైన ధీమంతులకు ఇటువంటి ఆలోచన, విచారణ ఉండదు – అన్న విషయం చూస్తే మనిషి బుద్ధిమంతుడైన వాడు ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ఎదుటి వ్యక్తులను గౌరవించాలని తెలుస్తున్నది. అదే ఉదార చరితులైన వ్యక్తుల లక్షణం. దాన్ని పాటించడం వెనుక ప్రతి వ్యక్తిలో పరమాత్ముడున్నాడన్న భావన ఉంది. మరొకటి కాదన్నది స్పష్టం. ఇదే మాటను ప్రసిద్ధ సంస్కృత గ్రంథం హితోపదేశము కొంచెం మార్పుతో- అయం నిజః పరోవేతి గణనాలఘు చేతసాం…ఉదారచరితా నాం తు వసుధైక కుటుంబకమ్...అని బోధించింది.
విద్వాంసులైనవారు, విజ్ఞులైనవారు సృష్టిలోని సర్వప్రాణుల హృదయాలే ధర్మానికి ముఖ్యమైన ఆధార స్థానాలుగా భావిస్తారు. కనుకనే తమ మనసుల్లో సర్వప్రాణుల హితాన్నే కోరుకుంటారు.
ఈ రోజు మనమనుకుంటున్న వసుధైక కుటుంబ భావనకు మూలం ఈ శ్లోకమే. ఇతడు నా వాడు, ఇతడుపరుడు అనే అల్ప భావన కేవలం అల్పబుద్ధులు, నీచహృదయులు, క్షుద్రులు మొదలైప వారిలో మాత్రమే ఉంటుంది. కాని ఉదార హృదయం కలిగిన వ్యక్తులు ప్రపంచాన్నంతా తమ కుటుంబంగా భావిస్తారు- అన్న ఆలోచన యావత్ ప్రపంచ మానవుల మధ్య సౌహార్దభావన వికసించే మార్గం చూపిస్తుంది. సృష్టిలోని ప్రతి ప్రాణిలో పరమాత్ముని గౌరవించగలిగే ఉన్నత స్థాయిని కలిగిస్తుంది.
మహాభారతం కూడా ఇలా చెప్పింది.
మానసం సర్వభూతానాం ధర్మమాహుర్మనీషిణిః
తస్మాత్ సర్వేషు భూతేషు మనసా శివమాచరేత్
విద్వాంసులైనవారు, విజ్ఞులైనవారు సృష్టిలోని సర్వప్రాణుల హృదయాలే ధర్మానికి ముఖ్యమైన ఆధార స్థానాలుగా భావిస్తారు. కనుకనే తమ మనసుల్లో సర్వప్రాణుల హితాన్నే కోరుకుంటారు. అనుకోవడంలో పరమాత్మ దర్శనానికి, జీవదర్శనానికి తేడాలేదనీ, సృష్టిలోని ప్రతి జీవిలో దేవుడే ఉన్నాడని అర్థమవుతుంది. ఈ సర్వసమదృష్టి అల్లకల్లోలమై అశాంతిపాలై అవస్థలు పడుతున్న ప్రపంచానికి ప్రశాంతత లభిస్తుంది. అప్పుడే నిజమైన ఆధ్మాత్మిక వికాసం జరిగినట్లు భావించాలి. అదే నిజమైన ఆధ్మాత్మిక పురోగతిగా గుర్తించవచ్చు.