Editorial

Wednesday, January 22, 2025
ఆధ్యాత్మికంప్రపంచానికి శుభం కలుగుగాక - గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

ప్రపంచానికి శుభం కలుగుగాక – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీవతాం ధ్యాయంతు భూతాని శివం మిథోథియా
మనశ్చ భద్రం భజతాదధోక్షజే ఆవేశ్యతాం నో మతి రస్యహైతుకీ

భాగవతం చెప్పిన విషయం పరిశీలస్తే మన ఆలోచనలు, మన భావాలు ఏ విధంగా ఉండాలన్న సత్యం బోధపడుతుంది. ప్రపంచానికి శుభం కలుగుగాక. దుర్జనులు సజ్జనులై వర్తింతురుగాక! ప్రాణులందరు ఒకరికొకరు మంచి చేస్తూ మంచినే కోరుచుందురుగాక! అందరి మనస్సుల్లోను ఉత్తమ భావాలే ఉత్పన్నమగుగాక! – అని భగవంతునిపై మనందరికీ నిష్కారణమైన భక్తి కలుగుగాక!

ప్రపంచం మానవ సమూహ సమన్వితం. పరస్పర కలహాలు మాని మనుషులు ప్రవర్తిస్తే ప్రపంచ శాంతి చేకూరుతుంది. అయితే ఈ ప్రవర్తన రావడానికి కొంత సాధన అవసరం. మనిషి తన మనస్సును తన అదుపులో పెట్టుకునే క్రమంలో దైవ ఆరాధన ప్రాధాన్యం వహిస్తుంది. కేవలం ఆడంబరాలు చాటుకోవడానికో, చెయ్యాలి కాబట్టి చెయ్యాలనో, మరొకదానికో పూజలు, ఆరాధనలు నిర్వర్తించ రాదు. తనకు మానసిక పరిణితి, పరిపక్వత రావడానికై దైవధ్యానాన్ని సాధన చెయ్యాలి. మన పూర్వులు చెప్పిన ఆధ్మాత్మికత ఇదే. ఏ వ్యక్తి అయితే మానసికంగా ఎదుగుతాడో, అతడు లోకోపకారం కొరకు పాటుపడుతాడు. ఆధ్మాత్మికతను సాధించడమంటే తోటివాళ్ళను దైవతుల్యంగా గౌరవించడం. ఎవ్వరికీ హానితలపెట్టకపోవడం అందరి శ్రేయస్సునే వాంఛించడం. ఈ మాటే భాగవతం బోధించింది. విశ్వశాంతికి ఇది తొలిమెట్టు కావాలంటే ఈ సాధనలో మనిషి తన మానసిక స్థాయిని పెంచుకోవాలి, మనసును అదుపులోకి తెచ్చుకోవాలి. ఇది చెయ్యడానికి తోడ్పడే ఏకైక సాధనం ఆధ్మాత్మిక చింతన మాత్రమేనన్నది తిరుగులేని నిజం.

నేను స్తుతిస్తున్నందుకు ప్రతిఫలం ఈ ప్రపంచమునందలి అజ్ఞానులందరూ జ్ఞానులై ఉందురుగాక! క్రూర స్వభావులైనవారందరూ శాంత చిత్తతలో మెలగుదురుగాక!

మన భారతీయ గ్రంథాల్లో సుభాషిత గ్రంథాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అనేకమంది పండితులు తమ స్వీయరచనతో పాటు అనేకులు రచించిన ఉత్తమమైన శ్లోకాలను ఎంచుకొని సుభాషితాలను సంకలించి గ్రంథాలుగా వెలువరించారు. అటువంటి వాటిలో ఉన్న సుభాషిత సంగ్రహంలో ఒక ప్రసిద్ధ శ్లోకం ఇది.

సర్వేభవంతు సుఖినః సర్వే సంతునిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాక్ భవేత్

ఈ శ్లోకంలో చెప్పిన విషయం గమనిస్తే పూర్వుల మానసిక పరిణితి తెలుస్తుంది. మానవ లోకంలోని జనులందరికీ, సుఖము, ఆరోగ్యము, శుభము కలుగుగాక! ఏ ఒక్కరు కూడా దుఃఖంతో బాధపడరాదన్న భావం మన ఆలోచనా విధానం ఏ విధంగా ఉండాలో సూచించింది. ఈ విధమైన ఉత్తమ భావాలను కలిగి ఉండాలనుకున్నప్పుడు వ్యక్తికి తనపై తనకు నియంత్రణ ఉండాలి. తన మనసును తానే నియంత్రించుకోగలిగే శక్తి ఉండాలి. అటువంటి సంయమనం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మనసు ఎటువంటి రాగద్వేషాలకు లోనుగాకుండా స్థిర చిత్తుడైతే ఈ విశ్వమానవ ప్రగతికి తోడ్పడ్డవాడవుతాడు. అటువంటి స్థిర చిత్తతకు ఆధ్యాత్మిక భావన సరియైన మార్గం. ఇది సాధించిన వారేగనుక రంతిదేవుడు, శిబి చక్రవర్తి మహనీయులను ఈ నాటికీ మనము గౌరవ భావంతో స్మరించుకుంటున్నాము.

దైవాన్ని ఆశ్రయించి, నిత్య సాధన చేసినవానికి ఇటువంటి మానసిక స్థితి సాధ్యం కావడానికి అవకాశం ఉందని స్కాందపురాణం అనేక శ్లోకాల్లో చెప్పింది. ఆ సంగతిని ఒక భక్తుని నోట ఈ పురాణాన్ని ఎట్లా పలికించిందో పరిశీలిస్తే ఆధ్యాత్మిక జీవనం యొక్క అసలు లక్ష్యం సర్వజనుల సంక్షేమమేనన్నది అర్థమవుతుంది.

అజ్ఞానినో జ్ఞానినో భవంతు, ప్రశాంతిభాజాః సతతోగ్ర చిత్తాః
మయాచ విశ్వం భరణీహ్యనంతే స్తుతే జగద్ధాతరి వాసుదేవ

-నేను స్తుతిస్తున్నందుకు ప్రతిఫలం ఈ ప్రపంచమునందలి అజ్ఞానులందరూ జ్ఞానులై ఉందురుగాక! క్రూర స్వభావులైనవారందరూ శాంత చిత్తతలో మెలగుదురుగాక! నేను స్తుతించే ప్రపంచ భరణకర్త, భేదభావాలు చూపని వాడైన ఆ వాసుదేవుడు ఈ వరాన్ని నాకు ప్రసాదించాలని కోరుతున్నాను. ఇది నూటికి నూరు శాతం ఆధ్యాత్మిక భావ సంపన్నుడు దైవాన్ని కోరుకోవలసిన కోరిక, అంతేకాదు తానుకూడా ఎదుటివారి విషయంలో ఆ విధంగా ప్రవర్తించాలన్న సందేశం కూడా ఇందులో స్ఫురిస్తూ ఉంది.
ఇదే స్కాందపురాణం మరో సందర్భంలో

సంసారవైద్యేఖిలదోష హాని విచక్షణే నిర్వృతిహేతుభూతే
సంసారబంఃధాః శిథిలీభవంతు హృదిస్థితే సర్వజనస్యవిష్ణౌ-

అంటూ సమస్త ప్రజలు కూడా ఈ ప్రపంచిక బంధనాలలో చిక్కుకోక సకల శుభాలను పొందాలని భావిస్తూ ఈ ప్రపంచానికి వైద్యం చేసే గొప్ప వైద్యుడు, అన్ని దోషాలను పోగొట్టేవాడు, ముక్తి ప్రదాత అయిన ఆ శ్రీమన్నారాయణుడు తమ హృదయాలలో కొలువైయుండగా సమస్త లోకములలోని జనుల ప్రాపంచిక బంధనాలు శిథిలమై సుఖములతో బాటు ముక్తిని కూడా పొందుదురు గాక!- అని భావించింది.

ఏ దైవ భావనైనా మనిషి ఉన్నతినే కోరింది. మన జాతిలోని లక్షణమే అది. అదే ఆధ్మాత్మికత. తనను తాను శోధించుకుని ఉన్నత స్థానాన్ని పొంది, ప్రతి వ్యక్తినీ గౌరవించి, లోకక్షేమాన్ని కోరడమే దీని అసలు లక్ష్యం. దాన్ని ఆచరించడమే యావత్ ప్రపంచానికి కూడా క్షేమదాయకం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article