Editorial

Wednesday, January 22, 2025
సంప‌ద‌అద్భుతం తెలుపు : రామప్ప దేవాలయ విశేషాలు

అద్భుతం తెలుపు : రామప్ప దేవాలయ విశేషాలు

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ మేరకు యునెస్కో ఈ మధ్యాహ్నం ట్వీట్ చేసింది. దీంతో ఎన్నో చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలున్నప్పటికీ తెలంగాణా రాష్ట్రం రామప్పతో తొలిసారిగా యునెస్కో జాబితాలో చేరినట్టయింది. తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడం కూడా ఇదే కావడం విశేషం. ఫలితంగా ప్రపంచ పర్యాటకుల దృష్టిలో ఒక అధికారిక ఆమోదం లభించి లభించినట్టయింది. ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేయడానికి ఈ గుర్తింపు ఏంతో దోహద పడుతుంది. మరో మాటలో ఈ నిర్ణయం తెలంగాణ పర్యాటకాన్ని అపురూపంగా మరొక స్థాయిలో నిర్వహించడానికి బంగారు అవకాశం. ఈ  సందర్భంగా రామప్ప అద్భుత ఆలయ విశేషాలపై వాట్సప్ లో వైరల్ అవుతున్న సవివరమైన వ్యాసం చక్కటి సమాచారం అందిస్తోంది.

ఇక్కడి శిల్పాలు కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు! అయితేనేం, అవి పలికించని భావం లేదు. వాటిని చూసి పులకించని హృదయం లేదు. మనసును గిలిగింతలు పెట్టే మదనిక రూపాలు, చూపు తిప్పుకోనివ్వని సాలభంజికలు, కాకతీయ వైభవాన్ని చాటే పేరిణి శిల్పాలు.. ఏ అప్సర కాంతలో శాపవశాన ఈ గుడి కుడ్యాలపై శిల్పాలుగా వెలిశారన్న భావన కలుగుతుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ కాకతీయ కట్టడానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో స్థానాన్ని సంపాదించిందీ సుందర నిర్మాణం.

ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం

పూర్వపు వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది.. రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. రుద్రుడి తండ్రి కాటయ. ఆయన తన హయాంలో పలు చెరువులు తవ్వించాడని రామప్ప దేవాలయ శాసనం తర్వాతిదైన గొడిశాల శాసనం (శక సంవత్సరం 1157, క్రీ.శ.1236) ద్వారా తెలుస్తున్నది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రేచర్ల రుద్రుడు తటాకాలు తవ్వించడంతోపాటు రామప్ప ఆలయాన్నీ కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువుకూడా రేచర్ల రుద్రుడు నిర్మించిందే!

శిల్పాచార్యుడి పేరుతో..

అద్భుత శిల్పకళతో అలరారే రామప్ప ఆలయ గర్భగుడిలో చిత్రిక పట్టిన పానపట్టంపై రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ, ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికా పేరు రాలేదు. ఆనాటి పాలకుడైన గణపతిదేవుడి పేరుతోనూ పిలువలేదు. ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు, తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ప్రఖ్యాతిగాంచింది. ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నో జానపద, మౌఖిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రామప్ప ప్రధాన దేవాలయ, ఉపాలయాల నిర్మాణం దశాబ్దాలపాటు కొనసాగింది.

నిర్మాణ పద్ధతి

కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు. క్రీ.శ.1203లో వేయించిన, గణపతిదేవుని కాలం నాటి కొండపర్తి శాసనం.. కాకతీయ శిల్ప నిర్మాణ కౌశలాన్ని ఈ శ్లోకంలో వర్ణించింది…

ప్రాకారోజయతి త్రికూటమ్‌ అభితస్తల్‌ తేన నిర్మాపితః
సుశ్లిైష్టెః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితః
యశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైః
సంతక్ష్యేవ మహీయసీమ్‌ ఇవ శిలాం యత్నాత్‌ సముత్తారితః

‘నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి, సన్నిహితంగా కూర్చి నిర్మించిన త్రికూట ప్రాకారం. వైభవంగా విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలా నిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు’ అన్న శ్లోకార్థాన్ని నిజం చేస్తూ కాకతీయుల నిర్మాణ ప్రతిభకు అద్దంపడుతుంది రామప్ప ఆలయం.

అబ్బురపరిచే శైలి..

ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానమూ, యంత్రాలూ లేని కాలంలో నిర్మించిన రామప్ప గుడిలో కనీవినీ ఎరుగని వింతలు కనిపిస్తాయి. శిల్ప సౌందర్యం ఆనాటి శిల్పాచార్యుల సునిశిత పనితనాన్ని చాటిచెబుతాయి. గొలుసుకట్టుగా నిర్మించిన చిన్నచిన్న శిల్పాల వెనుకగా ఒకవైపు నుంచి మరోవైపునకు దారం తీయవచ్చంటే ఆ శిల్ప నిర్మాణ చాతుర్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విశేషాలెన్నో రామప్ప గుడిలో చూడొచ్చు.

శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ ఆలయానికి ఇసుకతో పునాదిని నిర్మించారు. నల్లని గ్రానైట్‌ (చలువరాయి) శిలలను ప్రత్యేకంగా తెప్పించి ఆలయ రంగ మంటపం కట్టారు. కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కిన తర్వాత అద్దంలాంటి నునుపుదనం వచ్చేంత వరకు చిత్రిక పట్టారు. ఆలయ కప్పు భారాన్ని మోయడానికి నల్లరాతి గ్రానైట్‌ శిల్పాలను వాడటం అబ్బురపరిచే విషయం. ప్రతి శిల్పం ప్రత్యేకమైందే. వాటి ముఖాల్లో విభిన్న హావభావాలు కనిపిస్తాయి. విమాన గోపురం నిర్మాణం కోసం నీటిలో తేలే ఇటుకలను వినియోగించారు.

ఇసుక రాతిపెట్టె పరిజ్ఞానం

కాకతీయులు నిర్మించిన ఆలయాలన్నీ దాదాపు శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతో నిర్మించినవే. ఆలయ పునాదుల్లో 12 నుంచి 15 అడుగుల లోతులో సన్నని ఇసుకను నింపి, దానిపైన రాళ్లతో పునాదులు వేశారు. భూకంపాలు వచ్చినా ఆలయం కుంగకుండా ఉండేందుకే ఈ విధానాన్ని అనుసరించారు. అందుకే, 800 ఏళ్లలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా, ఇసుక షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేసింది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు ఆలయాన్ని కొద్దిగా దెబ్బతీశాయి.

స్వరాలు పలికే శిల్పం

ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న శిల్పం చాలా ప్రత్యేకమైంది. ఒక స్త్రీ అరటి చెట్టుని తన ఎడమ చేతితో వంచి పట్టుకున్నట్లుగా ఉంటుందీ ఏకశిలా మూర్తి. చేతి వేళ్లతో తట్టినట్లు తాకితే ఆ రాతినుంచి సుస్వరాలు వినిపిస్తాయి. బయటకు చూడటానికి రాతిలో ఎలాంటి బోలుదనం ఉన్నట్టుగా అనిపించదు. కానీ, ఇలా తట్టగానే అలా స్వరాలు పలుకడం శిల్పి ప్రతిభకు తార్కాణం.

నీటిలో తేలే ఇటుకలు

రామప్ప ఆలయ విమాన గోపురం నిర్మాణంలో వాడిన ఇటుకలు చాలా ప్రత్యేకమైనవి. ఆలయం మొత్తం బరువైన రాతితో నిర్మించారు. గోపురాన్ని కూడా రాతితో కడితే పునాదులు బరువును తట్టుకోవడం కష్టమని భావించి, తేలికైన ఇటుకలను రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగు లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అవి నీటిలో తేలుతాయి. ఇటుకల లోపలి భాగంలో స్పాంజిలా బోలుతనం ఉంటుంది. నిర్మాణంలో వీటిని ఉపయోగించినప్పుడు సున్నం, బెల్లం పాకం లాంటివి పీల్చుకొని.. కట్టడం దృఢంగా ఉండేలా చేస్తాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది. అలనాటి సాంకేతిక పరిజ్ఞానానికి తార్కాణమిది.

అరుదైన శిల్పరీతి

భారతీయ శిల్పరీతుల్లో కాకతీయులది ప్రత్యేకశైలి. శాతవాహనుల తర్వాత, అంతటి రూప
లావణ్యం కలిగిన శిల్పాలు కాకతీయుల హయాంలోనే ప్రాణం పోసుకున్నాయి. దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణం, వాటిని నిలబెట్టిన తీరు, గర్భాలయ ముఖద్వారాలను బట్టి అవి కాకతీయులు కట్టించినవే అని సులభంగా చెప్పవచ్చు. హోయసల శిల్పరీతి కాకతీయులకు మార్గదర్శకమని చెబుతారు చరిత్రకారులు. కాకతీయ నిర్మాణాలకు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసల పాలకులు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన గుళ్లు నిర్మించారు. ఆ ఆలయాల మీద కనబడే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ ఆలయాల్లోనూ కనిపిస్తాయి. అయితే, హోయసల శిల్పరీతికీ కాకతీయుల శిల్ప శైలికీ కొన్ని భేదాలు చూడొచ్చు. హోయసల శిల్పులు ఆలయాల వెలుపలి వైపు మాత్రమే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాకతీయ ఆలయాల్లో లోపలి భాగంలోనూ అద్భుత శిల్పాలు దర్శనమిస్తాయి. హోయసల ఆలయాలపై కనిపించేవి దేవతా మూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కనిపించేవి నాటి సామాన్య స్త్రీ పురుషులవి. సామాన్యుల వేషధారణ, సామాజిక అంశాలను వందల ఏండ్లపాటు సజీవంగా ఉండేలా ఆలయ కుడ్యాలపై చెక్కించిన ఘనత కాకతీయులదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఈ నల్లని రాళ్లలో..

రామప్ప గుడిలోని ప్రతి అంగుళమూ కళాత్మకమే. ప్రతి శిల్పమూ ప్రత్యేకమైందే. రుద్రేశ్వరాలయ గర్భగుడి ప్రధాన ద్వారం ఓ గొప్ప కళాఖండం. అంతరాలయ ద్వారానికి రెండు వైపులా రెండు పొడవైన ఘనాకార శిల్ప పలకలున్నాయి. వీటికి మృదంగ వాద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తున్న స్త్రీ, పురుషుల శిల్పాలను చెక్కారు. ఇవి పేరిణి శివతాండవానికి చెందిన వివిధ ముద్రలను ప్రతిబింబిస్తుంటాయి. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమల్లోని అతివల శిల్పాలు అతిలోక సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. ద్వారం పైభాగాన సింహాల వరుసలు, లతలు, వాద్యకారుల చెక్కడాలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి.

రంగ మంటపం

రామప్ప ఆలయంలో మధ్య భాగంలోని రంగ మంటపం మరో ప్రత్యేక ఆకర్షణ. దీన్నే ‘నాట్య మంటపం’ అనీ అంటారు. ఈ వేదికపైన ఆనాడు కాకతీయ సామ్రాజ్యంలో పేరొందిన మాచల్దేవి లాంటి నర్తకీమణులు ప్రదర్శనలు ఇచ్చేవారట. ఈ నాట్యప్రదర్శనలు ప్రేక్షకులు చూసేందుకు వీలుగా మంటపం మూడు పక్కలా అరుగులు ఉంటాయి. మంటపం నైరుతి స్తంభానికి రతీమన్మథులు, సముద్ర మథనం, వాయవ్య స్తంభానికి గోపికలు, కృష్ణుల శిల్పాలు నాలుగు అంగుళాల ఎత్తులో చెక్కడం విశేషం. నైరుతి, ఈశాన్య స్తంభాల శిల్పాల మధ్య సూది మాత్రమే దూరేటంత సన్నని రంధ్రాలను తొలవడం శిల్పి నైపుణ్యానికి ప్రతీక. రంగ మంటపం ఉత్తర దూలానికి గజాసురుని భక్తికి వశుడైన శివుడు అతడి పొట్టలో అష్టభుజాలతో నటరాజుగా కొలువుదీరిన వైనాన్ని మనోహరంగా మలిచారు శిల్పులు. మంటపం కప్పులో పది చేతులతో నర్తిస్తున్న నటరాజ శిల్పాన్ని చూడొచ్చు.

గతమెంతో ఘనం

కాకతీయ పాలనా కాలంలో క్రీ.శ.1213 నుండి 1323 వరకు దాదాపు 110 ఏండ్లు నిత్యం పూజాదికాలతో, ఉత్సవాలతో ఓ వెలుగు వెలిగిన రామప్ప ఆలయం పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానుల విధ్వంసకాండకు గురైంది. రామప్ప ఆలయంపై విరుచుకుపడిన ముష్కరులు గోపురాన్ని ధ్వంసం చేశారు. ఇదే సమయంలో అనేక అపురూప విగ్రహాలను విరిచేశారు. కాలపరీక్ష కూడా రామప్ప శిథిలానికి కారణమైంది. ఇసుకతో నిర్మించిన పునాది కావడంతో శతాబ్దాలు గడిచేసరికి కుంగిపోవడానికి కారణమైంది. ఎనిమిది శతాబ్దాలుగా చోటు చేసుకున్న చిన్నచిన్న భూకంపాల తాకిడికి ఆలయం దెబ్బతినడం మరో కారణం. వర్షపు నీరు పునాదిలో ఇంకిపోవడం వల్ల కూడా ఆలయం కుంగింది. ఆలయం సమీపంలో ఉన్న రామప్ప చెరువు నీటి బరువు ప్రభావం కూడా పునాదిపై ఉంది. ఫలితంగా ఆలయం కుంగి స్తంభాలు, పైకప్పు, గోడలు పగుళ్లు చూపాయి.

భారతదేశం నుంచి 1983లో అజంతా, ఎల్లోరా, ఆగ్రా కోట, తాజ్‌మహల్‌లకు తొలిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలకు ఈ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ హోదా లభించిన ప్రాంత చారిత్రక, ప్రాకృతిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకు ఆ సంస్థ తగిన చర్యలు తీసుకుంటుంది. యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులూ వస్తాయి. అంతేకాదు, పర్యాటకంగానూ ఎనలేని ప్రచారం లభిస్తుంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. మరీ ముఖ్యంగా, రామప్ప గుడిని మరో పది తరాల వరకు చెక్కుచెదరకుండా కాపాడుకునే అవకాశమూ లభిస్తుంది. మధ్యయుగపు రాచఠీవిని, అప్పటి వాస్తు శిల్ప వైవిధ్యాన్నీ , నాటి శిల్పుల హస్తకళా నైపుణాన్ని ఆవిష్కరించే రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుకోసం ఎదురుచూస్తున్నది.

మహాలింగం

గర్భాలయంలోని రామలింగేశ్వర మహాలింగం, హనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని రుద్రేశ్వరునితో పోటీపడుతున్నదా అన్నట్టు ఉంటుంది. పలకలు పలకలుగా కనిపించే పానపట్టం కిందిభాగం అబ్బురపరుస్తుంది. ప్రధానలింగం కృష్ణవర్ణ కాంతులీనుతూ తాజాదనంతో తళుకులీనుతుంది. గర్భాలయంలో ఎలాంటి దీపం లేకున్నా బయట వెలుతురు ఉన్నంత సమయం శివలింగంపై వెలుగు ప్రసరిస్తూనే ఉండటం నాటి శిల్పుల కౌశలానికి మెచ్చు తునకగా చెప్పవచ్చు. ఆలయ రంగ మంటపంలోని నల్లని స్తంభాలపై పడే వెలుగు పరావర్తనం చెంది గర్భగుడిలోకి ప్రసరించేలా నిర్మించారు.

శాసనానికో మంటపం

రామప్ప ఆలయాన్ని కట్టిన సందర్భంగా ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు సంస్కృతంలో 204 పంక్తులతో ఒక శాసనాన్ని వేయించి, దానిని నిలబెట్టి ఎండావానల నుంచి రక్షణకు ఒక మండపాన్ని కట్టించాడు. ఒక శాసనాన్ని అందంగా చెక్కించి, మరింత అందంగా మంటపం కట్టించి, మంటపంలో ప్రతిష్ఠించిన వైనం బహుశా ఎక్కడా కనిపించదు. ఈ శాసనంలో రుద్రసేనాని వంశానికి సంబంధించిన వివరాలు, అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి, పరాక్రమాలు, ఆనాటి ఓరుగల్లు పట్టణ వైభవం వివరించారు. ఇదే శాసనంలో ఆలయ నిర్వహణకు పలు గ్రామాలు శాశ్వత దానం ఇచ్చినట్టు ఉంది. శాసనంలో పేర్కొన్న తేదీ క్రీ.శ.1213 మార్చి 31గా తెలుస్తున్నది.

చూడు.. నన్నే చూడు!

రామప్ప ఆలయంలోని నంది కాకతీయ శైలికే తలమానికంగా పేరొందింది. ప్రధానాలయం తూర్పు ముఖద్వారానికి ఎదురుగా ఉంటుందీ నంది మంటపం. మెడపట్టీలు, చిరుగంటలతో అందమైన ఆహార్యం, బలమైన సౌష్ఠవంతో ఉన్న నందీశ్వరుని విగ్రహాన్ని చూసేందుకు రెండు కండ్లు చాలవు. ఒక కాలు కొంచెం పైకెత్తి, చెవులు రిక్కించి ‘యజమాని అయిన శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా?’ అని ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. అలాగే నందిని ఏ దిశ నుంచి చూసినా ఆ వైపుగానే చూస్తున్నట్టుగానే కనిపించడం మరో విశేషం.

మనసు దోచే మదనికలు

ఆలయ శిల్పాల్లో అబ్బురపరిచేవి మదనికలు. వీటిని చెక్కిన విధానం, అవి పలికించే హావభావాలు అత్యద్భుతం.

వేదన మదనిక:

ముల్లు గుచ్చుకున్న మదనిక విగ్రహం చూపరులకు తీయని బాధ కలిగిస్తుంది. పాదంలో ముల్లు విరిగిన చోట ఉబ్బెత్తుగా ఉండటం, ముల్లు తీస్తుండటం, ఆ బాధ తాళలేక మదనిక బాధతో పలికించిన హావభావాలు చూస్తూ మదనికను మలిచిన శిల్పికి జేజేలు పలుకుతాం.

అలంకృత మదనిక:

ఈ మదనిక ధరించిన వస్త్రంపై డిజైన్‌ చూడచక్కగా ఉంటుంది. అందమైన కేశాలంకరణ, కాళ్లకు ధరించిన పట్టీలు, చెవి దుద్దులు, పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ఎనిమిది శతాబ్దాల కిందటి నాగరికతకు అద్దంపడతాయి. పాదరక్షలకు ఎత్తు మడమలను (హై హీల్‌) జోడించే ప్రక్రియ ఆనాడే ఉందని నిరూపిస్తుందీ శిల్పం. అన్నిటికన్నా ముఖ్యంగా పాద భాగంలో అలంకృత మదనిక శిల్ప సోయగం, ముఖంలో కనిపించే భావావేశం మనసులో గిలిగింతలు పెడతాయి.

నాగ మదనిక:

అద్దంలా మెరిసిపోయే అపురూప శిల్పం నాగ మదనిక. వస్ర్తాచ్ఛాదన లేకుండా కనిపిస్తుందీ మూర్తి. అందుకే, ‘నగ్న మదనిక’ శిల్పం అని కూడా అంటారు. చేతిలో, కాళ్ల దగ్గర ఉన్న సర్పాలు ఏదో హెచ్చరిక చేస్తున్నట్లు ఉంటాయి.

మృదంగ మదనిక:

మృదంగం వాయిస్తూ నిలబడిన శిల్పం ఇది. దీంతోపాటే సహ వాద్యకారులు, నాట్యగత్తెల శిల్పాలనూ చూడొచ్చు.

నాట్య ముద్రా మదనిక

నాట్యం చేస్తున్న భంగిమలోని ఈ శిల్పంలో కాలి అందెలూ, చేతి కంకణాలు, హస్తాభరణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. పదివేళ్లకూ ఉంగరాలనూ, వేళ్లతో చూపిన ముద్ర స్పష్టంగా చెక్కారు.

లజ్జా మదనిక

ఈ మదనిక చీరను ఒక కోతి లాగేస్తుంటే, ఒక చేత్తో మానసంరక్షణ చేసుకొంటూ, రెండో చేతితో కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పం ముఖంలో కన్పించే హావభావాలు అద్భుతం, అనితర సాధ్యమూ.

పీవీ వ్యాసాలు

వరంగల్‌ కేంద్రంగా వెలువడిన కాకతీయ పత్రికలో పీవీ నరసింహారావు రామప్ప ఆలయంపై ప్రత్యేక కథనాలు రాశారు. 1957లో మూడు రోజులపాటు రామప్ప ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 1966 ప్రాంతంలో ‘ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’లో ‘రామప్ప – ఏ సింఫనీ ఇన్‌ స్టోన్‌’ శీర్షికతో గొప్ప వ్యాసం రాశారు పీవీ. అలా రామప్ప వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నించారాయన.

పేరిణి నృత్య ప్రేరణతో..

కాకతీయ గడ్డపై పుట్టిన అరుదైన నాట్యకళ పేరిణి. పురుషులు మాత్రమే చేసే ఈ అరుదైన నృత్యం జానపద శైలి అని, దేశీయమనీ చెబుతూ ‘నృత్య రత్నావళి’లోని ప్రత్యేక ప్రకరణలో వివరించారు జాయప సేనాని. యుద్ధ రంగంలో సైనికులను ఉత్తేజితులను చేయటానికి ‘ప్రేరణ’ అనే ఒక కొత్త నృత్యరీతి పురుడు పోసుకుంది. నిజానికి, అప్పటికే ఆచరణలో ఉన్న కొన్ని ఆటవిక, జానపద రీతులనే వీర రస ప్రధానంగా తీర్చిదిద్దారని చెబుతారు. ఆ ప్రేరణే రూపాంతరం చెందిన పేరిణి. కాకతీయ వైభవంలో స్థానం దక్కించుకున్న పేరిణి శిల్పాలు రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి, ఉత్తర దూలానికి, పైకప్పుపైన, అంతరాళ ద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. కాలక్రమంలో జీర్ణమైపోయిన పేరిణికి పూర్వవైభవం తీసుకొచ్చారు పద్మశ్రీ నాటరాజ రామకృష్ణ. ‘పేరిణి శివతాండవం’ పేరుతో కాకతీయ నృత్యరీతిని పునర్‌ రూపకల్పన చేశారీయన. ఈ అధ్యయనంలో రామప్ప గుడిలోని పేరిణి శిల్పాలు ఆయనకు ప్రేరణగా నిలిచాయి. అంతేకాదు, 1985 ఫిబ్రవరి 17న, శివరాత్రి సందర్భంగా రామప్ప దేవాలయంలో వేలమంది సమక్షంలో తన శిష్యబృందంతో పేరిణి నృత్య ప్రదర్శన ఇచ్చారు. 1991లో జరిగిన కాకతీయ ఫెస్టివల్‌లో భాగంగా ఫిబ్రవరి 25న మరోసారి, ఇక్కడే పేరిణి నృత్య ప్రదర్శన ఇప్పించారు.

పునరుద్ధరణ ప్రయత్నాలు

రామప్ప ఆలయాలను కట్టించిన రేచర్ల రుద్రుడు ఇక్కడ వేయించిన శాసనంలో ఓ అరుదైన ప్రతిపాదన చేశాడు. ఎవరికైనా తాము శత్రువులు అయితే కావచ్చు కానీ, ఆలయం కాదనీ, దీన్ని ధ్వంసం చేయరాదనీ అభ్యర్థించాడు. కాపాడాల్సిన బాధ్యత ఉన్నవాళ్లు ఆలయ బాగోగులు పట్టించుకోలేకపోతే పదివేల జన్మలు పేడలో పురుగులుగా పుడతారని శాపం కూడా రాయించాడు. అయితే, సుమారు వంద సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబు రామప్ప ఆలయాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు. నిజాం ప్రభుత్వంలో, 1914లో ఏర్పడిన పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్‌ రామప్ప ఆలయ పునరుద్ధరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. బలహీనంగా ఉన్న పైకప్పు పటిష్ఠతకోసం రాతి దూలాలను ఏర్పాటు చేయించారు. తర్వాతి కాలంలో భారత పురావస్తు శాఖ ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించి పైకప్పును బాగు చేయించింది. ఆలయ పునాదుల్లోకి వాన నీరు ఇంకకుండా ప్లాస్టరింగ్‌ చేయించింది.

More articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article