Editorial

Monday, December 23, 2024
PeopleDadasaheb phalke awardee : అపురూప స్నేహానికి వందనం - హెచ్ రమేష్ బాబు తెలుపు

Dadasaheb phalke awardee : అపురూప స్నేహానికి వందనం – హెచ్ రమేష్ బాబు తెలుపు

1949 డిసెంబర్ 12న బెంగళూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సోమహళ్ళి’లో కారు నలుపు కాస్త మెల్లకన్నుతో పుట్టిన రజనీ అంతా చూసి ఇలాంటి పుట్డాడేమిటీ అన్నారు. తల్లి రాంబాయి మాత్రం ‘‘నువ్వు రాజకుమారుడిలా ఉన్నావవురా అన్నది’’ ఆ మాట వూరికేనే పోలేదు. అంతకన్నా గొప్పవాడయ్యాడు. ఆ గోప్పదానానికి ఒక మామూలు మనిషి కారణం. ఆ మనిషి తాలూకు స్నేహం అన్న అమూల్యమైన గొప్ప విలువ కారణం. అతడే రాజ్ బహదూర్. ఆ స్నేహితుడి చలవతో శిఖరాయమానమైన నటుడిగా ఎదిగిన శివాజీరావ్ గైక్వాడ్ నేడు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారమూ అందుకున్నారు. ఈ ఆదివారం ఆ ఇద్దరు మిత్రుల మానవీయ కథనం.

హెచ్. రమేష్ బాబు 

“ఈ రోజు నేందుకున్న దాదాసాహెబ్ పురస్కారాన్ని నా మార్గదర్శి, గురువు బాలచందర్ గారికి, నాకు జీవితంలో నా తండ్రి స్థానంలో ఉండి జీవన విలువలు నేర్పిన నా సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ కి, ఇంకా నా స్నేహితుడు, కర్నాటక బస్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, సహోద్యోగి రాజ్ బహదూర్లకు అంకితం చేస్తున్నాను” అని ఇటీవల రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అనంతరం ఆ పురస్కారాన్ని వారికి అంకితం చేస్తూ చెప్పిన మాటలు మీరు వినే ఉంటారు. ఆ మూడో వ్యక్తి రజనీకాంత్  బస్ కండక్టర్ గా పని చేస్తున్నప్పుడు అతడిలోని నటనాభిలాషను గుర్తించి సినిమారంగంలో చేరడానికి స్ఫూర్తి దాత. అతడిచ్చిన ప్రోత్సాహం చాలా గొప్పది. అందుకే అత్యున్నత పురస్కారం పొందినప్పుడు రజనీకాంత్ భావోద్వేగపు స్పందన అలా వెల్లడైంది. ఇంతకీ ఆ రాజ్ బహదూర్ ఎవరు? అది తెలుసుకోవాలంటే 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి.

1969 బెంగళూరు…

కర్ణాటక బస్ ట్రాన్స్ పోర్ట్ లో డ్రైవర్ గా చేరి ఎంతో కాలం కాలేదతనికి. అదే కాలంలో నల్లగా ఉంగరాల జుట్టు, మెరుపులా మెరిసే చురుగ్గా సూటిగా చూసే కళ్ళతో ఇరవై ఏళ్ళ యువకుడొకడు కండక్టర్ గా చేరాడు. బెంగుళూరులోని శ్రీనగర్ నుండి మెజెస్టిక్ వరకూ వెళ్లే 10, 10`ఎ బస్ రూట్లలో వారిద్దరి డ్యూటి. అదీ పగటిపూట. కలిసి చేసే ఆ ప్రయాణంలో వారిద్దరికీ స్నేహబంధం రెక్కలు తొడిగింది. అప్పటికే నాటకాల్లో నటించిన అనుభవం ఉన్న ఆ కండక్టర్ తీరు డ్రైవర్ గా పనిచేస్తున్న అతడిని ఆకర్షణలో ఇట్టే కట్టిపడేసింది. కండక్టర్లో అంతర్లీనంగా దాగిన నటుడి విశ్వరూపాన్ని తొలుత అంచనా వేసింది అతనే. అందుకే ఇలా కాదని బి.టి.ఎస్. నాలుగో డిపోలో ఉన్న నాటక బృందంలో ఆ కండక్టర్ని చేర్పించాడు డ్రైవర్. పగలు ఉద్యోగం, రాత్రికి నాటకాలు…ఇట్లా  కండక్టర్ జీవితం నటలో మునిగితేలుతున్నది. డ్రైవర్ అతడిలోని నటుడివెంటే ఉంటున్నాడు.

గధను సాధారణంగా అందరిలా కాకుండా దానిని కుడినుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ హఠాత్తుగా ఎవరూ వూహించని వేగంతో భూమిపైకి ఎత్తేవాడు. ఇది ప్రేక్షకులను ఈలలు వేయించి చప్పట్లు కొట్టించి హాలును దద్దరిల్లిపోయేలా చేసింది.

నటనే ప్రాణమైన కండక్టర్ ‘సదారమే’, ‘కురుక్షేత్ర’, ‘ఎచ్చమ నాయక’ వంటి నాటకాల్లో కర్ణ, దుర్యోధన, ఎచ్చమనాయక్ వంటి పాత్రలతో వీరవిహారం చేస్తున్నాడు. స్టేజీపై దుర్యోధనుడి వేషంలో గధను సాధారణంగా అందరిలా కాకుండా దానిని కుడినుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ హఠాత్తుగా ఎవరూ వూహించని వేగంతో భూమిపైకి ఎత్తేవాడు. ఇది ప్రేక్షకులను ఈలలు వేయించి చప్పట్లు కొట్టించి హాలును దద్దరిల్లిపోయేలా చేసింది.

ఈ బంగారు గొలుసు నీ మెడలో ఉంచుకో…

ఇదంతా గమనిస్తున్న ఆ బస్ డ్రైవర్ ఈ కండక్టర్ నటనలోని కొత్త శైలిని గమనించి ఇక మనోడు కాలు మోపాల్సింది సినిమాల్లోనేనని ‘ఛలో మడ్రాస్’ అన్నాడు. ఆ కోరిక ఈ కండక్టర్ మనసులో ఉన్నా కూడా ఉద్యోగం వదిలి వెళ్ళడం ఇష్టం లేడతనికి. “అదేం లేదు. నేనున్నాను అన్నింటికి నెలనెలా నేను డబ్బు పంపుతాను… నడూ” అంటూ మద్రాస్ పంపాడు. అప్పుడే ప్రారంభమైన నట శిక్షణాసంస్థకు పంపేందుకు  ఫోటోలు తీయించుకోవాలి. కండక్టర్ దగ్గర డబ్బులేదు. కావలసిన 12 రూపాయలు డ్రైవర్ సర్దాడు. ఇంటర్వ్యూ పూర్తయింది. కండక్టర్ సెలెక్టెడ్. వెళ్ళడం ఎలా అంటే ముందు నువ్వు పద. నెలకు నేనే రొండొందలు పంపిస్తాను. వెళ్ళి మద్రాస్ లో వేషాలు వెదుక్కోమన్నాడు. అయితే ఏదో ఒక నెల మాత్రం పంపలేకపోయాడు. ఇక్కడ కండక్టర్ పస్తులుండిపోయాడు. అన్నీ గ్రహించిన డ్రైవర్ ‘‘నీకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇదుగో ఈ బంగారు గొలుసు నీ మెడలో ఉంచుకో. ఎప్పుడైనా ఆలస్యమైనా, అవసరమైనా దీన్ని కుదువబెట్టి డబ్బు తీసుకో. తిరిగి డబ్బులు చేతికి వచ్చాక విడిపించుకోవచ్చు’’ అని కండక్టర్ కి భరోసా కల్పించాడు ఆ డ్రైవర్ స్నేహితుడు.

ఆ కండక్టర్ రజనీకాంత్ ని తనలో దాగిన అపూర్వ నటన వైపు డ్రైవ్ చేసిన డ్రైవర్.  రజనీ సినీ జీవితానికి పునాదులు వేసిన ఆ డ్రైవర్ ని రజనీ ఎప్పుడూ మరచిపోలేదు.

ఇంతలో ఆ కండక్టర్ కోసం తపించి చేసిన ఆ డ్రైవర్ కృషి ఏమాత్రం వృధా కాలేదు. మహాదర్శన్కుడు బాలచందర్ దృష్టిలో పడి నటుడై, హీరో అయిపోవడమే గాదు. ఎం.జి.ఆర్., శివాజీ గణేషన్, జెమినీ గణేషన్ వంటి మహానటుల పరంపరంలో తమిళ చిత్రసీమలో అత్యదిక వన్ మాన్ షోగా హిమాలయశృంగంగా నిలబడ్డాడు.

మరవలేని కృతజ్ఞత

ఆ కండక్టర్ రజనీకాంత్ ని తనలో దాగిన అపూర్వ నటన వైపు డ్రైవ్ చేసిన డ్రైవర్.  రజనీ సినీ జీవితానికి పునాదులు వేసిన ఆ డ్రైవర్ ని రజనీ ఎప్పుడూ మరచిపోలేదు. తాను ఫాల్కే అవార్డు అందుకున్నప్పుడు సైతం తన నోట నోట ప్రకటితమైన ‘రాజ్ బహదూర్’ తన నట జీవితానికి ప్రాణం అంటే అతిశయోక్తి కాదు..

రజనీ సినీజీవితం ఒకటి రెండేళ్ళలో గాడిన పడింది. తన దారిలో సాగిపోతు నటనలో నూతనత్వం ఆవిష్కరిస్తూ ఒక్కో మెట్టే ఎక్కుతూ తమిళ చిత్రరంగంలో ‘సూపర్ స్టార్’ గా ఎదిగిపోయాడు. కానీ తనలోని నటుడిని తొలుత గుర్తించి సినిమాల్లోకి పంపి స్థిరపడేదాకా తోడ్పడిన రాజ్ బహదూర్ ను రజనీ మరిచిపోలేదు. ఎప్పుడు తీరిక దొరికినా అతని ప్రయాణం బెంగళూరు వైపే. అతని స్నేహితుని చెంతకే. కానీ కలుసుకోవడం కష్టం కదా! ఎలా వెళతాడు రజనీ మరి.

మారువేశంలో మిత్రుడిని కలవాల్సిన స్థితి

బెంగళూరుకు ఎప్పుడు వెళ్ళినా మారువేశంలో వెళ్ళే రజనీకాంత్ తన స్నేహితుని వెంట తీసుకుని ఆ మారు వేశంలోనే బెంగళూరు అంతా తిరిగి ‘విద్యార్థి భవన్’లో నేతి దోశ తింటాడు. లేకుంటే పార్శిల్ కట్టించుకుని కృష్ణారావు పార్కులో కూర్చుని తింటారు. ఒక్కోసారి ఎనభై ఏళ్ళ ముసలాడి వేశం వేసుకుని వచ్చేవాడు. ఆటోలో, కాలినడకన తిరిగేవాడు. ఏ అర్ధరాత్రో వెళ్ళి రాజ్ బహదూర్ ను కలుసుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకుంటారు.

ఉమా థియేటర్ దగ్గరికి వచ్చి పక్కనున్న బ్యాంక్ మెట్లపై కూర్చుని వచ్చీపోయే జనాన్ని చూస్తూ బజ్జీ, బోండాం పొట్లాం విప్పుతారు.

గుట్టళ్లి ప్రాంతంలో ఒక మహిళ వేడివేడిగా వేయించి ఇచ్చే బజ్జీ, బోండాలంటే రజనీకి మహా ఇష్టం. అదేం ఫైవ్ స్తార్ హోటల్ కాదు. రజనీ మెచ్చిన ఫుట్ పాత్ అంగడి. అక్కడ బజ్జీలు, బోండాలు పొట్లం కట్టించుకుని ఉమా థియేటర్ దగ్గరికి వచ్చి పక్కనున్న బ్యాంక్ మెట్లపై కూర్చుని వచ్చీపోయే జనాన్ని చూస్తూ బజ్జీ, బోండాం పొట్లాం విప్పుతారు. పక్కనే ఉన్న హోటల్లో కాఫీ తాగి నడుస్తూ వెళ్ళి విద్యార్థి భవన్ లో దోశె పార్సెల్ తీసుకుని పార్క్లో కూర్చుని తింటారు. ఇంకా భళేపేట రామన్న బిరియానీ అంటే రజనీకి ప్రాణం లేచొస్తుంది.

రాజ్ బహదూర్ కి తెలియని ‘కథ’ లేదు

ఇదేమిటి? రజనీ రాజ్బహదూర్ లు కలిస్తే వారిదొక విచిత్రమైన స్నేహ ప్రపంచం. రజనీ చిన్నప్పుడు తొలిసారిగా దొంగతనంగా సారాయి తాగిన గంగాధరేశ్వర ఆలయం పక్కనున్న పార్క్ లో రాజ్ బహదూర్ తానూ కలిసి మద్యం తాగుతరు. ‘శివాజీ’ సినిమా కథను పూర్తిగా రాజ్ బహదూర్ చెప్పేస్తాడు. అప్పటివరకు రజనీకి, డైరెక్టర్ శంకర్ కు తప్ప ఆ కథ మరెవరికీ తెలియని రహస్యం అని అందరికీ తెలుసు.

కానీ ఆ విషయం రాజ్ బహదూర్ పుణ్యమని గుట్టళ్ళి పార్క్లోని చెట్లకు, మొక్కలకు, పూలకూ తెలిసిపోయింది. శివాజీ కథ విని బహదూర్ థ్రిల్ అయిపోయాడు. కానీ కథ గురించి ఎక్కడా నోరు విప్పలేదు. ఇట్లా రాజ్ బహదూర్ తెలియని రజనీ రహస్యాలు లేవు.

పుట్టినరోజుకు ఆ ఇద్దరే!

సుమారు 15 ఏళ్ళ క్రితం రజనీ పుట్టిన రోజున తన కుటుంబంతో జరుపుకునేవాడు. పబ్లిక్ ఫంక్షన్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. పైగా వేలాది అభిమానుమాలను కట్టడి చేయలేమని మెల్లమెల్లగా బర్త్ డే ని జరుపుకోవడం మానుకుని ఆ రోజు మద్రాస్ కు దూరంగా ఉండేందుకు అలవాటుపడ్డాడు. ఊటీ, తిరుపతి, మంత్రాలయమో తనకిష్టమైన వైపు కారులో వెళ్ళేవాడు. ఒకసారి తిరుమల కొండపై గెస్ట్ హౌజ్ లో ఉన్నాడు. రజనీ వెంట రాజ్ బహదూర్ కూడా ఉన్నాడు. అంటే అసలు ఉన్నది ఇద్దరే.

రజనీకి పూలగుత్తి ఇచ్చి శుభాకాంక్షలు చెపుతూ రజనీని కౌగిలించుకున్నాడు. ‘‘నీకు కోట్లాది అభిమానులు అభినందనలు తెలుపాలని కాచుకుని ఉంటారు. కానీ నీకు ముందుగా శుభాకాంక్షలు తెలిపే అవకాశం నాది. నేనే పుణ్యం చేసుకున్నాను’’ అన్న బహదూర్ కి రజనీ ఏం జవాబు చెప్పాడంటే` ‘‘పుణ్యం చేసింది నీవు కాదు. నేను. ఎవరెవరో విష్ చేయడం కన్నా నాకు కావలసిన వారు, నా ఆప్తులు నాకు పూవులిచ్చారు. ఈ సౌభాగ్యం ఎవరికి లభిస్తుంది చెప్పు’’. ఇది రజనీకాంత్ హృదయంలో రాజ్ బహదూర్ కు ఉన్న ప్రత్యేక స్థానం.

‘మీరెలా ఉన్నారు?’ అని అడిగేవారు కదా గొప్ప అస్తి

రజనీకి రాజ్ బహదూర్ తో పాటు రఘనందన్, రాజారావు, రాము, చంద్రశేఖర్, మరిస్వామి ఇలా ఇంకా చాలామంది స్నేహితులే ఉన్నారు. కానీ అందరిలో రాజ్ బహదూర్ తోనే తనకు ఎక్కువ చనువు.

‘‘రజనీకాంత్ మీకంత క్లోజ్ కదా? మీరెందుకు కాల్షీట్ అడగకూడదు?’’ అని గత నలభై ఏళ్ళల్లో బహదూర్ కు చాలామంది సలహా ఇచ్చారు. వాటన్నింటికీ చిరునవ్వే అతని సమాధానం. అంతెందుకు రజనీనే ఏకంగా బహుదూర్ తో ‘‘కొందరు కూతురు పెళ్ళి, అనారోగ్యం ఇలా ఏవేవో కారణాలు చెబుతారు. . డబ్బున్నవారే అడుగుతుంటారు. ‘ఉందిగా ఇవ్వనీ’ అనే మనస్తత్వం వారిది. కానీ ఏ ఒక్కరూ ‘మీరెలా ఉన్నారు?’ అడిగేవారు కాదు. నువ్వు మాత్రం నేనిస్తానన్నా వద్దంటావే? ప్రపంచంలో నీలాంటి వారూ ఉంటారు?’ అన్నాడోసారి.

‘‘రజనీకాంత్ మీకంత క్లోజ్ కదా? మీరెందుకు కాల్షీట్ అడగకూడదు?’’ అని గత నలభై ఏళ్ళల్లో బహదూర్ కు చాలామంది సలహా ఇచ్చారు. వాటన్నింటికీ చిరునవ్వే అతని సమాధానం.

‘‘పోనీ…నేను స్టార్ ని అయ్యాను కదా! నా మేనేజర్ గా ఉండు. కాల్షీట్లు చూడు’’ అన్నాడు మరోసారి. దానికి బహదూర్ సున్నితంగా నిరాకరించాడు.

రజనీ నుంచి డబ్బు సహాయం తీసుకోవడం గురించి మరో సందర్భంలో చెబుతూ  ‘‘నాకు పెళ్ళి కాలేదు. ఉన్న ఆస్తినంతా అన్నదమ్ముల పిల్లలకు రాసిచ్చాను. చామరాజ్ పేటలో మూడంతస్తులు ఇల్లు ఉంది. కింది భాగంలో సోదరులున్నారు. టెర్రస్ పై ఒక చిన్నగది నాకోసం. తిండి బట్టకు లోటు లేదు. ఇక ఎం కావాలి? రజనీ ఇచ్చే డబ్బు నెనెక్కడ దాచుకోను? పైగా మరొకరి డబ్బు నాకెందుకు’’ అని.

తనకు టీ పెట్టివ్వడంలో తృప్తి!

డబ్బుతోనో, వ్యాపారంతోనో ముడిపడినది కాదు రజనీ రాజ్ బహదూర్ ల స్నేహం. అదొక నిస్వార్థమైన, నిష్కల్మషమైన ప్రేమాభిమానలు నిండిన మైత్రి. దానికో నిదర్శనం. అప్పుడప్పుడు రజనీ బహదూర్ ఇంటికి వచ్చినప్పుడు, తన ఫ్లాట్లో ఉన్నప్పుడు రజనీయే టీ పెట్టి ఇస్తాడు. బహదూర్ తాగిన గ్లాస్ ని తనే కడుగుతాడు. ఇంతకన్నా వారి అప్యాయంత మరో ఉదాహరణ ఉంటుందా? అనిపిస్తుంది.

“నా ప్రియమిత్రుడు   ప్రారంభిస్తారు’’

1989 డిసెంబర్ 14న బెంగుళూరులో రాఘవేంద్ర కళ్యాణమండపం నిర్మించి ప్రారంభోత్సవం చేశాడు రజనీ. ఆహ్వాన పత్రికలో నాటి ముఖ్యమంత్రి కరుణానిధి, శివాజీగణేషన్, ఇళయరాజా, చోరామస్వామి ఇలా 11 మందిలో చివరి పేరు రాజ్ బహదూర్ ది.

వేదికపై అందరితోబాటు రాజ్ బహదూర్ ను పరిచయం చేసాడు. తరువాత ప్రారోంభోత్సవం ఎవరు చేస్తారో పత్రికలో వేయలేదు. అందరికి కుతూహలంగా ఉంది. అప్పుడు రజనీ ‘‘దీనిని నా ప్రియమిత్రుడు రాజ్ బహదూర్ ప్రారంభిస్తారు’’ అన్నాడు. రాజ్ బహదూర్ విస్మయపోయాడు. అంతటి దిగ్గజాల నడుమ రజనీ ప్రకటనకు నోట మాట రాలేదు. ఈ సంఘటన అతని జీవితంలో మరువలేనిది.

“అలా కూచోవడం నాకెంతో సంతోషంగా ఉంది’’

ఒకసారి ఏం జరిగిందంటే రాజ్ బహదూర్ రజనీ ఎదురుగా కాలిమీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఇది రజనీ గమనిస్తున్నాడు. అది చూసిన బహదూర్ కొద్దిగ ఇబ్బందిగా ఫీలైపోయాడు. అంత గొప్ప సూపర్ స్టార్ ఎదురుగా అలా కూర్చోవడం సరికాదేమో అనుకుని ఉండబట్టలేక ‘‘నీ ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నందుకు ఏమైనా అనుకున్నావా?’’ అని అడిగేశాడు. అందుకు నవ్వుతూ రజనీ` ‘‘నా ముందు ఎవరూ అలా కూర్చోరు. కూర్చున్నా ఈ భంగిమలో… ఊహూ కనీసం ఒక్కరు కూడా కూర్చోలేదు. ఇప్పుడు నా ముందు ఇలా నీవైనా కూర్చున్నావు కదా …నాకెంతో సంతోషంగా ఉంది’’ అన్నాడు ఆనందంతో.

1949 డిసెంబర్ 12న బెంగళూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సోమహళ్ళి’లో కారు నలుపు కాస్త మెల్లకన్నుతో పుట్టిన రజనీ అంతా చూసి ఇలాంటి పుట్డాడేమిటీ అన్నారు. తల్లి రాంబాయి మాత్రం ‘‘నువ్వు రాజకుమారుడిలా ఉన్నావవురా అన్నది’’ ఆ మాట వూరికేనే పోలేదు. అంతకన్నా గొప్పవాడయ్యాడు. రాజబహదూర్ అనే స్నేహితుడి చలవతో శిఖరాయమానమైన నటుడిగా భారతదేశంలో అమితాబ్, అమీర్, సల్మాన్, షారూఖ్ ఖాన్లు, హృతిక్ రోషన్లు అంతా కలిసి తీసుకునే పారితోషికం ఒక్కడే తీసుకునే సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇంత ఎదిగినా రాజ్ బహదూర్ కు రజనీకాంత్ తొలినాటి శివాజీరావ్ గైక్వాడ్ మాత్రమే.

అదే సత్యం, శివం, సుందరం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article