పంద్రాగస్టు పాట : పెన్నా సౌమ్య గానం
రేపు పంద్రాగస్టు. స్వాతంత్ర్య దినోత్సవం. జాతి యావత్తూ పిల్లలై భరతమాత దీవెనలు తీసుకునే రోజు. తల్లి కొంగులా ఎగిరే జాతీయ పతాకాన్ని చూసి పిల్లలూ పెద్దలూ పరవశించే రోజు. పర పీడన నుంచి విముక్తమై స్వయంపాలనలో స్వేచ్చగా జీవిస్తున్న ప్రజానీకం ఎందరెందరో దేశభక్తులను మనసారా గుర్తు చేసుకునే రోజు. వారి స్పూర్తిని గుండెల నిండుగా పొదువుకుని మరింత బాధ్యతగా మెసులుకునేందుకు పునరంకితమయ్యే రోజు. ఈ సందర్భంగా కవి, ఉపాధ్యాయులు, శ్రీకాళహస్తికి చెందిన కయ్యూరు బాల సుబ్రమణ్యం రాసిన ఈ గీతం తెలుపుకు ప్రత్యేకం.
సామాన్యంగా ఉంటుంది పాట. ఒకటి రెండు సార్లు వింటే రోజంతా అది మీ గుండెల్లో మారు మోగడం ఖాయం. మరి వినండి.
“బాలల్లారా పిల్లల్లారా … భావి భారత పౌరుల్లారా… మెరిసే పూల మొగ్గల్లారా” అంటూ లలిత లలితంగా పెన్నా సౌమ్య గళం నుంచి జాలువారిన ఈ చక్కటి ఈ దేశభక్తి గీతాన్ని విని ఆస్వాదించండి.
అన్నట్టు, ఒకటికి రెండు సార్లు పిల్లలతో ఈ పాట పాడించడం మరవకండి. వారికి సులభంగా కంఠస్థం అవుతుంది.
గాంధి బోసి నవ్వుల్లారా ..అల్లూరి నిప్పు ఖనికల్లారా…
గురజాడ అడుగు జాడల్లారా.. వీరేశం అభినవ భావాల్లారా…
ఉప్పెనలా ఉరకండి… మెరుపుల్లా మెరవండి… కెరటాల్లా కదలండి…
రేపటి ఉజ్వల భారత్ కోసం …