Editorial

Thursday, November 21, 2024
Peopleఓ గుండమ్మ కథ - శ్రీదేవీ మురళీధర్ స్మరణ

ఓ గుండమ్మ కథ – శ్రీదేవీ మురళీధర్ స్మరణ

అద్భుత సహజ నటీమణి సూర్యకాంతం గురించి రాయాలనుకున్నప్పుడు శీర్షిక పేరు ఏమి పెట్టాలా అని ఆలోచిస్తే -నేను కొత్తగా పెట్టేదేవిటి, 1962 లో అతిరథ మహారథులు నాగిరెడ్డి-చక్రపాణిల జంట చేసిన తిరుగులేని నామకరణం స్ఫురణకు వచ్చింది. ‘గుండమ్మ కథ’ కన్నా  సరైన పేరు లేదనే నమ్మకం గట్టిపడి ధైర్యం చేసి అదే పేరుతో ఈ వ్యాసం రాశాను.

శ్రీదేవీ మురళీధర్

Shridevi Muralidhar writerతూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర వెంకటకృష్ణరాయ పురంలో ,1924 అక్టోబర్ 28 నాడు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ పొన్నాడ వెంకట రత్నమ్మ-అనంతరామయ్య దంపతులకు పదునాలుగవ సంతానంగా సూర్యకాంతం జన్మించారు. ఆరవ ఏటి నుంచే సంగీతం, నాట్యం నేర్చుకుంటూ కళాభిరుచి వ్యక్తం చేస్తూ పెరిగి సూర్యకాంతం కాకినాడలో రంగస్థల నటిగా నటనా జీవితానికి అంకురార్పణ గావించారు.

హిందీ తారలు అశోక్ కుమార్, లీలా చిట్నిస్ ల వీరాభిమాని అయిన సూర్యకాంతం మొదటి నుంచీ హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకోవాలని ఉబలాటపడ్డారు. లీలా చిట్నిస్ సినీ గీతాలను, హావభావాలతో అభినయించటంలో ఆమె ఆ రోజుల్లో దిట్ట.

ఆ కాలంలో మద్రాస్ లోని జెమినీ స్టూడియో లో హిందీ చిత్రాల షూటింగులు జరిగేవి. డాన్స్ ఆర్టిస్ట్ గా నెలకు 65 రూపాయల జీతంతో వారు చేరమంటే, వారితో వాదించి, 75 రూపాయలు జీతానికి ఒప్పించి చేరారు సూర్యకాంతం.’చంద్రలేఖ’లో బృందనృత్యం తో తెరపై మొదటి సారి మెరిసిన సూర్యకాంతం ఎన్నిరోజులు గడిచినా బృందగానాల పాత్రలు తప్ప వేరేవి రాకపోవటంతో విసుగు చెందారు. తాపీ ధర్మా రావు, పి.పుల్లయ్య గార్లు ఆమె ఆసక్తిని గమనించి తెలుగు చిత్రాలలో చిరు పాత్రలలో నటించమని కోరినా ఆమె హిందీ చిత్రాలు తప్ప చెయ్యనని ఖండితంగా చెప్పారు. అయితే ఆ పట్టు వదలని విక్రమార్కులు ఆమెను ఒప్పించి ‘నారద నారది’లో ఒక చిన్న వేషం వేయించారు.ఆమె మాత్రం ఆ పాత్రతో తృప్తి చెందలేదు. జెమినీ వారి కోరస్ పాత్రలతో వేసారి ఆమె జెమిని స్టూడియో నుండి బయటికి వచ్చేసారు. బొంబాయి హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాలని ఎంత కోరికగా ఉన్నా ఆమె ఆర్ధిక స్థితి అందుకు సహకరించక ఊరుకున్నారు.

‘సంసారం’ (1950) అనే చిత్రం లో తెలుగు తెరపై మొదటిసారిగా గయ్యాళి అత్త పాత్రను సూర్యకాంతం ముద్రతో ఆవిష్కరించించారు.’కోడరికం’ అనే తదుపరి చిత్రంలో తిరుగులేని నటనతో అత్తగారి పాత్రలో జీవించి సూర్యకాంతం తనదైన ‘బ్రాండ్’ ను,తెలుగు సాంఘిక చిత్రాలపై శాశ్వతంగా ముద్రించారు !!

1949 లో ‘ధర్మాంగద’లో మూగపాత్ర పోషించారు. ‘గృహప్రవేశం’చిత్రంలో సహాయనటి పాత్ర లభించింది. అందులో గుర్తింపుతో పాటు ‘సౌదామిని’చిత్రం లో నాయిక వేషం తలుపు తట్టింది. విధి వక్రించి అదే సమయంలో కారు ప్రమాదం లో ముఖం మీద గాయాలు ఏర్పడి ఆ చిత్రాన్ని వదులుకోవలసి వచ్చింది. ఆ మలుపే ‘సంసారం’ (1950) అనే చిత్రం లో తెలుగు తెరపై మొదటిసారిగా గయ్యాళి అత్త పాత్రను సూర్యకాంతం ముద్రతో ఆవిష్కరించించారు.’కోడరికం’ అనే తదుపరి చిత్రంలో తిరుగులేని నటనతో అత్తగారి పాత్రలో జీవించి సూర్యకాంతం తనదైన ‘బ్రాండ్’ ను,తెలుగు సాంఘిక చిత్రాలపై శాశ్వతంగా ముద్రించారు.

తెలుగులో టపాకాయల చిటపట వెలుగులు చిమ్ముతూండగా, చిరకాల స్వప్నం – హిందీ చిత్రంలో నాయిక పాత్ర ఎదురొచ్చి తలుపు తట్టింది. అయితే ఒప్పుకున్న కొద్ది రోజుల్లోనే ఆ పాత్ర ఇదివరకే ఒకరితో చిత్రించి ఆ నటిని సినిమా నుండి తొలగించారని తెలిసి, ఆమెలో మానవత్వం అలాంటి అవకాశం పట్ల విముఖత చూపింది. ‘ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండటం నా వల్ల కాదు’ అని తేల్చి చెప్పి ఆ పాత్రను వదులుకున్నారు.ఈ ఒక్క ఉదంతం చాలు – ఇతరుల కలల సమాధులపై తమ ఆశల మేడలు నిర్మించుకునే వారందరికీ గుర్తుండిపోయే గుణపాఠం!

చిత్రాలూ, ‘విజయ’ పరంపరలూ…

సూర్యకాంతం తమ నటనా ప్రస్థానంలో 750 కి పైగా చిత్రాలకు ప్రాణం పోశారు. అందులో 50 దాకా తమిళము,’బహుత్ దిన హుయే’,’బాల నాగమ్మ’,దో దుల్హనే’ అనే మూడు హిందీ చిత్రాలు. అందులో ‘చిరంజీవులు'(1950), ‘చక్రపాణి'(1954),’దొంగరాముడు'(1955), ‘తోడికోడళ్ళు’ (1955),అత్తా ఒకింటి కోడలే” (1958), ‘ఇల్లరికం'(1959),’ భార్యాభర్తలు(1961),’గుండమ్మకథ’, ‘కులగోత్రాలు (1962),’ దాగుడుమూతలు”(1964) మొదలైనవి ఆమెకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టిన కొన్ని చిత్రాలు మాత్రమే!

హావభావాలలో హాస్యాన్నీ, వెటకారాన్నీ- చేష్టలలో ఏహ్యాన్నీ, కోపాన్నీ ఒక్కసారిగా ప్రదర్శించగల ప్రజ్ఞావంతురాలు సూర్యకాంతం. నాటి మేటి నటులు, నటీమణుల సరసన ఏ విధంగానూ తీసిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని ఏర్పరచుకున్న ధాటీ ఆవిడది! ప్రముఖ తారలకున్నట్లే ఆమెకు కూడా లెక్కకు మించిన అభిమానుల ప్రోత్సాహం, ప్రేమా లభించాయి. 60 వ దశకంలో అద్భుతంగా విజయవంతమైన చిత్రాలలో నటించిన సూర్యకాంతం విజయావారి ఆస్థాన నటిగా పేరు పొందారు. ‘తోడికోడళ్ళు’ తరువాత అన్నపూర్ణా వారి ఆదరణకు నోచుకున్నారు. భానుమతి గారి భరణి సంస్థ ఏ చిత్రం తీసినా అందులో సూర్యకాంతం ఉండవలసిందే!

అందరూ అసమాన ప్రజ్ఞావంతులతో నిర్మించిన చిత్రం ‘గుండమ్మ కథ’లో ఒక కారక్టర్ ఆర్టిస్ట్ పేరు మీద చిత్రం నామకరణం జరగటం ఆ రోజుల్లో సంచలనవార్త అయ్యింది. నాగిరెడ్డి – చక్రపాణి జంట తమ నిర్ణయానికి కట్టుబడి ఆ పేరుతోనే చిత్రాన్ని విడుదల చేశారు.

అందరూ అసమాన ప్రజ్ఞావంతులతో నిర్మించిన చిత్రం ‘గుండమ్మ కథ’లో ఒక కారక్టర్ ఆర్టిస్ట్ పేరు మీద చిత్రం నామకరణం జరగటం ఆ రోజుల్లో సంచలనవార్త అయ్యింది. అందరూ వద్దన్నారు, అపహసించారు. నాగిరెడ్డి – చక్రపాణి జంట తమ నిర్ణయానికి కట్టుబడి ఆ పేరుతోనే చిత్రాన్ని విడుదల చేశారు. ‘విజయ’ ఢ౦కా మోగించారు! నిజానికి వారు సూర్యకాంతం లేకుండా చిత్రం తీయటానికి ఇచ్చగించేవారే కాదట! ఆమె నటనా కౌశలం మీద వారికి అంత అభిమానమూ, గురీ!

ఒకే ఒక్క ‘సూర్యకాంతం’…

శ్రీ పెద్దిభొట్ల చలపతి రావు ఈమె జీవన సహచరులు, మద్రాస్ లో పేరు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.
తెలుగు సినీ రంగంలో ఇలాంటి నటి మరి లేరు. ఆమె నిష్క్రమణ శూన్యం చేసిన స్థాన్నాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు! బాలకృష్ణ తదితర నటులు ‘గుండమ్మ కథ’ను పునర్నిర్మించాలని అనుకుని సూర్యకాంతం పాత్ర ఎవరూ పోషించలేరనే బెంగతో తటపటాయించారు.

కొరివికారంలా చురుక్కున గుచ్చుకుని మండే పదునైన మాట,ఎడమ చేతి వాటంతో చూపించే నిక్కచ్చిదనం, వెటకారపు మూతి విరుపు…ఆమె ప్రత్యేకత.

కొరివికారంలా చురుక్కున గుచ్చుకుని మండే పదునైన మాట,ఎడమ చేతి వాటంతో చూపించే నిక్కచ్చిదనం, వెటకారపు మూతి విరుపు…ఎన్ని వందల పాత్రలలో చూచినా, విసుగు పుట్టించవు. ప్రతిసారీ ‘ఒరిజినల్’గా మెప్పించే నటనను పండించటం ఒక్క సూర్యకాంతానికే చెల్లింది!

కేవలం హావభావాలతో క్షణంలో పాత్ర మనస్తత్వాన్ని కళ్ళకు కట్టించే అసమాన ప్రజ్ఞ ఆమెది! అదీ గాక ఆమె చెప్పేవి ‘మాటలు’,! డైలాగులు కావు సుమండీ! ఎన్టీఆర్ మొదలుకుని చిరంజీవి వరకు అందరితోనూ నటించారు సూర్యకాంతం.1994 లో విడుదలైన ‘ఎస్ పీ పరశురాం’ఆమె ఆఖరి చిత్రం.

నిజ జీవితంలోకి చొచ్చుకు పోయిన ‘ఇమేజ్!’

మద్రాసులో ప్రముఖ నటీమణి ఇంట్లో వంటగత్తెగా చేరటానికి ఉబలాట పడుతూ ఒక మహిళ బండి దిగింది. ఆ నటీమణి మరెవరో కారు, సూర్యకాంతమని తెలిసి అదిరిపడి ఎవరు చెప్పినా వినకుండా తిరుగు ప్రయాణం కట్టింది, ‘అమ్మో!సూర్యకాంతం చేతి కిందనే, బాబోయ్!’ అంటూ!

తాను హాస్యంగా ఆవిడతో ఇలా అన్నానని గుమ్మడి గారు తెలిపారు.’సూర్యకాంతం అనే మంచి పేరును మరెవరూ పెట్టుకోవటానికి వీలులేకుండా చేశావు కద!’

షూటింగు,తదితర సమయాలలో తారలను చూడవచ్చే అభిమానులు, ఇతర తారల దగ్గర ఆటోగ్రాఫులు తీసుకుంటూ,ఫోటోలు తీయించుకుంటూ, అక్కడే ఉన్న సూర్యకాంతంను మాత్రం తప్పించుకు దూరదూరంగా తిరిగేవారు. గయ్యాళితనానికీ, కరుకు మాటల పాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతం అంటే ప్రేక్షకులలో అందరికీ హడల్!!

కీర్తిశేషులు గుమ్మడిగారితో సూర్యకాంతం ఎన్నో చిత్రాలు చేశారు. ఒక టీవీ పరిచయంలో సూర్యకాంతం నటన సహజత్వాన్ని, దాని పర్యవసానంగా ప్రేక్షకులలో ఏర్పడిన ‘ఇమేజ్” ని గురించి ప్రస్తావిస్తూ, తాను హాస్యంగా ఆవిడతో ఇలా అన్నానని తెలిపారు.’సూర్యకాంతం అనే మంచి పేరును మరెవరూ పెట్టుకోవటానికి వీలులేకుండా చేశావు కద!’

నిజమే మరి, ఆవిడ రాకతో ఆంద్ర దేశంలో ఆ నామధారణ మరెవ్వరూ చెయ్య సాహసించలేదు!

వ్యక్తిగా సూర్యకాంతం…

నిజ జీవితంలో ఎంతో సున్నితమైన భావాలు, సుతిమెత్తని మనసు గల మానవి సూర్యకాంతం! ఎవరు బాధలో ఉన్నా తట్టుకోలేక తనకు మించిన, తలకు మించిన సాయం చేసేవారని గొప్ప పేరు. నిజాయితీ, ఆత్మస్థైర్యం కల ఉజ్జ్వలమైన వ్యక్తిత్వం ఆమెది. అతితెలివిగా పారితోషికాలు తగ్గించి, ఎగవేసే నిర్మాతల దగ్గర ఖరాఖండిగా ప్రతి పైసా వసూలు చేసేవారు. అయితే ఎవరు కష్టంలో ఉన్నారని తెల్సినా తన వద్దనున్న ఆఖరి పైసా వరకు వారికి సాయం చేసే ఉదాత్తు రాలిగా నిలిచిపోయారు. ఎప్పుడూ నవ్వుతూ,సంతోషంగా నలుగురిలో నడయాడే సూర్యకాంతం తన పరిసరాలను హాస్యాలతో, నవ్వులతో చైతన్యవంతం చేసేవారు. ఒకరికి పెట్టి వారు తింటుంటే చూసి సంతోషించే బంగారు మనసు ఆమెది! ఆమె భోజన ప్రియత్వం అందరికీ తెలిసిందే! ప్రత్యేకించి తీపి వంటకాలంటే ఆమెకు ప్రాణం!

ఒకరికి పెట్టి వారు తింటుంటే చూసి సంతోషించే బంగారు మనసు ఆమెది! ఆమె భోజన ప్రియత్వం అందరికీ తెలిసిందే!

అన్నట్టు, సూర్యకాంతం గారి వంటల పుస్తకం ”ఇంటింటి వంటలు’ బహుళ ప్రాచుర్యం పొందినది. ఆ పుస్తకానికి రచన ‘ఇంటింటి అత్తగారు, సూర్యకాంతం’ అన్న పేరు పెట్టారు. ఆ పుస్తకాన్ని నవోదయ వారు ప్రచురించారు.

షూటింగుకి వెళ్ళేటప్పుడు ఇంటి నుండి పెద్ద కెరియర్ నిండా రకరకాల వంటలు స్వయంగా చేసి సర్దుకుని తీసుకు వెళ్ళేవారు. అందరికీ కొసరి, కొసరి వడ్డించి, వారు తింటుంటే చూసి, తృప్తి పడేవారు. ఆమె వంటలలో చెప్పుకో దగ్గ వంటకం పులిహోర!

షూటింగు ముగిసే ఆఖరు రోజున యూనిట్ లోని చిన్నా,పెద్దా సభ్యులకు తనకు తోచిన వస్తువు కానుక చేసి చిన్నపిల్లలా సంబర పడేవారు!!

బాపు-రమణలు ‘బుద్ధి మంతుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు వారి పట్ల ప్రోత్సాహంతో ఉచితంగా నటించారు. అది గుర్తుంచుకుని వారు ‘బాలరాజు కథ’ లో ఆమెకు ముఖ్య పాత్రనిచ్చారు. పిల్లలు లేని సూర్యకాంతం కొందరు అనాధ పిల్లలను చేరదీసి పెంచేవారు. వారందరికీ ఆ చిత్రంలో చోటు కల్పించారు బాపు-రమణలు.

అందాల రాముడు’ నిర్మించినప్పుడు ఆమెకు ‘అట్ల సావాలమ్మ’ పాత్ర ఇచ్చారు. అందులో ఆమె ప్రాణ ప్రతిష్ట చేశారు.

వితరణశీలి, పరోపకారి సూర్యకాంతం…

ఆమె ఆంద్ర ప్రదేశ్ రంగస్థల కళాకారుల సంస్థకు విధిగా ప్రతి ఏటా విరాళాలు ఇచ్చేవారు. గ్రంథాలయాలకు,వికలాంగుల సంస్థలకు,విద్యాలయాలకు లెక్కకు మించిన విరాళాలు ఇచ్చేవారు. దివిసీమ వరద ముంపుకు గురైనప్పుడు ఎంతో అంకిత భావం తో విరాళాలు సేకరించారు. నిధుల కోసం నిర్వహించే కార్యక్రమాలలో ఉచితంగా పాల్గొనేవారు.

అవివేకంతో, అనాలోచితంగా మోసగాళ్ళ వలలో ఇరుక్కుని సినీరంగంలో తారలు కావాలని మద్రాసు చేరే అమాయకులైన అమ్మాయిలను, గట్టిగా చివాట్లు పెట్టి, వారికి మంచి బుద్ధులు మప్పి, తమ ఇళ్ళకు వెడలనంపేది ఈ ‘గయ్యాళి సూర్యకాంతం’!

అన్నింటికంటే చెప్పుకోదగ్గ పరోపకారం…అవివేకంతో, అనాలోచితంగా మోసగాళ్ళ వలలో ఇరుక్కుని సినీరంగంలో తారలు కావాలని మద్రాసు చేరే అమాయకులైన అమ్మాయిలను, గట్టిగా చివాట్లు పెట్టి, వారికి మంచి బుద్ధులు మప్పి, తమ ఇళ్ళకు వెడలనంపేది ‘గయ్యాళి సూర్యకాంతం’!

ఇది మామూలు సేవ కాదు,లేత జీవితాలను చితికి పోకుండా కాపాడిన మహోత్తర సేవ, ఒప్పుకుంటారు కదూ?

వివిధ పాత్రలలో సూర్యకాంతం…

-తోడి కోడళ్లలో ‘తోడికోడలు’, గుండమ్మ కథ లో ‘అత్తగారు’. చరణదాసీ లో ‘సోదరి’. మాయాబజార్ లో ‘తల్లి’. ఆత్మ బంధువు లో ‘కూతురు’. కాలం మారింది లో ‘అమ్మమ్మ’. మట్టిలో మాణిక్యం లో-(షోకైన) ‘సంఘ సేవిక’. ఇంకా ఎన్నెన్నో…

వారి స్మరణలో ఒక ‘హోరాహోరీ’ సన్నివేశం…

ఇదిగిదిగో , ఈ అద్భుతమైన ‘హోరాహోరీ’ సన్నివేశం కోసం గుండమ్మకథ చిత్రాన్ని అమితంగా ఇష్టపడిన నాలాంటి వాళ్ళు ఎందరెందరో! అప్పటికీ,ఇప్పటికీ,ఎప్పటికీ ఒక అనాగరిక, పల్లెటూరి ఆడవాళ్ళ పోట్లాటను ఎంతో ఆనందిస్తూ చూడటం వేరే ఏ చిత్రాలలోనూ జరగదు కాక జరగదు. ఛాయాదేవి, సూర్యకాంతం ఇద్దరూ పోటీపడి ఈ సన్నివేశాన్ని పండించారని తెలుగువాళ్లు ఏకగ్రీవంగా ఒప్పుకుంటారని నా నమ్మకం! ఈ లింక్ ని క్లిక్క్ చేసి చూసి ఆనందించండి.

ఇంతటి మహా నటి మధుమేహంతో ఎంతో బాధ పడి శరీరం సహకరించినంత వరకూ నటించారు. మరణించే దాకా నటించాలని అనుకుని సాధ్యమైనంత వరకు అనుకున్నట్లు చేశారు. వెండి తెరపై పూడ్చలేని వెలితిని సృష్టించి 1994 డిసెంబర్ 18 న ఆ అసమాన కళాకారిణి స్వర్గస్తులైనారు.

  • రచయిత్రి శ్రీదేవీ మురళీధర్ వ్యక్తుల జీవితాలను లోతుగా తడిమి రాస్తారు. అక్షరాల్లో ఆత్మీయంగా ఆవిష్కరిస్తారు. వారు అనేక గ్రంధాలు వెలువరించారు. అందులో సినిమా రంగానికి చెందిన ‘నా హాలీవుడ్ డైరీ’, ఆధ్యాత్మిక ధార ‘వేదాంత దేశికులు’ ప్రసిద్ధం. వారు కలం పట్టి రచయిత్రిగానే కాక సంఘ సేవకులుగా కూడా కార్యక్షేత్రంలో ఉన్నారు. వి. బి. రాజు సోషల్ హెల్త్ ఫౌండేషన్ స్థాపించి మద్యపానం, ఇతర మాదకద్రవ్య బాధితుల ప్రవర్తనలో మార్పు తెస్తున్నారు. ఆ విషయంగా తెచ్చిన వారి పుస్తకం ‘ఆల్కహాలిక్‌ల పిల్లలు’. ఈ వ్యాసం రచన మాసపత్రిక డిసెంబర్ -2011 నుంచి పునర్ముద్రణ. 
      

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article