Editorial

Monday, December 23, 2024
OpinionYear Roundup 2021 : శైలజ చందు నిశ్శబ్ద నీరాజనం

Year Roundup 2021 : శైలజ చందు నిశ్శబ్ద నీరాజనం

నడిచేందుకొక కాలి బాట వుంది.
పలకరించేందుకు పూలగుత్తి వుంది.
నిశ్శబ్దంగా !!
అందరికీ HAPPY NEW YEAR

శైలజ చందు 

నాకు నిశ్శబ్దం ఇష్టం.
నా చుట్టూ కావలసినంత వుంటుంది.
అయినా, ఇంకేం కావాలని అడిగితే నిశ్శబ్దమే కోరుకుంటాను.
పౌర్ణమి నాటి సాయంత్రం కొండవాలులో నడిచి పోవాలని.
వైజాగ్ బీచి మెట్ల మీద కూర్చుని దూరంగా కనిపించే సముద్రపు నీలాన్ని చూడాలని,
చెట్ల కింద నడుస్తూ ఓ దేవ గన్నేరు పూవు పరిమళాన్ని చూడాలని,
ఎండుటాకుల కబుర్లు వినాలని.
అంతా నిశ్శబ్దంగానే!

మౌనాన్ని చెదరగొట్టే సంభాషణలంటే నాకు భయం.
ఫోను సంభాషణలు నడపాలన్నా కూడా నా ప్రాణమ్మీద కొచ్చినంత బాధ.
ఓ పావుగంట మాట్లాడడమంటే ఓ యుగం గడిచినంత!
సచ్చిపోతాను, అంత సేపు వాగాలంటే.
బహు అనాసక్తిగా, తెలివి తక్కువగా మాట్టాడి, ఎదుటి వాళ్లకు విసుగు తెప్పించి, వారి చేతనే ఫోన్ పెట్టేయించడంలో కొంత నేర్పు సంపాదించాను.
మా పిల్లలయినా సరే, ఎక్కువ మాట్లాడుతుంటే,
“ఉండండర్రా, రౌండ్స్ కి పోవాలి.” అంటాను.
ఈ మధ్యన వాళ్లూ తెలివి మీరారు.
“వేళా పాళా లేదా రౌండ్స్ కి?” అని అడగరు.
అసహనంగా “ఊఁ , ఆఁ” అంటున్నానంటే వాళ్లకర్థమైపోతుంది.
“ఏమ్మా, రౌండ్స్ కెళతావా?” అని ఫోన్ పెట్టేస్తారు.
ఏ ఇద్దరు మనుషులైనా మౌనంగా కూర్చోరెందుకో!
‘ఏదో ఒకటి మాట్టాడకుండా వుండకపోతే వారికి వూపిరాడదా ఏమి.’ అనుకుంటాను.
నిశ్శబ్దం కావాలి.
ప్రయాణాల్లో అయితే మరీను.
మా శాయిత్రప్ప చెదరగొట్టిన నిశ్శబ్ద ప్రయాణం నాకింకా గుర్తు.
నాకప్పటికి అయిదారేళ్లుంటాయేమో.

కృష్ణా నది వొడ్డున నడుస్తున్నాము.  ఇంకా తెల్లవారనే లేదు. అప్పుడప్పుడే ఆకాశం ఎర్రబారుతోంది. కొద్ది దూరంలో నది నీళ్లు, నల్లగా నిశ్చలంగా వున్నాయి. చిరు చలిగాలి రివ్వున వచ్చి చుట్టుముడుతోంది. చుట్టూ నిశ్శబ్దం. హాయిగా వుంది.

మా అమ్మమ్మ వాళ్లు, నలుగురు అక్కచెల్లెళ్లు.
అంజమ్మ, కనకమ్మ, శాయిత్రమ్మ.
నిశ్శబ్దాన్ని పారద్రోలడంలో ఘన వనితలు!
అంజమమ్మ నెమ్మదైన మనిషి. తెల్లవారుజామునే లేచి భక్తి పాటలు పాడేది.
కస్తూరి రంగ, కావేటి రంగ తరహా పాటలు.
చూట్టానికి మన డబ్బింగ్ జానకిలా పద్ధతిగా వుండేది.
కనకమ్మ గారితో మనకంత పరిచయం లేదు.
మా అమ్మమ్మ కు వాగుడుకాయదనం లేదు కానీ,
మగవారితో సమానంగా మాట్లాడగలదు.
సెన్సారు వారి సుకుమారమైన ear drums గురించే కొంత concern!!
ఓ సారి శాయిత్రమ్మ మా ఇంటికొచ్చింది, పండగకు మమ్మల్నందరినీ అమ్మమ్మ గారింటికి తీసుకెళ్లడానికి.
అప్పుడు మానాన్న కృష్ణాజిల్లా, పెడసనగల్లు హైస్కూల్లో పనిచేసేవాడు. పక్కనే వున్న అయ్యంకి అనే వూళ్లో వుండేవాళ్లం.
మా నాన్న రావడం లేదు. మా అన్నలు, నేను, మా అమ్మ, శాయిత్రమ్మ కలిసి వెళ్లాలి.
తెల్లవారు జామునే, గూడు రిక్షాలో ఐలూరు వరకు వెళ్లాం. ఐలూరులో కృష్ణానది దాటి, లంకల్లో ప్రయాణం చేస్తే చిలుమూరు చేరొచ్చు. బస్సెక్కితే పదిహేను నిముషాల తర్వాత అమ్మమ్మ వూరు.
Easy కదా.
కృష్ణా నది వొడ్డున నడుస్తున్నాము.
ఇంకా తెల్లవారనే లేదు. అప్పుడప్పుడే ఆకాశం ఎర్రబారుతోంది. కొద్ది దూరంలో నది నీళ్లు, నల్లగా నిశ్చలంగా వున్నాయి.
చిరు చలిగాలి రివ్వున వచ్చి చుట్టుముడుతోంది.
చుట్టూ నిశ్శబ్దం.
హాయిగా వుంది.
“కస కసమంటూ ఇసకలో నడకేవిఁటి. బస్సెప్పుడెక్కుతా”మని మా అమ్మని సతాయిస్తున్నాడు.
పిల్లల పిచ్చి వేషాలకు మా అమ్మ సమాధానమే చెప్పదు. అటువంటి సతాయింపులు ఇగ్నోర్ చేయడంలో, ఆమె ఒక యూనివర్సిటీ.
(మా విష్ణు గురించి మీకు తెలియదు కదా. మొద్దులా వెలుగొందుతున్న నన్ను, రకరకాలుగా సానపెట్టి డాక్టర్ని చేసిన మా రెండో అన్నయ్య)
మా విష్ణు బాగా పద్ధతైన మనిషి.
‘మన ఇంటి ముందు బస్సుండాలి, అమ్మమ్మ గారింటి ముందు దించాలి’ అంటాడు.
అటువంటి రోజు వచ్చే నాటికి ఆ ఊరు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది.
మా శాయిత్రమ్మ గూడు రిక్షా ఎక్కిన దగ్గర్నుండీ ఏవిఁటేవిటో మాట్టాడుతూనే వుంది.
రిక్షాలో మొదలెట్టిన కథనమే, లింక్ తెగిపోకుండా ఇసకలో కూడా కొనసాగిస్తోంది.
ఒకటైనా అర్థం అయితేనా?
ముదురాకుపచ్చ నేత చీర కట్టుకుంది. అప్పటి వాళ్లు చీర కుచ్చిళ్ళు మనలా వదిలెయ్యరు. ఎక్కడో టక్ చేస్తుంటారు, మోకాళ్లు కనిపించేలా.
ఓ చేతి సంచీలో ఏవిటేవిటో కుక్కి , దిండు ఆకారంలో బస్తాలా తయారు చేసింది. దాన్ని , ఎడమ భుజంపై పెట్టుకుని, తల మీదుగా కుడి చేత్తో పట్టుకుంది.
‘అబ్బ’ అని address చేస్తూ ఎవరి గురించో చెబుతోంది.
తండ్రిని కాబోలు!
“అబ్బ అలా చేశాడు.
అబ్బ ఇలా చేశాడు.
అబ్బ అది వద్దన్నాడు, ఇది వద్దన్నాడు.” అంటోంది.
ఆమె ఏమి చెప్తోందో గుణించుకోగల వయసు కాదు కానీ, అవి ఫిర్యాదుల్లా వినబడుతున్నాయి.
ఇసకలో నడుస్తూ , బస్సెక్కించలేదని ఏడుస్తూనే వున్నాడు, విష్ణు.
ఓ వైపు శాయిత్రమ్మ.
మరో వైపు విష్ణు.
నా నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ.
నది వొడ్డున ఇసక మా పాదాలకు గరుకు మసాజ్ చేస్తోంది.
నది దగ్గరయే సరికి కొద్దిగా వెలుగొచ్చింది. చలిగానూ వుంది. నీరెండకు వెచ్చగానూ వుంది.
నడకలో శ్రమ తెలియకుండా వుండాలని కాబోలు,
శాయిత్రమ్మ ఎప్పటివో తన ‘చిన్నప్పటి పెళ్లి’ ముచ్చట్లు చెబుతోంది.
‘చిన్నప్పటి పెళ్లి’ సమాసంలో సత్యముంది.
Toilet control రాక మునుపే ఆమె పెళ్లి జరిగిందిట.
శుభం.
పీటల మీద ఈవిడేదో ఆగం చేస్తే, పెళ్లికొడుకు తన ఉత్తరీయంతో సంబాళించుకున్నాడట.
డైపర్లు లేని లేని ద్వాపర యుగం కదండీ.
పైపంచలే దిక్కు .
పెళ్లికొడుకు పద్దెనిమిదేళ్ల వాడు.
సర్వేంద్రియాలపై control గల ఆదాము.
అవ్వ శాయిత్రమ్మ ఎదిగే వరకూ తనను తాను అదుపు చేసుకుని, ఆ పైన నలుగురు బిడ్డల్ని కన్నాడు.
పెళ్లినాటి నిర్వాకం చెబుతూ “హ హ హ” అని చెబుతూ శాయిత్రమ్మ నవ్వుతుంటే, నిశ్చలంగా వున్న నది,
నీరెండలో తళ తళమంది.
లంక పొలాల్లో నడిచేప్పుడు, ఓ మొక్క పీకింది శాయిత్రమ్మ. మొక్క అడుగున ఎర్రటి చిలగడ దుంపలు. నీళ్ల ధారలో మట్టి కడిగేసి ఇచ్చింది. ఆకలి లేకపోయినా కచ కచమంటూ తింటూ నడిచాము.
చిలుమూరు చేరేప్పటికి ఆకలి వేసింది.
మా అమ్మా, శాయిత్రమ్మా స్టీలు కేరేజీల్లో అన్నం, గోంగూర పచ్చడి తెచ్చారు. కలిపి ముద్దలు పెడుతుంటే తినేసి, తియ్యని పంపు నీళ్లు తాగాము.
మా నాన్న అయితే అక్కడ తడికె హోటల్లో ఇడ్లి తినిపించేవాడు.
ఆడవాళ్లొక్కరే, అలా హోటల్లోకి పోగూడదు కదా.
అందుకని, మరి !
బస్సొచ్చే వరకూ శాయిత్రమ్మ మాట్లాడుతూనే వుంది.
బస్ రాగానే, సీట్లో కూలబడి నిద్రపోయింది.
నిద్రపోతూ , నిశ్శబ్ద భంగ వ్రతం కొనసాగించింది.

“అమ్మలూ, ఎవరీ శాయిత్రమ్మ? ఎప్పుడైనా మనింటికి వచ్చిందా?” అని తప్పక అడిగే వారు. ఎక్కడికెళ్లి పోయారో. ఏ నిశ్శబ్దంలో వున్నారో.

ఎందరో నిశ్శబ్దంలో కలిసిపోయారు.
అమ్మమ్మ పోవడం తెలుసు కానీ, శాయిత్రమ్మ ఎప్పుడు వెళ్లిందో తెలియదు.
నేనేది రాసినా డా. హరిబాబు గారు ఇష్టపడి చదివే వారు.
మొదటి షేర్ కూడా ఆయనదే.
ఇది గనక చదివితే,
“అమ్మలూ, ఎవరీ శాయిత్రమ్మ? ఎప్పుడైనా మనింటికి వచ్చిందా?” అని తప్పక అడిగే వారు.
ఎక్కడికెళ్లి పోయారో.
ఏ నిశ్శబ్దంలో వున్నారో.
నాకెంతో నిశ్శబ్దాన్ని మిగిల్చి వెళ్లారు.
అయినా నిశ్శబ్దమే బాగుంటుంది.

నిశ్శబ్దంగా!! అందరికీ Happy new year.

నడిచేందుకొక కాలి బాట వుంది.
పలకరించేందుకు పూలగుత్తి వుంది.
నిశ్శబ్దంగా!!
అందరికీ Happy new year.

శైలజ చందు రచయిత్రి, వైద్యురాలు. శాఖాధిపతి, Dept. of Obs &Gyn, Oman

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article