నేడు జూన్ 19 వ తేదీ
క్రీ.శ 1308 జూన్ 19 నాటి నందలూరు (కడప జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో నెలందలూరి (నందలూరు)మహాజనాలకు విద్వాంసులు నందలూరు, అందపూరు, మందడము, మన్నూరు, అస్త్వాపురం అయిదు గ్రామాలలో గతంలో సుంకము, పాదమువంటి అవనాయాలు విధించిరని విన్నవించగా రాజు వాటిని మహాజనులద్వారా సర్వమాన్యము చేసినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే శా. X నెం. 496].
అట్లే 1314 జూన్ 19 నాటి పెనుమూలి (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని శ్రీ వాకిటి ఎఱ్ఱయలెంకగారు తమ నాయంకరములోని 22 గ్రామాలలోగల ఆలయభూముల (పేర్లు యివ్వబడ్డాయి) వ్రిత్తులను కనిక గడ్డుగు, మాడ, పుట్టిపహిండి, ఉపకృతి, సుంకము మున్నగు వాటిని మినహాయించినట్లు, వీటి విషయమై నిరసన తెలిపిన (తిఱితిని)పినపాడు దొడ్డవోటి పెద్ది గారు దోషపరిహారార్థంగా మహారాజులకు పుణ్యంగా సర్వమాన్యం చేసినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 509].
అట్లే 1517 జూన్ 19 నాటి చేజెర్ల శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల ఆనతిని సాళువ తిమ్మరుసయ్యగారు చేజెర్ల కపోతేశ్వరాలయ శ్రీకరణం నమశ్శివాయకు పెదపాడు గ్రామాన 12 పుట్ల భూమిని,12 వరహాలను యిచ్చినట్లుగాను, వీటిని ఏ విధంగా వినియోగించాలో చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం.60].
అట్లే అదే రోజున యివ్వబడిన దేవుని కడప శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల సర్వప్రథాని తిమ్మరుసయ్య కడప తిరువెంగళనాథుని నిత్యపూజలకు ఆరగింపులకు భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం.75].
క్రీ.శ 1536 జూన్ 19 నాటి మొయిళకాలువ (కడప జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో రాయసం వెంగళప మొయిళకాలువలో వెంగడనాథుని ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించి స్వామి అమృతపళ్ళకు,తిరణాళ్ళకు భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 124].
అట్లే క్రీ.శ 1556 జూన్ 19 నాటి హంపీ శాసనంలో సదాశివరాయల మహామండలేశ్వరుడు అవుభళ రాజుంగారు ఆలయ గర్భగృహము,శుకనాశి,అంతరాళ, రంగమండపాలను నిర్మించి నిత్యార్చనలు, కైంకర్యాలకు గ్రామదానంచేసినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా IV నెం 280].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.