Editorial

Wednesday, January 22, 2025
Songఈ 'సుక్కురారం మహా లచ్చిమి' పాట విన్నారా?

ఈ ‘సుక్కురారం మహా లచ్చిమి’ పాట విన్నారా?

 

 

‘బుల్లెట్ బండి’తో గత కొన్ని నెలలు ఊగి పోయిన తెలంగాణా మెల్లగా ఈ ‘సుక్కురారం’ పాటతో నిమ్మళంగా మరో రాగం అందుకున్నది. ఈ సారి ఒకే అమ్మాయి.  తెలంగాణ యువతి. తనకై తాను పాడుకుంటున్న అందమైన ‘స్వాతిశయం’.

కందుకూరి రమేష్ బాబు 

తెలంగాణ జానపదంలో మరో మేలిమి పాట ‘సుక్కురారం మహా లచ్చిమి’. దాదాపు రెండు నెల్ల కింద యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట మెలమెల్లగా జనల్లోకి వెళుతోంది. లీడ్ యాక్టర్ గా నాగదుర్గ ఆధునిక మహాలక్ష్మిగా అలరిస్తూ  ముఖ్యంగా యూత్ ను తన అభినయంతో కట్టి పడేస్తోంది. గానం యువ గళం ‘వరం’. రచన, సంగీతం- చరణ్ అర్జున్. కొరియోగ్రఫీ, దర్శకత్వం – క్రిష్.

మలి తెలంగాణ ఉద్యమంలో కవి గాయకులూ ధూం ధాం ఎవరమూ మరచిపోలేం. అప్పడు కవి గాయకులూ నింగి నేలా ఏకం చేసి సకల జనులతో తెలంగాణా సాధనకై  దనుమాడారు. అదొక ఉద్విగ్న ఉత్తేజ చరిత్ర. రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అస్తిత్వ సొయి కొత్త పుంతలు తొక్కడానికి సోషల్ మీడియా విజృంభన ఒక ఆలంభన అనే చెప్పాలి. దాంతో ఇక యువతకు అడ్డు లేకుండా అయింది. ఎవరో వచ్చి తమను ఉద్దరించవలసిన అగత్యం లేకుండా పోయింది. నేరుగా తలెత్తుకుని తమ ప్రతిభను చూపడానికి ఉద్యుక్తులను చేసింది. స్వతంత్రంగా తన సత్తా చాటడం మొదలైంది. ఆ ఒరవడిలో ఎందరో ముద్దు బిడ్డలు. మట్టిలో మాణిక్యాలు… అందులో ఈ పాట గాయని ‘వరం’… లీడ్ యాక్టర్ నాగ దుర్గ…  వైవిధ్యమైన ఇతివృత్తాలతో అనేక పాటలు రచించి అద్భతంగా సంగీత దర్శకత్వం వహిస్తున్నచరణ్ అర్జున్…కోరియోగ్రఫీ చేసిన దర్శకుడు క్రిష్..

అటు సినిమా అవకాశాలు, ఇటు యూట్యూబ్ సౌకర్యం …డిజిటల్ తరంగా వీరంతా అవకాశాలను సద్వినియం చేసుకుంటూ తమదైన ముద్ర వేస్తూ చక్కటి పేరు సంపాదించు కోవడం అంటే అది మాటలు కాదు, కేవల కృషి మహిమ. వారి కృషికి దన్నుగా తోడైన సామాజిక మాధ్యమాలు చలువ. ఇంకేం? ఒకటివెనుక ఒకటిగా అవకాశాలు సృష్టించుకుని ఆత్మవిశ్వాసంతో మున్ముందుకు సాగుతూ తామేమిటో నిరూపించు కుంటున్నారు. ఆ క్రమంలోనే ఒక అమ్మాయి నేను ‘సుక్రారం మహాలచ్చిమిని’ అంటూ ముందుకు వచ్చేంత ఆత్మాభిమానం, దానికి వేలాది వ్యూస్ తో వీక్షకుల ఆదరణ. శభాష్ అనకపోతే ఎలా మరి!

శుక్రారం మహాలచ్చిమి ఒక ఆహ్లాదమైన బాణి…

ఈ లింక్ క్లిక్ చేసి ఒక సారి పాట విని ఇది చదవడం మంచిది.

సామాన్యంగా మొదలయ్యే ఈ పాట ‘అడ్డకాడి కచ్చి అమ్ములేది అంటే చిన్న పోరడైన చెప్పుతాడు” అంటూ తన చిరునామాని తెలంగాణ ఒరవడిలో ప్రకటిస్తూ “నేను సుక్కురారం మహా లచ్చిమి”ని అంటూ తనదైన అతిశయాన్ని ఆత్మాభిమానంతో మేళవించి చెప్పి ఇక ఊపందుకుంటుంది.

నేను ”ఏడు చుక్కలా ఎలుగుతుంటా క్యాచ్ మీ” అని సవాల్ విసురుతుంది.

‘ఎండి ( వెండి) తెరకి దొరకని ఎంకి సొగసుని’…అని సినిమాకు చిక్కని చుక్కగా ఈ అమ్ములు తనది జానపద బాణి అన్న ఆత్మాభిమానాన్ని ప్రకటిస్తుంది. ఈ పాట తెలంగాణ జానపదంలో ఇటీవలి మరో హిట్

నల్లగొండ బిడ్డ …చరణ్ అర్జున్

కవి గాయకుడు చరణ్ అర్జున్ రాసి, సంగీత దర్శకత్వం వహించిన ఈ పాట అటు ఫోక్ ఇటు క్లాసిక్ టచ్ తో ఆకర్షిస్తోంది.

ఆయుధం సినిమాలో ‘ఇదేమిటమ్మా మాయా మాయా’ అన్న పాటతో సినీ రంగంలోకి ప్రవేశించిన చరణ్ అర్జున్ నల్లగొండ వాస్త్యవ్యులు. వారిది మేళ్ళ దుప్పలపల్లి.

సినిమా పాటలు మాత్రమే కాకుండా ప్రైవేటు పాటలు రూపొందించాలన్న ఉద్ధేశ్యంతో 2019లో జీఎంసీ టెలివిజన్‌ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించిన తాను పెరిగిన ఊరు, అక్కడి పరిస్థితులపై ‘ఎట్టుండెరా ఊరు ఎట్టుండెరా’ అనే పాటను రూపొందించడం ఒక మలుపు. దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఇక తనకు ఎదురు లేకుండా పోయింది. ఆ తరువాత అనేక పాటలు రచించి తన సంగీత దర్శకత్వంలో వాటిని తన ఛానల్ ద్వారా వీక్షకులకు అందిస్తున్నారు. వాటిల్లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రాసిన ‘పండగొత్తాందంటే సాలు’ పాట, ‘కేసీఆర్‌ కథాగానం’ పాట, ‘ఎవలు రమ్మన్నారు కొడుకా… నిన్ను ఎవలు పొమ్మన్నారు కొడుకా’ వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.

ప్రముఖ హీరోలు నాగార్జున, బాలకృష్ణ సినిమాలకు కూడా వారు పాటలు రాశారు. వెండి తెరకు తగ్గ సినీ గీతాలు రాస్తూనే సామాజిక గీతాలు, మనవ సంబంధాలను యాది చేసే గేయాలు, మన మూలాలను, అను బంధాలు తడిమే గీతాలు, శ్రామికుల పాటలు మొదలు విజేతల కథా గానాల దాకా రచిస్తూ వాటికి సంగీత దర్శకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ‘శుక్రారం మహాలచ్చిమి’ తన రచనల్లో ఒక భావ కవిత వంటిది. స్వీయ ఉనికి చాటే ఆహ్లాద గీతం. మధ్యలో ఇంగ్లీష్ పదాలతో పాటను మోడ్రనైజ్ చేయడం కూడా ఈ సంగీత దర్శకుడి స్టయిల్ ఏమిటో చెబుతోంది.

కూచిపూడి నృత్యకారిణి దుర్గ…

ఈ పాట “చుట్టూ సూర్యాపేట… నట్ట నడుమ నల్లగొండ… పక్కనేమో పాన గల్లు, మధ్యలున్నాది మా ఇల్లు… నేను సుక్కురారం మహా లచ్చిమి” అంటూ సాగే ఈ పాటలో దుర్గ హావభావాలు, లాస్యం చక్కగా కుదిరాయి.

ఒక అమ్మాయి తానెవరో అభిమానంతో చాటుకునే ఈ పాట హాయిగా ఉన్నది. నాగదుర్గ అభినయం, రకరకాల వేషాల్లో బాగున్నది.

“కలిగినోల్ల ఇల్లే మాది…నన్ను ఎత్తుకున్నది వీధి వీధి. చూడ తెల్ల తోలు పిల్లనైనా… గోషి పోస్తే పని పాట దాన్ని…గడ్డి గోసుకుంటూ… గడ్డ పెరుగు తింటూ పెరిగినాను నిండు కుండలా” అని చెప్పుకుంటుంది.

“ఎండి (వెండి) తెరకు దొరకని ఎంకి సొగసుని” అని కితాబు ఇచ్చుకుంటుంది. తాను సినిమా కాదు, ‘జీవిత నాయకి’ అన్న స్పృహని వినిపించడం విశేషం.

ఈ పాటకు అభినయం చేసిన అమ్మాయి నాగ దుర్గ నల్లగొండ పట్టణానికి చెందిన అమ్మాయే. తాను కూచిపూడి నృత్యకారిణి కూడా. నల్లగొండలో నృత్యాలయాన్ని నిర్వహిస్తుండటమూ మరో విశేషం. గతంలో తాను ‘బతుకమ్మ పాట’, అలాగే ‘పదహారణాల బాల’ అన్న పాటతో ప్రేక్క్షకులకు ఆకర్షించగా తాజాగా ఈ పాటతో వారికి మరింత దగ్గ్గరైంది. ఆమె అధికారిక చానల్ ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.

బుల్లెట్ బండి ధోరణి కొంత…

“ఏడు చుక్కలా ఎలుగుతుంట క్యాచ్ మీ” అంటూనే తాను వూరు దాటలేదని అనడం, అయ్య వెతుకుతుండు నా వీరాధివీరుడిని అనడం, ఇట్లా ఆమె తన గురించి తాను వ్యక్తం చేసుకోవడం, ఒక రకంగా తానెవరో స్వగతంగా చెప్పుకోవడం ఈ “సుక్కురారం మహా లచ్చిమి” ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఐతే, ఈ పాట ముఖ్యంగా పైన వివరించిన కొన్ని చరణాలను బట్టి ఇది బుల్లెట్ బడి సాంగ్ లో మాదిరి స్వీయ పరిచయాన్ని నేరుగా శ్రోతకు చేపుకునే ధోరణిలో ఉంటుందనిపిస్తుంది. ఐతే, మొత్తంగా పాట భిన్నమైనదనే అనాలి.

విశ్లేషణ కన్నా వినండి పాట బాగుంటుంది. నాగదుర్గ అభినయం చూస్తూ వినండి. చివర్లో “నా లెక్కలో నేను మిస్ ఇండియాని” అంటుంది నాయకి. అలాగే, “ఇది రెండువేల ఇరవై ఒక్కటి …కానీ నా పద్దతి రాగి సంకటి” అని కూడా అంటుంది.

ఈ ధోరణి ఒక ప్రత్యేక స్వరాన్ని పట్టిస్తుంది. అది జానపదం పోకడను చాటుతూ ఆధినిక స్రవంతిని ఇముడ్చుకోవడంగా చెప్పుకోవచ్చు.

గాయని ‘వరం’ ప్రత్యేకం

తెలంగాణ గడ్డ గాయనీ గాయకులకు వరప్రదాయని. అందులో ఈ యువ గళం మలితరం వరం. ఈ పాట గానం చేసిన అమ్మాయి పేరు కూడా ‘వరం.’  తాను ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ నివాసి.

‘శుక్రారం మహాలచ్చిమి’కి ప్రాణం పోసిన ఈ గాయని మామూలు విజయాలు సాధించలేదు.

ఈ పాటను ఒకసారి కాకుండా రెండోసారి వింటే ఇక  మూడు నాలుగు సార్లు వినకుండా ఉండలేరు. అదే ఈ పాట ప్రత్యేకత. ‘నేను శుక్రారం మహాలచ్చిమి’.

తాను ‘నారప్ప’, ‘సీటి మార్’ టైటిల్ సాంగ్స్ పాడింది. RX 100లో ఒక ఐటం సాంగ్ కూడా పాడింది. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ లోని బోనాల పాట పాడింది కూడా తానే.

దాదాపు నలభై సినిమా పాటలు పాడిన ‘వరం’ బతుకమ్మ. బోనాల పాటలకు ఫేమస్. 2016లో వి 6 ఛానల్ వారి బతుకమ్మ పాట కోలో కోలో కోల్ తో, అలాగే బొట్టు, బోనం పాటలు కూడా ఆమె పాడినవే. తాజాగా ‘శుక్రారం పాట’తో యూట్యూబ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

మొదట్లో చెప్పినట్టు, ఒక్క మాటలో ఈ పాట కొత్త తరం తమ ఉనికిని చాటే తీరును కూడా ప్రతిబింబించడం విశేషం. అందుకే ‘అందమైన స్వాతిశయం’ అనడం.

మరోమాట. ఈ పాటను ఒకసారి కాకుండా రెండోసారి వింటే ఇక  మూడు నాలుగు సార్లు వినకుండా ఉండలేరు. అదే ఈ పాట ప్రత్యేకత.

 

More articles

1 COMMENT

  1. గొప్ప రచన మంచి నాట్యం వీనులవిందైన గానం అన్ని కలిసి ఇ పాటను అజరామరం చేశాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article